రాజకీయాల్లో బీఆర్ఎస్ జీరోయేనా?
posted on May 25, 2023 @ 10:48AM
కర్నాటక ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. కేంద్ర సర్కార్ అంటే ఒంటి కాలిమీద లేచే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత నోటి వెంట ఇప్పుడు కేంద్ర సర్కార్ ను పల్లెత్తు మాట అనడం లేదు.
ఇంత కాలం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే అంటూ వచ్చిన ఆయన ఇప్పుడు తన విమర్శలను కాంగ్రెస్ పైకి ఎక్కుపెడుతున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనీ, తెలంగాణ మోడల్ అంటూ ప్రధాని మోడీ గుజరాత్ మోడల్ ను అనుకరిస్తూ కేసీఆర్ దేశమంతా చుట్టేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. జాతీయ రాజకీయాలలోకి తొలి అడుగులు వేయడానికి ప్రయత్నించిన సమయంలో కనీసం ఆయనను కలిసిన స్టాలిన్, మమత, నితీష్ వంటి నేతలు ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం లేదు. వారి వారి బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలకు కేసీఆర్ ను కనీసం పలవను కూడా పిలవడం లేదు.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు కనీసం ఆహ్వానం కూడా అందడం లేదు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు సహకారం అందిస్తున్నామంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్ మేకర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తీరా ఎన్నికల వేళ బీఆర్ఎస్ కాడె వదిలేయడంతో ఎన్నికలలో జేడీఎస్ చతికిల పడింది. ఆ విషయాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్నికల ఫలితాలకు ముందే మీడియా సమావేశంలో వెల్లడించి పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
దీంతో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒంటరి అయిపోయినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఫలితాల ముందు వరకూ బీఆర్ఎస్ తో కలిసి అడుగులు వేస్తాయని భావించిన ప్రాంతీయ పార్టీలూ ఇప్పుడు దూరం జరుగుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో జత కలిసేందుకు తహతహలాడుతున్నాయి. దీంతో కేసీఆర్ ఇప్పడు జాతీయ రాజకీయాలలో పెద్ద జీరోగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ తో పొత్తుతోనే బీజేపీని దీటుగా ఎదుర్కోగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ తో గతంలో భేటీ అయిన చిన్నచిన్న పార్టీలు కూడా ఇప్పుడు ఆయనకు దూరం జరుగుతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చనప్పుడు కేసీఆర్ కు వెన్నంటి ఉన్న జేడీఎస్ కుమారస్వామి వంటి వారు సైతం కేసీఆర్ తీరు పట్ల గుర్రుగా ఉన్నారు.