పవన్ రాజకీయం సంగతేంటి?
posted on Mar 5, 2014 @ 6:08PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారా? తానొక్కరే పోటీ చేస్తారా? అసలు రాజకీయాల్లోకి వస్తాడా రాడా.. ఇలాంటి ప్రశ్నలు గత కొంత కాలంగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. మార్చి రెండో వారంలో తాను చాలా విషయాలు చెబుతానంటూ పవన్ అన్నట్లు కూడా వినిపించింది. అయితే అప్పటిదాకా ఆగలేని ఔత్సాహికులు ఈలోపు తమకు కావల్సినట్లుగా చెప్పేసుకుంటున్నారు. పవన్ రాజకీయ భవితవ్యాన్ని తమకు తామే రాసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి లేదా ఏలూరు నుంచి పోటీ చేయొచ్చని, అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లేదా ఇండిపెండెంటు గానే పోటీ చేస్తారంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి మీడియా సంస్థల్లో ఫోన్లు బర బర మోగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు సాయంత్రానికి వాటికి ఒకమోస్తరుగా తెరపడింది. పవన్ కళ్యాణ్ సన్నిహితురాలు, పంజా సినిమా నిర్మాత తిరుమలశెట్టి నీలిమ ట్విట్టర్ ద్వారా వీటికి తెరదించారు. ‘‘అందరూ ఎందుకంత ఆందోళన చెందుతున్నారు, రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు.. కాస్త ఓపిక పట్టండి. మీ అనుమానాలన్నింటినీ స్వయంగా పవన్ కళ్యాణే తీరుస్తారు’’ అని ఆమె ట్విట్టర్ లో తెలిపారు.