ఫిర్యాదులు రాకున్నా విద్వేష ప్రసంగాలపై కేసులు.. సుప్రీం
posted on Apr 29, 2023 @ 9:57AM
ప్రజలను రెచ్చగొట్టేలా చేసే విద్వేష ప్రసంగాలపై గతంలో మూడు రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల పరిధిని సుప్రీంకోర్టు దేశమంతటికీ వర్తింపజేసేలా విస్తృతం చేసింది. ఈ తరహా ఉపన్యాసా లపై ఫిర్యాదులు రాకున్నప్పటికీ కేసులు నమోదు చేయాల్సిందేనని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.
దేశ లౌకికత్వానికి తీవ్ర హాని కలిగించే నేర పూరిత చర్యలుగా విద్వేష ప్రసంగాలను అభి వర్ణించింది. గత ఏడాది అక్టోబరు 21న తామిచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా వీటిపై కేసులు నమోదులో జాప్యం జరిగితే కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ కె. ఎం. జోసెఫ్, జస్టిస్ బి. వి. నాగరత్నం ధర్మాసనం హెచ్చరించింది.
విద్వేష ప్రసంగాలు చేసిన వ్యక్తులు ఏ మతా నికి చెందిన వారైనా చట్టం ముందు నిలబెడాల్సిందేనని పేర్కొంది. గతంలో ఢిల్లీ, ఉత్త ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. రాజ్యాంగ పరిరక్షణ, దేశ ప్రజలందరి సంక్షేమం దృష్ట్యా చట్టబద్ద పాలన కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశా లిచ్చింది. విద్వేష ప్రసంగాలపై కేసులు దాఖలు చేసేలా ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితిపైనా పిటిషన్లు రావడంతో ధర్మాసనం తాజా ఉత్తర్వులిచ్చింది. కొంతకాలం క్రితం నుంచి మతపరమైన అల్లర్లు పెరగటంపై సుప్రీంకోర్టు ధర్మాసన ప్రస్తుత ఉత్తర్వు మంచి ఫలితానిస్తుందని న్యాయ కోవిదులు అంటున్నారు.