నితీష్ పౌరోహిత్యం వెనుక రహస్యం ఏమిటంటే?
posted on Apr 29, 2023 @ 9:48AM
ప్రతిపక్ష పార్టీలు సిద్దాంత, రాజకీయ విభేదాలన్నిటినీ వదిలి ఏకం అయితే కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ హ్యాట్రిక్ అడ్డు కోవడం అయ్యేపని కాదు. ఈ విషయంలో కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకూ అన్ని పార్టీలూ, అందరు నాయకులలో ఏకాభిప్రాయం వుంది. అందులో అనుమానం లేదు. అన్ని పార్టీలూ ఏకం అయినా ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి లేదనీ అంతకంటే ముఖ్యంగా ప్రతిపక్షల ఐక్యత అయ్యే పని కాదనీ జాతీయ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సర్వేలూ అదే చెపుతున్నాయి.
రాజకీయ విశ్లేషణలు, సర్వేలు ఎలా ఉన్నా విపక్ష పార్టీలు మాత్రం ఐక్యతా యత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి జేడీఎస్ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ జోడీ వెనక ఉన్న అసలు కారణం ఏదైనా విపక్షాలను ఏకంచేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నితీష్, యాదవ్ జోడీ కాలికి బలపం కట్టుకుని మరీ కాంగ్రెస్సేతర పార్టీల నాయకులను కలిసి విపక్ష పార్టీల ఐక్యత అవశ్యకతను వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ ( ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఇలా ఉత్తర భారత దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు అందరినీ కలుస్తున్నారు.
అయితే ఎందుకో ఏమో కానీ ఇంత వరకు నితీష్ కుమార్ దక్షిణ భారత దేశంలో కాలు పెట్టలేదు. ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు నితీష్ వస్తానని రాలేదు. అలాగే తమిళనాడు ముఖ్యమత్రి స్టాలిన్ ఇటీవల నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సుకు కూడా నితీష్ దూరంగానే ఉన్నారు. ఆర్జేడీ తరపున బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు కానీ జేడీయు తరపున నితీష్ కుమార్ హాజరవుతారని అనుకున్నా ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ దక్షిణ భారత దేశంలో ఎందుకు పర్యటించ డం లేదు? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నితీష్ కంటే ఒకడుగు ముందున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎందుకు కలవడం లేదు? అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ను ఎందుకు కలవలేదు? ఇలా నితీష్ కుమార్ దక్షణ భారత దేశం ప్రాంతీయ నాయకులను కలవక పోవడం యాధృచ్ఛికమా? వ్యూహత్మకమా? అనే ప్రశ్న ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
అదలా ఉంటే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీతో కళ్యాణం జరిపించే పౌరోహిత్య బాధ్యతలను ఎందుకు భుజానికి ఎత్తుకున్నారు? (ఒకప్పుడు ఈ పనిని కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ సమర్ధవంతగా నిర్వహించారు) అంటే రాష్ట్ర రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే, జాతీయ స్థాయిలో తన ఇమేజ్ పెంచుకోవడం అవసరమని ఆయన గుర్తించడం ఒక కారణం అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ తో సయోధ్య పెంచుకుని ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా తెరపికొచ్చే చక్కటి, చిక్కటి వ్యూహంతోనే నితీష్ కుమార ,కాంగ్రెస్ సారధ్యంలో ప్రతిపక్షాలను ఏకంచేసే బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారని జాతీయ మీడియాలో వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి.
అందుకే, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా లేకున్నా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు సిద్దంగా లేని, బీఆర్ఎస్, వైసీపీ, బీజీడీ, టీడీపీ వంటి పార్టీలను నితీష్ టచ్ చేయడంలేదనీ, అలాగే ఆల్రెడీ కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆయన కలవ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే భవిష్యత్ లో ఐక్యతా యత్నాలు కొనసాగుతాయని అంటున్నారు. మరో వంక నితీష్ ఎత్తుగడను కాంగ్రెస్ నాయకులు కొందరు పసిగట్టినందునే అయితే రాహుల్ కాకుంటే ప్రియాంక అంటూ ప్రియాంకా వాద్రా పేరును తెరపైకి తెచ్చారని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలాగే 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం అయ్యేపని కాదని రాజకీయ పరిశీలకులే కాదు, వివిధ పార్టీల నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ, అసలు సినిమా తెర మీదకు రాదని అంటున్నారు. అంతవరకూ ఐక్యతా ప్రవచనాలు వినిపిస్తూనే ఉంటాయని అంటున్నారు.