నల్లారి వారి కాన్వాయ్ వెనక్కి
posted on Mar 2, 2014 @ 10:17AM
'అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్' అన్నారు పెద్దలు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అలాగే అయ్యింది. లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా తెలంగాణా బిల్లు ఆమోదం పొందడంతో, ఇక చేసేది లేక.. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇన్నాళ్లూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇన్నాళ్ల బట్టి ఆయనకున్న కాన్వాయ్ విషయంలో అధికారులు వేలుపెట్టలేదు. ఇక రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని తెలిసిపోయిన తర్వాత ప్రోటోకాల్ అధికారులు నల్లారి వారి ఇంటికి వెళ్లి ఆయన కాన్వాయ్ నుంచి మూడు వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చల్లగా చెప్పారు. ఇక ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మాజీ ముఖ్యమంత్రికి కల్పించే స్థాయి భద్రత, ఆయనకు వ్యక్తిగతంగా ఉండే ముప్పును పోలీసులు అంచనా వేయడాన్ని బట్టి కల్పించే భద్రత మాత్రమే ఉంటాయన్న మాట. మొన్న దసరా సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అత్యాధునిక ఎస్ యూ వీలను తన కాన్వాయ్ లో చేర్చారు. దాంతో దేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్ ఉన్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. కాన్వాయ్ లోకి కొత్త కార్లు కావాలంటూ ఆదేశాలతో అధికారులు రెండు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కార్లను కొనుగోలు చేశారు. ఒక్కో కారు ధర కోటిన్నర కాగా, వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి మరో అరకోటి వెచ్చించారు. దీంతో రెండింటికి కలిపి నాలుగు కోట్లు ఖర్చయింది. ఇప్పుడు వాటన్నింటినీ వెనక్కి తీసుకున్నట్లే అయ్యింది. దసరా కానుకగా కిరణ్ తనకు తానే ఈ రెండు ఎస్ యూవీలను కొనుగోలు చేసి గిప్ట్ గా ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయన్నమాట.