రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర
posted on Mar 1, 2014 @ 3:13PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలుతున్నఈ సమయంలోనే మళ్ళీ 41సం. ల తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించబోతున్నారు. కేంద్ర క్యాబినెట్ సూచించిన విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించేందుకు అంగీకరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఆమోదముద్ర వేసారు. ఈరోజు రాత్రిలోగా గవర్నర్ నరసింహన్ కు కేంద్రం నుండి లేఖ అందగానే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది.
అయితే దీనివలన ప్రజలకు, రాజకీయ పార్టీలకు లేదా ఇతర సంస్థలకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నిద్రావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విదించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు. అయితే, గత ఆరు నెలలుగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, మంత్రి వర్గం అన్నీ ఉన్నపటికీ అవి ఉండీలేనట్టే సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం,కాంగ్రెస్ మంత్రులందరూ రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీలో కూర్చొని కీచులాడుకొంటూ చివరికి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో రెండుగా విడిపోతున్న తెలుగు ప్రజలకు రాష్ట్రపతి పాలనను బహుమతిగా ఇచ్చారు. అందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఆనం రామినారాయణ రెడ్డి వంటి మంత్రులు నిసిగ్గుగా శలవిస్తున్నారు.