సీబీఐ వ్యూహాత్మకమా.. వెనకడుగా?
posted on Apr 29, 2023 @ 11:15AM
అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి చందంగా ఉందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ హైకోర్టుకు అవినాష్ ను అరెస్టు చేస్తామని విస్పష్టంగా చెప్పిన సీబీఐ, ఆ తరువాత ఎందుకో అరెస్టు విషయంలో పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ పై ఆ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఊరటను సునీత సుప్రీం కోర్టుకు వెళ్లి లేకుండా చేశారు.
ఆ తరువాత ఏక్షణంలోనైనా అవినాష్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నా కూడా సీబీఐ ఎందుకో ఆ పని చేయలేదు. పోనీ ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హై కోర్టులో విచారణ పూర్తి కావడం కోసం సీబీఐ వేచి చూస్తోందా? అని భావించడానికి ఇక ఇప్పుడు ఆస్కారం లేదు. ఆ విచారణ వాయిదా పడినా..అనివాష్ ను సీబీఐ అరెస్టు చేయడానికి అడ్డంకులు ఏవీ లేవని తెలంగాణ హైకోర్టే విస్పష్టంగా చెప్పేసింది. ఆ వెంటనే అవినాష్ అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. అయితే సీబీఐ ఇప్పుడు కూడా అడుగులు ముందుకు వేయడం లేదు. ఇక వివేకా హత్య కేసులో సీబీఐ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తోంది.
విచారణలంటూ గతంలో విచారించిన వారినే మళ్లీ మళ్లీ పిలిచి విచారించడం.. కొత్త వారికి నోటీసులు పంపడం చేస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీరాల్సిందే అని తెలంగాణ హైకోర్టులో ఆయన బెయిలు పిటిషన్ పై వాదనలు వినిపించిన సీబీఐ.. ఇప్పడు అవినాష్ ను అరెస్టు చేయడానికి ఎటువంటి అడ్డంకులూ లేని పరిస్థితి ఏర్పడిన తరువాత కూడా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
అయితే సీబీఐ మీనమేషాలు లెక్కించడం కాదనీ, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కొందరు అంటున్నారు. ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేయకుండా ఏ శక్తీ సీబీఐని ఆపలేదనీ, ఎప్పుడు, ఎలా అరెస్టు చేయాలన్న విషయం స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ నిర్ణయించుకుంటుందనీ అంటున్నారు. బంతి సీబీఐ కోర్టులోనే ఉంది. దానిని గోల్ లోకి ఎలా పంపించాలన్న ప్లాన్ సీబీఐ ఇప్పటికే వేసి ఉంటుందని అంటున్నారు. న్యాయపరంగా చూస్తే అవినాష్ రెడ్డికి అన్ని తలుపులూ ప్రస్తురానికి మూసుకుని పోయాయి. దీంతో ఎపుడు ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పార్టీ పరంగా, ముఖ్యమంత్రి జగన్ పరంగా అవినాష్ కు ఇక మద్దతు అభించే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అవినాష్ ను దాటి సీబీఐ దర్యాప్తు మరింత ముందుకు వెళ్ల కుండా ఉంటే చాలన్నదే జగన్ అండ్ కో భావనగా కనిపిస్తోందని అంటున్నారు. అవినాష్ కు సీబీఐ నోటీసుల తరువాత జగన్ రెండు సార్లు చేసిన హస్తిన పర్యటనలో ఆయన సంబంధితులతో అవినాష్ తోనే దర్యాప్తు ముగిసేలా చూడాలని కోరడానికే వెళ్లారని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమనీ, ఇప్పుడో.. ఇహనో సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవడం ఖాయమని అంటున్నారు.