పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం మెగా సస్పెన్స్
posted on Mar 5, 2014 @ 9:23PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతానని ప్రకటించిననాటి నుండి మీడియాలో చెలరేగిన ఊహాగానాలు, విశ్లేషణల గురించి అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు తాజాగా రెండు పూర్తి విభిన్నమయిన సమాచారాలు అందడంతో, ఆయన రాజకీయ ప్రవేశం గురించి మరింత గందరగోళం ఏర్పడింది.
పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులయిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు తెదేపా అధిష్టానాన్ని కలిసిఆయన తరపున ఒక ప్రతిపాదన పెట్టినట్లు తాజా సమాచారం. దాని ప్రకారం, తనకు పదిహేను శాసనసభ టికెట్స్, తను కోరిన వ్యక్తులకి, వారు కోరుకొనే నియోజక వర్గాలలోనే కేటాయించేమాటయితే, ఆయన తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, లేకుంటే ముందుగా ప్రకటించినట్లే ఈనెల 12 లేదా 13 తేదీలలో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ప్రకటిస్తారని చెప్పినట్లు సమాచారం.
అయితే ఏకంగా పదిహేను టికెట్స్ కేటాయించడం ఏ పార్టీ కయినా కష్టమే. గనుక తెదేపా అందుకు అంగీకరించకపోవచ్చును. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒకవేళ కొత్త పార్టీ పెట్టలేకపోయినా, కనీసం తనకు పూర్తిగా పట్టున్న ప్రాంతాలలో స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టి వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే దీనికి పూర్తి విరుద్దమయిన మరో తాజా సమాచారం ఏమిటంటే, ఆయన కార్యాలయం నుండి ‘ముందు ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం లేదు. రద్దయింది’ అనే మెసేజ్ మీడియాకు చేరినట్లు తెలుస్తోంది. అన్న (చిరంజీవి) కాంగ్రెస్ పార్టీలో ఉండగా, తమ్ముడు తెదేపాలోనో లేక వేరే ప్రతిపక్ష పార్టీగానో ఎన్నికలలో నిలబడితే ఇప్పటికే దెబ్బ తిన్న బందుత్వాలు మరింత దెబ్బ తింటాయని మెగా కుటుంబ సభ్యులు అందరూ పవన్ కళ్యాణ్ పై తీవ్రమయిన ఒత్తిడి తెచ్చి ఆయన ప్రెస్ మీట్ ను రద్దు చేయించినట్లు, తద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా రద్దయినట్లేనని చూచాయగా తెలుస్తోంది.
ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లయితే, సీమాంధ్రలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం, శ్రమ కూడా ఉండదు. గనుక, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ద్వారా కుటుంబ సభ్యులపైన, వారిద్వారా పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు.
అయితే పవన్ కళ్యాణ్ పట్టుదల, దృడ సంకల్పం గురించి బాగా తెలిసిన కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఒకసారి ఏదయినా నిర్ణయం తీసుకొంటే ఇక కష్టమయినా నష్టమయినా వెనుకడుగు వేయడని, ఆయన తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం చేయడమో లేదా తన తరపున కొందరు స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టడమో ఖచ్చితంగా చేస్తాడని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.
ఏమయినప్పటికీ, ఇక ఈ సస్పెన్స్ మరింత కాలం కొనసాగితే అది పవన్ కళ్యాణ్ పేరు ప్రతిష్టలకి నష్టం కలిగిస్తుంది. గనుక ఆయన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విస్పష్టమయిన ప్రకటన చేసి ఈ సస్పెన్స్ కు వెంటనే తెర దించడం అత్యవసరం.