ముందస్తు బెయిలు అనుమానమే.. న్యాయనిపుణులు
posted on May 25, 2023 @ 2:20PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు మృగ్యం అనే న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (మే 25) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సహ నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి బెయిలు వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం.
వైఎస్ వివేక హత్యకు సూత్రధారులలో ఒకడిగా పేర్కొంటూ, కచ్చితంగా అరెస్టు చేస్తామని, చేయాలని సిబిఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ దొరకడం కష్టం అంటున్నారు. అదే సమయంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదని అవినాష్ చెప్పినా ముందస్తు బెయిలు ఇచ్చే అవకాశం అణుమాత్రం కూడా లేదనీ, కానీ మానవతా దృక్ఫథంతో అరెస్టయిన తరువాత బెయిలు మంజూరు చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
సుప్రీం కోర్టు దృష్టికి అవినాష్ తరఫు న్యాయవాదులు ఆమె తల్లి అనారోగ్యం విషయాన్ని తీసుకువెళ్లినా న్యాయస్థానం పట్టించుకోకపోవడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జి విని, ఇంకా వినడానికి సమయం లేదని జూన్ 5వ తేదీకి కేసు వాయిదా వేశారు. అయితే, ఈనెల 25వ తేదీన నే కేసును విచారించి తీర్పును వెలువరించాలని వెకేషన్ కోర్టు బెంచ్ ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీనితో జూన్ 5వ తేదీకి వాయిదా వేసిన కేసు ఇన్ వ్యాలీడ్ అవుతుందని వారు వివరిస్తున్నారు.