బాలినేనికి పొమ్మనలేకే పొగబెట్టారా?
posted on Apr 29, 2023 @ 2:12PM
వైసీపీకి ఒకదాని తరువాత ఒకటిగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి జగన రెడ్డికి సమీప బంధువు, మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపాన్ను ఎక్కారు. పార్టీలో తనకు వరుసగా ఎదురౌతున్న అవమానాలపై తిరుగుబావుటా ఎగురవేసి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని ఆ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం పార్టీలో సంచలనం రేపింది.
స్వల్ప అస్వస్థత కారణంగా హైదరాబాద్ లో ఉంటున్న ఆయన తన అసంతృప్తి కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కాక ఆరోగ్య కారణాల కారణంగా వైదొలగుతున్నట్లు చెబుతున్నారు. అధికారికంగా ఆయన ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఈయకపోయినా.. బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేశారంటూ పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో బాలినేనికి పార్టీలో పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. తాజాగా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కాపురం పర్యటన సందర్భంలో కూడా ప్రోటోకాల్ రగడ జరిగింది. బాలినేనిని సీఎం వచ్చే హెలిప్యాడ్ దగ్గరకు అనుమతించకపోవడంతో కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుదిరిగారు. ఆ తర్వాత సీఎంవో నుంచి కాల్ రావడంతో మళ్లీ వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ కనిపించారు. అయినా కూడా ఆయన ముభావంగా కనిపించారు.
మొత్తం మీద బాలినేని ఎపిసోడ్ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి సమీప బంధువే పార్టీపైన అలిగి పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడటం సంచలనం సృష్టిస్తోంది. ఇదంతా టీకప్పులో తుపానే అంటూ పార్టీ నేతలు డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బాలినేని నిర్ణయం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు.