అక్కడ పొగడ్తలు.. ఇక్కడ తెగడ్తలు.. బీజేపీ డ్యుయెల్ రోల్
posted on May 25, 2023 @ 2:09PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయంలో బీజేపీ చిత్ర విచిత్ర వేషాలు వేస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బందీ రాకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకుంటోంది. అడగకుండానే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నా.. ససేమిరా ఇవ్వనంటున్న బకాయిలను జగన్ కు వెసులుబాటు కలిగే విధంగా ఎన్నికల సంవత్సరంలో విడుదల చేసేసింది. పార్లమెంటు వేదికగా ఎప్పుడూ రుణగొణ ధ్వనేనా అని స్వయంగా విత్తమంత్రి వైసీపీ ఎంపీలపై చిరాకు పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి ఇంకా అప్పు కావాలా అని అడిగి మరీ మంజూరు చేసేస్తున్నారు.
అదే సమయంలో ఏపీ బీజేపీ మాత్రం జగన్ సర్కార్ పై చార్జిషీట్లు పెడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాలలోనూ విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తోంది. వెంటనే ఆయనేమైనా నొచ్చుకుంటారేమోనని తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ పేదలకు లక్షల ఇళ్లు కట్టిస్తూ జగన్ ప్రజారంజకంగా పాలిస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. మా ముఖ్యమంత్రి బ్రహ్మాండం. పేదల పాలిటి పెన్నిధి అని చాటుకోవడానికి వైసీపీ కార్యకర్తలకు ఈటల మాటలు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. ఈటల వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసుకుంటోంది. ఎందుకంటే కొద్ది రోజుల కిందటే ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజా చార్జిషీట్ ఉద్యమంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని విమర్శలు గుప్పించారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని ఆవాస్ యోజన అని బోర్డు పెట్టడం లేదంటూ మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల పరిస్థితి చూడాలని కోరారు. రోజుల వ్యవధిలో అదే బీజేపీకి చెందిన తెలంగాణ నాయకుడు ఈటల రాజేందర్ జగన్ ను ఆకాశానికెత్తేస్తూ వ్యాఖ్యలు చేశారు.
వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 లక్షల ఇళ్లు మంజూరైతే వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని సోము వీర్రాజు అంటే.. జగన్ సర్కార్ పేదలకు లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చేసిందని ఈటల పొగిడేస్తున్నారు. జగన్ విషయంలో ఏపీ బీజేపీ ఒకలా, తెలంగాణ బీజేపీ మరోలా మాట్లాడడం వెనుక మర్మమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.