డిల్లీ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవం

ఢిల్లీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్‌గా తిరిగి ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. అలాగే  డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యింది. ఆప్‌ అభ్యర్థి ఆలీ మహమ్మద్‌ ఇక్బాల్‌ డిప్యూటీ మేయర్‌ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంసీడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికలో వీరు ఏకగ్రీవం అయ్యారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి షిఖా రాయ్ బుధవారంనాడు తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నుంచి కూడా బీజేపీ తప్పుకుంది. ఢిల్లీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్, మహమ్మద్‌ ఇక్బాల్‌లను సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అభినందించారు. ప్రజలకు ఆప్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వారి అంచనాలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేద్దామంటూ కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నిక రొటేషనల్‌ పద్ధతిలో ఐదు సింగిల్‌ ఇయర్స్‌ టర్మ్‌తో ఉంటుంది. తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్‌ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్‌ కేటగిరిగా, మూడు సంవత్సరం రిజర్వ్‌డ్‌ కేటగిరిగా, తక్కిన రెండేళ్లు ఓపెన్‌ కేటగిరిగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సిటీకి కొత్త మేయర్‌ వస్తారు. డిసెంబర్‌ 4న ఎంసీడీ ఎన్నికలు జరగగా, ఆప్‌ అత్యధిక సీట్లు దక్కించుకుంది. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. మేయర్‌ ఎన్నికలో షెల్లీ ఒబెరాయ్, షిఖారాయ్ మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసినప్పటికీ బీజేపీ నామినేషన్‌ ఉపసంహరించు కోవడంతో మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఒబెరాయ్ ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్‌గా నాలుగో ప్రయత్నంలో ఎన్నికయ్యారు. దీనికి ముందు జరిగినమూడు సమావేశాల్లో ఆప్‌, బీజేపీ మధ్య గందరగోళం తలెత్తింది. నామినేటెడ్‌ సభ్యులకు ఓటింగ్‌ హక్కుల వ్యవహారంపై గొడవ జరగడంతో మూడుసార్లు వాయిదా పడి నాలుగోసారి ఎన్నిక జరిగింది.  

బాబువైపు బీజేపీ.. వైసీపీకి ప్రమాద ఘంటికలు?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయి.  దాదాపు ఐదేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న బీజేపీ తెలుగుదేశం పార్టీలు  మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా?  అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందన్నది కమలం పార్టీ భావన. అలాగే ఏపీలో బీజేపీతో మైత్రి అధికార వైసీపీని ఇబ్బందుల్లో నెట్టి విజయాన్ని నల్లేరు మీద బండి నడక చేసుకోవడానికి దోహదపడుతుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు కోరుకుంటోంది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం పార్టీ అగ్రనాయకత్వానికి చేరవేసిందని పార్టీ శ్రేణులో అంటున్నాయి. తెలంగాణలో కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని  బీజేపీ అగ్రనాయకత్వం కూడా గుర్తించిందని చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేనల మధ్య అప్రకటిత పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తెలుగుదేశంతో కలవడం ఉభయతారకంగా ఉంటుందన్న అభిప్రాయం కమలం అగ్రనాయకత్వంలో కలిగిందని అంటున్నారు. ఆ కారణంగానే  ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ  దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం.. వైసీపీ ఉ అంటే ఉ, ఉహూ అంటే ఉహూ అన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించినా ఆ పార్టీ అధిష్ఠానం చూసీ చూడనట్లు వదిలేసింది. అయితే ఇటీవలి కాలంలో అటు బీజేపీ అగ్రనాయకత్వంలోనూ, ఇటు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలపై అటు బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులూ కూడా ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో  తెలుగుదేశం కూడా..  ఇటీవలి కాలంలో బీజేపీ విధానాలకు సంబంధించి ఎటువంటి విమర్శలూ చేయలేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాట్ల విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. తాజాగా  ఒక జాతీయ టీవీ చానెల్  నిర్వహించిన సదస్సులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీజేపీ మోడల్ అభివృద్ధికి, ప్రధాని మోడీ విజన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించేశారు. పనిలో పనిగా గతంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడానికీ, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి విభేదాలు కారణం కాదనీ, సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా అంశమేననీ కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యతకు అధికారిక ప్రకటనే తరువాయి అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రంలో జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీతో కలవడం అన్న ఊహే జగన్ సర్కార్ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. అందుకే గతంలో  హస్తినలో ఒక కార్యక్రమంలో మోడీ స్వయంగా చంద్రబాబును పలకరించి కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో ఉలిక్కిపడింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి  భుజాలు తడుముకున్నారు.  మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్నఅభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఈ మార్పు కచ్చితంగా అధికార వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అంటున్నారు. 

హీటెక్కిస్తున్న బండి సంజయ్ ట్వీట్

1970 బాలివుడ్ లో ఓ సినిమా వచ్చింది. ధారాసింగ్ బందిపోటుగా వచ్చిన ఈ సినిమా పేరు ‘‘చోరోన్ కే  చోర్ ’’ సినిమా బాగా ఆడింది. ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుత తెలంగాణా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండటంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో షరా మామూలే. కానీ ఒకడుగు ముందుకేసి ఈ పర్వాన్ని మరింత వేడెక్కించే విధంగా మాట్లాడుతున్నారు. వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి దిగజారుతున్నారు. ‘‘చోరోన్ కే  చోర్ ’’ టైటిల్ మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘‘గ్యాంగ్ స్టర్ల గ్యాంగ్ స్టర్ ’’ అని సంభోధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనను ఇరికించాడని కాక మీద ఉన్న బండి సంజయ్ బెయిల్ పై బయటకొచ్చి పబ్లిక్ మీటింగ్ లలో తండ్రీ కొడుకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీలో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ ప్రమాదకారి అని అన్నారు. బండి సంజయ్ బుధవారం ట్వీట్ చేసిన పదాలు చూస్తుంటే అవతలి వారిని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కేసీఆర్ గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ అంటూ కాంట్రవర్శీ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ఈ ట్వీట్ మీద బీఆర్ ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో మరి. 

సమగ్ర పంటలబీమా తక్షణావసరం!

పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షంతో అన్నదాతల నెత్తిన పిడుగుపడింది. పెట్టిన పెట్టుబ డులు వర్షార్పణం అయ్యాయి. పంటలు వస్తే అప్పులు తీర్చుకుని  కొత్త పంటలు వేద్దామన్న ఆశతో  ఉన్న అన్నదాతను అకాల వర్షం దొంగ దెబ్బతీసింది. ఈ నెలలోనే వరుసగా మూడు మార్లు అకాల వర్షం అన్నదాతపై కోలుకోలేని దెబ్బ తీసింది.  ఉభయ తెలుగు రాష్టాల్లోనూ ఇదే పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయంలో నీళ్లపాలవుతుండం ఒక రివాజుగా మారిపోయింది.   నష్టాల అంచనాలతో కాలక్షేపం చేయకుండా... కాలయాపన జరక్కుండా  అన్నదాతను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా పంట నష్టాలను గుర్తించాలి. రైతులకు భరోసా ఇవ్వాలి.  మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  వేలాది ఎకరాల్లో కోట్లాది  రూపాయల విలువ చేసే పంట నష్టం జరిగింది.  తెలంగాణలో ఇటీవలే దెబ్బతిన్న పంటలను సిఎం కెసిఆర్‌ పరిశీలించారు. కేంద్రం ఇచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా ఎకరాకు పదివేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ సాయమే ఇంతవరకు అందలేదు. ఈ క్రమంలో ఇంకా ఆలస్యం చేయ కుండా వెంటనే  అన్నదాతను ఆర్థికంగా ఆదుకోవాలి. ఇప్పటికైనా  సమగ్ర పంటల బీమా ను కూడా వన్ నేషన్ వన్ క్రాప్ ఇన్సూరెన్స్ పద్ధతికి మార్చాలి.   దేశంలో ఉన్న ఇన్సూరెన్స్‌ కంపెనీలతో చర్చించి సమగ్ర పంటలబీమా పథకం రచించాలి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా సాయం అందేలా చూడాల్సిన అవరసరం ఉంది. అప్పుడు ప్రభుత్వాలు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోగలుగుతాయి.  

పులివెందులలో హై టెన్షన్.. ఒక వైపు అవినాష్..మరో వైపు సీబీఐ

అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం అని తేలిపోయిన తరువాత పులివెందులలో  హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సుప్రీం కోర్టు  తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో ఇహనో ఇప్పుడో అవినాష్ అరెస్టు ఖాయమన్న విషయంపై పెద్ద ఎత్తున పులివెందులలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.  ఈ పరిణామాల మధ్య కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. అయితే సీబీఐ అధికారులు అంతకు ముందు రోజు నుంచే పెలివెందులలో మకాం వేశారు.  దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ పులివెందులలో నెలకొని ఉంది. ఎంపీ అవినాష్‌ రెడ్డి కోసం ఆయన మద్దతు దారులు,  అనుచరులు భారీగా తరలి రావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ టెన్షన్ వాతావరణంలోనే  అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు.  సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న విషయంపై తన అనుచరులతో అవినాష్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు.  అదలా ఉంచితే.. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భద్రత విషయంలో సీబీఐ అధికారులకు అనుమానాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయనను జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు.  దీంతో దస్తగిరి భద్రత విషయంలో సీబీఐ అధికారులు చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్నపిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 26)విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పులివెందులలో ఉండటంతో కేసు విచారణ ఈ రోజు విచారణకు వస్తుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోవడంతో అవినాష్ రెడ్డి ఏం చేస్తారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.  ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో అవినాష్ వరుస భేటీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పులివెందులతో పాటు కడప జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

అవినాశ్ అరెస్ట్ వార్తలపై బెట్టింగ్ లు మామూలుగా లేవు

కోళ్ల పందేలు, క్రికెట్ పై బెట్టింగ్ ల గూర్చి విన్నాం. ఫలానా పార్టీ లేదా ఫలానా అభ్యర్థి  గెలుపోటములకు సంబంధించి బెట్టింగ్లు కట్టడం మామూలే కానీ తెలుగునాట ఓ వింత బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి. అవి కూడా లక్షల్లో బెట్టింగ్ లు జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.  అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వత ఇలాఖా కడపలో బెట్టింగులు జోరందుకున్నాయి..కొందరు ఆయనను అరెస్ట్ చేస్తారని కొందరు, చేయరంటూ మరికొందరు  పందేలు కాస్తున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంతో పాటు అవినాష్ రెడ్డి నివాసముండే పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది..వేల రూపాయల నుంచి లక్షల రూపాయల మధ్య బెట్టింగ్లు నడుస్తున్నట్లు సమాచారం..  వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు  అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి,  అతని అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ మూతపడిందా?

ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ కు  తాళం వేసేశారా? అంటే ఇండియన్ పోస్ట్స్ ఔననే అంటోంది. ఈ మేరకు తపాలా శాఖ ఇచ్చిన ఒక మెసేజ్ తీవ్ర కలకలం సృష్టించింది. కేసులు నమోదు చేయడం, చేయకపోవడం విషయంలో ఏపీలో పోలీసు శాఖ కూడా  అవినాష్ రెడ్డి టెక్నిక్ ను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.    చంద్రబాబుపై ఎర్రగొండపాలెంలో ఈ నెల 21న తెలుగుదేశం అధినేత పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్ల దాడి జరిగంది.   ఈ ఘటనపై కేసు నమోదు చేయాలంటూ మంగళగిరి మండలం క్రిష్టాయిపాలేనికి చెందిన సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. చంద్రబాబును హత్య చేయాలన్న కుట్రతో మంత్రి ఆదిమూలపు సురే శ్‌ ఈ దాడి చేయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదును ఆయన  ఈనెల 24న రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ కు పంపారు. కానీ మంత్రిపై వచ్చిన ఫిర్యాదు కావడంతో ఆ రిజిస్టర్డ్ కవర్ ను తీసుకోవడానికి ఎర్రగొండపాలెం పీఎస్ లో ఎవరూ ధైర్యం చేయలేదు.  అది వెనక్కు వెళ్లిపోయింది. దీంతో ఫిర్యాదు దారుడు తన రిజిస్టర్‌ పోస్టును ట్రాక్‌ చేయగా డోర్‌ లాక్డ్‌, నాట్‌ డెలివర్డ్ అని తేలింది.  ఈ సమాచారం 24 తేదీ 5.44 గంటలకు ఎర్రగొండపాలెం పోస్టాఫీస్‌ నుంచి సమాచారం వెళ్లింది. నిబంధనల ప్రకా రం పని వేళల్లో ప్రభుత్వ కార్యాలయాలు డోర్‌ లాక్‌ అయ్యి ఉండటానికి వీళ్లేదు. దీంతో  ఈ విషయం వైరల్ అయ్యింది. సామాజిక మాధ్యమంలో ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ కు తాళం వేశారా? ఆ పీఎస్ ను మూసేశారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఉండగా ఎర్రగొండపాలెం ఎస్సై ఈ విషయంపై స్పందిస్తూ తమ పోలీసు స్టేషన్ కు ఎటువంటి రిజిస్టర్డ్ పోస్టూ రాలేదనీ, తమ పోలీసు స్టేషన్ డోర్ ఎప్పుడూ లాక్ చేసి లేదనీ వివరణ ఇచ్చారు.   మొత్తం మీద  సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్‌  ఫిర్యాదు రిజిస్టర్డ్ పోస్టులో పంపినా ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్ లో డెలివరీ కాకపోవడం, పీఎస్ లాక్ చేసి ఉందంటూ మెసేజ్ రావడం సంచలనంగా మారింది.  

కమలంవైపు చంద్రుడి చూపు

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు కలిసే సాగుతాయా అన్న అనుమానాలకు చంద్రబాబు చాలా వరకూ తెరదించేశారు. గతంలో  తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రావడానికి మోడీ పాలనతో , మోడీ విధానాలతో విభేదించడం కారణం కాదని స్పష్టం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్న విషయం సెంటిమెంటుగా మారిందనీ, ఆ హోదా సాధన కోసమే ఎన్డీయే నుంచి బయటకు రావలసి వచ్చిందని విస్పష్టంగా చెప్పారు. జాతీయ  న్యూస్ ఛానల్  నిర్వహించిన టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్: ద నీడ్ టు కీప్ ఫైటింగ్  సదస్సులో  పాల్గొన్న చంద్రబాబునాయుడు ఎన్డీయేతో కలిసి పని చేస్తామా అంటే ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ముక్తాయించారు. ప్రస్తుతం ఏపీలో జగన్  సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాల్సి ఉందని, అందుకోసం ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పలు సందర్బాలలో చంద్రబాబు విస్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా  రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జనసేనాని అయితే వచ్చే ఎన్నికలలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని విస్పష్ట ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఏపీలో తెలుగుదేశంతో జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందన్న భావన అన్ని వర్గాలలో వ్యక్తమౌతోంది. చంద్రబాబు తాజాగా ఒక జాతీయ స్థాయి చానల్ నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం బీజేపీతో పొత్తు ఉంటుందన్న పరిశీలకుల అంచనాకు తగ్గట్టుగానే ఉంది. అయితే చంద్రబాబు ఈ సదస్సులో దేశ ప్రగతి, టెక్నాలజీ, సంక్షేమం తదితర అంశాలలో తన విజన్ ను కూడా ఆవిష్కరించారు. మోడీ మోడల్ కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం భారతీయ జనాభాలో 40% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. యువత ఎక్కువ కలిగిన దేశం మనది. ప్రభుత్వాలు వారి ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా, అందుకు అనుగుణంగా విధానాలు రూపిందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చన్నారు.   అలాగే  టెక్నాలజీ పరంగా ఉన్నత దశలో ఉన్నాం. సాంకేతికత విప్లవాన్ని తెస్తుందని తాను మొదటి నుంచీ చెబుతున్నానని పేర్కొన్నారు.  నాలెడ్జ్ ఎకానమీ   ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారుతుందన్నారు. . సాంకేతిక విప్లవానికి హైదరాబాద్ ప్రస్థానమే నిదర్శమన్న చంద్రబాబు నేడు తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతోందంటే తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వేసిన బీజాలే కారణమన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు తీసుకురావడానికి నాడు నేను మన బలాలు ఏంటో బిల్ గేట్స్‌ కు వివరించాను. భారతీయులు గణితంలో, ఇంగ్లీషులో ప్రావీణ్యం కలిగిన వారు అని వివరించాను. దీంతో బిల్ గేట్స్ అంగీకరించి హైదరాబాద్‌ లో  మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు.  నాడు తాను  విజన్ గురించి మాట్లాడితే నన్ను విమర్శించారు. కానీ ఆ విజన్ 2020 హైదరాబాద్‌లో సాకారం అయ్యిందని వివరించారు. సమాజం కోసం ముందుచూపుతో పనిచేసే నాయకులు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారనీ, అలాగే తనూ విమర్శలను ఎదుర్కొన్నాననీ చంద్రబాబు చెప్పారు.   మొత్తంగా ఈ సదస్సులో దేవ ప్రగతి, సంక్షేమం, సంపద పెంపు సాంకేతిక విప్లవం వంటి ఎన్ని అంశాల గురించి మాట్లాడినా ఆయన మోడీ ప్రభుత్వం, మోడీ మోడల్ అభివృద్ధి, విజన్ లపై చేసిన వ్యాఖ్యలే  హైలైట్ అయ్యాయి. ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణలు ఉంటాయని ఆయన తన మాటల ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనాని హస్తిన పర్యటన తరువాత ఏపీలోని అధికార వైసీపీతో బీజేపీ సంబంధాలు ఒకింత చెడిన సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత ఈ సదస్సులో మోడీ మోడల్ కు మద్దతు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

కేజ్రీవాల్ ఇంటిపై డ్రోన్ కెమెరా చక్కర్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భధ్రత కొరవడిట్టు కనబడుతోంది.   కేజ్రీవాల్ ఇంటి వద్ద డ్రోన్ కెమెరా కనబడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. ముఖ్యమంత్రి ఇంటి వద్ద డ్రోన్ కెమెరా ఎవరు తిప్పారు అనే విషయాన్ని భధ్రతా బలగాలు ఆరాతీస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు అన్వేషిస్తున్నారు.  అరవింద్ కేజ్రీవాల్ కు భధ్రతాపరమైన సమస్య ఇది మొదటి సారి కాదు. గత సంవత్సరం మార్చిలో కేజ్రీవాల్ ఇంటి వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. అప్పట్లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోసిడియా ఒక ట్వీట్ చేశారు.  సంఘ విద్రోహశక్తులు ముఖ్యమంత్రిని హత్య చేయాలని చూస్తున్నాయని  కామెంట్ చేశారు . సీసీటీవీని ధ్వంసం చేశారని ఆరోపించారు. భధ్రతా బలగాల మీద కూడా దాడులు చేశారన్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఢిల్లీ పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం బీజేపీ యువమోర్చాకు చెందిన 150 నుంచి 200 మంది దాడి చేసినట్లు ఎఫ్ ఐ ఆర్ లో నమోదైంది.  సాక్షాత్తు ముఖ్యమంత్రికే భధ్రత కొరవడడం ఆసక్తి నెలకొంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. మద్యం కుంభకోణంలో విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ  ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆరా తీసిన సంగతి తెలిసిందే.  దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణం విషయంలో బీఆర్ఎస్  అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుమార్తెను విచారించిన దర్యాప్తు సంస్థ నేరుగా ముఖ్యమంత్రిని విచారించాలని నిర్ణయించడం  సంచలనం రేకెత్తించింది. పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ ట్వీట్ చేస్తూ  బిజేపీ ప్రభుత్వ దమనకాండకు చక్కటి నిదర్శనమని  విమర్శించారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు పాలయిన సంగతి తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థ గత ఫిబ్రవరి నెలలో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా వుంది. అయితే ముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.

వైఎస్ ఫ్యామిలీ.. అక్కడా, ఇక్కడా అరాచకమే!

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు వైఎస్ కుటుంబ డ్రామాయే ట్రెండింగ్ లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఆధిపత్యం, జనాభిమానం సంపాదించిన రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబ ప్రతిష్ట మసకబారుతోంది. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, వైఎస్ కుమార్తె షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వెళ్లి వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర రాజకీయాలలోకి అడుగుపెట్టిన అనంతరం.. మరీ ముఖ్యంగా అన్నా చెళ్లెళ్ళ (జగన్, షర్మిల) మధ్య సయోధ్య కొరవ డిందన్న వార్తలతో వైఎస్ కుటుంబ ప్రతిష్ట మసకబారింది. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ.. కుటుంబ రాజకీయాలు రచ్చకెక్కుతుండటంతో  వైఎస్ కుటుంబానికి కంచుకోటలాంటి పులివెందులలో కూడా ఆ కోటకు బీటలు వారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పాలనలో జగన్ వైస్ కు ఏ మాత్రం సరిపోలని విధంగా వ్యవహరిస్తుండటం, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతుండటంతో వైఎస్ ను అభిమానించే వారు కూడా విమర్శలు గుప్పించే పరిస్థితి ఏర్పడింది. ఇక వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని.. ఆ రాష్ట్ర రాజకీయాలలో తనదైన పాత్ర పోషించడం కోసం వేస్తున్న అడుగులూ వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా తాజాగా ఆమె పోలీసులపై చేయి చేసుకున్న తీరు పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వివేకా హత్య కేసులో  కుటుంబంలోనే ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడంతో వైఎస్ కుటుంబ ప్రతిష్ట మరింత మసకబారింది. వైఎస్  పిల్లలు (జగన్, షర్మిల)   అధికారం కోసం దేనికైనా తెగిస్తారా అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో  జోరుగా సాగుతోంది.  మరీ ముఖ్యంగా వివేకా హత్య అనంతర పరిణామాలపై  వైఎస్ కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అరాచకంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అత్యధిక మొత్తంలో విరాళాలు అందుకున్న పార్టీల్లో బీఆర్ఎస్ టాప్

రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు వ్యక్తులు ఇచ్చే పార్టీ విరాళాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆగ్రస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ  టాప్ 5లో నిలిచింది దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల్లో ఐదు రాజకీయ పార్టీలు మాత్రమే విరాళాల్లో అత్యధిక వాటా దక్కించుకున్నాయని ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.189.80 కోట్ల నిధులు విరాళాల కింద వచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తంలో ఐదు పార్టీలకే రూ.162.21 కోట్లు (85 శాతం) విరాళాలు అందాయని వెల్లడించింది. ఈ ఐదు పార్టీల్లో .. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ,జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ,సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లకు రూ.162.21 కోట్లు (85 శాతానికిపైగా) అందాయని ఏడీఆర్ తెలిపింది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి 2021-22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు లభించాయి. రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉంది. ఆప్ 2619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లు అందుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో రూ.33.26 కోట్లతో జేడీయూ రూ.29.80 కోట్లతో ఎస్పీ నాలుగో స్థానంలో రూ.20 కోట్లతో వైసీపీ అయిదో స్థానంలో నిలిచాయి. ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడిస్తున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. విరాళాల రూపంలో రూ.20వేలకు పైన అంతకన్నా తక్కువ మొత్తాల్లో అందిన వివరాలను 26 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.189.80 కోట్ల నిధులు విరాళాల కింద వచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తంలో ఐదు పార్టీలకే రూ.162.21 కోట్లు (85 శాతం) విరాళాలు అందాయని వెల్లడించింది. ఈ ఐదు పార్టీల్లో .. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లకు రూ.162.21 కోట్లు (85 శాతానికిపైగా) అందాయని ఏడీఆర్ తెలిపింది. ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడిస్తున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. విరాళాల రూపంలో రూ.20వేలకు పైన అంతకన్నా తక్కువ మొత్తాల్లో అందిన వివరాలను 26 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి. కాగా 2021–22 సంవత్సరానికి అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎన్డీపీపీ, ఎన్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమ విరాళాల వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్ వివరించింది. మరి కొద్ది నెలల్లో దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీలకు విరాళాల జాతర  ఎలక్షన్  వ్యయానికి బాగా ఉపయుక్తంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్‌ కు కళ్లెం వేస్తున్న గ్రూపిజం.. అనైక్యతే అసలు రోగం

దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్‌ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క తెలంగాణలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టునాగంభోట్లు అన్న చందంగా ఉంది. ప్రజలలో పార్టీ పట్ల సానుకూలత ఉన్నా.. అది ఎన్నికలలో విజయానికి  ఎంత మాత్రం ధీమా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇందుకు ఒకే ఒక్కకారణం పార్టీలోని గ్రూపిజం.  కాంగ్రెస్ కుటుంబం పట్ల విధేయత పాటించే నాయకులు.. రాష్ట్రాలలోకి వచ్చే సరికి ఎవరికి వారు అధినాయకులుగా భావించుకుంటూ   ఎవరికి వారు ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది పోయి ఉనికి కోసం పాటుపడే దశకు చేరుకుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో   కాంగ్రెస్ కు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజలలో అభిమానం ఉంది. అయితే నాయకుల తీరు, వైఖరి కారణంగా ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారిపోతున్నదని పరిశీలకులు అంటున్నారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు జట్టుకట్టి  పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి లాగేస్తున్నారు. వాస్తవానికి పిసిసి చీఫ్‌గా రేవంత్‌ పగ్గాలు చేపట్టిన తరువాతనే తెలంగాణలో కాంగ్రెస్ కు క్షేత్ర స్థాయిలో ఒకింత జోష్ వచ్చింది. కానీ సీనియర్ల వైఖరి కారణంగా ఆ జోష్ కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. సీనియర్‌.. జూనియర్‌ రాజకీయం కారణంగా ఆ పార్టీ విజయావకాశాలను ‘చే’ జేతులా నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.  కాంగ్రెస్ బలహీనత అనైక్యత. ఆ అనైక్యత కారణంగానే రాష్ట్రంలో బీజేపీ బలపడింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు పొందింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకున్నది. అనంతరం అధికార పార్టీ టీఆర్‌ఎస్‌  వ్యూహంలో చిక్కుకుని కాంగ్రెస్ తరఫున  ఎన్నికైన వారంతగా మెల్లగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)  గూటికి చేరిపోయారు. ఆ తరవాత ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీస మాత్రపు విజయాలు సాధించలేకపోయింది. మునుగోడులో డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ను గాడిన పెట్టేందుకు పార్టీ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డికి ఒకింత స్వేచ్ఛ ఇచ్చింది. అయితే  జానారెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్‌, జగ్గారెడ్డి, తదితర నాయకులు రేవంత్ స్వేచ్ఛగా పని చేయడానికి అవకాశం లేకుండా ఒకింత పెడసరంగా వ్యవహరిస్తున్నారు. అంతా బాగుంది అన్న వాతావరణాన్నితన వివాదాస్పద ప్రకటనలతో పాడు చేస్తున్నారు.  

బాబు బాటలో నితీష్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) మంగళవారం భారత రాజకీయానువెక్కిరించే ధోరణిలో మాట్లాడారు.బీహార్ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వాఖ్యలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ యేతర పార్టీలను కూడగట్టి అధికారంలో తీసుకురావడానికి నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. చంద్ర బాబు కూడా  2019లో నితీష్ తరహా ప్రయత్నాలు చేసి భంగపడ్డారని  పీకే  గుర్తు చేశారు. అతను బీహార్ ప్రజల వెల్ఫేర్, డెవలప్ మెంట్ పట్టించుకోకుండా దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాననడం అవివేకమన్నారు. ఒక ఎంపీ కూడా లేని నితీష్ కుమార్ దేశ ప్రధాని ఎవరు కావాలో నిర్ణయిస్తున్నాడని పీకే ఎద్దేవా చేశారు.  బీహార్ కు చెందిన ఈ రాజకీయ వ్యూహకర్త  బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్, డిఎమ్ కె , టీఎంసీ, బీఆర్ఎస్  తదితర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. పీకే గతంలో గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తరపున ప్రచారం చేశారు. 2012లో మోడీ విజయానికి పీకే దోహదపడ్డారు.అప్పటి నుంచే అతను పాపులర్ అయ్యారు.  పీకే పూర్వాశ్రమంలో ఐక్యరాజ్య సమితిలో పని చేశారు. భారత్ లో పేరెన్నికగన్న ఎన్నికల వ్యూహకర్తలలో పీకే ముందువరసలో నిలిచారు. ప్రశాంత్ కిషోర్ అస్సాంకు చెందిన ఫిజీషియన్ ని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నారు. 

విపక్షాల ఐక్యతా యత్నాలు..ప్రధాని కుర్చీ కోసం కోట్టాటలు!

జాతీయ రాజకీయాల్లో మార్పుతీసుకుని వచ్చి..వెూడీకి వ్యతిరేకంగా గంట కట్టాలని తెలంగాణ  తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నాలకు ఎవరూ కలిసి రాలేదు. వెూడీని గద్దె దించాలంటే బీజేపీయేతర రాజకీయ  పార్టీల్లో ఐక్యత అవసరం. అయితే  ఆ ఐక్య కూటమికి నాయకత్వం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీయే నేనే ముందు అంటుండటంతో అడుగులు ముందుకు పడటం లేదు. విపక్షాలలోనిఈ బలహీనతే బలంగా బీజేపీకి బలంగా మారుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలహీన పడడంతో  జాతీయ రాజకీయాలలో ఆధిపత్యం కోసం పోటీపడే పార్టీల సంఖ్య పెరిగిపోయింది. పోటీపడటమే కానీ.. సయోధ్య యత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ఎదుటి పార్టీని అడుగు వేయనీయకుండా అడ్డుపడుతోంది.  ఇప్పుడు తాజాగా బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌   ఐక్యత యత్నాలను కొనసాగించేందుకు రంగంలోకి దిగారు.  అయితే గతంలో ఈ ప్రయత్నం చేసిన కెసిఆర్‌తో నితీశ్‌ ముందుగా చర్చించి ఉంటే ఈ నితీష్ ప్రయత్నాలకు ఎంతో కొంత విశ్వసనీయత దక్కేది.  కానీ విపక్షాల ఐక్యతా యత్నాలను ఎవరు ప్రారంభించినా ప్రధాని కుర్చీని దృష్టిలో ఉంచుకునే  అడుగు ముందుకు వేస్తున్నారు. ఆ కారణంగానే ఆ కుర్చీకి తమతో పోటీకి వస్తారనుకున్న వారిని పక్కన పెట్టి ఆ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడానికీ, ఇప్పుడు తాజాగా నితీష్ ఐక్యత అంటూ రాష్ట్రాలు చుట్టేయడానికీ కూడా ఇదే కారణం. దీంతో విపక్షాల ఐక్యత గత మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఐక్యతా యత్నాలే తప్ప ఐక్యత వాస్తవ రూపం దాల్చడం లేదు.  ఇక కేంద్రంలో  పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కూడా  విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించడాన్ని బాధ్యతగా కాకుండా ఒక హక్కుగా భావించడం వల్ల కూడా ఐక్యతా యత్నాలు ముందుకు సాగడం లేదు. తాజాగా నితీష్ కుమార్ , తేజస్వీ యాదవ్‌ కలసికట్టుగా ప్రారంభించిన ఐక్యతా యాత్ర కూడా తొలి అడుగులోనే తడబడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తొట్ట తొలిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. వీరిరువురూ కూడా కొద్ది కాలం కిందటే... బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీల ఐక్యతే తమ లక్ష్యం అని బాహాటంగా ప్రకటించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ తో మహాఘట్ బంధన్ లో ఉన్న నితీష్, తేజస్విలు వారిని కలిసి ఐక్యతారాగం వినిపించడం వృధా ప్రయాసే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.  మొత్తంగా ప్రధాని వెూడీ పాలనపై  ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా..  ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఉండటంతో జనం ఎటూ తేల్చుకోలేని  పరిస్థితిలో ఉన్నారు. ఇదే మోడీకి శ్రీరామరక్షగా మారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     2024 సార్వత్రిక ఎ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి అన్నదే బీజేపీయేతర పార్టీల లక్ష్యం.  గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేస్తున్న   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులందరిదీ అదే మాట. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,  భారత్ జోడో  యాత్ర చేశారు. అందుకోసమే  కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు రెడీ అయిపోతున్నారు. కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరడానికి  కూడా వారు ఒక్క క్షణం వెనుకాడని పరిస్థితి  ఉంది. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిలో నడుస్తున్నారు. శరద్ పవార్ అయితే మహా ముఖ్యమంత్రిగా తన మేనల్లుడిని కూర్చోపెట్టేందుకు పొత్తు యత్నాలకు మోకాలడ్డడానికి కూడా వెనుకాడటం లేదు.    బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావుడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  ఇప్పుడు  అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో  ఒంటరిగా పాద యాత్ర కు పరిమితమైపోయారు. ఆయన ఎక్కడ నడుస్తున్నారో, ఆయనకు జనం మద్దతు ఉందో లేదో తెలియని పరిస్థితి.  ఇటువంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతా యత్నాలు ఫలిస్తాయా? 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపై నడిచి విజయం సాధిస్తాయా అంటే ఔననే సమాధానం మాత్రం రావడం లేదు. 

వైఎస్ కుటుంబం ఊగిసలాట

ప్రస్తుత రాజకీయాలు నాలుగు వ్యవస్థల చుట్టూ తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు లాంటి న్యాయ వ్యస్థలు, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలలో రాజకీయ వివాదాల పరిష్కారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తి పెద్దది, ప్రతిభామంతమైన రాజకీయ కుటుంబాలలో ఎదురింటి సందించి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. అలాంటి వైఎస్ కుటుంబం ప్రస్తుతం ఆ వ్యవస్థలు, సంస్థల మధ్య చక్కర్లు కొడుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తూ దోషులను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్లు సీబీఐకి దొరక్కుండా న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారు.  హత్యకు గురైన తన తండ్రికి న్యాయం జరగాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సునీత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కేసు తిరిగి సీబీఐ చేతికి చిక్కింది.   ఆంధ్రప్రదేశ్ నుండి కేసును తెలంగాణకు బదలాయించాలంటూ సునీత చేసి పరాటంతో వివేకా హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయన వాదనలు పై కోర్టుల్లో నిలవడం లేదు.గతంలో జాతీయ స్థాయిలో సంచలనం కలిగించినజగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11చార్జిషీట్లను వేసింది.  ఆ కేసులలో 16నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ఎప్పటికైనా కేసులను ఎదుర్కొనక తప్పదు. ఇదంతా చూస్తుంటే 2009 వరకూ రాజకీయాలను శాసించిన వైఎస్ కుటుంబం, రాజశేఖరరెడ్డి మరణంతో కష్టాల బారిన పడిందనే చెప్పాలి. ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా నిలబడి రాజకీయాలు నడిపిన వైఎస్ఆర్  తన తరువాతి తరం ఇలా వివాదాల్లో చిక్కుకుంటుందని ఊహించి ఉండరు. అయితే మితిమీరినరాజకీయ పలుకుబడి, పరిమితులు లేని ఆశ వైఎస్ కుటుంబాన్ని ఈ స్థాయికి చేర్చిందని కడపకు చెందిన రాజకీయ నేతలే అంటున్నారు.   జగన్ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులే కాక ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్ననిర్ణయాలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను మసక బారేలా చేశాయని వీరి వాదన. 151 స్థానాల్లో గెలిపించిన ప్రజలకు జగన్ చేసిందేమీ లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిరోజూ కూసుల నుంచి బయటకు వచ్చే వ్యూహాలపైనే చర్చిస్తూ బిజీగా ఉండే  పాలకులు ప్రజలను ఏం పట్టించుకుంటారనేది ప్రతిపక్ష పార్టీల వాదన. ఏది ఏమైనాజగన్ నుండి, సునీత వరకూ వైఎస్ కుటుంబమంతా నిఘా సంస్థలు, న్యాయస్థానాల మధ్య కాలాన్ని గడపాల్సి రావడం విచారకరం. 

తెలుగువన్ ముందే చెప్పింది... బీఆర్ఎస్ లోకి తెలంగాణ మాజీ సీఎస్?

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారా?..  త్వరలో చేరబోతున్నారా?.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆయన పార్టీలో చేరికకు దారి సుగమం అవుతోందనీ, అందుకే మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదికపై ఆయనకు  చోటు లభించిందని విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి ఆయన తెలంగాణ బయట జరిగే ప్రతి బీఆర్ఎస్ సభలోనూ ప్రముఖంగా కనిపిస్తారని అంటున్నారు.  ఔరంగాబాద్‌లో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 14) జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో సోమేశ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. సభలో పాల్గొనడానికి కొన్ని నిమిషాల ముందు మహారాష్ట్ర పొలిటీషియన్ అభయ్ పటేల్ నివాసంలో జరిగిన సమావేశంలోనూ  ఆయన పాల్గొన్నారు.    బీఆర్ఎస్  వేదిక మీద సోమేశ్ కుమార్ కకనిపించడంఇదే మొదటి సారి.    తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలుగువన్ ముందే చెప్పింది. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని కూడా నాడే తెలుగువన్ అంచనా వేసింది. సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పంచే అవకాశాలున్నాయనీ పేర్కొంది. ఆయన తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్ట్ చేసిన సమయంలోనే తెలుగువన్  ఇక ఆయన అడుగురు రాజకీయంవైపే అని కుండబద్దలు కొట్టింది. సర్వీస్ నిబంధనల ప్రకారం తెలంగాణలో రిలీవ్ అయిన వెంటనే రాజీనామా చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయి కనుక ఏపీలో రిపోర్టు  చేసి అక్కడ పోస్టింగ్ తీసుకుంటరనీ, ఆ తరువాత తీరిగ్గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేసీఆర్ వెంట రాజకీయ అడుగులు వేస్తారనీ నాడే తెలుగువన్ విస్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు తాజా పరిణామాలను గమనిస్తే నాడు తెలుగువన్ చెప్పింది అక్షర సత్యం అని రుజువైంది.  

సునీత రాజ‌కీయ ప్రవేశం... వైసీపీ కొత్త డ్రామా?

వివేకా హత్య కేసు విషయంలో అన్నిదారులూ మూసుకుపోయి.. అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని తేలిపోయిన తరువాత.. ఈ కేసు విషయంలో తార్కిక ముగింపు కోసం సాహసోపేత న్యాయపోరాటం చేసిన సునీతను బదనాం చేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. వివేకా హత్య కేసును గుండెపోటు నుంచి అల్లుడు, కూతురే హంతకులు అంటూ చేసిన ఆరోపణలన్నీ సందేహాలకు అతీతంగా కోర్టుల్లో వీగిపోయిన నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతను బదనాం చేయడమే లక్ష్యంగా ఆమె తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ శ్రేణులుపోస్టర్ల పర్వానికి తెరతీశాయి.   వివేకా రెండో  భార్య, ఆస్తుల  గొడవ అంటూ మరణించిన వివేకా వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని అవినాష్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఇప్పుడు తాజాగా వైఎస్ సునీత రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్ల పర్వానికి తెరతీశారు. కడప జిల్లా తాడిపత్రిలో ఈ మేరకు పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారన్నదానిపై స్పష్టత లేకపోయినా.. వీటి వెనుక ఉన్నది వైసీపీయే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.    ఎందుకంటే.. వైఎస్ వివేకా హత్య కేసులో   వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి నిందితులు అంటూ  ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. టెక్నికల్ ఎవిడెన్స్ సహా సుప్రీం కు నివేదించింది. ఈ కేసులో ఇప్పటికే   భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ  అవినాష్ రెడ్డినీ అరెస్టు చేయనుంది. అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. తెలంగాణ అవినాష్ కు ముందస్తు బెయిలు ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే  కడప జిల్లా వాసులంతా  ఆజాత శత్రువు  భావించి అభిమానించే వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన  అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   వివేకా.. రెండో వివాహం.. అక్రమ సంబంధాలు, దందాలు.. ల్యాండ్ సెటిల్‌మెంట్లు తదితర అంశాలను వీరిద్దరూ తమ నేరం నుంచి తప్పించేందుకు పుట్టించిన కట్టుకథలుగా పలువురు భావిస్తున్నారు. పైగా వివేకా బంధువులే  ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడటం పట్ల మొత్తంగా వైఎస్ కుటుంబం పట్ల కడప జిల్లా వాసులకు ఒకింత గౌరవం తగ్గిందని కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.   ఈ నేపథ్యంలో సునీత తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోకపోవడంతో నే పోస్టర్ల పర్వానికి తెరతీశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్యుల ఫొటోలతో  సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ వెలసిన పోస్టర్ల వెనుక ఉన్నది వైసీపీయేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. సునీత తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులూ ఎవరో తెలియాల్సిందేనంటూ సునీత చేసిన న్యాయపోరాటాన్ని ఒక్క వైసీపీ వినా అన్నిరాజకీయ పార్టీలూ, ప్రజలూ కూడా స్వాగతించారు. అలాగే  తెలుగుదేశం పార్టీ కూడా పలు సందర్భాలలో  సునీత పోరాటాన్నిస్వాగతిస్తూ, ఆమెకు సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించింది. అయితే రాజకీయంగా ఆమె తెలుగుదేశం వైపు అడుగులు వేస్తున్నట్లుగా, సునీత ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. ఆమె  ఓ కూతురిగా  తండ్రి హంతకులకు శిక్షపడాలంటూ  చేసిన ఒంటరి పోరు చేశారు. ఆ పోరాటంలో ఆమె విజయానికి చేరువయ్యారు.  దీంతో ఆమెను బదనాం చేయాలనీ, బురద జల్లాలన్న ఉద్దేశంతోనే రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్లు వెలిశాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

మళ్లీ తెరపైకి రాయల తెలంగాణ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం అయిన దశాబ్ద కాలం తర్వాత  రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదనలు రాజకీయాల్లో మరో మారు చర్చనీయాంశమయ్యాయి.  రాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ... రాయల తెలంగాణ అనేది ఇప్పుడు సాధ్యం కాదని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే రాయల తెలంగాణ అనే అంశం తెరపైకి వచ్చిందని ఆయన అన్నారు. రాయల తెలంగాణ కానీ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కానీ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని పక్క రాష్ట్రాల వారు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఏపీ అభివృద్ధి కూడా కేసీఆర్ తోనే సాధ్యమని... రాయల తెలంగాణ అనే అంశాన్ని వదిలేసి కేసీఆర్ నాయకత్వం దిశగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినట్టు... ఆంధ్రను సువర్ణాంధ్ర చేయడం కూడా సాధ్యమేనని కేసీఆర్ గతంలోనే చెప్పారని అన్నారు. పాలకులను మార్చి రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర వెనుకబాటుకు కారణమైన పాలకులపై ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయాలని జగదీశ్ రెడ్డి సూచించారు. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యూపీఏ చైర్  పర్సన్ సోనియాగాంధీని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఈ డిమాండ్ ను బలపరిచిన వారిలో ఉన్నారు. రాయలసీమలో ముస్లిం జనాభా ఎక్కువ. రాయల తెలంగాణ ఏర్పాటు అయితే ఆ పార్టీ అధికారం  చేజిక్కించుకునే అవకాశం ఉండేది. అయితే రాయల తెలంగాణ ప్రతి పాదనను ప్రారంభం నుంచే బీజేపీ వ్యతిరేకించింది. రాయలసీమలో ఉన్న వెనకబాటుతనానికి పాలక పక్ష పార్టీలే కారణమని బీజేపీ నిందించింది.  రాయల తెలంగాణ డిమాండ్ ను టీడీపీ ఎప్పుడూ సమర్ధించలేదు. అప్పట్లో టీఆర్ఎస్ ఈ ప్రతి పాదనను వ్యతిరేకించింది. రాజకీయ అస్థిత్వం కోసం రాయల తెలంగాణా నినాదం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

బెదిరింపు కాల్స్ అతనికి కొత్తేం కాదు

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్ రావడం మంగళవారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అత్యవసరాల కోసమని ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీద ప్రారంభమైన టోల్ ఫ్రీ నెంబర్ నుంచే తనకే బెదిరింపు కాల్ రావడం హిందుత్వ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  మాఫీయా శక్తుల మీద ఉక్కుపాదం మోపిన కారణంగా బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ వివాదా స్పద సీఎం అని చెప్పుకోవచ్చు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని పోలీసుల చేత దాడులు చేయించినట్లు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఇటువంటి చర్యలకు తావులేదు. అయినా యోగి ఆదిత్యనాథ్ హిందూ మతోన్మాదిగా చేసే ప్రసంగాలు అనేక సార్లు వివాదాస్పదమయ్యాయి.  యోగి ఆదిత్యనాథ్ పై 2005లో క్రిస్టియన్లను బలవంతంగా హిందువులుగా మార్చిన ఆరోపణలున్నాయి.మదర్ థెరిస్సాను కూడా  యోగి ఆదిత్యనాథ్ వదల్లేదు.  దేశంలో క్రిస్టియానిటీ పెంచి పోషించింది ఆమేనని వివాదాస్పద ప్రకటన చేశారు. యోగాసనాలు చేయని పక్షంలో శివుడు దేశం విడిచి వెళ్లిపోతాడని యోగి ఆదిత్యనాథ్ అప్పట్లో  చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.  ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని గెలిపించకపోతే మరో కశ్మీర్ అవుతుందని యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగాలు  చేసి వివాదాస్పద వ్యక్తిగా నిలిచి పోయాడు. ఈ క్రమంలో తాజాగా ఆదిత్యనాథ్‌ ను చంపేస్తామంటూ ప్రభుత్వ టోల్‌ ఫ్రీ నంబర్‌ 112 కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. అత్యవసర సర్వీసుల కోసం యోగీ సర్కార్ 112 సర్వీస్‌ను ప్రారంభించింది. బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని పై 112 ఆపరేషన్‌ కమాండర్‌ సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ చట్టం 66 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. “నేను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి 112 సర్వీస్ కు సందేశం వచ్చిందని” కమాండర్‌ పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్ రావడం ఇవ్వళ కొత్తేమి కాదు.  నిరుడు లక్నో నుంచి ఇలాంటి తరహా కాల్ వచ్చిన సంగతి తెలిసిందే.