మోత్కుపల్లి సైలెన్స్ దేనికి సంకేతం
posted on Mar 5, 2014 8:57AM
రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశం వస్తుందని చివరి వరకు ఆశపడి, అధినేత చంద్రబాబు చెయ్యివ్వడంతో ఓ దశలో సైకిల్ కూడా దిగిపోదామనుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఇప్పుడు ముందంతా చీకటే కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద ఒంటికాలిమీద లేచే నర్సింహులు.. రాజ్యసభ వ్యవహారం తర్వాత అస్సలు నోరెత్తితే ఒట్టు. ఆయన మాటే ఎక్కడా వినిపించడంలేదు. నర్సింహులు ఈసారి పోటీచేసే విషయంలో కూడా ముందు వెనక ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఓ దశలో అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా కథనాలొచ్చాయి. కానీ అప్పట్లో నామా నాగేశ్వరరావు ఆయనను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేశారు. ఇక గతంలో ఆలేరు నుంచి వలస వెళ్లి తుంగతుర్తి నుంచి గెలిచినా.. ఇప్పుడక్కడ కుడిభుజంగా ఉండే నేతలు గానీ, కేడర్ గానీ పెద్దగా లేకపోవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని మరో ఎస్సీ నియోజకవర్గం నకిరేకల్ మీద ఆయన దృష్టి పడినట్లు తెలుస్తోంది. నకిరేకల్ టీడీపీ ఇన్‌చార్జ్ పాల్వాయి రజనీ కుమారిని ఆమె సొంత నియోజకవర్గం తుంగతుర్తి పంపి, ఆయన ఇక్కడ పోటీ చేయచ్చంటున్నారు. మరోవైపు, ఖమ్మం జిల్లాకు వచ్చి మధిర ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీ చేయాలని, ఎన్నికల ఖర్చులు తాను భరిస్తానని నామా నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. చివరకు మోత్కుపల్లి పయనం ఎటు సాగుతుందో చూడాలి మరి.