పోటీ చేయడానికి ఎదురు డబ్బులు?

      అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఖరుకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి వద్దకు నేరుగా నాయకులే వెళ్లి కాంగ్రెస్ తరఫున బీఫారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నా వారి నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు.   మాజీ మంత్రి రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో పరువు నిలవాలంటే అన్ని చోట్లా అభ్యర్థులను రంగంలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రంగంలో ఉండాల్సిందేనంటూ తన అనుచరవర్గానికి రఘువీరా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మడకశిర మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ తానే ఖర్చు భరిస్తానని రఘువీరారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతపురంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నేరుగా తమకు ఇస్తామంటేనే పోటీ చేస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది.

చంద్రబాబు సరి కొత్త ప్రయోగం

  ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని, వినియోగించుకోవడంలో ఎల్లపుడు ముందుండే చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు నిన్న వైజాగ్ లో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రకటించారు.   ఈసారి పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరిని అభ్యర్ధులుగా నిలబెట్టాలో తెలుపమని కోరుతూ పార్టీ ఎంచుకొన్నకొందరు అభ్యర్ధుల పేర్లను చంద్రబాబు గొంతుతో రికార్డు చేయబడిన వాయిస్ మెసేజ్ లు పార్టీ కార్యకర్తల, ప్రజల సెల్ ఫోన్లకు పంపబడతాయని, ఐ.వీ.ఆర్.యస్. ఆధారితంగా పనిచేసే ఆ మెసేజ్ లకు ప్రజలు, కార్యకర్తలు స్పందించి తమకు నచ్చిన అభ్యర్ధులను ఎంచుకోవచ్చని వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారికి నచ్చిన వ్యక్తినే పార్టీ అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజక వర్గాల వారిగా అభ్యర్ధుల పేర్లతో కూడిన మెసేజ్ లు ప్రజలకు, కార్యకర్తలకు అందుతాయని, వాటికి స్పందించమని చంద్రబాబు కోరారు.   ఇదే ప్రయోగం ఆయన అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయక మునుపే చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. అందరి మన్ననలు పొందగాలిగేవారు. కానీ, దాదాపు సగం మందికి పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత చేస్తున్న ఈ ప్రయోగం వలన ఆశించిన ఫలితం దక్కకపోవచ్చును. పైగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు విజయవాడ నుండి కేశినేని నానికి ఏడాది క్రితమే ఆయన లోక్ సభ టికెట్ ఖరారు చేసారు. ఇప్పుడు ఆయనతో బాటు మరో ముగ్గురు అభ్యర్ధుల పేర్లను సూచిస్తూ మెసేజులు పంపినప్పుడు, ప్రజలు, కార్యకర్తలు ఆయనను కాక మరొకరి పేరును సూచిస్తే ఆయనను మార్చడం సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చి చేరుతున్న వారందరూ కూడా పార్టీ టికెట్స్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరుతున్నారనేది బహిరంగ రహస్యం. కనుక అభ్యర్ధులకు పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత ప్రజలను, కార్యకర్తలను అభిప్రాయం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి.   అయితే, ఇప్పటికీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయని అనేక నియోజకవర్గాలలో ఈ ప్రయోగం చేయవచ్చును. కానీ, అది కూడా కొత్త సమస్యలకు దారి తీయవచ్చును. అయితే ప్రతీ కొత్త ప్రయోగానికి, ఆలోచనకీ మొదట్లో ఇటువంటి ఆటుపోటులు, విమర్శలు ఎదుర్కోక తప్పదు గనుక చంద్రబాబు ప్రయత్నించడంలో తప్పులేదు.

సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్

  రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కూడా విభజించాలని కేంద్రం నిర్ణయిం చింది. దీనికి రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రాంతం సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేజోన్‌గా ఉండనుండగా, విజయవాడ ప్రధాన కేంద్రంగా సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక జోన్‌గా ఆవిర్భవించనుంది. రాష్ట్ర విభజన ఖాయంగా మారిన నేపథ్యంలో.. సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ వివిధ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఆ సమయంలో కేంద్రం దీనిపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాళ్లు మాత్రం కొత్త జోన్ ఏర్పాటు వల్ల అదనంగా ఖర్చు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని పెదవి విరిచేశారు.   తెలంగాణా బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపే సమయంలో సీమాంధ్ర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో వారిని బుజ్జగించే చర్యల్లో భాగంగా కేంద్రం మళ్లీ ఈ రైల్వే జోన్ విభజను పరిశీలిస్తానని హామీ ఇచ్చింది. తాజాగా రెండు జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం రైల్వే అధికారులను ఆదేశించటంతో ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల చేయలేదు.   ప్రస్తుతం తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్) జోన్ పరిధిలో ఉన్న విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను కూడా కొత్త జోన్ పరిధిలోకి తేనున్నారు. ఈ మూడు ప్రాంతాలను ప్రత్యేక డివిజన్‌గా చేసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తేవాలని చాలాకాలంగా గట్టి డిమాండ్ ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోలేదు. ఇప్పుడు పనిలోపనిగా ఆ ప్రాంతాలను తూర్పుకోస్తా నుంచి తప్పించి విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు.

కేసీఆర్ అమరుల ఉసురు పోసుకుంటారా?

  తెలంగాణా రాష్ట్ర సాధన కోసం దాదాపు వెయ్యిమంది వరకు ప్రాణత్యాగాలు చేసి అమరులయ్యారు. కానీ ఆ అమరుల కుటుంబాలను ఉద్యమపార్టీగా చెప్పొకునే టీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇతర పార్టీల నాయకులను ప్రజల్లో పలుచన చేసేందుకు ఎప్పటికప్పుడు అమరుల అంశాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం వాళ్లను కూరలో కర్వేపాకులా తీసి పారేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోతూ కూడా తెలంగాణా నినాదాలు చేసిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి.   శ్రీకాంత్ తల్లి శంకరమ్మ సైతం ఇదే అంటున్నారు. ఆమె కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని కూడా హెచ్చరించారు. పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ చెప్పారని, దానికి ఆమె ససేమిరా అన్నారని తెలుస్తోంది.

రాయపాటి చూపు…తెలుగుదేశం వైపు

  కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేస్తారని భావించిన రాయపాటి సాంబశివరావు.. ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. నాలుగు సార్లు లోక్ సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఈసారి గుంటూరు వదిలి నరసరావుపేట వైపు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరులో రాయపాటి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఏం చేయాలో ఆయన నిర్ణయించుకునేలోపే గల్లా జయదేవ్ టీడీపీలో చేరిపోవడం, ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు రాయపాటి నరసరావుపేట ఎంపీ టికెట్ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారని సమాచారం. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ రాయపాటి తన ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు సమాచారం. ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుంటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ తరువాత నరసరావుపేట పార్లమెంటు టికెట్ కేటాయింపు అంశం ఒక కొలిక్కి రావచ్చని జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.

కుర్చీని వదలాలంటే ఎంత కష్టమో

  రాకరాక వచ్చిన కేంద్ర మంత్రిపదవిని వదులుకోవడం కావూరి సాంబశివరావుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అప్పటివరకు సమైక్యాంధ్ర నినాదాలు చేసిన ఆయన, ఆ తర్వాత ఉన్నట్టుండి స్వరం మార్చేశారు. కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు వినాలని, మనం ఏం చేయగలమని అన్నారు. ఇప్పుడు కూడా చిట్టచివరి రోజు వరకు ఆ పదవిని అనుభవించేసి, ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసే ఆలోచనల్లో కావూరి ఉన్నట్లు తెలుస్తోంది.   ఇందుకోసం ముందుగా ఆయన పార్లమెంటులో తానేం ఇరగదీశానో చెబుతూ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ...’ అంటూ ఆ లేఖ సాగింది. ఈ లేఖను కరపత్రాలుగా ముద్రించి ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గంలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ఆ కరపత్రంపై ఒక ఫోన్ నంబరు కూడా ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే మంత్రి కావూరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖల భాగోతానికి తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే అభిప్రాయనికి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఆవిర్భావ సభలో ఆకట్టుకోని కిరణ్ ప్రసంగం

      తూర్పు గోదావరి జిల్లా జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. కిరణ్ చేసిన ప్రసంగం చాలా చప్పగా సాగడంతో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు నిరసి౦చిపోయారు. కాంగ్రెస్ అధిష్టాన౦పై పాత పాటనే కిరణ్ మళ్ళీ వినిపించారు. రాష్ట్ర విభజనకు ఎవరు సిపార్సు చేస్తే విభజించారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఈ రీతిలో విభజించడం సమంజసమా? అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణ విద్యార్ధులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలలో ఇబ్బందులు వస్తాయని అన్నారు. గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తెలియదని అన్నారు. రాష్ట్ర విభజనకు పెద్ద బాబు చంద్రబాబు, చిన్న బాబు జగన్ బాబు ఇద్దరూ లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు. విభజనను ఎలా చెయ్యాలి అనేది కూడా చిన్న బాబు జగన్ లేఖలో వివరించి పంపించారని అన్నారు. మరోవైపు ఇతర పార్టీ అధ్యక్షులపై పదునైన విమర్శలు చేయడంలో కిరణ్ విఫలమయ్యారు. సభకు వచ్చిన కార్యకర్తలో, ప్రజల్లోను ఉత్సాహాన్ని ని౦పలేకపోయారు. ఇదే తీరుగా కిరణ్ తన ప్రసంగాలతో ప్రజల్లోకి వెళితే పార్టీకి గుర్తింపు రావడం కూడా కష్టమేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.                      సభ హైలైట్: సమైక్యాంద్ర పార్టీ సభను నిర్వహిస్తున్న ఒక నేత ఒకటికి పదిసార్లు రోడ్డుమీద ఉన్నవారంతా సభ ప్రాంగణంలోకి రావాలని కోరడం విశేషం. 

యువ ఓటర్లదే ఇక రాజ్యం

      లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో సగానికిపైగా యువ ఓటర్లే ఉన్నారు. మొత్తం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో 3.52 కోట్ల మంది యువతే. ఇటీవల కేంద్ర ఎన్నిల కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా బయట ఉన్న యువతను జాబితాలోకి తీసుకురావడానికి అనేక చర్యలను చేపట్టారు. దీంతో కొత్తగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. రాష్టంలో మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోయి, పురుష ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జనవరిన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2.90 కోట్ల మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 2.92 కోట్ల మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య తలకిందులైంది. ఇంటింటి ఓటర్ల జాబితా తనిఖీల అనంతరం పురుష ఓటర్లు పెరిగిపోయారు. మహిళా ఓటర్లు ఏకంగా నాలుగు లక్షల మంది తగ్గిపోయారు. ప్రస్తుతం పురుష ఓటర్లు 3.13 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 3.10 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు సంఖ్య మూడు లక్షలు తక్కువ.

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పేరు జనసేన?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించబోయే కొత్త పార్టీ పేరు ‘జన సేన’ అని తాజా వార్త. ఆయన ఈమధ్యనే ఎన్నికల కమీషన్ వద్ద ఈ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పార్టీకి ఎన్నికల కమీషన్ అంగీకరిస్తుందా లేదా అనే సంగతి తేలవలసి ఉంది. లేకుంటే ఆయన తన అనుచరులతో కలిసి స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగవచ్చును. ఎల్లుండి హైదరాబాదులోని మాదాపూర్ వద్ద ఉన్న హైటేక్స్ లో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ స్థాపనకు చురుకుగా పనులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.ఆరోజు పవన్ కళ్యాణ్ తన పార్టీ పేరు, లోగో, జెండా, అజెండా వగైరాలు ప్రకటిస్తారు.

మెగా సోదరుల మధ్య కూడా కాంగ్రెస్ చిచ్చు

  కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకాలంగా అన్నదమ్ములలా కలిసి బ్రతికిన తెలుగుజాతిని రెండుగా చీల్చింది. ఇప్పుడు చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించి, మెగా సోదరుల మధ్య కూడా చిచ్చుపెట్టి వారి కుటుంబాలను, అభిమానులను కూడా రెండుగా చీల్చుతోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్న సంగతి తెలిసి ఉన్నపటికీ, ఆయనను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించితే, దానిని ఆయన అంతే సంతోషంగా మహాప్రసాదమన్నట్లు స్వీకరించడం విశేషమే.   కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందో చిరంజీవికి తెలిసి ఉన్నపటికీ, ఆయన ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, కేవలం పదవులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇంతకాలం రామలక్షణుల వలే మెలిగిన ఈ మెగా సోదరులిరువురూ ఎన్నికల కురుక్షేత్రంలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోబోతున్నారు. చిరంజీవి సీమాంధ్ర ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ తరపున యుద్ధం చేస్తుంటే, ఆయన సోదరులిరువురూ ఆ వంచింపబడ్డ ప్రజల తరపున నిలబడి పోరాడేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను చీల్చడానికి కూడా వెనుకాడలేదు. అదేవిధంగా చిరంజీవి అధికారం, పదవుల కోసం రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మీద, తనకు బ్రహ్మరధం పట్టిన తెలుగు ప్రజలమీద కత్తి కట్టినట్లుగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రజల ముందు రాబోతున్నారు.   నిజానికి చిరంజీవి ఇప్పటికయినా తన తప్పుని సరిదిద్దుకొనే అవకాశం సోదరుడు పవన్ కళ్యాణ్ ద్వారా దక్కినపుడు దానిని సద్వినియోగం చేసుకొని ఉండి ఉంటే, ఆయనకు ప్రజలు మళ్ళీ బ్రహ్మ రధం పట్టేవారు. కానీ, తనను ఆదరించి ఆశీర్వదించిన తెలుగు ప్రజల కంటే, తోడబుట్టిన తమ్ముళ్ళ కంటే కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీయే మిన్న అని ఆయన అనుకొంటున్నారు. ఆమెను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొంటే తనకు తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో ఓడిపోతే తన పరిస్థితి ఏమిటనేది ఆయన ఆలోచించుకొన్నారో లేదో ఆయనకే తెలియాలి.   ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెగా సోదరుల మధ్య చిచ్చుపెట్టి వినోదం చూస్తోందని భావించవచ్చును.అయితే, అందుకు కాంగ్రెస్ నే కాదు చిరంజీవిని కూడా నిందించక తప్పదు.

ఈ సిరా ఏ ఓటుదో?

      ఎన్నికల్లో దొంగ ఓట్లను నిరోధించేందుకు సిరా చుక్కతో చెక్ పెడతారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఓటరు వేలిపై వేసే ఈ చుక్క వల్ల వాళ్లు అప్పటికే ఓటు వేసినట్టు తెలుస్తుంది. అది పోవాలంటే చాలా సమయం పడుతుంది. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. రోజుల వ్యవధిలోనే ఓటర్లు ఆయా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన వారు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోను, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు తరువాత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.   ఓటు వేసిన వారి ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. ఈ చుక్క చెరగాలంటే నెలకు పైగా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండు ఎన్నికల మధ్య వ్యవధి తక్కువ కావడంతో ఓటర్లకు పోలింగ్ ఏజెంట్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రెండు ఎన్నికలకూ రెండు వేళ్లకు సిరా చుక్క వేస్తారా? అది సాధ్యం కాదా? అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

పార్టీ అధ్యక్షుల సీమ?

  రాయలేలిన సీమ, రతనాల సీమ మన రాయలసీమ. రాష్ట్ర రాజకీయ పటంలో సీమకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. అతి ఎక్కువ ముఖ్యమంత్రులను అందించిన ఘనత రాయలసీమదే. రాష్ట్ర విభజన నేపద్యంలో మరో రికార్డ్ సీమ మెడలో హారం కానుంది. సీమ ప్రాంతంలోని 4 జిల్లాలకు చెందిన వారే వివిధ రాజకీయ పార్టీల అద్యక్షులు, కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ పార్టీతో పెరిగిన అధ్యక్షులు మొత్తం 5 ప్రధాన పార్టీల అధ్యక్షులతో రాజకీయాల్లో కీలకం తామేనని నిరూపించుకున్నారు.   ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ పార్టీకి అధ్యక్షుడు కూడా కిరణే. కడప జిల్లాకు చెందిన జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఎంపిక కావడం అనంతపురం జిల్లాకో పార్టీ అధ్యక్షుల కోటా దక్కింది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ వేదిక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ్ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే.

గవర్నర్ వర్సెస్ భన్వర్ లాల్

      గవర్నర్ నరసింహన్ ఎంత చమత్కారంగా ఉంటారో అంతే సీరియస్ గా కూడా ఉంటారు. గతంలో డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుంది అంటే, ఏముంది జనవరి 1 వస్తుంది అని సరదాగా నవ్వేశారాయన. అలాంటి గవర్నర్.. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్ లాల్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.   విషయం ఏమిటంటే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉంది కాబట్టి, ప్రధాన అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని గవర్నర్ నరసింహన్ భావించారు.  కానీ, ఆ విషయం సీఎస్ నుంచి భన్వర్ లాల్ వద్దకు వెళ్లింది. ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని సంప్రదించి, ఇది ఎన్నికల కోడ్ కు ఉల్లంఘన అని, గవర్నర్ కూడా కోడ్ పరిధిలోకే వస్తారని చెప్పారు. దాంతో నరసింహన్ కు ఒళ్లు మండింది. అందుకే భన్వర్‌లాల్‌ కు ఘాటైన లేఖ రాస్తూ.. తన అధికారాల గురించి చెప్పనక్కర్లేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తే చాలనే అర్థం వచ్చేలా పేర్కొన్నట్లు సమాచారం.

భోజనం చెయ్యి.. 20 వేలియ్యి

      మన రాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు లాంటి టీఆర్ఎస్ నేతలు ఆమధ్య కూలిపని చేసి, టీ కొట్టులో పనిచేసి వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు సంపాదించారు.. గుర్తుందా? గమేళాలో ఒకే ఒక్క ఇటుక పెట్టుకుని దాన్ని నాలుగడుగులు తీసుకెళ్లి ‘కూలీ‘ చేసినందుకు కేసీఆర్ అప్పట్లో 20 వేలు సంపాదించేశారు. సరిగ్గా ఇదే మంత్రాన్ని బెంగళూరులో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జపిస్తున్నారు.   నిన్నటి వరకు ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేసి, ఇప్పుడు ఆమ్ ఆద్మీగా మారిన బాలకృష్ణన్ అక్కడో విందు ఏర్పాటుచేశారు. దీనికి అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు. అక్కడ భోజనం చేయడంతో పాటు పార్టీ విధానాల గురించి ఏం అడిగినా కేజ్రీ సమాధానాలు చెబుతారు. ఇంతకీ విందుభోజనం ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా 20 వేల రూపాయలు మాత్రమే. ఇలా ఒక్కో విందు ద్వారా 4 లక్షలు సంపాదించాలన్నది ఆ పార్టీ లక్ష్యమట. ఇలాంటి ఫండ్ రెయిజింగ్ డిన్నర్స్ అమెరికన్ రాజకీయాల్లో మామూలే. కానీ ఆమ్ ఆద్మీలకు అందని ద్రాక్షల్లాంటి ఇలాంటి విందుల వల్ల ఏం లాభమని ఆప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారట.

అబ్బాయి దెబ్బ.. బాబాయ్ అబ్బా

  అబ్బాయ్ ముద్దొస్తున్నాడని చంకన వేసుకుంటే చెవులు కొరికేసాడట. ఇదే రీతిలో బాబాయ్ వివేకానందరెడ్డికి జరిగిందట. అన్న వైఎస్ అంటే వల్లమాలిన అభిమానం వివేకాకు.. రాముడు వనవాసానికి వెళ్తే.. ఆయన పాదరక్షలు సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు టైపులో అవకాశం దక్కి ఉంటే వివేకా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అన్నయ్య బొమ్మ పెట్టి పాలించేవాడే. అన్న మనోడే అయినంత మాత్రాన అబ్బాయి కూడా తనోడే అవుతాడనుకోవడం పొరపాటే అని చింతిస్తున్నాడు వివేకానందరెడ్డి.   అన్న ఉన్నప్పుడే అన్యాయం అన్నీ తానే అనుకుని నమ్ముకున్న అన్న ఉన్నప్పుడే వివేకాకు అన్యాయం జరిగింది. అబ్బాయి మొదటి దెబ్బకు బాబాయ్ అబ్బా! అని వాపోయాడు. అన్న కొడుకు జగన్ కోసం తన పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేసిన వివేకా.. వైఎస్ మరణానంతరం తప్పనిసరి స్థితిలో కాంగ్రెస్ లో చేరాడు. అమ్మ అన్నం పెట్టదు. అడుక్కొనీ తిననివ్వదన్నట్లు జగన్ వ్యవహరించడంతో వైఎస్ ఫ్యామిలీ పొలిట్రిక్స్ లో వివేకా ఒంటరి అయిపోయాడు. కాంగ్రెస్ లో ఉంటూ వదిన విజయమ్మపై పోటీ చేసి వైఎస్ అభిమానులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అడ్డంకులు అధిగమించేందుకు తప్పనిసరి అబ్బాయి పంచన మళ్ళీ చేరాడు.   బాబాయి అయినా .. జగన్ జైలులో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లి భంగపడిన వివేకా..అవమానభారంతో ఉన్నా ఇతర పార్టీల్లో చేరలేని పరిస్థితి. అబ్బాయి జగన్ కడప జిల్లా పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల పందేరం పూర్తి చేశాడు. బాబాయ్ కి నో టికెట్..నో సీట్... పోనీ పార్టీ పదవుల్లో ఏమైనా అవకాశం ఇస్తాడా అనుకుంటే అదీ లేదు. ఒకప్పుడు జగన్ అభిమానులు అడ్డగించిన సందర్భంలో మీసం మెలేసి తొడగొట్టిన బాబాయ్.. ఇప్పుడు అబ్బాయి కొట్టిన దెబ్బకు రాజకీయరంగం నుంచి ఏకంగా కనుమరుగైపోయే పరిస్థితి. పాపం బాబాయ్!

జైరామ్ నోటి దురద కొంచెం ఎక్కువే

  గత రెండు వారాలుగా రాష్ట్రం మీదనే చక్కర్లు కొడుతున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలని, ప్రతిపక్ష పార్టీలనీ చివరికి తన కాంగ్రెస్ పార్టీకి కూడా చిరెత్తిస్తున్నారు. మొన్న తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని ప్రకటించి నాలిక కరుచుకొన్న తరువాత తెరాస మీద అవాకులు చవాకులు వాగి నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరికలు చేయించుకొని వారి చేత తలంటించుకొన్నాక ఆంద్రాకు వచ్చి పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజమండ్రీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అక్కడ తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. దానిని జైరామ్ రమేష్ ఎద్దేవా చేస్తూ ‘శ్మశానంలో పుడుతున్న పార్టీ చివరికి శ్మశానంలోనే కలిసిపోతుందని’ వ్యాక్యానించారు. అప్పుడు పత్రికా విలేఖరులు అభ్యంతరం చెపితే, తన మాటలను అపార్ధం చేసుకోవద్దని రాజమండ్రిలో ఒక కైలాసభూమి ఉందని అందుకే తాను ఆవిధంగా అన్నాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని సర్ది చెప్పుకొన్నారు. అయితే కిరణ్ కి కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు తీసిపోని విధంగా చాలా ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ అస్తికలను గోదావరిలో కలపడానికే ఆయన పనికట్టుకొని డిల్లీ నుండి వచ్చారని అన్నారు.   తెలుగు ప్రజలందరూ పవిత్ర గోదావరి ప్రవహించే రాజమండ్రీని తమ సాంస్కృతిక రాజధానిగా, ఒక పరమ పవిత్ర ప్రాంతంగా, పుణ్యక్షేత్రంగా భావిస్తూ దానితో ఏదో చెప్పలేని ఒక అవినాబావ సంబంధం పెనవెసుకొని ఉంటారు. అందుకే, అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు గోదావరి-రాజమండ్రీ గురించి అపురూపంగా వర్ణిస్తారు. తెలుగు సినిమాకు గోదావరికి-రాజమండ్రీకి విడదీయరాని అనుబంధం ఉంది. అటువంటి పట్టణాన్ని జైరామ్ రమేష్ ఒక శ్మశానభూమిగా వర్ణించడం ఆయన మిడిమిడి జ్ఞానానికి, అహంకారానికి అద్దం పడుతోంది.   ఆయన ఈవిధంగా మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్లు మాట్లాడితే, ఇప్పటికే జీవచ్చవంలా కాడి మీద పడుకానున్న కాంగ్రెస్ పార్టీకి ఆయనే శ్రాద్ధ కర్మలు స్వయంగా నిర్వహించి ఉండవల్లి చెప్పినట్లు ఆ గోదాట్లోనే అస్థికలు కలిపి డిల్లీ తిరుగు ప్రయాణం కాకతప్పదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇటువంటి నేతల వలననే కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం కలుగుతోంది.

కమలం - సైకిల్ దోస్తీ?

  రానున్న ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్రంలోని కమలనాథులు ఎంతగా ఉత్సాహపడుతున్నా, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక కొన్ని లాంఛనాలు కూడా పూర్తి చేసుకున్నాక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినపుడు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. స్థానిక, సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణల్లో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ ప్రధాన శత్రువులన్నారు. భవిష్యత్ అవసరాలు, జాతీయరాజకీయాల్లో పార్టీ పోషించాల్సిన పాత్ర దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయాలని సూచించారు. సాధారణ ఎన్నికలు పార్టీకి ముఖ్యం కాబట్టి బీజేపీ ఎన్ని స్థానాలు కోరితే అన్ని ఇవ్వాలన్నారు.

చెప్పుడు మాటలు విని విఫలమయ్యా: బాబు

  తాను 1999 వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వాడినని, ఆ తరువాత 2009 వరకూ పలువురు చెప్పిన మాటలు వినటంతో పాటు మొహమాటాలకు పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటంతో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. బాలకృష్ణ పోటీ చేస్తానంటే ఆయన కోరిన సీటును ఇస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపారు. సీమాంధ్రలో తనను లేకుండా చేయటంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి సహకరించాలనే ఉద్దేశంతోనే.. టీడీపీ సీమాంధ్రలో బీసీ సీఎం నినాదం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు.   టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉన్న ఉద్యోగులకే తనపట్ల వ్యతిరేకత ఉందని బాబు వ్యాఖ్యానించారు. అభ్యర్థులను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) పద్ధతి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎంపిక చేస్తామని అన్నా రు. తొలుత పార్టీ కార్యకర్తలు, ఆ తరువాత ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ సీటుకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు పంపి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, వీరు ఎవ్వరూ వద్దనుకుంటే మరొకరి పేరు సూచించాలని కోరతామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామన్నారు.

విభజించు.. పాలించు

  కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. విభజించి పాలించే విధానాన్ని పదే పదే పాటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఉంటే తనకు ఇబ్బంది అని విభజించి, ఇప్పుడు మళ్లీ రెండువైపులా కూడా ప్రజల్లోను, నాయకుల్లోను విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగమే కేంద్ర మంత్రి జైరాం రమేష్ పర్యటన, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.   ఆంధ్రప్రాంతంలో పర్యటించినంత కాలం అక్కడి ప్రజలను, నాయకులను కూడా నోటికి వచ్చినట్లల్లా తిట్టిపోసిన జైరాం రమేష్.. తాజాగా తెలంగాణలోనూ అదే పని చేస్తున్నారు. జేఏసీ నేతలకు వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తామని ప్రకటనలు చేయడం, మరోపక్క తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలతో సమావేశం కానున్నట్టు ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి- తెలంగాణ జేఏసీకి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్ని పార్టీ సీనియర్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా తీవ్రంగా విమర్శించారు. హత్యలు చేసినవాళ్లే శవంపై పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఆయన తీరు ఉందని దుయ్యబట్టారు. జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య అంతరం పెంచే పాపపు పనికి ఒడిగడుతున్నారని ఆరోపించారు.