అవినాష్ కేసు.. మళ్లీ రేపు
posted on May 25, 2023 @ 6:35PM
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ హైకోర్టు ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను జూన్ 5కు వాయిదా వేసింది. అయితే అంత వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐని ఆదేశించలేదు. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకుండా తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ కర్నూలులోని విశ్వ భారతి ఆస్పత్రిలో తన తల్లిని అడ్మింట్ చేసి ఈ నెల 19 నుంచి అక్కడే ఉంటున్నారు.
కాగా ఈనెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే తనకు పది రోజులు వ్యవధి కావాలంటూ ఆయన సీబీఐకి లేఖ రాయడమే కాకుండా తెలంగాణ హైకోర్టులో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశించాలనీ, అప్పటి వరకూ తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని సుప్రీం ను ఆదేశించారు.
దీనిపై సుప్రీం కోర్టు గురువారం (మ 25)న అవినాష్ రెడ్డి బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అయితే అంత వరకూ అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టు విచారించింది. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.