ఏడు జిల్లాలకే ప్రత్యేక హోదా

  సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలకు ప్రత్యేక హోదా వర్తిస్తుందని ఇన్నాళ్లూ భావించిన వారి ఆశల మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ నీళ్లు చల్లారు. రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి మొత్తం 7 జిల్లాలకు మాత్రమే ప్రత్యేక హోదా అమలవుతుందని ఆయన విశాఖపట్నంలో చెప్పారు. బుందేల్ఖండ్ మాదిరిగానే సీమాంధ్రకు కూడా ప్రత్యేక హోదా ఉంటుందని జైరాం రమేష్ తెలిపారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే పరిశ్రమలకు మాత్రమే పన్నురాయితీలు వర్తిస్తాయని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు వర్తించబోవని స్పష్టం చేశారు. సీమాంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటుచేస్తామని కూడా ఆయన తెలిపారు.

నరసింహన్ గవర్నర్ గిరీ

  పైకి చాలా సౌమ్యంగా కనిపించే గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన మొదటి రోజునే శాంతి భాద్రాల విషయంలో చాలా కటినంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. ఆ తరువాత మాకీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే ముందు సంతకాలు చేసిన అనేక ఫైళ్ళను పునః సమీక్షించబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. అదేవిధంగా నామినేటడ్ పదవులలో కిరణ్ కుమార్ రెడ్డి నియమించిన వారందరూ స్వచ్చందంగా తప్పుకోమని కోరారు. రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుకి చైర్మన్ గా కిరణ్ చేత నియమింపబడ్డ కేసీ రెడ్డి ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయగా మరోకొంతమంది త్వరలోనే తప్పుకోవచ్చును. ఆ తరువాత సమ్మె చేస్తున్న పెట్రోల్ బ్యాంకులపై ఆయన దృష్టి సారించారు. వారు వెంటనే సమ్మె విరమించకపోతే తీవ్ర చర్యలు తీసుకొంటానని గట్టిగా హెచ్చరించి వారిచే ఒకే ఒక్కరోజులో సమ్మె విరమింపజేసారు. ఈ రోజు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతీతో సమావేశమవాదం గమనిస్తే బహుశః ఆయన ఇక గాడి తప్పిన ప్రభుత్వనిర్వహణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేయవచ్చును. నరసింహన్ అధికారం చెప్పటిన రెండు రోజుల్లోనే ఇంత చురుకుగా వ్యవహరిస్తూ పాలన చక్కబెట్టడం అభినందనీయం.

తెలంగాణాకు తెదేపా ప్రత్యేక కమిటీ

  టీ కప్పులో తుఫానులా మొదలయిన తెదేపా-తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అలకపాన్పు సీను ప్రశాంతంగా ముగిసింది. తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలను ఖండిస్తూ తను తెదేపాలోనే ఉంటానని, తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవాలని తపన పడుతున్నానని ముక్తాయింపు ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. మరొకటి రెండు రోజుల్లో తెదేపా-తెలంగాణా కోసం ప్రత్యేకంగా ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవూరి, మండవ, మరియు యల్.రమణలతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ తెలంగాణాలో పార్టీ శాఖకు కార్యవర్గం, ఎన్నికల కమిటీ, ఏర్పాటులో పార్టీ అధినేత చంద్రబాబుకి సహకరించవచ్చును. త్వరలో జరగనున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగబోతున్నాయి గనుక, తాత్కాలికంగా ఈ ఐదుగురు సభ్యుల కమిటీ నేతృత్వంలోనే పోటీచేసి, రాష్ట్రం అధికారికంగా విభజింప బడిన తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా శాఖలు ఏర్పాటు చేసేందుకు తెదేపా యోచిస్తున్నట్లు సమాచారం.

పార్టీని వీడను..బ్రతికించుకుంటా:ఎర్రబెల్లి

      తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ పార్టీని వీడుతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడనని, తెలంగాణలో పార్టీని బ్రతికించుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధినాయకత్వానికి సూచనలు చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ టిడిపి కి ప్రత్యేక కమిటీ వేయనందుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ టిడిపి పోరం కన్వీనర్ పదవికి రాజీనామా కూడా చేశారు. పార్టీని కూడా వీడేందుకు సిద్దమయ్యారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక కమిటీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ సీనియర్లు మోత్కుపల్లి నరసింహులు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు,ఎల్.రమణ,మండవ వెంకటేశ్వరరావులతో కమిటీ వేయవచ్చని భావిస్తున్నారు. వారంలోగా ప్రత్యేక కమిటీపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

సీమాంధ్రలో చక్కర్లు కొడుతున్న డిల్లీ నేతలు

  గత మూడునాలుగేళ్ళుగా రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్నా, లక్షలాది ప్రజలు రోడ్లమీధకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, డిల్లీ నుండి రెక్కలు కట్టుకొని వచ్చి రాష్ట్రంపై వాలిపోయారు. ఒకరు రాష్ట్రవిభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కాగా, మరొకరు రాజ్యసభలో తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన వెంకయ్య నాయుడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలంగాణా కోసం తెలంగాణా ప్రజలు పోరాడుతున్నపుడు ఈ ప్రజా ప్రతినిధులు ఇద్దరూ ఈ సమస్య పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు. వందలాది అమాయకులయిన యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొంటున్నపుడయినా స్పందించిన పాపానపోలేదు. కానీ ఇప్పుడు తెలంగాణా మేమే ఇచ్చామంటే, కాదు మేమే తెచ్చామని క్రెడిట్ కోసం కొట్లాడుకొంటున్నారు.   ఏనాడూ సీమాంధ్ర ప్రజలను పరమార్శించడానికి కూడా రాని జైరాం రమేష్ ఇప్పుడు సీమాంధ్రలోనే చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర విభజన సంగతి పక్కనబెట్టి, తాము విదిలించబోయే తాయిలాలు కావాలంటే తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి, శాసనసభకు, కేంద్రమంత్రులకు పూచికపుల్లెత్తు విలువీయకపోయినా సీమాంధ్ర ప్రజలందరూ తమ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించమని కోరుతున్నారు. ఇంక వెంకయ్య నాయుడు మరొక అడుగు ముందుకు వేసి తన ప్రాస బాషలో అలవోకగా ఉపన్యాసాలు దంచుతూ, గతంగతః అని జరిగినదంతా ఒక పీడకలగా మరిచిపోయి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీకే ఓటేయమని కోరుతున్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నంత కాలం రాష్ట్రంలో అడుపెట్టని   ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు రాష్ట్రంలోనే ఎందుకు తిరుగుతున్నారంటే వారి అగ్ర నేతలు నరేంద్ర మోడీ, సోనియా రాహుల్ గాంధీలు పర్యటనకు రంగం సిద్దం చేయడానికే. త్వరలో మోడీ రాష్ట్ర పర్యటన చేయబోతున్నట్లు ఖరారయింది. ఇక సోనియా, రాహుల్ గాంధీలు ఎప్పుడు తెలుగు ప్రజలను అనుగ్రహిస్తారో చూడాలి.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

      మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు.నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు.

మండలాలు సీమాంధ్రలో.. ఓట్లు తెలంగాణలో

      పోలవరం ముంపు ప్రాంతాల కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపినా.. అక్కడి ప్రజలు మాత్రం తెలంగాణలోనే ఓట్లు వేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం ప్రచురించిన భారత ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారు. ఈ గెజిట్ ప్రకారం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలు యథాతథంగా కొనసాగుతాయి. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. అంటే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ముంపు మండలాల ఓటర్లు తెలంగాణలోనే ఓటు వేస్తారు.

తెలుగువన్ ఫౌండేషన్ అధ్వర్యంలో వైద్య శిబిరం

  గత రెండు దశాబ్దాలుగా తాజా సినీ,రాజకీయ, సామాజిక వార్తా విశ్లేషణలను అందిస్తూ తెలుగు ప్రజలను ఆకట్టుకొన్న తెలుగువన్.కమ్ సంస్థ యాజమాన్యం ‘తెలుగువన్ ఫౌండేషన్’ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది. తెలుగు ఫౌండేషన్ ప్రతినిధులు, మణిపాల్ ఆసుపత్రి వైద్యనిపుణులతో కలిసి నాగాయలంక మండలంలో ఎదురుమొండి, నాచుగుంట గ్రామాలలో పర్యటించి వివిధ వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్యసేవలు అందించేందుకు వారి వివరాలు సేకరించింది. గ్రామస్తులలో ప్రధానంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళనొప్పులు, సీజనల్ జ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని మణిపాల్ ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం తెలిపారు. త్వరలోనే ఈ రెండు గ్రామాలలో ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులకు వైద్యం చేస్తామని తెలుగువన్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ కంఠమనేని రవిశంకర్  మరియు మణిపాల్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డా.రాజమోహన్ తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త వీవీ ఆర్. కృష్ణం రాజు, కృష్ణ మూర్తి, మణిపాల్ మార్కెటింగ్ హెడ్ ఉదయ కిరణ్, గ్రామ సర్పంచులు నాయుడు బాబురావు, సైకం నాగేశ్వర రావు తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

అన్నవరం ప్రసాదం ఇక వంద గ్రాములే

  మీసాల స్వామిగా పేరొంది అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తులకు ఇదో షాక్. స్వామివారి ప్రసాదం తయారీ ఖర్చులు పెరగడంతో ధర పెంచితే భక్తులు ఆగ్రహిస్తారని, బరువు తగ్గించేశారు. ఇన్నాళ్లూ స్వామివారి బంగీ ప్రసాదం 150 గ్రాములుండగా దాన్ని వంద గ్రాములకు కుదించారు. దినుసుల ధరలన్నీ పెరగడంతో ఏడాదికి 25 లక్షల ఖర్చు పెరిగిందని, అందువల్ల బరువు తగ్గించక తప్పలేదని ఈవో వెంకటేశ్వర్లు చెబుతున్నారు. అయితే, రేటు మాత్రం పది రూపాయలుగానే ఉంచామన్నారు. ఏవేం పెరిగాయి. నెయ్యి.. గతంలో రూ. 292, ఇప్పుడు 377 గ్యాస్ ధర.. 200 పెంపు గోధుమ ఇప్పుడు కిలో రూ.24 చక్కెర కిలో రూ. 29 ప్యాకర్ల చార్జీ.. గతంలో 35 పైసలు, ఇప్పుడు 50 పైసలు

చిత్తూరు నేతలిద్దరూ ఇక మాజీలే

   చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి పదవిని పొందిన రెండో వ్యక్తిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లో నిలిచిపోయారు. ఆయన, ఆయనతో పాటు మంత్రి గల్లా అరుణకుమారి మాజీలు అయ్యారు. రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సులకు ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో నల్లారి, గల్లా తమ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు మాత్రమే. చిత్తూరు జిల్లా నుంచి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1983లో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న తరువాత ఎన్నికైన రెండు నియోజకవర్గాల్లో తిరుపతికి రాజీనామా చేసి గుడివాడ నుంచి కొనసాగారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇద్దరు కీలక నేతలు ఒకరు ముఖ్యమంత్రిగాను మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన జరిగింది.

ఒక్కటవుతున్న బొజ్జల, నాయుడు?

  ఒక్కటవుతున్న బొజ్జల, నాయుడు? ఒకనాటి గురుశిష్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్‌సీవీ నాయుడు ఒకే వేదికపై కనిపించారు. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రథమ శిష్యుడి గా ఎస్‌సీవీనాయుడు పేరుపొందారు. కానీ ఎస్‌సీవీ నాయయుడు 2004లో వైఎస్ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరి గురువు బొజ్జల పైనే పోటీచేసి గెలిచారు. మరోసారి 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్‌సీవీ తలపడ్డారు. ఈ సారి విజయం బొజ్జల వైపు నిలచింది. అయితే కొంతకాలంగా ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.   మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ నుంచి స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించేందుకు మంత్రి గల్లా అరుణకుమారి బుధవారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి (కాంగ్రెస్) ఒకే వేదికపై పలకరించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న పొగడచెట్టు కింద కూర్చుని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంత్రితో స హా ఈ నేతలంతా చెట్టు కింద కూర్చుని 30 నిమిషాలు ముచ్చటలాడారు.

తెలీదు.. గుర్తులేదు.. చెప్పలేను: రామోజీరావు

  ‘ఈనాడు’ పత్రిక వార్తా సేకరణ విభాగమైన ‘న్యూస్‌టుడే ’ ఎక్కడుందో తనకు తెలియదన్నారు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు. దాని రిజిస్టర్డ్ ఆఫీసు హైదరాబాద్‌లోని తన ఈనాడు ఆవరణలోనే ఉందన్న సంగతి కూడా తెలియదనే చెప్పారాయన. కోర్టు సాక్షిగా ఆయన ఇలా ప్రతిదానికీ తనకు తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇవ్వటంతో.. ‘‘మీరు అవసరానికి అబద్ధాలాడుతున్నారు! ఔనా?’’ అని ప్రశ్నించారు ప్రతివాది తరఫు న్యాయవాది. ఇదంతా శనివారం కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప జూనియర్ మున్సిఫ్ కోర్టులో జరిగింది. తనకు వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనాలపై గనుల యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి 2005లో పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి ఆయన బెయిలు కోసం గతంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యారు కూడా. రెండోసారి నిందితుడిగా తన వివరణ ఇచ్చారు. మూడోసారి శనివారం క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పాటిల్ సిద్ధారెడ్డి, రవిచంద్ర ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పరువునష్టం వార్తను ప్రస్తావించిన న్యాయవాదులు రామోజీని వేసిన ప్రశ్నలు, ఆయనిచ్చిన సమాధానాలు ఇలాఉన్నాయి..   లాయర్: ఈనాడు 23 ఎడిషన్లకీ మీరేనా చీఫ్ ఎడిటర్?   రామోజీ: అవును నేనే. కానీ ఏ పేపర్లో ఏది పబ్లిష్ చేయాలన్నది వాళ్ల ఇష్టం. నేను చెప్పను.   లా: ఈ పరువు నష్టం వార్త రాసిందెవరు?   రా: నాకు తెలీదు. అయినా ఇది పరువు నష్టం వార్త కాదు.   లా: ఇది పరువు నష్టం వార్త కాదన్నది మీ అభిప్రాయమా? నిర్ణయమా?   రా: నా అభిప్రాయం మాత్రమే.   లా: ఈ వార్తలు మీకు తెలియకుండానే పబ్లిష్ చేశారా?   రా: మాకు న్యూస్‌టుడే అనే ఏజెన్సీ వార్తలు సప్లయ్ చేస్తుంది. వాటినే ప్రచురిస్తాం. అది ఇండిపెండెంట్ ఏజెన్సీ. (వాస్తవానికి ఇది ఈనాడుకు చెందిన వార్తా సంస్థ)   లా: అంటే న్యూస్‌టుడేతో మీకు ఎలాంటి సంబంధం లేదంటారా?   రా: అవును. దాంతో మాకెలాంటి సంబంధం లేదు.   లా: న్యూస్‌టుడే డెరైక్టర్ గోపాలరావు మీకు తెలుసా?   రా: తెలీదు. లా: ఆయన మీ ఉషోదయా హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ కదా! ఈనాడు బిల్డింగ్‌లోనే ఉంటారు కదా?   రా: ఏమో! నాకు తెలీదు.   లా: ఏడాది కిందట న్యూస్‌టుడే ఉద్యోగులందరినీ ఉషోదయ సంస్థలో విలీనం చేశారు. ఆ సంగతైనా తెలుసా?   రా: ఏమో నాకు తెలీదు. ఒకసారి చూడాలి.   లా: న్యూస్‌టుడే అడ్రస్ ఎక్కడ? రా: ఏమో! నాకు తెలీదు.   లా: అది మీ ఈనాడు కాంపౌండ్‌లోనే ఉంది కదా! దాని రిజిస్టర్డ్ చిరునామా అదే కదా!! (ఆర్‌ఓసీ పేపర్లు చూపిస్తూ)   రా: ఏమో.. నాకు తెలీదు. చూడాలి.   లా: న్యూస్‌టుడే మరో డెరైక్టర్ బాపినీడు చౌదరి తెలుసా?   రా: తెలుసు. ఎందుకంటే ఆయన ఈటీవీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.   లా: న్యూస్‌టుడే కాకుండా వేరే తెలుగు ఏజెన్సీల నుంచి మీరు వార్తలు తీసుకుంటారా?   రా: తీసుకోం.   లా: మీపై హైకోర్టులో 200కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కదా?   రా: ఏమో నాకు తెలీదు.   లా: మీరు ఇదివరకు ఒక పరువు నష్టం కేసులో రూ.10 వేలు జరిమానా కూడా కట్టారు కదా?   రా: ఏమో! నాకు గుర్తు లేదు. మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన రామోజీ... తాను 15 ఏళ్లుగా ఫిలిం సిటీలోనే ఉంటున్నానని, ఈనాడులో ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు. తాను అన్ని వార్తలూ చూడనని, ఎడిటోరియల్, పాలసీ వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటానని అన్నారు.

జుకర్‌బర్గ్ సంపద డబుల్

  సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(29 ఏళ్లు) సంపద దూసుకుపోతోంది. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన సంపద దాదాపు రెట్టింపు స్థాయిలో ఎగబాకింది. దీనంతటికీ ఫేస్‌బుక్ షేరు ధర పరుగే కారణం. 2012 మే 18న ఫేస్‌బుక్ పబ్లిక్ ఇష్యూ సమయంలో జుకర్ బర్గ్ సంపద 18 బిలియన్ డాలర్లు. ఇప్పుడిది 33 బిలియన్ డాలర్లకు ఎగసింది. తాజా గణాంకాల ప్రకారం జుకర్‌బర్గ్ వద్ద 47.89 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 19.6%. 2004 ఫిబ్రవరిలో ఆరంభమైన ఫేస్‌బుక్ సంస్థ గత నెలలోనే పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న యూజర్ల సంఖ్య 123 కోట్లు పైనే. మొబైల్ చాటింగ్ అప్లికేషన్ సేవల దిగ్గజం వాట్స్‌యాప్‌ను ఏకంగా 19 బిలియన్ డాలర్లు(రూ.1.18 లక్షల కోట్లు) వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.

ఎండొచ్చినా.. వానొచ్చినా కరెంటు కోతే

  మన రాష్ట్రంలో గట్టిగా ఎండలు వచ్చినా, సరిగ్గా నాలుగు చినుకులు పడినా కరెంటు మాత్రం పోవడం ఖాయం. గడిచిన రెండు రోజులుగా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో ఇలాగే ఉంటోంది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా సేపటి పాటు శివారు ప్రాంతాలలో కరెంటు కోతలు అమలు చేశారు. కొద్ది పాటి వర్షానికే కోఠి లాంటి ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ లాంటివి కనిపించాయి. ఇక ఆదివారం సాయంత్రం అయితే దాదాపు గంట పాటు గట్టిగానే వాన కురిసింది. అయితే సెలవు రోజు కాబట్టి ట్రాఫిక్ మీద మరీ అంత ఎక్కువ ప్రభావం కనిపించలేదు. కరెంటు మాత్రం ఎడా పెడా తీసేస్తూనే ఉన్నారు.

గల్ఫ్ లో పేలుడు.. ఐదుగురు భారతీయుల మృతి

  ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుడు జరిగి, ఐదుగురు భారతీయులు సహా పదకొండు మంది విదేశీయులు మృతి చెందారు. గురువారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దోహాలోని టర్కిష్ హోటల్ ల్లో సంభవించిన భారీ పేలుడులో మొత్తం 11 మంది మరణించారని, వారిలో 5గురు భారతీయులున్నారని ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి భారతీయులను గుర్తించారు. మృతులలో రియాస్ ఖిజాకె మానోలిల్, అబ్దల్ సలీం, జకారియా పదింజారే, అనాకండి, వెంకటేష్, షేక్ బాబు అనే ఐదుగురు భారతీయులని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు నేపాల్ దేశస్థులు ఉండగా, మరో ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు ఉన్నారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అక్కడి రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

కావూరి కూడా జంప్ జిలానీయేనా?

  కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. ఈ విషయం వాళ్లూ వీళ్లూ కాదు.. స్వయంగా కావూరే చెప్పారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కేడర్‌, ప్రజలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి 1984 నాటి కంటే అద్వాన్నంగా ఉందని అన్నారు. పార్టమెంట్‌లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని కూడా కావూరి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. తనకు మంత్రి పదవి రానంత వరకు కాంగ్రెస్ పార్టీని, అధిష్ఠాన వర్గాన్ని తెగ తిట్టి పోసి, సమైక్య నినాదం భుజానికెత్తుకున్న కావూరి, ఆ తర్వతా ఒక్కసారిగా స్వరం మార్చి సోనియా, రాహుల్ గాంధీల భజన చేయడం తెలిసిందే. అలాంటిది మళ్లీ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే గెలవడం మాట అటుంచి డిపాజిట్లు కూడా రావని తెలిసిపోయినట్లుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఈ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా జంపు జిలానీల లిస్టులో ఉన్నట్లు అర్థమైపోతోంది.

కేసీఆర్ కి అమావాస్యే అడ్డొచ్చిందా?

  తెలంగాణ వచ్చేస్తోంది కాబట్టి.. తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భవితవ్యం గురించి చర్చించేందుకు శనివారం జరగాల్సిన టీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా పడింది. ఆ రోజు అమవాస్య కారణంగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని 3వ తేదీన నిర్వహిస్తామని టీఆర్ ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు స్వయంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టాలా.. లేక కమలంతో కదం కలపాలా అనే విషయం తేల్చుకోడానికి టీఆర్ఎస్ ఓ భారీ సమావేశం నిర్వహించాలనుకుంది. దానికి శనివారాన్ని ముందు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఆరోజు పార్టీ పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం కలిసి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతాయని ఆ పార్టీ ఇంతకుముందు ప్రకటించింది.   కానీ, మధ్యలో ఏమైందో గానీ.. కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ కు మధ్య సంబంధాలు ఒక దశలో కాస్త చెడాయి. దాంతో విలీనం లేదా పొత్తు అనే విషయాన్ని శనివారమే తేల్చేస్తామని ముందు చెప్పినా.. తర్వాత మళ్లీ బీజేపీతో దోస్తీ కడితే ఎలాగుంటుందని కేసీఆర్ ఆలోచించారు. అంతే, వెంటనే కమలనాథులను సంప్రదించేందుకు వీలుగా తమ కీలక సమావేశాన్ని వాయిదా వేశారు. కానీ ఈ విషయాలన్నింటినీ బయటకు చెప్పేస్తే ఎందుకొచ్చిన తలొనొప్పి అని.. అమావాస్య వంక పెట్టారని వినికిడి.   కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం గురించి కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని, తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పగా, కాంగ్రెస్ తో విలీనం కంటే పొత్తే మేలని టీఆర్ఎస్ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో పాటు ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పయనం ఎటు అన్న విషయం సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది!