కాంగ్రెస్ కి మజ్లీస్ తలాక్...తలాక్...తలాక్

  కేవలం ఈ ఒక్క రోజులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో చాలా మార్పులు చేర్పులు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరో ఆసక్తి కరమయిన అంశం ఏమిటంటే, విభజన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొంటుందని భావించిన మజ్లీస్ పార్టీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోబోమని తేల్చిచెప్పేసింది. తెరాస హ్యాండివ్వడంతో షాకులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది మరో పెద్ద షాకని చెప్పవచ్చును. ఎందుకంటే ఇంతకాలం మజ్లిస్ పేరు చెప్పుకొని ముస్లిం ఓట్లను దండుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ అవకాశం పోయింది. తమది లౌకికవాద పార్టీ అని కాంగ్రెస్ ఎంత గొంతు చించుకొన్నా పేద, మధ్య తరగతి ముస్లిం ప్రజలు మజ్లిస్ పార్టీ వైపు, లేదా ఆ పార్టీ పొత్తులు పెట్టుకొంటున్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు తప్ప కాంగ్రెస్ చెపుతున్న కుహాన లౌకిక కదలని పట్టించుకోరు. అదేవిధంగా రాష్ట్ర విభజన చేసినందుకు గుర్రుగా ఉన్న సీమాంధ్రలో ముస్లింలపై కూడా ఈ ప్రభావం పడితే, ఇక కాంగ్రెస్ పార్టీకున్న మైనార్టీ ఓటు బ్యాంకు ఖాళీ అయిపోవడం ఖాయం.   మజ్లిస్ పార్టీ మంచి విజయోత్సాహంతో ఉన్నతెరాసతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్ మేయర్ గా ఉన్నమజ్లిస్ పార్టీకి చెందిన మజీద్ హుస్సేన్ కొద్ది సేపటి క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను కలిసి తమ పార్టీ నిర్ణయాన్ని తెలిపిన తరువాత తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాందీ తన ముద్దబ్బాయ్ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్న ఈ సమయంలోనే ఇటువంటి విపరీత పరిణామాలు జరుగుతుండటం పాపం నిజంగా దురదృష్టమే!

కిరణ్ కొత్త పార్టీకి హై కమండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?

  గత ఆరేడు నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ గురించి విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ, ఆయన ఇంతకాలంగా మీన మేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేయడంతో, ఆయన పార్టీపై ప్రజలకే కాదు మీడియాకు కూడా నిరాసక్తత ఏర్పడింది. సీమాంధ్రలో విభజనను వ్యతిరేఖిస్తూ ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి ఉండి ఉంటే అప్పుడు వచ్చే ఆ ఆధారణే వేరు. కానీ, కాంగ్రెస్ హై కమండ్ నుండి అనుమతి లేనందునే తను పదవికి రాజీనామా చేయలేకపోయానని స్వయంగా చెప్పుకొని, రాష్ట్ర విభజన పూర్తిగా జరిగిపోయిన తరువాత మరి అనుమతి దొరికిందో ఏమో తాపీగా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దపడ్డారు. కానీ, కనీసం ఆ విషయాన్ని కూడా ఆయన స్వయంగా, దైర్యంగా ప్రకటించకుండా శైలజానాథ్, సబ్బంహరి, రాయపాటి వంటి వారితో మీడియాకు న్యూస్ లీకులు ఇస్తూ పార్టీ పట్ల ప్రజలలో ఆసక్తి పెరిగేలా చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆవిధంగా చేయడం వలన ప్రజలలో ఆయన పట్ల, ఆయన పెట్టబోయే పార్టీపట్ల మరింత వ్యతిరేఖ భావన, అనాసక్తి ఏర్పడింది.   దానికితోడు మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం అవడంతో, కిరణ్ కుమార్ రెడ్డి ఇక కొత్త పార్టీ ఆలోచన విరమించుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఆయన అదృష్టమో లేక మెగాభిమానుల దురదృష్టమో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టె ఆలోచనను విరమించుకొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీ పరుడు, మానవతావాది రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆశించిన వారందరూ ఆయన తాజా నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తప్పకుండా చాలా సంతోషించి ఉండాలి.   ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లయితే, సీమాంధ్రలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం, శ్రమ కూడా ఉండదు. గనుక, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ద్వారా కుటుంబ సభ్యులపైన, వారిద్వారా పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి చేసి ఆయనను విరమింపజేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందో లేక ఇంకా మీన మేషాలు లెక్కిస్తూ కూర్చొంటే ఉన్నపరువు కూడా పోతుందని మరి భయపడ్డారో లేక ఎన్నికల భేరీ మ్రోగిందని తొందరపడుతున్నారో తెలియదు కానీ ఆయన ఈరోజే తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇక రాష్ట్రం రెండుగా విడిపోతున్న ఈ సమయంలో కూడా ఆయన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అనే పేరుతో రిజిస్టర్ చేయించిన పేరును తన పార్టీకి వాడుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమయితే, కేసీఆర్ తెలంగాణాపేరు చెప్పుకొని బలపడినట్లుగా, సమైక్యాంధ్ర పేరు చెప్పుకొని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఏమయినప్పటికీ, ఆయన కొత్త పార్టీ పెట్టినట్లయితే, అది కాంగ్రెస్ మహావృక్షానికి మొలిచిన మరో కొమ్మే అవుతుంది తప్ప వేరే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బిజెపిలోకి దగ్గుబాటి దంపతులు

      కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తమ నియోజకవర్గ ప్రజలతో పురందేశ్వరి సమావేశమై వారితో చర్చించాకే పార్టీ వీడే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో తీసుకున్న నిర్ణయాలు తనను బాధించాయని, తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయాలను కూడా పరిగణంలోకి తీసుకోలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడామని చెప్పారు. ఒక దశలో తాము రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయం తీసుకున్నామని, కానీ కార్యకర్తలు, సన్నిహితుల వారించడంతో బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 13న అద్వానీ, రాజనాథ్ సమక్షంలో బిజెపిలో చేరనున్నారు. ఈ ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేఅవకాశాలున్న౦దున బీజేపీలోకి వెళ్ళడం వలననే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరికి, ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగితే ఆమెకు మళ్ళీ అంతకంటే మంచి కీలకమయిన పదవే దక్కవచ్చును.   

నేడే కిరణ్ కొత్త పార్టీ ప్రకటన

      ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు మాదాపుర్ లో తన సన్నిహితులతో కిరణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై చర్చించి..ఆ తరువాత ఆరు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సర్వేలు కూడా చేసినట్లు సమాచారం. బుధవారం ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత ఇప్పుడు కిరణ్ కొత్త పార్టీని ప్రకటించిన ప్రయోజనం వుండదని కొంతమంది నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా ఆరవై రోజులు సమయమే వున్నందున...కిరణ్ కొత్త పార్టీ పెట్టిన సీమాంధ్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ కు షాక్.. 863 కోట్లు జప్తు

      వైఎస్ జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. జగన్ మీడియా, ఇతర సంస్థలకు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన సుమారు రూ.325 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేసినట్లు ప్రకటించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు పేరుతో జరిగిన పలు అక్రమాలకు సంబంధించిన జగన్, నిమ్మగడ్డలకు చెందిన రూ.863 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం లోని సెక్షన్ 9, 11, 12, 13 (3) రెడ్ విత్ 13(1) (సి), (డి), భారత శిక్షాస్మృతిలోని 120-బి రెడ్ విత్ 420, 409, 419, 468, 471, 477-ఏ సెక్షన్ల కింద ఈ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మరొక సర్వే నివేదిక సిద్దం

  రాష్ట్రం రెండుగా విడిపోతున్న ఈ తరుణంలో వస్తున్నమున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలకి పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల గురించి రాజకీయ పార్టీలకే కాకుండా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంట నెలకొంది. ఇది గమనించిన మీడియా-సర్వేసంస్థలు నిత్యం ఒక కొత్త నివేదిక ప్రజల ముందు ఉంచుతున్నాయి.   అయితే ఇటీవల ఇండియా టుడే కోసం సి-ఓటర్ అనే సర్వేసంస్థ నిర్వహించిన సర్వే నివేదికలో ఎంత నిబద్దత ఉందో తెలుసుకొనేందుకు ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ సదరు సి-ఓటర్ సంస్థకు చెందిన 11ఏజన్సీలకు డబ్బులు ఎరగా చూపితే తాము ప్రజల నుండి సేకరించిన సమాచారంలో మార్పులు చేసి నివేదిక ఫలితాలను మార్చేందుకు కూడా వారు వెనుకాడలేదని బయటపెట్టడంతో ఇండియా టుడే పత్రిక యాజమాన్యం ఆ సర్వే నివేదికను వెంటనే రద్దు చేయడమే గాకుండా, తమ ప్రతిష్టకు భంగం కలిగిన్చినందున సి-ఓటర్ సంస్థపై కోర్టులో కేసు వేయబోతున్నట్లు ప్రకటించింది. అందువలన ఇప్పుడు సర్వే నివేదికలను సైతం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది సర్వేలను మాత్రం ఆపలేకపోయింది, వాటి ప్రమాణాలను, నిబద్దతని ద్రువీకరించే ఎటువంటి ప్రత్యేక అధికారిక సంస్థలు లేనందున సదరు మీడియా లేదా సర్వే సంస్థకున్న పేరుని బట్టి ప్రజలు వాటి నివేదికలను విశ్వసించవలసి వస్తోంది.   తాజాగా, ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్స్-సి.యన్.యన్.; ఐ.బీ.యన్. మరియు లోక్ నీతి మరియు సీ.యస్.డీ.యస్. అనే నాలుగు సంస్థలు ఆంధ్ర, తెలంగాణాలలో సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి నివేదికలు ప్రకటించాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు 11-17 లోక్ సభ సీట్లు, తేదేపాకు 10-16 రావచ్చని సమాచారం. ఇక తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు సరిసమానంగా 6 నుండి 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ తెరాస అత్యధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకొంటుందని ప్రకటించింది.   ఈ ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనతో సాధించాలనుకొన్న ప్రయోజనం నెరవేరినట్లే భావించవచ్చును. ఎందుకంటే ఆ పార్టీకి తెలంగాణాలో ఉన్న 15 లోక్ సభ స్థానాలలో తెరాసతో కలిపి కనీసం 12 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తాడన్ని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రలో కనీసం 11-17 లోక్ సభ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది. గనుక రెండు రాష్ట్రాలలో కలిపి కాంగ్రెస్ ఖాతాలో ఎంతలేదనుకొన్నా కనీసం 25-30 సీట్లు పడతాయి.   కానీ ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నరాజకీయ పరిణామాలను బట్టి ఈ అంచనాలు, సర్వే నివేదికలు, రాజకీయ పార్టీల భవిష్యత్తు అన్నీ కూడా మారుతుంటాయి గనుక మున్ముందు మరింత ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చును.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం మెగా సస్పెన్స్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతానని ప్రకటించిననాటి నుండి మీడియాలో చెలరేగిన ఊహాగానాలు, విశ్లేషణల గురించి అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు తాజాగా రెండు పూర్తి విభిన్నమయిన సమాచారాలు అందడంతో, ఆయన రాజకీయ ప్రవేశం గురించి మరింత గందరగోళం ఏర్పడింది.   పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులయిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు తెదేపా అధిష్టానాన్ని కలిసిఆయన తరపున ఒక ప్రతిపాదన పెట్టినట్లు తాజా సమాచారం. దాని ప్రకారం, తనకు పదిహేను శాసనసభ టికెట్స్, తను కోరిన వ్యక్తులకి, వారు కోరుకొనే నియోజక వర్గాలలోనే కేటాయించేమాటయితే, ఆయన తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, లేకుంటే ముందుగా ప్రకటించినట్లే ఈనెల 12 లేదా 13 తేదీలలో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ప్రకటిస్తారని చెప్పినట్లు సమాచారం.   అయితే ఏకంగా పదిహేను టికెట్స్ కేటాయించడం ఏ పార్టీ కయినా కష్టమే. గనుక తెదేపా అందుకు అంగీకరించకపోవచ్చును. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒకవేళ కొత్త పార్టీ పెట్టలేకపోయినా, కనీసం తనకు పూర్తిగా పట్టున్న ప్రాంతాలలో స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టి వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.   అయితే దీనికి పూర్తి విరుద్దమయిన మరో తాజా సమాచారం ఏమిటంటే, ఆయన కార్యాలయం నుండి ‘ముందు ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం లేదు. రద్దయింది’ అనే మెసేజ్ మీడియాకు చేరినట్లు తెలుస్తోంది. అన్న (చిరంజీవి) కాంగ్రెస్ పార్టీలో ఉండగా, తమ్ముడు తెదేపాలోనో లేక వేరే ప్రతిపక్ష పార్టీగానో ఎన్నికలలో నిలబడితే ఇప్పటికే దెబ్బ తిన్న బందుత్వాలు మరింత దెబ్బ తింటాయని మెగా కుటుంబ సభ్యులు అందరూ పవన్ కళ్యాణ్ పై తీవ్రమయిన ఒత్తిడి తెచ్చి ఆయన ప్రెస్ మీట్ ను రద్దు చేయించినట్లు, తద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా రద్దయినట్లేనని చూచాయగా తెలుస్తోంది.   ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లయితే, సీమాంధ్రలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం, శ్రమ కూడా ఉండదు. గనుక, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ద్వారా కుటుంబ సభ్యులపైన, వారిద్వారా పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు.   అయితే పవన్ కళ్యాణ్ పట్టుదల, దృడ సంకల్పం గురించి బాగా తెలిసిన కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఒకసారి ఏదయినా నిర్ణయం తీసుకొంటే ఇక కష్టమయినా నష్టమయినా వెనుకడుగు వేయడని, ఆయన తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం చేయడమో లేదా తన తరపున కొందరు స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టడమో ఖచ్చితంగా చేస్తాడని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.   ఏమయినప్పటికీ, ఇక ఈ సస్పెన్స్ మరింత కాలం కొనసాగితే అది పవన్ కళ్యాణ్ పేరు ప్రతిష్టలకి నష్టం కలిగిస్తుంది. గనుక ఆయన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విస్పష్టమయిన ప్రకటన చేసి ఈ సస్పెన్స్ కు వెంటనే తెర దించడం అత్యవసరం.

పవన్ రాజకీయం సంగతేంటి?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారా? తానొక్కరే పోటీ చేస్తారా? అసలు రాజకీయాల్లోకి వస్తాడా రాడా.. ఇలాంటి ప్రశ్నలు గత కొంత కాలంగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. మార్చి రెండో వారంలో తాను చాలా విషయాలు చెబుతానంటూ పవన్ అన్నట్లు కూడా వినిపించింది. అయితే అప్పటిదాకా ఆగలేని ఔత్సాహికులు ఈలోపు తమకు కావల్సినట్లుగా చెప్పేసుకుంటున్నారు. పవన్ రాజకీయ భవితవ్యాన్ని తమకు తామే రాసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి లేదా ఏలూరు నుంచి పోటీ చేయొచ్చని, అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లేదా ఇండిపెండెంటు గానే పోటీ చేస్తారంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి మీడియా సంస్థల్లో ఫోన్లు బర బర మోగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు సాయంత్రానికి వాటికి ఒకమోస్తరుగా తెరపడింది. పవన్ కళ్యాణ్ సన్నిహితురాలు, పంజా సినిమా నిర్మాత తిరుమలశెట్టి నీలిమ ట్విట్టర్ ద్వారా వీటికి తెరదించారు. ‘‘అందరూ ఎందుకంత ఆందోళన చెందుతున్నారు, రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు.. కాస్త ఓపిక పట్టండి. మీ అనుమానాలన్నింటినీ స్వయంగా పవన్ కళ్యాణే తీరుస్తారు’’ అని ఆమె ట్విట్టర్ లో తెలిపారు.

ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్న జైరాం

  గ్రామాలలో మహిళలు వడ్లు దంచే రోటి దగ్గర ఒక రకం పాటలు పాడుతారు. మిరపకాయలు దంచేటపుడు మరొక రకం పాటలు పాడుతుంటారు. అందుకే ‘ఏ రోటి కాడ ఆ పాట’ అనే సామత పుట్టుకొచ్చింది. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందగానే డిల్లీ నుండి రెక్కలు కట్టుకొని సీమాంధ్రపై వాలిపోయిన బీజేపీ నేత వెంకయ్య నాయుడిని చూసి కంగారుపడిన కాంగ్రెస్ అధిష్టానం, చూసి రమ్మంటే కాల్చి రాగల సమర్దుడయిన జైరాం రమేష్ ను రాష్ట్రం మొత్తం కవర్ చేసుకురమ్మని పురమాయించడంతో అయన మొదట తిరుపతి వెంకన్నకు మొక్కి అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ లో వాలిపోయి, సోనియమ్మ అమ్మజెప్పిన ఘనకార్యం మొదలుపెట్టేసారు.   తెరాసని చెడామడా తిట్టేసి, ఆ పార్టీ ఇక ఎందుకు పనికిరాదని, అదొక శుద్ధ వేస్ట్ పార్టీ అని, తనకసలు రాష్ట్ర విభజనే ఇష్టం లేదని కానీ పార్టీ నిర్ణయాన్ని, తెలంగాణా ప్రజల ఆకాంక్షను మనసులో ఉంచుకొని విభజన ప్రక్రియలో పాలుపంచుకోవలసి వచ్చిందని సీమాంధ్ర ప్రజలకు వినబడేలా బిగ్గరగా అరిచి చెప్పారు. అప్పుడు తెరాస నేతలు కూడా ఆయనపై తీవ్రంగా విరుచుకు పడటంతో నిజంగానే ఆ రెండు పార్టీలు శత్రువులయిపోయాయేమో? అని అందరూ భ్రమ పడిపోయారు కూడా.   సీమాంధ్రలో వాతావరణం కొంచెం చల్లబడినట్లు వైజాగ్ కాంగ్రెస్ వాతావరణ శాఖ నుండి సిగ్నల్స్ రాగానే జైరాం రమేష్ మెటికలు విరుచుకొంటూ వైజాగ్ లో వాలిపోయి, కాంగ్రెస్ పార్టీ గత అరవై సం.లుగా దేశం మొత్తం మీద చేయలేని ఘన కార్యాలన్నిటినీ రానున్న పదేళ్లలో ఒక్క సీమాంధ్రకే చేసిపెట్టేందుకు కమిట్ అయిపోయిందని, కాంగ్రెస్ ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని, అందుకు తెలంగాణా ఏర్పాటే గొప్ప ఉదాహరణ అని, అందువల్ల ఇక సీమాంధ్ర ప్రజలందరూ కళ్ళు మూసుకొని (గుడ్డిగా) కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లు గుద్దేసి, తమ పిలకలు హస్తం చేతిలో నిరభ్యంతరంగా పెట్టేయోచ్చని నూరిపోసారు. ఇదంతా చూసి సీమాంధ్ర ప్రజలు ‘పాపం! జైరాంను, కాంగ్రెస్ పార్టీని అనవసరంగా అపార్ధం చేసుకోన్నామేమో? అని చాలా ఫీలయిపోయారు కూడా.   కానీ, ఆయన ఈరోజు వరంగల్ వెళ్ళగానే సరికొత్త ట్యూన్స్ తో సరికొత్త రోటిపాట అందుకొన్నారు. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణా వాళ్ళకే చెందుతుందని, దానిలో వచ్చే ఆదాయంలో చిల్లి గవ్వ కూడా సీమాంధ్రకు విదిలించడం అనవసరమని తేల్చి చెప్పారు. అంతే కాక సీమాంధ్రవాళ్ళ మాట విని ఉంటే, చార్మినార్ లో రెండు మినార్లు కూడా తమ వాటాగా ఇవ్వమని డిమాండ్ చేస్తారని జోకేసారు. ఇక తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాపోయినా తమ మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనడం వాస్తవం కాదని, తెరాస తమతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరిస్తే స్వాగతిస్తామని చెప్పి, తెరాసని మళ్ళీ మెయిన్ లైన్లోకి తీసుకు వచ్చారు.   అదే సమయంలో డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయనకు కోరస్ పాడటం విశేషం. అంటే ఈ సాంగ్స్ అన్నీ డిల్లీలోనే ముందే కంపోస్ అయినట్లు అర్ధమవుతోంది. త్వరలో ఇటువంటి వెరైటీ సాంగ్స్ మరికొన్ని వినిపించిన తరువాత, రాజమాతని, యువరాజా వారిని మొదట సీమాంధ్రకి ఆ తరువాత తెలంగాణాకి ఆహ్వానించి తెలుగు ప్రజలందరినీ అనుగ్రహింపజేస్తారేమో? బళా కాంగ్రెస్...ఈ తెలివితేటలకే ప్రజలు గత అరవై ఏళ్లుగా ఫ్లాటయిపోతున్నారు.

మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా: 9 దశల్లో పోలింగ్

      16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దశల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి తొలిదశ ఎన్నికలు ప్రారంభం కాగా, మే 7న తొమ్మిదవ దశతో ఎన్నికలు పూర్తికానున్నాయి. మే 16న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా సంపత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. పరీక్షలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించామని సంపత్ పేర్కొన్నారు. జనవరిలో ఓట్ల జాబితాను సవరించామని, దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సంపత్ వెల్లడించారు. పేర్లు గల్లంతయిన ఓటర్ల కోసం మరో అవకాశం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. మార్చి 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈసారి తిరస్కరణ ఓటు(నోటా) అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎన్నికల ముఖ్య తేదీలు : ఏప్రిల్ 7న తొలిదశలో రెండు రాష్ట్రాల్లోని 6 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  ఏప్రిల్ 9న రెండో దశలో 5 రాష్ట్రాల్లోని 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  ఏప్రిల్ 10న మూడో దశలో 14 రాష్ట్రాల్లోని 92 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  ఏప్రిల్ 12 న నాలుగో దశలో మూడు రాష్ట్రాలోని 5 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  ఏప్రిల్ 17న ఐదో దశలో 13 రాష్ట్రాల్లోని 122 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  ఏప్రిల్ 24న ఆరో దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  ఏప్రిల్ 30న ఏడో దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  మే 7న ఎనిమిదవ దశలో 7 రాష్ట్రాల్లోని 64లోక్‌సభ స్థానాలకు పోలింగ్  మే 12న తొమ్మిదవ దశలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాలకు పోలింగ్  మే 16న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌటింగ్, అదేరోజు ఫలితాలు విడుదల.  

సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులపై నిఘా

      ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై సోషల్ మీడియా ద్వారా నిఘా వేయనుంది. వికీపీడియా, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక సంబంధాల వెబ్‌సెట్ల ద్వారా అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీ పర్యవేక్షించనుంది. అలాగే, ఈ సైట్లలో ప్రకటనల రూపంలో అభ్యర్థులు చేసే వ్యయాన్ని కూడా చూస్తుంది. పెయిడ్ న్యూస్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్యలను కట్టుదిట్టం చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు కానున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

సుప్రీంకోర్టుపై రాయపాటి తీవ్ర ఆరోపణలు

  ఈరోజు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనంపై తీవ్ర ఆరోపణలు చేసారు. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వంటి కేంద్రమంత్రులు కొందరు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో దాఖలయిన అనేక పిటిషన్లను కోర్టు పరిగణనలోకి తీసుకొని స్టే విదించకుండా న్యాయమూర్తులను మేనేజ్ చేసారని రాయపాటి ఆరోపించారు. మరి కాంగ్రెస్ పార్టీ, సుప్రీంకోర్టు ఈ ఆరోపనలపై ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. గత వారం ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ ప్రకటిస్తారని తెలిపారు. కానీ ఆ మాట చెప్పి వారం రోజులయినా ఇంకా కొత్త పార్టీ రాకపోవడంతో ఆయన మళ్ళీ ఈ రోజు కొత్త పార్టీకి మరో సరికొత్త ముహూర్తం ప్రకటించారు. మరో వారం పది రోజుల్లో కిరణ్ తన కొత్త పార్టీ ప్రకటిస్తారని మీడియాకు తెలిపారు.

పిఠాపురంలో సైకిల్ కు పంక్చర్

      సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ‘దేశం’లో నాయకత్వంపై కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో అనుచరగణంతో తిరుగుతున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకు అడుగడుగునా చుక్కెదురవుతోంది. పిఠాపురం రూరల్ మండలంలోని భోగాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఇంటింటా టీడీపీ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ స్థానిక మర్రిచెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీకి మొదటి నుంచి కష్టపడి పని చేస్తున్నఅల్లుమల్లు విజయకుమార్‌పై విమర్శలు చేశారు. విసుగెత్తిపోయిన నాయకులు, కేడర్ చివరకు ఆయనపై కుర్చీలు విసిరేసే పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా టీడీపీ టిక్కెట్టు వర్మకు కేటాయిస్తే పార్టీలోనే ఉండి వ్యతిరేకంగా పని చేయడమా లేక, ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడమా అనేదానిపై వర్మ వ్యవహార శైలి నచ్చని నేతలంతా వచ్చే 15 రోజుల్లో ఒక స్పష్టత తీసుకువచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్

      కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ 16వ లోక్ సభ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికల జరగనున్నాయి. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం వున్న లోక్ సభ, శాసన సభ సీట్ల ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి.    తెలంగాణ: 1. తెలంగాణలో ఏప్రిల్ 2 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.                          2. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.   3. ఏప్రిల్ 10న నామినేషన్ల పరీశీలన.   4. ఏప్రిల్ 12 నామినేషన్ల ఉపసంహరణకు గడువు.   5. ఏప్రిల్ 30 తెలంగాణలో పోలింగ్ వుంటుంది.   6. తెలంగాణలో 17 ఎంపీ, 119 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.        సీమాంధ్ర: 1. సీమాంధ్రలో ఏప్రిల్ 12 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.               2. ఏప్రిల్ 19వరకు నామినేషన్ల స్వీకరణ వుంటుంది.     3. ఏప్రిల్ 21న నామినేషన్ల పరీశీలన.   4. ఏప్రిల్ 23నామినేషన్ల ఉపసంహరణకు గడువు   5. మే 7న సీమాంధ్రలో పోలింగ్ వుంటుంది.    6. సీమాంధ్రలో 25ఎంపీ, 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.          మే16న ఇరుప్రాంతాలలో ఓకే రోజు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.   

మోత్కుపల్లి సైలెన్స్ దేనికి సంకేతం

  రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశం వస్తుందని చివరి వరకు ఆశపడి, అధినేత చంద్రబాబు చెయ్యివ్వడంతో ఓ దశలో సైకిల్ కూడా దిగిపోదామనుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఇప్పుడు ముందంతా చీకటే కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద ఒంటికాలిమీద లేచే నర్సింహులు.. రాజ్యసభ వ్యవహారం తర్వాత అస్సలు నోరెత్తితే ఒట్టు. ఆయన మాటే ఎక్కడా వినిపించడంలేదు. నర్సింహులు ఈసారి పోటీచేసే విషయంలో కూడా ముందు వెనక ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఓ దశలో అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా కథనాలొచ్చాయి. కానీ అప్పట్లో నామా నాగేశ్వరరావు ఆయనను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేశారు. ఇక గతంలో ఆలేరు నుంచి వలస వెళ్లి తుంగతుర్తి నుంచి గెలిచినా.. ఇప్పుడక్కడ కుడిభుజంగా ఉండే నేతలు గానీ, కేడర్ గానీ పెద్దగా లేకపోవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని మరో ఎస్సీ నియోజకవర్గం నకిరేకల్ మీద ఆయన దృష్టి పడినట్లు తెలుస్తోంది. నకిరేకల్ టీడీపీ ఇన్‌చార్జ్ పాల్వాయి రజనీ కుమారిని ఆమె సొంత నియోజకవర్గం తుంగతుర్తి పంపి, ఆయన ఇక్కడ పోటీ చేయచ్చంటున్నారు. మరోవైపు, ఖమ్మం జిల్లాకు వచ్చి మధిర ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీ చేయాలని, ఎన్నికల ఖర్చులు తాను భరిస్తానని నామా నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. చివరకు మోత్కుపల్లి పయనం ఎటు సాగుతుందో చూడాలి మరి.

తెలుగు ప్రజలు మరీ అంత చులకనయిపోయరా

  తెలుగువాళ్లంటే కాంగ్రెస్ పెద్దలకు, అందునా రాష్ట్రాన్ని నిలువునా గొడ్డలితో చీల్చేసిన జీవోఎం సభ్యులకు ఎంత చులకనో మరోసారి రుజువైంది. సాక్షాత్తు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, సొంత పార్టీ కార్యకర్తల ముందే జైరాం రమేష్ తన అహంకారాన్ని, తెలుగువాళ్ల పట్ల ఉన్న నీచ భావాన్ని బయటపెట్టారు. ‘‘సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్‌మినార్‌లో రెండు మినార్లు కావాలని అడుగుతారు...’’ అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.   సీమాంధ్ర కేంద్రమంత్రులు రోజూ అధిష్టానం వద్దకు వచ్చి అష్టోత్తరం, సహస్రనామం చదివినట్లుగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అడిగారని జైరాం వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూరు పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తల సమావేశంలో.. దుగ్గరాజపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం పోర్టును కూడా అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి జె.డి.శీలం కోరినపుడు జైరాం పైవిధంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు, ఎయిర్‌పోర్టు, ఫార్మాసూటికల్, పవర్ ప్లాంట్ కాంట్రాక్టర్లు అందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నారంటూ మరోసారి ఎద్దేవా చేశారు.

నేడే సార్వత్రిక ఎన్నికల నగారా

  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది. ఏప్రిల్ రెండో వారంలో మొదలుపెట్టి మే 15వ తేదీకల్లా మొత్తం ఎన్నికల పర్వాన్ని పూర్తిచేసేందుకు ఈసీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలను మొత్తం ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నేతలకు పెద్దిరెడ్డి వల

  చిత్తూరు కాంగ్రెస్ నాయకులకు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల విసురుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆయన మంత్రివర్గంలో ఉండగానే బహిరంగ విమర్శలు చేసిన పెద్దిరెడ్డి, ఆ తర్వాతి కాలంలో పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేతలను లాగేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. నగరంలోని పీసీసీ మాజీ సభ్యుడు ఎస్.సుధాకరరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నా యకులు, చిత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఐరాల మాజీ ఎంపీపీ పొలకల ప్రభాస్‌కుమార్‌రెడ్డి(చిట్టిరెడ్డి)తో పెద్దిరెడ్డి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. దీంతో వారిలో కొందరు జగన్ పార్టీలో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ సొంత పార్టీ పెట్టే విషయంపై ఇప్పటివరకు ఒక స్పష్టత లేకపోవడం, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేకపోవడంతో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

యలమంచిలిలో మల్లగుల్లాలు

విశాఖ జిల్లా యలమంచిలి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుందరపు విజయ్‌కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నా, మరోపక్క మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు వినిపిస్తోంది. సుందరపు అభ్యర్థిత్వాన్ని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుతోపాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తుండడంతో అభ్యర్థి విషయంలో స్పష్టత కనిపించడంలేదు. మరోపక్క ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కూడా హఠాత్తుగా రూటు మార్చారు. చంద్రబాబుతో మంతనాలు జరిపిన ఎమ్మెల్యే యలమంచిలి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని కార్యకర్తలతో చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలు తెలుగుతమ్ముళ్లతోపాటు, కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఇక రాష్ట్ర విభజన దెబ్బకు.. కాంగ్రెస్‌పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది.