కాంగ్రెస్ కి మజ్లీస్ తలాక్...తలాక్...తలాక్
posted on Mar 6, 2014 @ 1:30PM
కేవలం ఈ ఒక్క రోజులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో చాలా మార్పులు చేర్పులు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరో ఆసక్తి కరమయిన అంశం ఏమిటంటే, విభజన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొంటుందని భావించిన మజ్లీస్ పార్టీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోబోమని తేల్చిచెప్పేసింది. తెరాస హ్యాండివ్వడంతో షాకులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది మరో పెద్ద షాకని చెప్పవచ్చును. ఎందుకంటే ఇంతకాలం మజ్లిస్ పేరు చెప్పుకొని ముస్లిం ఓట్లను దండుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ అవకాశం పోయింది. తమది లౌకికవాద పార్టీ అని కాంగ్రెస్ ఎంత గొంతు చించుకొన్నా పేద, మధ్య తరగతి ముస్లిం ప్రజలు మజ్లిస్ పార్టీ వైపు, లేదా ఆ పార్టీ పొత్తులు పెట్టుకొంటున్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు తప్ప కాంగ్రెస్ చెపుతున్న కుహాన లౌకిక కదలని పట్టించుకోరు. అదేవిధంగా రాష్ట్ర విభజన చేసినందుకు గుర్రుగా ఉన్న సీమాంధ్రలో ముస్లింలపై కూడా ఈ ప్రభావం పడితే, ఇక కాంగ్రెస్ పార్టీకున్న మైనార్టీ ఓటు బ్యాంకు ఖాళీ అయిపోవడం ఖాయం.
మజ్లిస్ పార్టీ మంచి విజయోత్సాహంతో ఉన్నతెరాసతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్ మేయర్ గా ఉన్నమజ్లిస్ పార్టీకి చెందిన మజీద్ హుస్సేన్ కొద్ది సేపటి క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను కలిసి తమ పార్టీ నిర్ణయాన్ని తెలిపిన తరువాత తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాందీ తన ముద్దబ్బాయ్ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్న ఈ సమయంలోనే ఇటువంటి విపరీత పరిణామాలు జరుగుతుండటం పాపం నిజంగా దురదృష్టమే!