అప్పటివరకు పిచ్చామే చేతిలోనే అధికారం
posted on Mar 1, 2014 @ 2:32PM
సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పిచ్చామె చేతిలోనే అధికారం ఉంటుందని, తన చేతిలోని రాయి ఎక్కడ విసిరితే అక్కడే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆ పిచ్చామే విసిరిన రాయి నిజామాబాద్ లో పడిన కూడా ఆ ప్రాంతాన్ని సీమాంధ్ర రాజధానిగా ఒప్పుకోవాల్సి వస్తుందని జేసీ మండిపడ్డారు. వైకాపాలో చేరాలంటే ఎంపీ టిక్కెట్టుకు రూ.30కోట్లు, ఎమ్మెల్యే టికెట్ కు రూ.5 కోట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో కేవలం డబ్బు మాత్రమే పనిచేయదని, అభ్యర్థి గుణగణాలు, శక్తిసామర్థ్యాలు ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆరే అవుతారని అన్నారు. ఇటు సీమాంధ్ర ప్రాంతంలో, అటు తెలంగాణ ప్రాంతంలోను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జేసీ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్ళుగా ఉన్న అనుబంధం తెంచుకోవడం బాధగానే ఉందని, కానీ కాంగ్రెస్ ఉంటేనేం..పోతేనేం.. అని కొందరు చెప్పడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆయన అన్నారు.