బంతి ఇప్పుడు సీబీఐ కోర్టులో.. ఏ క్షణంలోనైనా అవినాష్ అరెస్ట్?
posted on Apr 28, 2023 @ 6:15PM
అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డికి ఉన్నఅన్నిదారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు బంతి సీబీఐ కోర్టులో ఉంది. తలుచుకుంటే ఏ క్షణమైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడవచ్చు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును జూన్ 5కు వాయిదావేసింది.
సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి ఈ రోజు తీర్పు వెలువరించలేమని చెప్పి.. వెకేషన్ బెంచ్ కు మార్చుకుంటారా? అని అడిగారు. అయితే ఇది అత్యవసరమనీ, తీర్పు వెంటనే ఇవ్వాలనీ అటు అవినాష్ తరఫు న్యాయవాదులూ, ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులూ కూడా కోరారు, అయితే అత్యవసరమైతే చీఫ్ జస్టిస్ బెంచ్ కు వెళ్లాలని న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర సూచించారు.
దీంతో అవినాష్ తరఫు న్యాయవాదులు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ విషయంలో విస్పష్ట డైరెక్షన్ ఇచ్చినందున తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోనని హైకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. అంతకు ముందు జస్టిస్ సురేంద్ర బెంచ్ లో వాదనలు పూర్తయిన తరువాత విచారణను జూన్ 5కువాయిదా పడింది. ఆ సందర్భంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు అని కోర్టు స్పష్టం చేసింది. ఆ తరువాత సీజే బెంచ్ కూడా ఇప్పటికప్పుడు విచారణ చేపట్టడం కుదరదని స్పష్టంచేసింది.
కనీసం రెండు వారాలు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ లాయర్లు .. సీజేని కోరినా.. సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో సీజేఐ వ్యాఖ్యలు చూసిన తర్వాత కూడా ఇలా ఎలా ఒత్తిడి చేస్తారని సీజే అవినాష్ లాయర్లను ప్రశ్నించారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. దీంతో సీబీఐ అనుకుంటే ఏ క్షణంలోనైనా అవినాష్ ను అరెస్టు చేయవచ్చు. అవినాష్ లాయర్లు కూడా ఇదే చెప్పారు. సీబీఐఅవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని వారు తెలిపారు.