సైకిల్ ఎక్కనున్న రాజాసింగ్
posted on Apr 28, 2023 @ 6:29PM
ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలని అనుకుంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మహమ్మద్ ప్రవక్తపై విద్వేష ప్రసంగం చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన రాజాసింగ్ మూడునెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కానీ పార్టీ నాయకత్వం తనను దూరం పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందడంతో బీజేపీ నుంచి రాజాసింగ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. రాజాసింగ్ ఇటీవలె బర్త్ డే వేడుకలు జరుపుకున్నప్పటికీ పార్టీ నాయకత్వం హాజరు కాలేదు. కానీ తెలంగాణ బీజేపీ చీఫ్ మాత్రం ఫోన్లో విషెస్ తెలిపారు. మళ్లీ ఎటువంటి చర్చలు జరపకపోవడం విశేషం. ఎన్నికలు ఇంకా ఆరునెలలు కూడా లేవు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటి? అనే డోలాయామాన పరిస్థితిలో పడ్డాడు రాజాసింగ్. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలనుకుంటున్నారు ఆయన. టిడీపీ తెలంగాణ చీఫ్ కాసానితో చర్చలు జరిపారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన యోచిస్తున్నారు. 2009లో టీడీపీలో చేరి కార్పోరేటర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో బీజేపీ తీర్థం పుచ్చుకుని గోషామహల్ నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ అదే పార్టీ నుంచి 2018లో రెండో సారి గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడం విశేషం.