తల్లిని చంపేసి… బిడ్డకు జననమా: నరేంద్ర మోడీ
posted on Mar 2, 2014 @ 10:09AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించాయని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దుమ్మెత్తి పోశారు. రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు పాటించాల్సిన కనీస విషయాలేవీ పాటించలేదని, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా చేశారని మండిపడ్డారు. తల్లిలాంటి సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ప్రకటించిన ప్యాకేజీలు, పన్ను రాయితీలు ఏవీ సామాన్యుడికి పనికొచ్చేవి కావని మోడీ తేల్చిచెప్పేశారు. తాను త్వరలోనే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తానని కూడా నరేంద్ర మోడీ చెప్పారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఎంతవరకు కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని మండిపడుతున్న సీమాంధ్ర ప్రాంత వాసులు ఇప్పటికే తమ ఆగ్రహాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ లాంటి నాయకులు రాజ్యసభలో విభజనకు అనుకూలంగా మాట్లాడటంతో పలు ప్రాంతాల్లో నరేంద్ర మోడీ ఫ్లెక్సీలను కూడా తగలబెట్టారు. ఈ ఆగ్రహాన్ని కొంతవరకైనా చల్లార్చి, ఆ ప్రాంతంలో కనీసం ఒకటి రెండైనా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలని అంటున్నారు.