అధికారం కోసం విలువలకు తిలోదకాలు..?
posted on Apr 29, 2023 @ 10:13AM
అధికారమే లక్ష్యంగా బీజేపీ విలువలకు తిలోదకాలిచ్చేస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శివసేననునిలువునా చీల్చి.. ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు నిచ్చి షిండేను సీఎం పీఠం మీద కుర్చోబెట్టిన బీజేపీ.. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మహా ఉప ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం పీఠంపై కూర్చో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు షిండేతో భేటీ అయ్యారన్న వార్తలు అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అలాగే షండేతో మహాబలేశ్వర్ లో ఉద్ధవ్ థాక్రే భేటీ అయ్యారన్న వార్తలు కూడా మహా రాజకీయలను వేడెక్కించాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. షిండేనీ, ఆయనతోపాటు ఎన్సీపీ నాయకుడు శరద పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ని ఉప ముఖ్యమంత్రులుగా చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉందన్న వార్తలు వినవస్తున్నాయి.
ఈ భేటీల నేపథ్యంలో రానున్న రోజులలో మహారాష్ట్ర రాజకీ యాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారం కోసం ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలతో మహారాష్ట్ర రాజకీయాలు జాతీయ వార్తలలో గత కొద్ది కాలంగా ప్రాధాన్యత ను సంతరించుకుంటున్నాయి. రానున్న రోజులలో ఎలాంటి మలుపులకు దారి తీస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.