జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్

      రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలైంది. అసెంబ్లీ, లోక సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, మున్సిపాల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైంది. తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. జడ్పిటిసి, ఎంపీటీసి ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. స్థానిక సంస్థల బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.   1. మార్చి17 నుండి 20 వరకు నామినేషన్ల స్వీకరణ 2. మార్చి 21న నామినేషన్ల పరీశీలన 3. మార్చి 24న నామినేషన్ల ఉపసంహరణ 4. ఏప్రిల్ 6న పోలింగ్ 5. ఏప్రిల్ 7న అవసరమైన చోట రీపోలింగ్ 6. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు

రాజకీయాల్లోకి రాఖీ?

      ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందాలను ఆరబోసే రాఖీ సావంత్ ఉన్నట్టుండి సమాజసేవికగా మారిపోయింది. శుభ్రత- పరిశుభ్రత అంటూ లెక్చర్లు ఇస్తోంది. అంతేకాదు, మురికివాడలకు కూడా వెళ్లిపోతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా పదివేల చెత్తబుట్టలు, కొన్ని బహుమతులు, తినుబండారాలు కొనుక్కుని మురికివాడలకు వెళ్లారు రాఖీ. అక్కడున్నవారికి వాటిని పంచిపెట్టింది. డస్ట్‌బిన్స్ పంచుతున్నప్పుడు అందరూ అందులోనే చెత్త వేయాలని, తద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, దానివల్ల రోగాల బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ లెక్చర్ కూడా ఇచ్చేసిందట. ఆమెకు రాజకీయాల్లో చేరాలని ఉందని, అందులో భాగంగానే ఇదంతా చేసిందని కూడా కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు.

జైరామ్ దెబ్బకి టీ-కాంగ్రెస్ కూడా మటాష్?

  పార్లమెంటులో విభజన బిల్లుకి ఆమోదముద్ర పడగానే కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చి రాష్ట్రం మీద చక్కర్లు కొడుతూ ఆంధ్ర, తెలంగాణా ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయ్ సింగ్ ఇన్-చార్జ్ అయినప్పటికీ ఇప్పుడు జైరామ్ రమేషే ఇన్-చార్జ్ అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఆంధ్ర, తెలంగాణాలలో పార్టీని తీవ్ర ప్రభావితం చేసే విదంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాకు దళితుడనే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇంత కీలకమయిన నిర్ణయాలను ఈవిధంగా ప్రకటించ(లే)దు. కానీ, జైరామ్ రమేష్ ప్రకటించారంటే బహుశః అందుకు అధిష్టాన దేవత అనుమతించి ఉండవచ్చును.   తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పడమే కాకుండా, కనీసం పొత్తులకయినా కాంగ్రెస్ ను కనికరించకుండా, తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది చెపుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా తయారయ్యారు. అంతే గాక తెలంగాణా ఏర్పడితే మొదట దళితుడనే ముఖ్యమంత్రి ని చేస్తానని చెపుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. పైగా తనపార్టీ నేతలచేత తనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి తెలంగాణా పునర్నిర్మాణం చేయాలని గట్టిగా డిమాండ్ చేయిస్తున్నారు. అందువలన ఇప్పుడు కేసీఆర్ ని అతని పార్టీని తెలంగాణా ప్రజల దృష్టిలో పలుచన చేసేందుకే బహుశః జైరామ్ రమేష్, ఇప్పుడు ‘దళిత ముఖ్యమంత్రి’ అంశం తలకెత్తుకొన్నారు. అయితే తెలంగాణా ఏర్పాటు చేసి, తెరాసను విలీనం చేసుకొని, తెదేపా, బీజేపీలను దెబ్బతీసి రాజకీయ లబ్ది పొందాలని కలలుగన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జైరామ్ రమేష్ తాజా ప్రకటనతో మరొకసారి తన కాళ్ళను తానే నరుకొన్నట్లుగా అయింది.   తెలంగాణా ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగంటున్న డజనుకు పైగా ఉన్న టీ-కాంగ్రెస్ నేతల ఆశలపై జైరామ్ రమేష్ ప్రకటన నీళ్ళు చల్లినట్లయింది. వారందరూ ఇంతవరకు కేవలం ముఖ్యమంత్రి పదవికోసమే సోనియా భజన చేస్తున్నారని అందుకే తెరాసతో పొత్తులు వద్దంటున్నారని కూడా అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ ని ఇరుకునపెట్టే ప్రయత్నంలో జైరామ్ రమేష్ మాట్లాడిన మాటలు వారికి తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇంతవరకు ఆయనను అంటిబెట్టుకొని తిరిగిన టీ-కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు ఆయనపై అధిష్టానానికి పిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నారు.   అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు. సోనియమ్మ ఆదేశం లేనిదే జైరామ్ రమేష్ అయినా ఆవిధంగా మాట్లాడరు అనే తత్వం వారు గ్రహించలేకపోవడం విచిత్రమే. అయినా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసం తన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీని, నేతల రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టగలిగిన కాంగ్రెస్ అధిష్టానం, అవసరమనుకొంటే టీ-కాంగ్రెస్ నేతలను (కేసీఆర్ కి) బలి ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతుంది? అనే ఆలోచన కూడా వారికి లేకపోవడం విచిత్రమే.  

దానం దాదాగిరీ

    ‘ఈ బస్తీలో మా అన్నతిరుగొద్దన్నడు..మీరు వెంటనే వెళ్లిపోండి.. లేకుంటే బాగుండదు..’ ఇవీ ఏ వీధి రౌడీయో అన్న మాటలు కావు, ఇతర పార్టీల నాయకులకు తాజా మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరుల హెచ్చరికలు. పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి మీరెవరు.. అని ప్రశ్నించిన వేరే పార్టీల కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ దౌర్జన్యకాండ నిరాఘాటంగా పోలీసులు పక్కనుంచి చూస్తుండగానే జరిగింది. బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర నగర్ లో ఈ సంఘటన జరిగింది. కార్పొరేటర్ కొడుకు, అతడి అనుచరులు ఈ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడిన బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్జీ, అనుచరులు సంజీవ్‌నాయక్, రాజేందర్‌లపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341 (దౌర్జన్యం), సెక్షన్ 509 (మహిళలపై అసభ్యప్రవర్తన, అసభ్య పదజాలంతో దూషించడం), 506 (చంపుతానని బెదిరించడం) తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వైకాపాలో చేరిన అనంత వెంకట్రామి రెడ్డి

      సీమాంధ్రలో కాంగ్రెస్ బలమైన నాయకులంతా ఒకరి వెనుక ఒకరు పార్టీని వీడి వేరే పార్టీలోకి వలసలు వెళ్ళడంతో ఆ పార్టీ అధిష్టానం దిక్కుతొచని స్థితిలో పడిపోయింది. తాజాగా అన౦తపురం జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం వైకాపాలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో అనంతపురం జిల్లాతో పాటు పార్టీలో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని, అందుకే తాను పార్టీని వీడానని తెలిపారు. జిల్లాలో పార్టీ గెలుపుకు శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలుగుదేశం తరపున లోక్ సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అక్కడ రసవత్తర పోటీ జరిగే అవకాశం ఉంది. ఇరు పక్షాలకు ఇది ప్రతిష్టాత్మక నియోజకవర్గం అవుతుంది.

తిరుపతిలో కుల రాజకీయాలు షురూ

  తిరుపతిలో కుల రాజకీయాలు మొదలైపోయాయి. ముందునుంచే చిత్తూరు ప్రాంతంలో కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందినవాళ్లు తమ ఆధిపత్యం చూపించుకోడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ పార్టీలో ఉన్న ఓ కులం వాళ్లంతా కలిసి సమావేశం పెట్టుకున్నారు. దానికి ఇతర పార్టీలలో ఉన్న సాటి కులస్థులను కూడా పిలిచారు. పిలవడం అయితే పిలిచారు గానీ, వాళ్లను వేదికమీదకు కూడా పిలవకుండా, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పార్టీ వాళ్లనే అందలం ఎక్కించారు. దాంతో మమ్మల్ని పిలవడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకంటూ మిగతా పార్టీల వాళ్లు మండిపడుతున్నారు. మరోవైపు బీసీ సంఘాలు కూడా ఈ కులసమావేశం విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. తిరుపతిలోని బీసీలలో యాదవ సామాజికవర్గం బలంగా ఉంటుంది. కుల సమావేశాలు ఏర్పాటుచేసి, తమవాళ్లనే గెలిపించుకోవాలని చెప్పడం ఏంటని వీళ్లు కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. బీసీలను కాదని వాళ్లెలా గెలుస్తారో చూస్తామని కత్తులు నూరుతున్నారు.

పవన్ పార్టీ పెడితే.. ఆలోచిస్తా: అలీ

  సినీ హీరో పవన్‌కళ్యాణ్ పార్టీపెడితే రాజకీయ ప్రవేశం, పోటీ చేసే అంశాల గురించి ఆలోచిస్తానని సినీ నటుడు అలీ చెప్పారు. గుంటూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పవన్ పార్టీ పెట్టకుండా రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. రాజమండ్రి నుంచి పవన్ పార్టీ తరపున పోటీచేయనున్నారని ప్రచారం జరుగుతున్నట్లు విలేకరులు అడగ్గా అలాంటిదేమీ లేదన్నారు. టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ అలీ పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అది ఉండవల్లి వ్రాసిచ్చిన స్క్రిప్టేనా

   తెలంగాణా బిల్లు వివిధ దశలలో ఉన్నప్పుడు మాట మాట్లాడకుండా కూర్చుని, లాస్ట్ బాల్ ఇంకా ఉందంటూ కామెంట్లు చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాత్రం తెలుగు మంత్రం జపిస్తున్నారు. తెలుగువాళ్ల ఐక్యత కోసమే తాను రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 12వ తేదీన రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి, అక్కడ పార్టీ ప్రకటిస్తానని చెప్పిన ఆయన.. ఈలోపు తాను సమైక్య రాష్ట్రం కోసం ఎంతగా ‘పోరాడానో’ చెబుతున్నారు. మిగిలిన పార్టీల మీద పనిలోపనిగా దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, పరువు ప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి, తెలుగువారి సర్వతోముఖాభివృద్ధికి తన జీవితాన్ని అంకితమిస్తున్నట్లు కిరణ్ తాజాగా చెప్పారు. తెలుగుజాతిని విభజించి, అవమానించినందువల్లే పదవిని వదులుకోవడంతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని వివరించారు. తన పాలనలో సామాన్యుడి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పథకాలు అమలవుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుట్రపన్ని విభజన చిచ్చుతో నాశనం చేశాయని ఆరోపించారు. దటీజ్ కిరణ్. ఇంతకీ ఈ స్క్ర్రిప్టు అంతా ఇచ్చింది మాత్రం ఉండవల్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.

రాంభూపాల్ కన్నీటి పర్యంతం

  కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడని మాజీ మంత్రి, కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాంభూపాల్ చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీజీ వెంకటేష్‌ను పార్టీలో చేర్చుకుని కర్నూలు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన తన అనుచరులతో చర్చించారు. నాలుగున్నర సంవత్సరాలపాటు వయస్సును కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నగరమంతా పర్యటించి పార్టీకి పునాదులు ఏర్పాటు చేశానన్నారు. అలాంటి తనను కనీసం సంప్రదించకుండా టీజీని పార్టీలో చేర్చుకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కాంగ్రెస్ నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న చంద్రబాబు

  ఈరోజు మాజీ కాంగ్రెస్ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి మరియు శిల్పా మోహన్ రెడ్డిలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మరియు ఆమె కుమారుడు గల్లా జయదేవ్ ఇద్దరూ కూడా నిన్ననే పార్టీలో చేరారు. ఇక నిన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డితో రాసుకు పూసుకు తిరిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఇప్పుడు చంద్రబాబు పంచన చేరారు. బహుశః రానున్న మరికొద్ది రోజులలో ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు వారి అనుచరులు తెదేపాలోకి బారులు తీరి తరలి రావచ్చును.   ఇప్పుడు వారందరూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తేస్తూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నేతలు కండువాలు మార్చుకొంటున్నపుడు ఇటువంటివి సహజమే. కాంగ్రెస్ అధిష్టానం వారిని మోసగిస్తే, వారు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిస్తున్నారు. ప్రభుత్వం రద్దయ్యే చివరి నిమిషం వరకు పదవులను పట్టుకొని వ్రేలాడిన ఈ నేతలందరూ, తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు, యం.యల్యే. టికెట్స్ కోసమే తెదేపాలోకి దూకారని అందరికీ తెలుసు. ఇంత కాలంగా సోనియా, రాహుల్ గాంధీలకు భజనలో తరించిన వారందరూ ఇప్పుడు పచ్చకండువా కప్పుకోగానే చంద్రబాబు భజన మొదలుపెట్టేసారు. ఆయన నిజాయితీ, కార్యదీక్ష, పట్టుదల, సమర్దతల గురించి నోరారా వర్ణించుతూ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని పొగడ్తలతో ముంచెత్తేసారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన వారందరూ ఇక ముందు తెదేపాను బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నారు.   ఇటువంటి వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి, వారు అవకాశవాద కాంగ్రెస్ నేతలు కారని ప్రజలకు ఏవిధంగా నచ్చచెప్పగలరు? వారు పార్టీ కండువాలు మార్చినంత తేలికగా ప్రజలకు వారిపట్ల ఉన్న అభిప్రాయలు మారవని విశేష రాజకీయ అనుభవం గల ఆయనకీ తెలియక పోదు. అటువంటప్పుడు వారు తెదేపా తరపున పోటీ చేసి ఓడిపోతే, నష్టం పార్టీకే కాని వారికి కాదనే సంగతి కూడా ఆయనకీ తెలియక పోదు. కానీ, ఎన్నికల ముందు అటువంటి బలమయిన నేతల రాకతో పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నందునే వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు.   అయితే వారందరూ కూడా తమకు పార్టీలో టికెట్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరారు తప్ప తెదేపాకు సేవచేయడానికో లేకపోతే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికో కాదు. మరి అటువంటి వారు ఇప్పుడు తెదేపాను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని ఇస్తున్న హామీలను ఎంతవరకు నమ్మవచ్చో చంద్రబాబే ఆలోచించుకోవలసి ఉంది. పదవులు, పార్టీ టికెట్స్ కోసం ఇంత తేలికగా కాంగ్రెస్ పార్టీతో బందాలు తెంపుకొని గుంపులు గుంపులుగా తరలివస్తున్న ఇటువంటి నేతలు, ఒకవేళ ఎన్నికల తరువాత తెదేపా మెజార్టీ సాధించలేకపోతే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీలోకి తరలివెళ్లిపోవడం ఖాయం.   అందువలన చంద్రబాబు కాంగ్రెస్ నుండి తరలి వస్తున్నఇటువంటి నేతలకు కాక చిరకాలంగా నమ్మకంగా పార్టీనే అంటిపెట్టుకొని సేవలు చేస్తున్న వారికే తొలి ప్రాధాన్యం ఈయడం వలన పార్టీపై నేతలకు శ్రేణులకు నమ్మకం పెరుగుతుంది. తద్వారా పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుంది కూడా. ఇంతకాలం సోనియా, రాహుల్ గాంధీలకు వీరభజన చేసిన ఈ నేతలందరూ, కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే ఇప్పుడు గుంపులు గుంపులుగా తెదేపాలోకి ప్రవేశించి, ఎన్నికలవగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే ఆలోచనతోనే వచ్చి చేరుతున్నారేమో? అప్పుడు తెదేపా కూడా ఇప్పడు కాంగ్రెస్ ఖాళీ అయినట్లే అయిపోయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల చంద్రబాబు మరింత అప్రమత్తతో మెలగడం చాలా అవసరం.

జైరాం వ్యాఖ్యలను తప్పుపట్టిన పురంధేశ్వరి

      కాంగ్రెస్ పార్టీ వీడి బిజెపిలో చేరడంపై మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఆమె బిజెపిలో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేదన్నారు. తాను కూడా ఎప్పుడు పార్టీ ప్రతిష్టను దిగజార్జలేదని అన్నారు. కృతజ్ఞత లేదంటూ తన పట్ల జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. రామాయపట్నం దగ్గర తనకు వెయ్యి ఎకరాలు ఉన్న మాట అవాస్తవమని పురందేశ్వరి తెలిపారు. తమకు ఎక్కడ ఏ భూములు ఉన్నాయో సర్వే నంబర్లతో జైరాం రమేష్ వెల్లడించాలని పురందేశ్యరి డిమాండ్ చేశారు. లోకసభలో బిల్లు పాస్ కాగానే తాను రాజీనామా చేశానని పురంధేశ్వరి గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే సీమాంధ్రకు న్యాయం జరగదన్నారు.విభజన తీరే కాదని, కాంగ్రెసు పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు.

టిడిపి తరపున మహేష్ బాబు ప్రచారం

      టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తారనే విషయంపై రాజకీయాలలో వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు సమక్షంలో గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ టిడిపి లో చేరారు. గల్లా జయదేవ్ ఎవరో కాదు..మన మహేష్ అక్క భర్త. అంటే ఇద్దరూ బావ బామ్మర్దులన్నమాట. మహేష్ గతంలో రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించినప్పటికి, బావ కోసం ఆయన పోటీ చేయబోయే గుంటూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తాడని సమాచారం. ఇదే విషయాన్ని మహేష్ బావ జయదేవ్ కూడా ఈరోజు స్వయంగా ప్రకటించారు. మహేష్ బాబు ఏ పార్టీకి చెందకపోయినా తనకు ప్రచారం చేస్తారని చెప్పారు.

కాంగ్రెస్-తెరాస పొత్తులెందుకొద్దు అంటే

  టీ-కాంగ్రెస్ నేతలు తెరాసతో పొత్తులు వద్దనుకోవడానికి కారణం ముఖ్యమంత్రి, ఇతర కీలక పదవుల కోసం ఆరాటం వల్లనే తప్ప వేరేఏమీ కాదు. ఒకవేళ కాంగ్రెస్-తెరాసలు పొత్తులు పెట్టుకొంటే, టికెట్స్ మరియు మంత్రి పదవులలో సింహభాగం తెరాసకే వెళ్ళిపోవడం ఖాయమని వారికీ తెలుసు. ఎన్నోఏళ్లుగా ముఖ్యమంత్రి పదవి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, జైపాల్ రెడ్డి వంటి ఓ డజనుమంది టీ-కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ అవకాశం వస్తుంటే, దానిని చేజేతులా కేసీఆర్ కి ఆయన కుటుంబ సభ్యులకి అప్పగిస్తారని భావించలేము. అందుకే వారు విలీనమే కాదు తెరాసతో పొత్తులు కూడా వద్దని కోరుకొంటున్నారు. అయితే ఒకవేళ కేసీఆర్ బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే వారి పరిస్థితి ఏమిటో వారే ఊహించుకోవచ్చును. కానీ, తెరాస బీజేపీతో పొత్తులు పెట్టుకోకపోయినా కేసీఆర్ మరియు తెరాస ధాటికి టీ-కాంగ్రెస్ నేతలు నిలవలేరని వారికీ తెలుసు. అయితే పొత్తులు పెట్టుకొని పదవులు వదులుకోవడం కంటే, పోరాడిపోగొట్టుకొన్నా అంత బాధ అనిపించదు కనుకనే టీ-కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తెరాసతో పొత్తులు వద్దని చెపుతున్నారు.   తెరాస కూడా ఇంచుమించు వారిలాగే ఆలోచిస్తోంది గనుకనే ఆ పార్టీతో విలీనం,పొత్తులు వద్దని కోరుకొంటోంది. గత పదేళ్ళుగా ఎండనక వాననక రోడ్లమీద పడి ఉద్యమాలు చేసి తెలంగాణా సాధించుకొన్నాక తీరాచేసి ఇప్పుడు అధికారం చేతికి అందే సమయంలో దానిలో కాంగ్రెస్ పార్టీకి వాటా పంచి ఇవ్వడం బాధగానే ఉంటుంది. గనుక టీ-కాంగ్రెస్ నేతల ప్రకటనను తెరాస కూడా స్వాగతించవచ్చును.   అయితే జానారెడ్డి చెప్పినట్లు ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారం చెప్పట్టాలంటే యంపీ సీట్లు అవసరం గనుక, కాంగ్రెస్-తెరాసలు మెజార్టీ యంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి, మెజార్టీ యంయల్యే సీట్లు తెరాసకి దక్కేలా ఒప్పందం చేసుకొని ఎన్నికల పొత్తులకి సిద్దపడవచ్చును.ఆవిధంగా ఒప్పందం చేసుకోవడం వలన తెరాసకు కూడా లాభమే. ఎందుకంటే దానికి యంపీ సీట్లకి పోటీ చేసే సామర్ధ్యం, పెట్టుబడి పెట్టగల సరయిన నేతలు లేరు. పైగా దాని దృష్టి రాష్ట్రంలో అధికారంపైనీ కానీ, కేంద్రంపై లేదు.   అయితే, ఈ ఒప్పందం వలన మళ్ళీ జానారెడ్డి వంటి వారి ఆశలు ఆవిరి కాకమానవు. పోనీ ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏ కేంద్రమంత్రి పదవో పుచ్చుకొందామన్నా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకమే లేదు. అందువల్ల టీ-కాంగ్రెస్ నేతలందరూ తెరాసతో పొత్తు వద్దని తమ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడిచేయవచ్చును. తెరాస కోరుకొంటున్నదీ అదే. కాగల కార్యం గందర్వులే చేస్తారు అంటే ఇదేనేమో!

టిడిపిలో చేరిన గల్లా అరుణ, జయదేవ్

      కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా గల్లా అరుణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న తమను, ఆపార్టీ నట్టేట ముంచిందని అన్నారు.సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని గల్లా అరుణ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమన్నారు. అందుకే తాము టిడిపిలో చేరుతున్నామన్నారు. చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సహకరించేందుకే పార్టీలో చేరుతున్నానని చెప్పారు. జయదేవ్ మాట్లాడుతూ.. తనకు నటుడు మహేష్ బాబు, ఆయన తండ్రి కృష్ణల మద్దతు ఉందని చెప్పారు. మహేష్ బాబు ఏ పార్టీకి చెందని వాడయినప్పటికీ తనకు మద్దతిస్తారని చెప్పారు.

పురందేశ్వరిపై జైరాం సంచలన వ్యాఖ్యలు

      బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిపై కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆమె వెన్నుపోటు పొడిచారని అన్నారు. పురందేశ్వరి ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పురంధేశ్వరి వేల ఎకరాల భూములు కొన్నారని, అక్కడే పోర్టు నిర్మాణం చేయాలని ఆమె కోరారని జై రామ్ రమేష్ ఆరోపించారు. అయితే తాము దుగరాజపట్నం వద్దే పోర్టు నిర్మించేందుకు నిర్ణయించామని జైరాం రమేష్ తెలిపారు. అందుకే పార్టీని వీడారని అన్నారు. 'ఆమె పచ్చి స్వార్థపరురాలిగా, కృతఘ్నురాలిగా వ్యవహరించారు. ఆమె నిజస్వరూపం బయటపడింది' అని జైరాం వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు కేంద్రం తగిన న్యాయం చేయలేదన్న పురందేశ్వరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆమె ఆరోపణలు నిరాధారమని, హుందాతనంగా లేవని జైరాం అన్నారు.

చంద్రబాబు బీసీ మంత్రం

  చంద్రబాబు నాయుడు మరోసారి బీసీ మంత్రం జపించేందుకు సిద్ధమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే చంద్రబాబు తన మదిలోని మాటను చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిసి పనిచేసే విషయమై తమ సంఘం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్. కృష్ణయ్య చెప్పారు. బీసీలను సీఎం చేస్తామని ప్రకటించిన టీడీపీపై ఎవ్వరూ విమర్శలు చేసినా సహించేది లేదన్నారు.

పంచాయతీలకు రేపే నోటిఫికేషన్.. 6న పోరు

  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు, జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ చైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ తదితర అధికారులతో సమావేశమయ్యారు. రిజర్వేషన్లను ఎప్పటిలోగా అందిస్తారో తెలపాలని కోరారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఏడెనిమిది జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌లు అందగానే జెడ్పీ, మండల రిజర్వేషన్లు ఖరారు చేసి శనివారం రిజర్వేషన్ల జాబితా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఉంటాయని కూడా చెప్పారు. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చే రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

తమ్మినేనికి తెలంగాణా సీపీఎం సారథ్యం?

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి పదవి తమ్మినేని వీరభద్రానికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అయిన తమ్మినేనినే ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణాలోనే పార్టీకి మంచి పట్టున్న జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో వీరభద్రం పేరు చాలా కాలంగా కార్యదర్శి పదవి కోసం వినిపిస్తోంది. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పరిశీలించిన అనంతరం, కేంద్ర కమిటీ ఆమోదం తీసుకొని తెలంగాణ పార్టీ కార్యదర్శి పేరును ప్రకటిస్తారని హైదరాబాద్‌లోని ఎంబీ భవన్ వర్గాలు తెలిపాయి. తమ్మినేని పేరు కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఆయన ఈసారి ఎన్నికల బరినుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ఎస్.వీరయ్య పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నారు. గత రాష్ట్ర మహాసభల్లోనే ఈయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చేయవచ్చనే ప్రచారం జరిగింది. వీరిద్దరిలో ఒకరిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా త్వరలోనే ప్రకటించనున్నారు.