ఫినిష్ చేసేస్తారా? ప్రజాస్వామ్యమా? అరాచకమా?

ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది... అలాంటి వేళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం   అమదాలవలసలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఆయన ఫినిష్ అయిపోతారని, వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన  మాట్లాడుతున్నారంటూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎవరిని ఉద్దరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత అంటూ ప్రశ్నించారు. ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఉపసంహరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని కూడా తమ్మినేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిలో ఉండి  తమ్మినేని సీతారాం ఇలా మాట్లాడడం... దేనికి సంకేతమని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటువంటి వ్యాఖ్యలు జగన్ పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు.. అంటే మాజీ మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, అలాగే ప్రస్తుత మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా లాంటి వాళ్లు చేస్తే.. రోటిన్ అనుకోవచ్చు. కానీ తమ్మినేని సీతారాం చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇంకోవైపు వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలూ, శ్రేణులే అంగీకరిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు.. వెళ్తున్నారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. అలాగే గతే ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడు సక్సెస్ అయిందని. అదేవిధంగా ఈ ఏడాది రాజమహేంద్రవరం వేదికగా తాజాగా నిర్వహించిన మహానాడు సైతం సూపర్ డూపర్‌ సక్సెస్ అయింది. తెలుగుదేశం కార్యక్రమాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.   ఇక గతంలో చంద్రబాబు నివాసంపైకి మంది మార్బలంతో అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వెళ్లడం.. అలాగే జగ్గయ్యపేట పర్యటనలో ఉన్న చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగడం... ఆ సమయంలో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు కావడం.. ఒక కమెండోకు నిజమైన కుట్లు పడటం తెలిసిందేప. ఇక కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబును అడ్డగించడం.. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే గతేడాది డిసెంబర్ చివరలో చంద్రబాబు రోడ్డు షో సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది విగత జీవులు కాగా. ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే గుంటురులో చంద్రన్న కానుక పంపిణి సందర్బంగా జరిగిన తోపులాటలో పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ (1) తీసుకు వచ్చింది. సదరు జీవోపై ప్రతిపక్షాలను అణగదొక్కేందుకేనంటూ విపక్షాలు సైతం నిరసన వ్యక్తం చేశాయి.ఆ జీవోను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.   గతంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపైన.. అలాగే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపైన అధికార పార్టీ శ్రేణులు దాడి చేస్తుంటే...రక్షక భట వర్గం ప్రేక్షక పాత్ర వహించడం వినా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటం. రాష్ట్రంలో నెలకొన్న అరాచకత్వానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతోన్నాయి. అందుకు పార్టీ అధికార ప్రతినిధి కె. పట్టాబి అంశమే ఓ ఉదాహరణగా ,చెప్పవచ్చు.   మరోవైపు అధికారం అందుకోవడం కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై ఎయిర్ పోర్ట్ వేదికగా కోడికత్తి దాడి ఎపిసోడ్ చోటుచేసుకోవడం... అలాగే వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్య కావింప బడడం.. సదరు కేసులన్నీ కాలం గడుస్తున్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థల చేతి లో భద్రంగానే ఉన్నాయని వారు వివరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలకు పోలీసులు సాక్షీభూతంగా నిలుస్తున్నారు.. తప్ప వాటిని నియంత్రించే పనిని వారు చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు చంద్రబాబు భద్రతపై ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయనీ, అటువంటి వ్యాఖ్యలు చేసిన తమ్మినేనికి ఒక్క క్షణం కూడా స్పీకర్ గా కొనసాగే అర్హత లేదనీ తెలుగుదేశం శ్రేణులే కాదు, రాజకీయ పండితులు, న్యాయ నిపుణులు సైతం అంటున్నారు. 

ఎవరీ దర్షిత్

అలా వచ్చాడు.. ఇలా స్టేజ్ ఎక్కాడు.. చెప్పాల్సింది.. కట్టె కొట్టే తెచ్చే తరహాలో నాలుగు ముక్కల్లో నలగ్గొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే.. స్ప్రైట్ తాగినట్లు ఎక్కడ సుత్తి లేకుండా.. చాలా నేర్పుగా... నేరుగా చెప్పేశాడు.. దటీజ్ పోట్లూరి దర్షిత్. అతిరథ మహారధులు పాల్గొన్న రాజమహేంద్రవరం మహానాడులో నూనుగూ మీసాల  యువకుడు దర్షిత్ జగన్ నాలుగేళ్ల పాలన గుట్టును జస్ట్ 4 నిమిషాల 44 సెకన్లల్లో విప్పేశాడు. అతగాడి వాగ్దాటికి.. వేదికపై ఉన్న సీనియర్లే కాదు.. ఈ మహానాడుకు విచ్చేసిన వారు సైతం ముగ్దులయ్యారు. దీంతో మహానాడులో దర్షిత్ వజ్రంలా మెరిశాడు. అయితే ఇంతకీ ఈ దర్షిత్ ఎవరు,  ఏం చేస్తుంటాడంటూ నెటిజన్లు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.  పోట్లూరి దర్షిత్. స్వస్థలం విజయవాడ. బాల్యం నుంచి విద్యాభ్యాసమంతా విజయవాడలోనే జరిగింది. ప్రస్తుతం స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోన్నారు. 2015లో దర్షిత్ వయస్సు 11 ఏళ్లు... అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ క్రమంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టగా.. దర్షిత్... తాను దాచుకొన్న 2 వేల రూపాయిల నగదును సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. అలా పోట్లూరి దర్షిత్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.   రాజధాని, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహాన ఉన్న పోట్లూరి దర్షిత్.. 2019 ఎన్నికల వేళ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 10 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు మాత్రం జగన్ పార్టీకి పట్టం కట్టారు. అయితే అదే ఏడాది అంటే 2019 డిసెంబర్ 17న రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రకటన చేయడంతో.. రాజధాని ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు డిసెంబర్ 18 నుంచి ఆందోళన బాట చేపట్టారు.  ఆ క్రమంలో ఆందోళనకు దిగిన రైతులపై జగన్ ప్రభుత్వం   పోలీసులను  ప్రయోగించింది. అణచివేతకు గురిచేసింది. అమరావతి స్టూడెంట్ కో-ఆర్డినేషన్ సైతం ఈ ఆందోళనలో భాగస్వామ్యం అయింది. దీంతో మైనర్‌ దర్షిత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడమే కాకుండా.. అతడిని గృహనిర్భంధం చేశారు. దాంతో దర్షిత్‌పై పోలీసుల ఆమానుష చర్యను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు దర్షిత్ స్వయంగా రెండు పేజీల లేఖ రాశారు. తెలుగులో.. ఆ లేఖలో సారాంశం, రాసిన తీరు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను ఆకట్టుకుంది. దర్షిత్ లేఖకు జవాబు రాశారు. అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టి ఆయన తొలిసారి.. తన సొంత ఊరుకు వస్తున్నానని.. ఈ సందర్భంగా వచ్చి తనను కలవాలంటూ సందేశం పంపగా.. జస్టిస్ ఎన్. వి. రమణను  దర్షిత్ కలిశారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును సైతం దర్షిత్ కలిశారు. దర్షిత్ వాగ్దాటి, ఆలోచన తీరు, రాష్ట్ర పరిస్థితులపై అతి చిన్న వయస్సులోనే అంతగా అవగాహన ఉండడం పట్ల వెంకయ్యనాయుడు శుభాశీస్సులు  అందుకున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనపై చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదిగాక ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు శ్రమిస్తున్నాడు దర్షిత్.   ఇక పోట్లూరి దర్షిత్‌లోని దీక్ష, పట్టుదల, ఆలోచన సరళి, ప్రజా సమస్యలపై పోరాడే గుణం, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నించే తత్వం   చూసి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అచ్చెరువొందారు.  దీంతో 2021లో టీడీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధిగా దర్షిత్‌ని నియమించారు.  అయితే జగన్ ప్రభుత్వంలో అదీ  తొలి కేబినెట్‌లో మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్‌ వగైరా వగైరా.. మలి కేబినెట్‌లో మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా లాగా తొడలు కొట్టలేదు.. మీసాలు మెలేయ లేదు.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పచ్చి బూతులు మాట్లాడలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, ప్రజలు పడుతోన్న ఇబ్బందులపైన కనీస అవగాహన లేని వీరి వల్ల.. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్... మరింత నష్టపోతుందనే భావన ప్రజల్లో నిగూఢంగా ఉంది.  అయితే వయస్సులో చాలా చిన్నవాడైన దర్శిత్‌ ఆలోచన సరళి, అతడి మాట్లాడే విధానం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదన్నది సుస్పష్టం. మరోవైపు జగన్ అధికారలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని చేసిన ప్రతీ విమర్శకు.. అంతే ఇదిగా.. చాలా పద్దతిగా కౌంటర్ ఇచ్చిన ఒకే ఒక్కడీ దర్షిత్. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియలో సైతం ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 

ఆ శాఖలు మాకొద్దు కర్ణాటకం మళ్లీ మొదలు!

కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యమంత్రి ఎంపిక మొదలు  అడుగడుగునా బాలారిష్టాలను ఎదుర్కుంటోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతవరకు ఎదురైన సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్  తగ్గేదేలే  అంటూ  సీఎల్పీ నేత సిద్దరామయ్యతో పోటీ పోటీ పడినా, అధిష్టానం సిద్దరామయ్యను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది.  డీకే శివకుమార్ డిప్యూటీతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత మాత్రి వర్గం కూర్పు లోనూ సిద్ద రామయ్య, డీకే మరో మారు జబ్బలు చరిచారు. ఫలితంగా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటులో  కొంత జాప్యం జరిగింది. అయినా, చిరవకు, ‘ఆల్ ఈజ్ వెల్ దట్  ఎండ్స్ వెల్’ అన్నట్లు ఆ ఎపిసోడ్ కూడా సుఖాంతమైంది. ముందు పది మంది, ఆ తర్వాత 24 మంది మొత్తం 34 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కొంచెం ఆలస్యంగానే అయినా మంత్రులకు శాఖలు కేటాయించారు. దీంతో ఇప్పుడు మళ్ళీ, మరో ముసలం మొదలైంది.ఆశించిన శాఖలు రాని మంత్రులు చిర్రుబుర్రు మంటున్నారు.  మరో వంక కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించిన ఐదు గ్యారెంటీలకు సంబందించిన శాఖలు దక్కిన మంత్రులు, ఈ శాఖలు మాకొద్దని అంటున్నారు. అంతే కాదు, అవసరం అయితే మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం కానీ, ఆ( గ్యారెంటీల అమలు) భాద్యతలను తీసుకునేంది లేదని మొరాయించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డికి రవాణ శాఖ కేటాయించారు. గతంలో కూడా రామలింగా రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నష్టాల్లోకి వెలుతున్న రవాణా శాఖను తనకు అప్పగించడంతో రామలింగా రెడ్డి మండిపడుతున్నారని తెలిసింది. ఇప్పటికే 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచిన అయన తనంతటి  సీనియర్ కు రవాణా శాఖ ఇస్తారా? మీ శాఖలు మీ దగ్గరే పెట్టుకుని మీరే చూసుకోండి, నేను మంత్రి పదవికి రాజీనా చేస్తానని ఇప్పటికే సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేసి రామలింగా రెడ్డి చెప్పారని మీడియా సమాచారం. అలాగే రామలింగా రెడ్డి బాటలోనే మరో సీనియర్ నాయకుడు,ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి మునియప్ప ఏకంగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద తమ గోడు వినిపించుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసి, తన శాఖ మార్చాలని కోరారు. అయితే, రాహుల్ గాంధీ, ఆయన అభ్యర్ధనను నిర్ద్వందంగా తోసి పుచ్చడమే కాకుండా రాజీనామా చేయాలనుకుంటే చేయవచ్చని,లోక్ సభ ఎన్నికల వరకు మంత్రి వర్గంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  అలాగే  గతంలో హోం మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ జీ. పరమేశ్వర్ కూడా ఇంటలిజెన్స్ విభాగం ఇవ్వకుండా కేవలం హోమ్ శాఖ మంత్రిగా నియమించి తన పరువు తీశారని  మండిపడుతున్నారని తెలిసింది.ఇస్తే పూర్తిగా హోమ్ శాఖ ఇవ్వాలని, అందులో కోతలు కొయ్యడం సరికాదని పరమేశ్వర్ మండిపడుతున్నారని తెలిసింది.  అయితే, కర్ణాటక గెలుపుతో లోక్ సభ ఎన్నికలకు నిచ్చెనలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఎవరి మాట వినే మూడ్ లో లేదని అంటున్నారు. మరో వంక ఐదు గ్యారెంటీల అమలు విషయంలో ఒత్తిడి పెరుగుతున్న నేపధ్యంలో, మరో రెండు రోజులలో జూన్ 1 న జరిగే పూర్తి స్థాయి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య హామీల అమలుకు విధి విధానాలు ఖరారు చేసే కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఎనికల సందర్భంగా చెప్పిన విధంగా అందరికీ  అన్ని ఉచితాలు అమలు చేస్తారా? నిబంధనలు వర్తిస్తాయి ..అంటారా అనేది చూడవలసి ఉంది.

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ?

ఆ ఇద్దరు నాయకులు బీజేపీలో చేరడం లేదు. ఇదే విషయాన్ని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అవును. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరని, ఈటల స్పష్టం చేశారు. అంతే కాదు, వారు బీజేపీలోకి రావడం ఏమో కానీ, వారు నన్నే తమ వెంట రమ్మంటున్నారని సంచలన ప్రకటన చేశారు.  మరో వంక  తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు,తాము బీజేపీలో చేరడం లేదని ఒక టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతే కాదు ఈటలనే తమతో పాటు రావాలని కోరామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు, అయితే ఈటలను తమతో ఎక్కడికి రమ్మన్నారు? అందరం కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుందాం,రమ్మని ఈటలను ఆహ్వానించారా లేక అందరం కలిసి కొత్త పార్టీ పెడదాం రమ్మని  ఆహ్వానించారా? అనే విషయంలో జూపల్లి, ఈటల ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ ఆప్షన్ రైట్ ఆఫ్ చేసిన జూపల్లి కాంగ్రెస్  విషయంలో తమ నిర్ణయాని వచ్చే నెలలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే, అదలా ఉంటే ఆ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం  జోరుగా సాగుతోంది. జూన్ 8వ తేదీన జూపల్లి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్తున్నారని మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా ఇరువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ చాలా కాలంగా పార్టీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ బాట పట్టడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి మొదట నిర్ణయించినప్పటికీ, తాజాగా జూన్ 8వ తేదీన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఖమ్మంలో జూన్ 20వ తేదీ లోపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఉండగా ఆ సభ తరువాత పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరే  నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. అయితే అదే సమయంలో మరో వంక పొంగులేటి, జూపల్లితో పాటుగా, ప్రస్తుతం బీజేపీ, కాంగ్రస్, బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న; కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్న మరి కొందరు నాయకులతో కలిసి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకులు, క్యాడర్ ఉన్నా నాయకుల్లో విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అనే అనుమనాలు, పొంగులేటి, జూపల్లి వెనకడుగు వేసేలా చేస్తున్నాయని అంటున్నారు. అలాగే సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ తో ఉన్న లోపాయి కారి సంబంధాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఓ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసేందుకు తెర వెనుక సమాలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ  విషయంలో స్పష్టత రానప్పటికీ రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న20 నుంచి 25 మంది నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిణామాల నేపధ్యంలో, పొంగులేటి, జూపల్లి కదిపిన తేనేతుట్టే రాష్ట్రంలో రాజకీయ పుననేకీకరణకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని, పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అంతిమంగా బీఆర్ఎస్ కు మేలు చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.

అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఐపిఎల్ 2023

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 సీజన్‌లో 70 లీగ్ మ్యాచ్‌లు నమోదు చేసింది. అంతే కాదు  ఇప్పటివరకు 11 సెంచరీల నుండి 1,066 సిక్సర్‌ల వరకు నమోదు చేసింది.   ఐపీఎల్ 2023లో ఈ సీజన్‌లో 11 సెంచరీలు నమోదయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఐపిఎల్  2023 లీగ్ దశలో ఇప్పటివరకు 11 సెంచరీలను సాధించింది, ఇది ఇప్పటివరకు లీగ్‌లోని ఏ ఎడిషన్‌లోనూ అత్యధికంగా ఉంది.  ఐపిఎల్  2023 రికార్డు స్థాయిలో రికార్డులను నమోదు చేసింది. ఐపిఎల్  2023లో 35 సార్లు మొత్తం 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయబడింది.ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 సార్లు 200 పరుగుల ఛేజ్ చేసింది. ఐపీఎల్ 2023లో ఇప్పటికే రికార్డు స్థాయిలో 1,066 సిక్సర్లు కొట్టారుఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మొత్తం 1066 సిక్సర్లు నమోదయ్యాయి, ఈ సీజన్‌లో మొత్తంగా అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయి. గతంలో 2022 సీజన్‌లో 1062 సిక్సర్లు కొట్టి, జాబితాలో రెండో స్థానంలో ఉంది. 

అవినాష్ ముందస్తు.. అంతిమ తీర్పుపై ఉత్కంఠ?

మరి కొన్ని గంటలలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా అంటే న్యాయనిపుణులు ఔననే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో  అవినాష్ కు ముందస్తు బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమేనని అంటున్నాయి. అయితే గత శనివారం (మే 27) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిలు పిటీషన్ పై వాదనలు విన్న అనంతరం తీర్పును బుధవారం(మే31)కు వాయిదా వేసింది. అంతకు ముందు వరుసగా రెండు రోజుల పాటు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు, డాక్టర్ సునీత తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు సుదీర్ఘవాదనలు వినిపించాయి. ఆ తరువాత హైకోర్టు వేకేషన్ బెంచ్ తీర్పు బుధవారం(మే 31)కి వాయిదా వేసింది. 31వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ దర్యాప్తు తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. అవినాష్ కు అరెస్టు కాకుండా ఎటువంటి రక్షణా లేకున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది? అవినాష్ ఫోన్ ను ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. కాగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై వాదనలు క్లోజ్ గా ఫాలో అయిన న్యాయ నిపుణులు ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమని చెబుతున్నాయి.  అసలు మొదటి నుంచీ సీబీఐ వర్సెస్ అవినాష్ టామ్ అండ్ జెర్రీని తలపించేలాగే సాగింది. సీబీఐ విచారణకు పిలిచినప్పుడల్లా ఏవేవో కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటారు. ఇక హాజరు కాక తప్పదన్న పరిస్థితి వస్తే కోర్టులను ఆశ్రయిస్తారు. గత జనవరి నుంచీ ఈ గేమ్ ఇలా సాగుతూనే ఉంది. ఇక చివరి అంకానికి వచ్చేసింది. అవినాష్ ముందస్తు బెయిలుపై తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు బుధవారం (మే 31) తెరపడుతుంది. 

ఏపీలోకి షర్మిల ఎంట్రీ?.. జగన్ కు ఇక చుక్కలే?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల ఎవరు వదిలిన బాణమంటూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటన్నిటినీ దాటుకుని ఆమె చాలా దూరం నడిచేశారు. అయినా ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె టార్గెట్ ఎవరు అన్న విషయంలో ఇంత కాలం స్పష్టత రాలేదు. అయితే ఇటీవల స్వల్ప వ్యవధిలో ఆమె కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండు సార్లు భేటీ అయిన తరువాత ఆమె అడుగులు ఎటు? ఆమె టార్గెట్ ఎవరు అన్న విషయంలో మెల్లిమెల్లిగా ఒక క్లారిటీ వస్తోంది.  ఇప్పటి వరకూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబ సభ్యులూ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలను ఆకర్షించిన షర్మిల తన అసలు టార్గెట్ మాత్రం సొంత సోదరుడు, ఏపీ సీఎం జగన్ రెడ్డే అన్న విషయాన్ని డీకేతో భేటీ సందర్భంగా ఆయనకు తేటతెల్లం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని నడపడానికి అవసరమైన వనరుల సమీకరణలో ఆమెకు సోదరుడు జగన్ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారన్నది ఆమె ఆగ్రహంగా చెబుతున్నారు.  ఇక షర్మిల అవసరాన్ని ఆసరాగా చేసుకుని డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించి షర్మిల కాంగ్రెస్ లో చేరే విధంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. అసలు విషయమేమిటంటే.. డీకే ప్రతిపాదనకు షర్మిల ఇప్పటి వరకూ ఔనని కానీ.. కాదని కానీ బదులివ్వలేదని అంటున్నారు. ఆమె ఇంత కాలం తన కార్యక్షేత్రం  తెలంగాణ అని భావించి అక్కడ పని చేసి  కొంత వరకూ సక్సెస్ అయ్యారు. ఆమెను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు.  అయితే తెలంగాణలో పార్టీ  నడిపేందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ అండతో ఏపీలో కూడా కాలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలంగాణ పార్టీని ఏపీలో విస్తరించే అవకాశం లేనందున ఆమె తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే  జరిగితే.. వైఎస్ జీవించి ఉన్నంత కాలం అంటిపెట్టుకుని ఉన్న పార్టీలోకి ఆయన వారసురాలిగా ఆమె అడుగుపెట్టినట్లౌతుంది. అదీ గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండు ప్రాంతాలలోనూ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో   అపార ప్రజాభిమానం ఉంది. ఇక ఏపీలో జగన్ విషయానికి వస్తే తండ్రి  మరణం తరువాత కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నా  కుటుంబం మొత్తం  ఆయన వెన్నంటి నిలిచి  వైఎస్ రాజకీయ వారసుడు జగనే అని చాటారు. అయితే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరుతో కుటుంబం మొత్తం ఆయనకు దూరమైంది. మరీ ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వ్యవహరించిన తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి వత్తాసుగా  వివేకా కుమార్తెను ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలతో  కుటుంబం జగన్ కు దూరమైంది. చివరకు సొంత తల్లి, చెల్లి కూడా ఆయనకు దూరం జరిగారు. అదే సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుపై డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయపోరాటానికి షర్మిల మద్దతుగా నిలవడంతో వైఎస్ కుటుంబం  షర్మిల వెనుక  నిలవడంతో జగన్ ఒంటరి అయ్యారు. ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తే వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా జగన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే  ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తునకే అడుగడుగునా అడ్డుపడుతూ,  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం, తాజాగా ఈ కేసులో  సీబీఐ జగన్ పేరును కూడా ప్రస్తావించడంతో  ఆయన ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో బాబాయ్ హత్య కేసులో న్యాయం కోసం నిలబడిన వివేకా కుమార్తె సునీతకు అండగా నిలిచిన షర్మిల కనుక ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తే జగన్ కు రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఆస్తుల వ్యవహారంలోనే కాకుండా, రాజకీయంగా కూడా తనకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన సోదరుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్న షర్మిల కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.   పార్టీని   విలీనం చేయడానికి అంగీకరిస్తే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే సూత్ర ప్రాయంగా అంగీకరించిందని కూడా చెబుతున్నారు. అదే జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు, జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న బీజేపీకీ ఒకే సారి చెక్ పెట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ బలోపేతమౌతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద షర్మిల స్వల్ప వ్యవధిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ ల  వెనుక కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉన్నారనీ, ఆమె సూచన మేరకే షర్మిలను కాంగ్రెస్ లోకి డీకే ఆహ్వానించారనీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

వైసీపీలో మినీ మేనిఫెస్టో మహా ప్రకంపనలు

అవును. తెలుగు దేశం పార్టీ మహానాడులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన, 2024 ఎన్నికల ముందస్తు మినీ  మేనిఫెస్టో అనేక మందిని ఆశ్చర్యపరిచింది. తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఆర్థిక సంస్కరణలకు పెట్టింది పేరుగా నిలిచారు. ఆర్థిక, విద్యుత్ సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు తెచ్చిన సంస్కరణల ఫలితంగానే, తెలుగు రాష్టాలకు, ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని  హైదరాబాద్  నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐటీ, ఫార్మా  హబ్ గా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇది ఎవరో అన్న మాట కాదు  స్వయంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సత్యం. నిజం. చంద్రబాబు శ్రీకారం చుట్టిన సంస్కరణలే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఇంధనంగా  మారి ముందుకు నడిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా ప్రపంచం గుర్తిస్తోంది.  అవును. అప్పుడు అలా సంస్కరణలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు నాయుడు, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత వరాలు సహజంగానే, కొన్ని ప్రశ్నలను తెర మీదకు తెచ్చాయి. అలాగే, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేస్తున్న ఉచిత పథకాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని విమర్శిస్తున్న తెలుగు దేశం పార్టీ,  ఉచిత పథకాలను, మినీ మేనిఫెస్టోలో, గ్యారెంటీలుగా చూపడం ఏమిటనే ప్రశ్నతో పాటుగా, మరి కొన్ని ప్రశ్నలు విమర్శలువినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో తో కలవర పాటుకు గురైన వైసీపీ మంత్రులు, మాజీలు మినీ మేనిఫెస్టో పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతాన్ని తవ్వి తీసి, ప్రజలు తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మరని సంబర పడిపోతున్నారు.జగన్ రెడ్డికి  ఉన్న ‘గొప్ప’ విశ్వసనీయత చంద్రబాబాబుకు లేదని తమలో తాము సంబుర పడిపోతున్నారు.  అయితే  అధికార వైసీపీ చేస్తున్న పసలేని రాజకీయ విమర్శలను పక్కన పెడితే, తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు సంస్కరణలకు పెద్ద పీట వేసింది నిజం. అలాగే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేస్తున్న ఉచిత పథకాలను విమర్శించిందీ నిజమే. కానీ  తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పేదలకు పనికొచ్చే, సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. నిజానికి  ఈరోజు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అమలవుతున్న సబ్సిడీ బియ్యం (రూపాయికి కిలో బిబియ్యం) పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగు దేశం పార్టీ... అలాగే ఈ రోజున తెలుగు రాష్త్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉచిత విద్యుత్, మహిళా సాధికరిత కోసం చేపట్టిన  అనేక సంక్షేమ పథకాలకు  గతంలో  తెలుగు దేశం ప్రభుత్వాలే శ్రీకారం చుట్టాయి.  అంతే కాదు, తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకుపోతే, వైసీపీ  జగన్ రెడ్డి అభివృద్ధిని పక్కకు నెట్టి ఆర్థిక ప్రగతిని పట్టాలు తప్పించారు. సంతుల్యత లోపించి రాష్ట ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. అప్పుల కుప్పగా మారిపోయింది. అప్పు పుడితే తప్ప పూట గడవని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జారిపోయింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వలేనంతగా రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారిపోయింది. అదలా ఉంటే  వైసీపీ ప్రభుత్వం  ఓ వంక  సంక్షేమం పేరిట ప్రజలను మభ్య పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ, మరో వంక మద్యం ధరలు మొదలు విద్యుత్, బస్సు చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయింది. జనం నడ్డి విరిచింది.  చివరాఖరుకు చెత్తమీదా పన్నేసింది. ఈ  చేత్తో ఇచ్చి ఆ చేత్తో అంతకు పదింతలు గుజుకుంది. ఆలా గుంజుకున్న సొమ్ములను అవినీతి ఖాతాలో వేసుకుని నేతలు ఆస్తులు పెంచుకున్నారు. రాష్టాన్ని అప్పుల ఊబిలోకి, జనాలను మద్యం మత్తులోకి  వైసీపీ సర్కార్ నెట్టి వేసింది..నిజానికి తెలుగు దేశం తప్పు పట్టింది, వైసీపీ ప్రభుత్వం సక్షేమం చాటున సాగిస్తున్న అవినీతి బాగోతాన్నే కాని, సంక్షేమ పథకాలను కాదు. అయితే  వైసేపీ నేతలు తెలుగు దేశం మినీ మేనిఫెస్టో ను విమర్శిస్తున్నారు. చంద్రబాబు, తమ నాయకుడు జగన్ రెడ్డిని ఫాలో అవుతున్నారని సంబర పడి పోతున్నారు. కానీ  ప్రజలు సంక్షేమం, సంక్షోభం మధ్య ఉన్న సన్నని  పొరను గుర్తిస్తున్నారు. జగన్ రెడ్డి కుట్రలను గ్రహించారు. అందుకే  చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నారు. అందుకే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. గోల చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా, చంద్రబాబు నాయుడు తమ అనుభవం అంతా రంగరించి సంధించిన మినీ మేనిఫెస్టో ... వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

అటా ఇటా.. ఎప్పటికి తేల్చుకుంటారు?

రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని విధాలుగా ఆలోచించడం సహజం. అయితే ఆ ప్రయత్నం మరీ సుదీర్ఘంగా సాగితే చులకన అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు దాదాపు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధినేతను ధిక్కరించి బహిష్కరణ వేటుకు గురి కావడం అంటే మామూలు విషయం కాదు. మాజీ మంత్రి ఈటల తరువాత అంత సాహసోపేతంగా వ్యవహరించిన నేతలుగా పొంగులేటి, జూపల్లి గుర్తింపు పొందారు. ముఖ్యంగా పొంగులేటి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు దక్క నివ్వనంటూ భీషణ ప్రతిజ్ణ చేసి సంచలనం సృష్టించారు. అదేదో రాజకీయ ప్రకటన కాదనీ, నిజంగానే పొంగులేటికి జిల్లాపై అంత పట్టుందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత అటా..ఇటా ఎటువైపు అన్న విషయంలో పొంగులేటి, జూపల్లి చేస్తున్న కాలహననం వారిని ప్రజలలో పలుచన చేస్తున్నది. ఇరువురూ కడా అటా ఇటా అంటే కాంగ్రెస్ లోకా, బీజేపీలోకా అన్నది తేల్చుకోలేక సతమతమౌతున్నారు. ఆ రెండు పార్టీలూ కూడా సిద్ధాంత పరంగా పరస్పర విరుద్ధమైనవి. కానీ వీరిరువురూ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టలలో ప్రస్తుతం ఏ పార్టీ బలంగా ఉందో అందులో చేరాలని భావిస్తున్నా.. తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరించి పరిశీలిస్తున్నా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే  వారు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందంటూ రెండు మూడు ముహూర్తాలు కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత తూచ్ కాదు కాదు, బీజేపీలో చేరుతున్నారంటూ కూడా ముహూర్తాలు ఖరారు అయ్యాయని ప్రచారం జరిగింది. ఆ తరువాత రెండూ కాదు.. వీరిరువురూ కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అనీ, ఆ పేరుపై రిజిస్ట్రేషన్ కు కూడా దరఖాస్తు చేయడం అయిపోయిందనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా పొంగులేటి, జూపల్లిలు ఈటలతో రహస్య భేటీ జరపడంతో కమలం గూటికే చేరుతున్నారని అంతా భావించారు. తీరా భేటీ తరువాత ఈటల చేసిన వ్యాఖ్యలు వారు కమలానికి దూరమేనని తేటతెల్లం చేశాయి. వారిరువురూ తనకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈటల సెటైర్ వేయడంతో రహస్య భేటీ  పొంగులేటి, జూపల్లి కమలం గూటికి ప్రవేశించడానికి  మార్గం సుగమం చేయడం అటుంచి.. ఆ దారులనే మూసేసిందని తేటతె ల్లమైపోయింది.    ఇక వారి ముందున్నది రెండే మార్గాలు కాంగ్రెస్ లో చేరడం.. లేదా ప్రచారంలో ఉన్న విధంగా సొంత కుంపటి పెట్టుకోవడం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం చేస్తే.. వారి మద్దతు దారులు తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

ముసుగు తీసేసిన మోడీ!

ప్రధానిగా మోడీ తొలి సారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ ఆయన ప్రధాన అజెండా హిందుత్వ అన్న అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి మోడీ ప్రధానిగా అధికార పగ్గాలు అందుకున్న తరువాత సమాజంలో ద్వేష భావం పెంపొందేలా వరుస సంఘటనలు జరిగాయని పరిశీలకులు ఉదాహరణలతో చెబుతున్నారు. అయితే తాజాగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఆయన ముసుగు తీసేశారనడానికి నిలువెత్తు నిదర్శనంగా వారు విశ్లేషిస్తున్నారు.  భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకిక విధానాలకు ఆయువు పట్టులాంటి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తూ సాధువులు, మఠాధిపతుల ఆధ్వర్యంలో వారి ఆధిపత్యంతో సాగింది.  సాధువుల ఆశీర్వాదాల మధ్య సెంగోల్  (రాజదండం)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాష్టాంగ నమస్కారం చేడయం ఏ సంస్కృతికి ప్రతిబింబం. సాధువులు – మఠాధిపతులు వెంటరాగా, తాను రాజదండంగా అభివర్ణించిన సింగోల ను స్వయంగా మోసుకెళ్ళి, స్పీకర్ స్థానానికి సమీపంలో ప్రతిష్టించారు. హిందుత్వ భావజాలానికి ఆద్యుడైన వినాయక్ దామోదర్ సావార్కర్ జన్మదినం  అయిన మే 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ద్వారా ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన సందేశమేమిటన్న ప్రశ్న విపక్ష రాజకీయ పార్టీల నుంచే కాదు.. భారత దేశం మతాతీత దేశమని భావించే కోట్లాది మంది ప్రజల నుంచీ వస్తున్నది. ఇంత కాలం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత దేశం హిందూ దేశం అని సమాజానికీ, ప్రపంచ దేశాలకీ సందేశంగా పార్లమెంటు భవన ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.   అన్నిటికీ మించి  రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ కలిసిన వ్యవస్థ. అటువంటిది దేశ  ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి, సర్వసైన్యాధిపతి ప్రమేయం లేకుండా భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ద్వారా  ప్రజలకు మోడీ ఇచ్చిన సందేశమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని 19 ప్రధాన రాజకీయ పార్టీలు పార్లముంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించినా లెక్క చేయకుండా, ఆయా పార్టీలను సమాధాన పరిచి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలే చేయకుండా  మేం నిర్ణయించిందే శాసనం అన్నట్లుగా ప్రారంభోత్స కార్యక్రమాన్ని మోడీ కానిచ్చేశారు. గత తొమ్మిదేళ్ళ పాలనలో మోడీ ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల నిర్వహణలో ఇష్టారీతిగా వ్యవహరించారు. ఉభయ సభల్లో దాదాపు 76% బిల్లులు  ఎలాంటి చర్చకానీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీల పరిశీలనకానీ లేకుండానే ఆమోదించేసిన తీరు ప్రజాస్వామ్యానికి శోభ నివ్వదు.  మొత్తం మీద మోడీ సర్కార్  ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గుడివాడలో కొడాలికి ఇక ‘కాపు’ కాయరా?

మహానాడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఉక్రోషంతోనో, మరో కారణంతోనో  వైసీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు.  విపక్షంపై మరీ ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుపై నోటికి పని చెప్పాలంటే.. కొడాలి నాని అందరి కంటే ముందుంటారు. ఇప్పుడు కూడా   ఎప్పటిలాగే  మినీ మేనిఫెస్టోపై దుమ్మెత్తి పోయడంలో కూడా నాని ముందంజలో ఉన్నారు.  చంద్రబాబు,  టీడీపీ నేతలపై ఆయన తన  మాటల దాడి ఉధృతి పెంచారు. ఈ  క్రమంలో నాని, కాపు సామాజిక వర్గం పై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే కొడాలి నాని  మహానాడులో ఆయన ప్రకటించిన మినీ మేనిఫెస్టోను విమర్శించే క్రమంలో తన బూతుల పంచాంగం విప్పారు. ఆ క్రమంలో  ఆయన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అదే ఊపులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారంటూ..  కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని.. ఇప్పుడు  కాపు వర్గం కొడాలి నానిపై  ఫైర్ అవుతోంది. కొడాలి నాని కాపు వర్గానికి క్షమాపణ చెప్పాలని, ఆయనను  వైసీపీ నుంచి  బహిష్కరించాలని కాపులు   డిమాండ్ చేస్తున్నారు. కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్‌ చేసింది. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని జనసేన నేత లంకిశెట్టి బాలాజీ అన్నారు.  గుడివాడలో కాపు సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో కాపు ఓట్లు ఉన్నాయి. ఇంత కాలం గుడివాడలో కాపు సామాజిక వర్గం కొడాలి నానికి మద్దతు ఇస్తూ వచ్చింది.  అయితే తన నోటి దురుసుతనంతో ఇప్పుడాయన వారిని దూరం చేసుకున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నాని కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.   నోటికి గట్టిగా పని చెప్పడం.. మోటుగా.. కరుకుగా సమాధానం చెప్పడం.. అలవోకగా అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం.. వైకాపా నేతలకు సర్వసాధారణం. అలా బూతు మాటలను ప్రయోగిస్తేనే.... పార్టీలో గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వారిది. అయితే ఈ సారి మాత్రం నాని తన నోటీ దురుసుతనం వల్ల ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి. 

బాబును ఫినిష్ చేయడానికి కేంద్రం అనుమతి కోరతారట!

తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న జనాదరణ.. వైపీపీ పట్ల వ్యక్తమౌతున్న నిరాదరణతో అధికార పార్టీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందా? వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదా? అంటే తమ్మినేని మాటలు వింటే ఎవరైనా ఔననే అంటారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయి ఉండీ నోటికి హద్దూ అదుపూ లేకుండా ఇష్టారీతిగా ఆయన మాట్లాడిన మాటలు కచ్చితంగా నేరపూరితమైనవే. ఒక సామాన్యుడి నోటి నుంచి అటువంటి మాటలు వచ్చి ఉంటే ఈ పాటికి కటకటాల వెనుక ఉండేవాడు. లేదూ విపక్షాల వారెవరైనా అధికార పక్ష నేత గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖాకీలు ఇళ్లపై దాడి చేసి మరీ జైలు పాలు చేసి ఉండేవారు. కానీ ఇక్కడ మాట్లాడినది రాష్ట్ర స్పీకర్, అందునా స్పీకర్ అయి ఉండీ వైసీపీ కార్యకర్తల సమావేశంలో విపక్ష నేతను ఫినిష్ చేసేస్తామంటూ మాట్లాడటం అరాచకత్వానికి, విశృంఖలతకూ పరాకాష్ట. అసలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ రూటే సెపరేటు.. ఆయన ఏం మాట్లాడతారో తెలిసే మాట్లాడతారా అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తరువాత ఆయన ఇంకా అరెస్టు కాకుండా ఉన్నారంటే.. అది స్పీకర్ పదవి ఇచ్చిన రక్షణ కవచమైనా అయి ఉండాలి లేకపోతే.. ఏపీ పోలీసులకు వైసీపీ నేతలను అరెస్టు చేసే ధైర్యం లేకపోవడమేనా అయి ఉండాలి. ఇంతకీ ఆయన చంద్రబాబును ఫినిష్ చేస్తానని అన్నారు. ఔను స్పష్టంగా అవే మాటలు మాట్లాడారు. బ్లాక్ కమెండోల రక్షణ లేకుంటే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవారని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఆముదాల వలసలో  వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఔను పార్టీ కార్యకర్తల సమావేశంలోనే స్పీకర్ మాట్లాడారు. బ్లాక్ కమాండోలు ఉన్నారన్న ధైర్యంతో ఆయన రెచ్చిపోతున్నారనీ, ఆ రక్షణ లేకపోతే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయేవారనీ తమ్మినేని ఉన్నారు. అలాగే అసలు ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు బ్లాక్ కమాండోల రక్షణ ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు భద్రత ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ హోదాలో తాను కేంద్రాన్ని కోరతానని వైసీపీ కార్యకర్తలకు చెప్పారు. అంటే  చంద్రబాబును ఫినిష్ చేయడానికి కేంద్రాన్ని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని అనుమతి కోరుతానని ఆయన అంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  అయినా ఎవరికి జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉండాలో నిర్ణయించాల్సింది ఏపీ అసెంబ్లీ స్పీకర్ కాదన్న విషయం తమ్మినేనికి తెలియదనుకోవాలా? అన్నిటికీ మించి ఇటీవల చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందంటూ ఎన్ఎస్జీ ఉన్నత స్థాయి అధికారులు చంద్రబాబు నివాసం, ఆయన తరచూ వెళ్లే పార్టీ కేంద్ర కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లును ఒకటికి రెండు సార్లు సమీక్షించారు. ఆయనకు కమాండోల భద్రతను పెంచారు. కుప్పం, నందిగామ వంటి చోట్ల వైసీపీ మూకలు ప్రమాదకరంగా ఆయనకు సమీపంలోకి వచ్చి దాడికి  యత్నించారు. వీటన్నిటినీ చూస్తుంటే చంద్రబాబుకు ముప్పు పొంచి ఉన్నది అధికార పార్టీ నుంచేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

ఇక ఏపీలో ముందస్తు నగారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు డిసైడైపోయారా? ఆయన తాజా హస్తిన పర్యటనలో ఈ విషయంపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకు తార్కానంగా ఆయన హస్తిన నుంచే కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలను చెబుతున్నారు. ఔను హస్తిన నుంచి ఆయన సోమవారం (మే29) పార్టీ ముఖ్యులకు ఒక సందేశం పంపించారు.  వచ్చే నెల 7న కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలన్నదే ఆ సందేశం. ఆ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా జగన్ చెప్పారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన తీసుకోబోయే కీలక నిర్ణయం ముందస్తేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం దూకుడు ను నిలువరించాలంటే.. ఆ పార్టీ మరింత పుంజుకోకుండా ఆపాలంటే ముందస్తు ఒక్కటే మార్గమన్నది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశంగా వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాలలో వైసీపీ పాలన పట్ల.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అందుకు తాజా తార్కానం అమరావతి ఆర్5 జోన్ లో పట్టాల పంపిణీకి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి.. వేల మందికి పట్టాలు పంపిణీ చేపట్టినా.. ఆ సభలో జగన్ ప్రసంగం ప్రారంభించగానే జనం మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడాన్ని చూపుతున్నారు.  ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ రోహిణి కార్తె ఎండలను మించిపోయింది. ఏపీ సీఎం ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేసినా ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అసెంబ్లీల గడువు పూర్తయ్యే రాష్ట్రాల్లో ఈసీ ఇప్పటికే సన్నాహాలు ఆరంభించింది. ధృవపడని సమాచారం మేరకు పనిలో పనిగా ఏపీలో కూడా ఈసీ ఎన్నికల సన్నాహాలు ఆరంభించింది.  అయినా ఏపీలో  కూడా ఎన్నికలు జరగాలంటే.. ఎ ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ఈసీ ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే… ఇక జాగు లేకుండా జగన్ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అదిగో ఆ నిర్ణయం తీసుకునేందుకే జగన్ వచ్చే నెల 7న కేబినెట్ బేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలకు హేతువు మాత్రం ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల, మంత్రులు సమయం సందర్భంతో పని లేకుండా ముందస్తు ప్రశక్తే లేదన్న ప్రకటనలు గుప్పించడమేనంటున్నారు.  ముందస్తుకు వైసీపీ తొందర ఎందుకంటే.. రాష్ట్రంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆర్థిక పరిస్థితులు కారణంగా ఆ పథకాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. అదే జరిగితే.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారి మొదటికే మోసం వస్తుంది. ఈ ఆలోచనతోనే జగన్ ముందస్తు మంత్రం జపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనీ, సహకారం అందింస్తామన్న హామీ కూడా జగన్ కు లభించిందని అంటున్నారు. అందుకే ఏళ్ల తరబడి పైసా విదల్చడానికి కూడా ఇష్టపడని కేంద్రం ఒక్క సారిగా ఉరుములేని పిడుగులా.. జగన్ సర్కార్ పై అవాజ్యమైన ప్రేమానురాగాలు ప్రదర్శిస్తూ రెవెన్యూ లోటు నిధులను పది వేల కోట్ల రూపాయలకు పై చిలుకు ఒకే సారి విడుదల చేసిందని అంటున్నారు. ముందస్తు సన్నాహాలకు, బకాయిల చెల్లింపులకు ఈ నిధులు రాష్ట్రానికి ఉపకరిస్తాయన్న యోచనతోనే ఆ విడుదల జరిగిందనీ, లేకుంటే గత ప్రభుత్వం రెవెన్యూలోటు భర్తీ గురించి అడినప్పుడల్లా దేశ రక్షణ నిధులివ్వమంటారా అంటూ ఒంటి కాలిమీద లేచిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు హఠాత్తుగా అంత సొమ్ము ఒకేసారి ఎందుకు విడుదల చేస్తుందని అంటున్నారు.   ఏది ఏమైనా జగన్ సర్కార్ ముందస్తుకు వెడుతుందా? లేదా? అన్నది జూన్ 7న జరిగే కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

కెసీఆర్ ఇలాఖాలో నీటి కటకట

ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో తాగునీటి కటకట వాటిల్లింది. భారతదేశంలోనే పవర్ ఫుల్ సిఎం కెసీఆర్ అని ప్రచారంలో ఉన్నప్పటికీ ఎండాకాలంలో గజ్వేల్ వాసులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. దాదాపు 60 శాతం మంది నీటి ఎద్దడికి గురవుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకదర్గంలో మొత్తం 3, 22, 130 మందిలో 1,93,278 మంది తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ఆరు మండలాల్లో ప్రజలు దాహార్తికి గురవుతున్నారు. వర్గల్ మండలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది.  మరుగుదడ్లు కేవలం 46.73 శాతం మందికే ఉన్నాయి. అంటే మండలంలో మొత్తం 3.2 లక్షల మంది జనాభా ఉంటే లక్షా 48 వేల మంది మరుగుదడ్లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు.  అంటే మిగిలిన  లక్షా 73 వేల మంది ఆరు బయట విసర్జన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి స్వంత ఇలాఖాలోనే ఇటువంటి పరిస్థితి ఉందంటే మిగతా ప్రాంతాల్లో అంచనా వేయవచ్చు. 

మహాజన ప్రభంజనం.. మహానాడు

రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పండుగ మహానాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రజల ముందు ఉంచింది. మే నెల 27, 28 తేదీలలో జరిగిన తెలుగుదేశం వార్షిక ప్రతినిథుల సభ, బహిరంగ సభలు ఆ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ ను నింపాయి.  27వ తేదీన సుమారు 15వేల మంది హాజరౌతారని అశించిన ప్రతినిథుల సభకు 40 వేల మందికి పైగా హాజరు కావడంతో ప్రతిపక్ష తెలుగుదేశంలో ఆనందం, అధికార వైసీపీలో గుబులు ఒక్కసారిగా బయటపడ్డాయి.  తెలుగుదేశం పార్టీ ఆ జోష్ ను రెండు రోజుల పాటు కొనసాగించగా, వైసీపీ తన అక్కసును అనేక రకాలుగా ప్రకటిస్తూనే వచ్చింది.  రాజమండ్రి శివారు ప్రాంతమైన వేమగిరిలో జరిగిన రెండు సభలూ సూపర్ హిట్ కావడంతో పసుపు క్యాడర్ లో  పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరో వైపు పరిస్థితిని గమనించిన వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డు పడటం కనిపించింది. ముందు రోజు నుండీ ఫ్లెక్సీలు చించివేయడం, సభలకు స్థలాన్ని ఇచ్చిన వారిని బెదరించడంతో పాటు.. లక్షలాది మంది ప్రజలు హాజరౌతున్న సభలకు అంబులెన్సులను ఇచ్చే వారిని కూడా వైసీపీ నేతలు బెదరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇన్ని అవరోధాల మధ్య మహానాడు మహా విజయాన్ని స్వంతం చేసుకుంది. రాజమండ్రి నగరంలో, సభలు జరిగే చోట భారీ వాహనాలను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ సమస్యను సృష్టించారని స్థానిక టీడీపీ నేతలు వైసీపీ  నేతలపై, ప్రభుత్వ శాఖల అధికారులపై ఆరోపణలు చేయడం కూడా కనిపించింది.  ఇన్ని అవాంతరాల మధ్య రెండు రోజుల పాటు సాగిన మహానాడు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రతినిథుల మహాసభల దాదాపు ప్రతి నాయకుడూ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభ ముందు ఉంచే ప్రయత్నం చేశారు.  27వ తేదీన ప్రతినిథుల మహా సభలో పార్టీ ముఖ్యులు చేసిన ప్రసంగాలు పార్టీ ప్రతినిథులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిథులు రావడంతో సభకు నిండుదనం చేకూరింది.  సుమారు  40 డిగ్రీల ఎండ కాస్తున్నా లెక్క చేయకుండా ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల దాకా సాగిన ప్రతినిథుల మహా సభ పార్టీలోని క్రమశిక్షణను చెప్పకనే చెప్పింది. ప్రతినిథుల సభలో అధినేత చంద్రబాబు ప్రసంగం హైలైట్ గా నిలిచింది. కౌరవులను ఓడించి గౌరవ సభలోకి అడుగుపెడతానని బాబు చెపపినపుడు ప్రతినిథుల సభ హర్షం వ్యక్తం చేసింది. అదే రోజు సాయంత్రం జరిగిన జాతీయ అధ్యక్షుడి ఎన్నికల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రానున్న ఎన్నికలలో యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తామని, క్రమశిక్షణ పాటించని నాయకులను పార్టీ ఆదరించే ప్రశ్నే లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.  మొత్తం 19 తీర్మానాలను ఆమోదించారు.  28వ తేదీన జరిగిన భారీ బహిరంగ సభ పార్టీ పట్టును మరోసారి తెలిపింది. లక్షల మంది హాజరైన ఈ సభలో పార్టీ అధినేత మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రకటించిన మానిఫెస్టో రానున్న ఎన్నికలలో విజయానికి తొలి సంకేతమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  మినీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చేసిన ప్రకటనల్లో ఎ క్కడా వ్యక్తుల పేర్లను పథకాలకు పెట్టలేదు.  18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిథి, చదువుకునే పిల్లల తల్లులకు తల్లికి వందనం, జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు వసతి, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల భృతి ఈ మినీ మేనిఫెస్టోలో ముఖ్యమైనవి. ఇవి కాక అధికారం ఉండే ఐదేళ్లలో 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించే బాధ్యత తనదేనంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు తెలుగుదేశం శ్రేణులకు అమితానందాన్ని కలిగించాయి.   ఏది ఏమైనా రాజమహేంద్రవరం మహానాడు తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, శ్రేణులకు ఒక మధుర జ్ణాపకంగా నిలిచిపోనుంది. 2023 మహానాడు స్ఫూర్తితో రానున్న ఎన్నికలకు సమాయత్తం కావడానికి తెలుదండు జిల్లాలకు తరలివెళ్లింది. 

ఆవిర్భావ దినోత్సవాలకు కాంగ్రెస్ ప్లాన్ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అమెరికాలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ బిఆర్ఎస్ కు వెళ్లిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం బిఆర్ఎస్ అని  ప్రచారం చేసుకుంటుంది.  వచ్చే నెల రెండున అమెరికా టెక్సాస్ లో జరిగే వేడుకలకు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిధులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇటీవలె కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో  ఆ పార్టీ బలం పెరిగింది. కర్ణాటక సరిహద్దు జిల్లాలలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. కాస్తా కష్టపడితే బిఆర్ఎస్ ను దెబ్బతీయడం సులభమేనని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  పిల్ల పుట్టి తల్లి చచ్చినట్టు తెలంగాణ పుట్టి కాంగ్రెస్ చచ్చినట్టు మారింది. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్ తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా రెండు పర్యాయాలు బిఆర్ ఎస్ అధికారంలో రావడాన్ని కాంగ్రెస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.  ఇదిలా ఉండగా బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. తాము కూడా బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలను జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. సోనియాగాంధీని ముఖ్య అతిథిగా హజరుఅయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించాయి. జూన్ రెండున హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, డిప్యూటి సీఎం డికె శివకుమార్ ను  ఈ సభకు రప్పించాలని చూస్తున్నారు.  

సైబరాబాద్ మొక్క.. తప్పిన లెక్క

రాజమహేంద్రవరం వేదికగా జరిగిన రెండు రోజుల పాటు జరిగిన మహానాడు ఆదివారంతో ముగిసింది.   మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరు అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.  అయితే మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మేనిఫెస్టోపై ఆయన చేసిన ప్రకటనపై అధికార వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అలాగే  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ కూడా విమర్శించారు. ఇప్పటికే కొడాలి నానిపై నెటిజన్లు ఫైర్ అవుతుంటే..  విడదల రజినీ విమర్శలపై  నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.  అంతేకాదు.. చంద్రబాబుపై ఆమె చేసిన ప్రతి కామెంట్‌కి  కౌంటర్ ఇస్తున్నారు.   ఆ క్రమంలో ఏపీ సీఎం  జగన్‌ను తిట్టేందుకే ఈ మహానాడు ఏర్పాటు చేశారంటు విడదల రజినీ పేర్కొనడంపై.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  మరి జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ తదితరులు చంద్రబాబుని బండ బూతులు తిట్టారని..  వారి సంగతి ఏమిటని వారు ఈ సందర్భంగా నిలదీస్తున్నారు. అలాగే ఇదే వేదికగా.. సైకిల్.. ఎలక్ట్రిక్ సైకిల్‌గా మారబోతోందని.. ఆ క్రమంలో ముందు చక్రం సంక్షేమం అయితే వెనుక చక్రం అభివృద్ధి అని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో సంక్షేమం గురించి కానీ.. అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదని ఆమె విమర్శించడంపై  కూడా నెటిజన్లు రజని తెలుగుదేశం గూటిలో ఉన్న సమయంలో చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.  2017లో విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించిన మహానాడు వేదికగా.... అదీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో... అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారని.. హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఉందని.. ఆ సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్క నేను సార్..  అంటూ నాడు ఒకటికి రెండు స్లారు గర్వంగా చెప్పుకొచ్చిన విషయం  మరిచిపోయారా? మంత్రి రజినీ అంటూ నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా చురకలంటిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్.. సంక్షేమాన్ని, అభివృద్ధి ఆయన రెండు కళ్లని.. వాటిని ఆయన ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారో.. అందరు చూస్తున్నారని మీరు చెబుతున్నారు. అసలు అభివృద్ధి , సంక్షేమ అంటే ఏమిటని నెటిజన్లు ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని  సోషల్ మీడియా ద్వారా  సూటిగా ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబు చేసింది చెప్పేందుకు ఏమీ లేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని.. మీరు అంటున్నారు. మరి మీ పార్టీ అధినేత   జగన్ ప్రతిపక్ష నేతగా.. ఇచ్చిన హామీలు.. ఆ తర్వాత ఆయన గద్దెనెక్కిన అనంతరం అమలు చేసిన వాటి గురించి మీరు కనీసం ఒకటి లేకుంటే రెండు వివరించగలరా? అని ఈ సందర్బంగా  డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంపద సృష్టి, మేనిఫెస్టోలపై చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించడాన్ని ఖండించి.. వాటికి సైతం నెటిజన్లు తమదైన శైలిలో ఆమెకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం.. అది కుదరదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో.. అప్పటికప్పుడు జంప్ జిలానీ రాగం ఆలపించి.. ఫ్యాన్ పార్టీలో చేరి.. అలా ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు....  మంత్రి పదవి కూడా చేపట్టి.. ఇప్పుడు.. మీ రాజకీయ జీవితానికి బేస్ అయిన టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలుగుప్పించడం ఏం మాత్రం పద్దతి కాదని నెటిజన్లు నిర్మొహమాటంగా మంత్రి రజనీకి తేల్చి చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. సైబరాబాద్ మొక్క లెక్క తప్పిందంటూ సోషల్ మీడియాలో నెటిజనల్ కామెంట్స్  చేస్తున్నారు.