మద్యం కుంభకోణంలో మరో కుదుపు! కవితకు బిగిసిన ఉచ్చు
posted on Apr 29, 2023 @ 1:44PM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరిన్ని చిక్కులు తప్పవనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన కవితకు తాజాగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఆమె చుట్టూ మరింతగా ఉచ్చుబిగిసుకుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు. ఈ కేసులో ఇప్పటికే దినేష్ అరోరా అప్రూవర్‌గా మారగా.. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అప్రూవర్‌గా మారారు. దీంతో మరోసారి మద్యం కుంభకోణంలో కవిత పాత్ర విషయం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తన చార్జిషీట్ లో కవిత పేరును ప్రస్తావించింది. పలు మార్లు ఇప్పటికే ఆమోను విచారించింది. ఈ కుంభకోణంలో కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ ఇప్పడు తాజాగా బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు.
కాగా ఇప్పటికే కవితన కూడా ఈ కేసులో పలుమార్లు విచారించిన ఈడీ తొలి నోటీసులు సీఆర్పీసీ 160 కింద ఇవ్వగా ఆ తరువాత మాత్రం సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చింది. అంటే తొలి సారి ఆమెను ఆమె నివాసంలో విచారించినప్పుడు ఆమె వివరణ మాత్రమే తీసుకుంది. అయితే ఆ తరువాత నుంచి మాత్రం ఆమె విచారణ కోసం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఆమెను ఈడీ ఢిల్లీకి పిలిపించుకుని మరీ విచారించింది. తాజాగా బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఇక కవిత అరెస్టే తరువాయి అన్న చర్చ సర్వత్రా సాగుతోంది.
ఇదే కుంభకోణంలో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’కు నోటీసులు జారీ చేసి విచారించింది. అన్నిటికీ మించి బుచ్చిబాబు అప్రూవర్ గా మారడానికి ముందే మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ కేసుకు సంబంధించి వరుస లేఖలతో సంచలనాలకు తెర తీస్తున్నాడు.
జైలు నుంచి సుఖేష్ విడుదల చేసిన లేఖలో కవిత ప్రస్తావన తీసుకురావడం, ఆమెతో చేసిన వాట్సాప్ చాటింగ్ ను బయట పెట్టడం అప్పట్లో కలకలం రేపింది. తాజాగా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఇక కవితను ఈడీ అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.