విజయసాయిరెడ్డికి సీబీఐ పిలుపు..?!
posted on Apr 29, 2023 @ 2:34PM
ఓ వైపు ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరినీ సీబీఐ అరెస్టు చేస్తోంది. నేడో రేపో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం అని తేలిపోయింది. దీంతో వైసీపీ ఒక విధమైన క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. అలాంటి వేళ.. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్కడని ఆ పార్టీలోని ఓ వర్గం సందేహంతో ప్రశ్నిస్తోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అవ్వడంలో అన్నీ తానే అయి విజయసాయిరెడ్డి వ్యవహరించారని, అటువంటి విజయసాయి.. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఎందుకు ముఖం చాటేశారని పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది. అయినా ఇటీవలి కాలం వరకూ విజయసాయి ఎక్కడ ఉన్నా, ఏ పర్యటనలో ఉన్నా.. ట్విట్టర్ మరోవైపు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నా.. ఎక్కడ పర్యటిస్తున్నా.. విపక్షాన్ని ఎండగట్టడంలోనూ తమ పార్టీ ముఖ్యమంత్రిని పొగడ్తలలో ముంచెత్తడంలోనూ ట్విట్టర్ వేదికగా స్పందించే వారనీ, అయితే ఇటీవల కాలంలో ఆయన ట్విట్టర్‌కు కూడా దూరంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
ఏదో సినిమాలో నటుడు నూతన ప్రసాద్ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్న డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం అలాగే వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అలాంటి వేళ విజయసాయిరెడ్డి పార్టీకి అండగా నిలవాల్సింది పోయి.. విపక్ష నేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితమైపోవడంపై పార్టీ శ్రేణుల్లో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన సైలెన్స్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా ఉందని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఆయన ఇంత సైలంగా ఉన్న సందర్భమే లేదనీ, అలాగే ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను టర్గెట్ చేస్తూ... విజయసాయి చేసే ట్వీట్లు సెటైరికల్ గా ఉంటూ ప్రత్యర్థి పార్టీని ఇబ్బందుల పాల్జేసేవనీ, అటువంటి విజయసాయి ట్విట్టర్ వేదికగా చెప్పిన బర్త్‌డే విషెష్ పట్ల ఫ్యాన్ పార్టీలో సైతం విస్మయం వ్యక్తమైంది.
అయితే ఫ్యాన్ పార్టీలో చాలా కీ రోల్ ప్లే చేసిన విజయసాయిరెడ్డి ఇలా మౌనవ్రతం పట్టడం వెనుక ఉన్న కారణాలపై పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. వైయస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం తుది దశకు చేరుకొందని.. అలాంటి వేళ.. ఆ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి.. అలాగే ఈ హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి సైతం ఇటీవల మీడియా ముందు వైయస్ అవినాష్ రెడ్డి అండ్ కోపై విమర్శించారని.... అదే విధంగా వైయస్ సునీత కూడా ఈ కేసులో అసలు హంతుకులు ఎవరో బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం.. ఇంకోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ వివేకాకు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది.
ఇక సీబీఐ అయితే.. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటుందని.. ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని సైతం సీబీఐ విచారించే అవకాశం ఉందనే ఓ చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ మీడియా ముందుకు వచ్చి తొలిసారిగా చెప్పింది విజయసాయిరెడ్డేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని సైతం విచారించే అవకాశం ఉందని.. ఆ క్రమంలో సీబీఐ నుంచి విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఆయన గ్రహించే.. ఆయన మౌనవ్రతం పాటిస్తూ లైమ్ లైట్ లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఆతడు పని చేస్తున్న తుమ్మలపల్లి యూరేనియం ఫ్యాక్టరీ ఉన్నతాధికారులను సైతం సీబీఐ అధికారులు పిలిపించుకొని ఉదయ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలిపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో విజయసాయిరెడ్డిని సైతం.. సీబీఐ పిలిపించుకొని.. ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.