వోట్ల బిచ్చగాళ్లు వచ్చేస్తున్నారు

రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎన్నికల వేళ వరాలు ప్రకటించడం షరా మామూలే. కానీ అవసరం లేకున్న వరాలు ప్రకటించి తీరా అధికారంలో వచ్చాక వాటిని మరుస్తున్న పార్టీ నేతలే ఎక్కువవుతున్నారు.  వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు గెహ్లాట్ . ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వోట్ల కోసం ఉచిత కరెంటు ప్రకటన చేసినట్లు ఆరోపిస్తున్నాయి.  ఎన్నికలకు ముందు,  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి భారతీయ పౌరుడి బ్యాంక్ ఖాతాకు 15 లక్షల రూపాయలు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవికత మరోలా  జరిగింది.  రూ.15 లక్షలు ఖాతాలోకి  పడలేదు.  ప్రజా సంక్షేమం కోసం చేసిన వాగ్దానాల అమలులో చిత్తశుద్ది కనిపించడం లేదు.  చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా జరుగుతోంది. కేవలం ఎన్నికల నేపథ్యంలో చేసిన వాగ్దానాలు చాలా సందర్భాల్లో వైఫల్యం చెందుతున్నాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని కెసీఆర్ వాగ్దానం చేశారు. వాస్తవికతలో అలాంటిది జరగలేదు.  పంటరుణాలను రూ లక్ష వరకు మాఫీ చేస్తానని కెసీఆర్ మరో వాగ్దానం చేశారు. ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు.  తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. ఈ వాగ్దానం కూడా అమలు  జరగలేదు.  కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కీం క్రింద కెజీ నుంచి పీజీ ఉచిత విద్యనందిస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. కానీ ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు.  గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కెసీఆర్  వాగ్దానం చేసి తూట్లు పొడిచారు.  ఒక్క తెలంగాణ రాష్ట్రంతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసే హామీలు, వాగ్దానాలు అమలు కావడం లేదు.  వోట్ల కోసం ఆయా పార్టీలు వేసే బిస్కట్స్ అని ప్రజలు గ్రహించాలి.   

తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేర రాజకీయ రేస్!

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ పొలిటిల్ మైలేజీ కోసం పోటీ పడుతున్నాయి. తెలంగాణ సాధించింది మేమేనంటూ బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనంటూ కాంగ్రెస్, అన్ని విధాలుగా సహకరించింది మేమేనంటూ బీజేపీ పోటాపోటీగా ఉత్సవాల నిర్వహణకు సమాయత్తమౌతున్నాయి. తెరాసగా ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అంతా ఆ పార్టీ క్రెడిట్ లో వేసుకుంది. అయితే ఎప్పుడైతే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చేశారో.. అప్పటి నుంచీ తెలంగాణ కార్డ్ ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో మాదే కీలక పాత్ర అని గత ఎనిమిదేళ్లుగా ఎంతగా చెప్పుకున్నా బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేకపోయింది.  అయితే ఎప్పడైతే టీఆర్ఎస్ తన పార్టీ పోరులోని తెలంగాణను తీసేసి భారత్ చేర్చిందో అప్పటి నుంచి బీజేపీ తెలంగాణ సాధనలో తమ పాత్ర విస్మరించడం సాధ్యం కాదంటూ గట్టిగా గళమెత్తింది. అందుకు ప్రజల నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ సోనియమ్మే తెలంగాణ ఇచ్చిందని గతంలో ఎంతగా చెప్పుకున్నా విశ్వసించని తెలంగానం ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత కాంగ్రెస్ మాటలకు ఔను కదా అంటూ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణలో మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ ఈ వేడుకలు మూడు వారాలు నిర్వహించాలని నిర్ణయిస్తే.. కేంద్ర  ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తామనీ, ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు.  ఇక కాంగ్రెస్ సోనియాగాంధీ చలవ వల్లే తెలంగాణ ఆవిర్భవించిందన్న ప్రచారంతో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 

రెజ్లర్ల ఆందోళన.. మసకబారుతున్న మోడీ ప్రతిష్ట

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్  భూషణ్ పై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపైనే దాష్ఠీకాలు జరుగుతున్న తీరు మోడీ ప్రతిష్టను నిలువునా ముంచేస్తున్నది. గత 41 రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై కేంద్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనకు మద్దతూ పెరుగుతోంది. ఈ మద్దతు కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వస్తుండటం.. మోడీ ప్రతిష్టను విదేశాలలో కూడా మసకబారుస్తోంది. తాజాగా భారత మహిళా రెజ్లర్ల ఆందోళనపై  యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్  స్పందించింది. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో మార్చ్ చేపట్టిన రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును నిర్ద్వంద్వంగా ఖండించింది. అలాగే భాతర మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలనీ, అలాగే నెలన్నర రోజులలో ఎన్నికలు నిర్వహించకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేస్తామనీ హెచ్చరించింది.   అదలా ఉంటే.. 41 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా   ఏప్రిల్ నుంచి తాము ఉద్యమిస్తున్నా.. బ్రిజ్ భూషణ్ పై చర్యల విషయంలో   పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమైన  రెజ్లర్లు  చివరి క్షణంలో ఖాప్ రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేంద్ర ప్రభుత్వానికి మరో ఐదు రోజుల గడువు ఇచ్చారు. భారత రెజ్లర్ల ఆందోళనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. దేశ వ్యాప్తంగా వారి ఆందోళనకు మద్దతుగా మహిళాలోకం గళమెత్తుతోంది. అలా గళమెత్తుతున్న వారిలో కేంద్రంలోని మహిళా మంత్రులు లేకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు యూనియన్ కేబినెట్ లోని మహిళా మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఒలింపిక్స్ లో రాణించి దేశానికి పతకాలు సాధించిన మహిళా రెజ్లర్ల పట్ల మీరు ప్రవర్తించాల్సిన తీరిదేనా అని నిలదీస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను వదిలేసి రెజ్లర్లపై కేంద్రం దమనకాండ ప్రదర్శించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా.. రెజ్లర్ల ఆందోళనకు దేశ, విదేశాల నుంచి మద్దతు పెరుగుతుంటే.. కేంద్రం, పోలీసులూ మాత్రం బ్రిజ్ భూషణ్ ను వెనకేసుకురావడంలో పోటీ పడుతున్నారు. తాజాగా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవంటూ ట్వీట్ చేశారు. అలా ట్వీట్ చేసిన వెంటనే దానిని డిలీట్ చేశారు. ప్రజా వ్యతిరేకత, ఆగ్రహానికి దడిసి ఢిల్లీ పోలీసులు ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో పోలీసుల తీరును ఆ ట్వీట్ తేటతెల్లం చేసింది. రెజ్లర్ల ఆరోపణలను బలపరిచే సాక్ష్యాలేవీ లేకపోవడం వల్లే బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయలేదంటున్న పోలీసులు.. ఆయనపై నమోదైన కేసులో ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉందని మాత్రం అంగీకరిస్తున్నారు.   

తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు.. మోడీయే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల విషయమై గత ఏడాదిగా  ఏదో ఒక రూపంలో చర్చ సాగుతూనే ఉంది. కూటములు, సమీకరణాల విషయంలో విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికో, లేక సొంత క్యాడర్ ను అలర్ట్ గా ఉంచడానికో అధికార వైసీపీ అగ్రనాయకత్వమే ఈ చర్చను సజీవంగా ఉంచింది. ముందస్తు చర్చ వెనక్కు వెళ్లకుండా వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని తాజాగా ఉంచుతూ వచ్చారు. ఇప్పుడిక ఏపీ అసెంబ్లీ గడువు ముగియడానికి ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పుడు ముందస్తు ముచ్చట మళ్లీ బలంగా తెరమీదకు వచ్చింది. అయితే ఈ సారి ఇందులో ఎలాంటి వ్యూహం లేదు. మొత్తం ములిగిపోవడమో.. ముందస్తుతో అదృష్టాన్ని పరిశీలించకోవడమో తప్ప మరో దారి లేని పరిస్థితికి జగన్ సర్కార్ చేరిపోయింది. దీంతో ఈ సారి స్వయంగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికల విషయంలో సీనియస్ గా ఆలోచిస్తున్నారు. అందులో భాగమే ఈ నెల 7 కేబినెట్ భేటీ అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉండటమో, సంక్షేమ పథకాలు కొనసాగించలేని నిస్సహాయతో.. పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తో, జనంలో వ్యక్తమౌతున్న ఆగ్రహమో జగన్ సర్కార్ ముందస్తుకు తహతహలాడేందుకు కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి జగన్ సర్కార్ ముందస్తుకు వెళ్లడానికి తెరమీదకు వచ్చిన కారణం ప్రధాని మోడీ.   అవును ప్రధాని మోడీయే జగన్ ముందస్తుకు తొందరపడటానికి కారణమని అంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలన్న పట్టుదలతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ చేయగలిగినంతా చేసింది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోజుల తరబడి రాష్ట్రంలో క్యాంపు చేసి ప్రచారం చేశారు. ఎప్పడూ ఫ్రీబీస్ (ఉచితాలు) దేశానికి మంచివి కావు అంటూ  ప్రతి వేదికమీదా ఉద్ఘాటించే  మోడీ, కర్నాటక బీజేపీ ఎన్నికలలో గెలిస్తే ఇవి ఉచితం.. అవి ఉచితం అంటూ ఏకంగా మేనిఫెస్టోలోనే పొందుపరిచినా కిమ్మనలేదు. పైగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనతో విస్తృతంగా ప్రచారం చేసిన మోడీ స్వయంగా తన ప్రసంగాలలో వాటినే ప్రముఖంగా చెప్పారు. అవి చాలవనుకున్నారో ఏమో.. హిందుత్వ ఎజెండాను కూడా అన్ని భేషజాలూ వదిలేసి మరీ భుజానికెత్తుకున్నారు. ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేశారు. బజరంగ్ భళి నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీకి ఓటెసి బజరంగ్ నినాదం చేయడంని పిలుపు  నివ్వడానికి కూడా మోడీ వెనుకాడలేదు. అ యినా కర్నాటకలో బీజేపీకి పరాభవం తప్పలేదు. అంతే కాకుండా కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై యాంటీ ఇన్ కంబెన్సీ ప్రభావం తీవ్రంగా ఉందని పరిశీలకులు  సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభావం తగ్గుతోందనడానికి కర్నాటక ఫలితాలను చూపుతున్నారు. ఇక అన్నిటికీ మించి ఏపీలో బీజేపీ పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం ఏపీలో వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండగా ఉందన్న సంగతి ఏపీ ప్రజలలో బలంగా నాటుకుందంటున్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే.. అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే..ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న ఆగ్రహానికి మోడీ వ్యతిరేకత కూడా తోడై జమిలిగా మునిగిపోవడం ఖాయమని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి హస్తిన పర్యటన జగన్ ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి ఓకే చేయించుకున్నారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.   దీంతో మోడీ వ్యతిరేకత తన సర్కార్ పై పడకుండా ఉండాలంటూ సార్వత్రిక ఎన్నికల వరకూ వేచి చూడకుండా ముందస్తు ఎన్నికలకు వెడితేనే ఏదో ఒక మేరకు ప్రయోజనం ఉంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఈ నెలాఖరుకే కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచాయి. తెలంగాణలోనూ అధికారంలోకి  రాగలమనే విశ్వాసాన్ని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త, సునీల్ కనుగోలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తోండటంతో.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ కాంగ్రెస్ లో ఆశలు నెలకొన్నాయి. అంతే కాదు, అక్కడ పాటించిన పద్ధతిలోనే, అదే పంధాలో తెలంగాణలో అడుగులు వేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.  అందులో భాగంగా, ఎన్నికల వ్యూహ హకర్త సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్ధులను ముందుగానే ఖరారు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అభ్యర్దుల ఎంపికకు చివరి క్షణం వరకు వేచి చూసే పద్దతికి  స్వస్తి చెప్పిన హస్తం పార్టీ, తెలంగాణలోనూ  అదే పద్దతిని ఫాలో అవుతోందని అంటున్నారు. కనీసం సగం నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులోగా  దాదాపు 50 శాతం నియోజక వర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం, ఇప్పడు తాజాగా మరో సర్వే నిర్వహిస్తోందని, ఈ సర్వే ఫలితాలు వచ్చిన వెంటనే సర్వే రిపోర్టులను విశ్లేషించి 60 మంది అభ్యర్ధులతో తొలి జాబితా సిద్దమవుతుందని అంటున్నారు.  అయితే, అభ్యర్ధుల పేర్లను వెంటనే ప్రకటించకుండా, ఏంపికైన అభ్యర్ధులకు పచ్చ కార్డు  పంపుతారని అంటున్నారు. సర్వేలలో వచ్చిన ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల్లో గ్రాఫ్ తక్కువగా ఉన్న నేతలను వేరే నియోజకవర్గాలకు మార్చుతారు. కర్ణాటకలో ఇదే ప్లాన్‌ను అమలు చేసి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తోంది. సునీల్ కనుగోలు టీమ్‌తో పాటు ఇతర ఇండిపెండెంట్ ఏజెన్సీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను మార్చే అవకాశముందని అంటున్నారు.  ఓ వంక అభ్యర్ధుల ఎంపిక కసరత్తు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మరో వంక కర్ణాటక తరహాలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సిద్ద చేస్తునట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా,  తెలంగాణ ఇచ్చిన అమ్మ  సోనియమ్మ  అనే నినాదంతో ప్రచారాన్ని పాజిటివ్ నోట్  తో ప్రారంభించేందుకు ప్రచార సామాగ్రిని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్ణాటక ఎన్నికల్లో పెద్దగా ప్రచారంలో పాల్గొనని సోనియా గాంధీ తెలంగాణలో కొంత విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ,  ప్రియాంకా వాద్రా తెలంగాణలో మరింత విస్తృతంగా పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలలో ఒకరైనా ప్రతీనెలా రాష్ట్ర పర్యటనకు వచ్చేలా ప్లాన్ చేస్తోన్నారని అంటున్నారు.. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నాయకులు రాష్టంలో విస్తృతంగా పర్యటించేందుకు  ప్రణాళికలు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, టీ కాంగ్రెస్  ను రేసులోకి తీసుకు వచ్చింది. అంతే కాదు, బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి కమలం కాదు, కాంగ్రెస్  పార్టీనే అని , బీజేపీ నాయకులే బహిరంగంగా ఒప్పు కుంటున్నారంటే... ఒక్క గెలుపుతో హస్త రేఖలు ఎలా మరిపొయాయో ..అర్థం చేసుకోవచ్చు.

పొగరాయుళ్లకు శిక్షలు కాగితాలకేనా? 

ఇకపై ఓటీటీలో ప్రసారమయ్యే వాటికి పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కంపల్సరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది కానీ అమలు చేయించడంలో మాత్రం పాలకులు చిత్తశుద్ది ప్రదర్శించాల్సి ఉంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం సినిమా థియేటర్ స్లైడ్స్ లో ప్రచారం చేస్తుంది. తాజాగా పాలకులు ఇటువంటి ప్రచారాలను ఒటీటీ ప్రసారాల్లో కూడా చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడంలో తప్పు లేదు. కానీ పాలకులు గతంలో చేసిన ఉత్తర్వులను అమలు చేయిస్తున్నారా? లేదా అనేది శేష ప్రశ్నగానే మిగులుతుంది. థియేటర్ స్లైడ్స్ లో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెలపై ఉన్న మాదిరిగానే ఒటీటీ ప్రసారాల్లో ఉంటుంది తప్పితే అమలు చేయించే బాధ్యత పాలకులపై ఉండటం లేదు. అదే థియేటర్  ప్రాంగణంలోనే ఇంటర్వెల్ లో పొగలు కక్కే సిగరెట్లను ఊదేసేవారు ఎక్కువగా  ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగుట నిషేధం అని మన చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయించే బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. జైలు శిక్ష విధించే అధికారం చట్టాల్లో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ది లోపించినట్లయ్యింది. ఇవ్వాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని తద్దినం మాదిరిగా జరుపుకునే వారే సమాజంలో ఎక్కువయ్యారు. 

అవినాష్ కు బెయిలు.. జగన్ కు నోటీసులా?

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ బుధవారం ( మే 31) తుది తీర్పు ఇచ్చేసింది. అయితే బెయిలు వచ్చినంత మాత్రాన సంతోషించడానికి అవినాష్ రెడ్డికి పెద్దగా మిగిలిందేమీ లేదు. ప్రతి వారం విచారణకు హాజరు కావాల్సిందే. సీబీఐ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే. అయితే ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించడానికి ముందు జరిగిన హైడ్రామా కారణంగా బెయిలు లభిస్తే చాలు  అవినాష్ రెడ్డి గెలిచేసినట్లే  అన్న వాతావరణం క్రియేట్ అయ్యింది. అయితే అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ  హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో అవినాష్ నే కాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విచారించాల్సి ఉంటుందని విస్పష్టంగా పేర్కొంది. పకడ్బందీగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల పేర్లను ప్రస్తావించి.. అవినాష్ కు తప్పించుకునే అవకాశం లేకుండా చక్రబంధంలో ఇరికించింది. ప్రభావ వంతమైన వ్యక్తి అనీ, రాజకీయ కోణంలో జరిగిన వివేకా హత్య లో అవినాష్ ప్రమేయం ఉందని విస్పష్టంగా చెప్పింది. అలాగే వివేకా హత్య విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలుసునని పేర్కొంది. ఆ సమాచారాన్నిఆయనకు అవినాష్ రెడ్డే చేరవేశారని కూడా సీబీఐ అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   అంతే కాకుండా వివేకా హత్య వెనుక కుట్ర ఉందనీ, తమ దర్యాప్తులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హత్య విషయం ప్రపంచానికి ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించడానికి ముందే తెలుసుననీ సీబీఐ పేర్కొంది.  హత్య విషయాన్ని ఎంవీ కృష్ణారెడ్డి 2019 మార్చి 15 ఉదయం 6.15 గంటలకు వెల్లడిస్తే జగన్ మోహన్ రెడ్డికి మాత్రం హత్య విషయం అంతకంటే ముందే తెలిసిందనీ సీబీఐ పేర్కొంది. అలాగే హత్యకు ముందు, తరువాత కూడా అవినాష్ రెడ్డి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నట్లు తేలిందనీ, ఆయనే జగన్ మోహన్ రెడ్డికి వివేకా హత్య విషయం చెప్పి ఉంటారనీ, ఆవిషయాన్ని ఆయనను విచారించి తేల్చుకోవాలని, ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డిని కూడా విచారించాల్సి ఉంటుందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుంటే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు రావడమన్నది చాలా చిన్న విషయమనీ, వివేకా హత్య కేసులో లాజికల్ ఎండ్ కు చేరే దిశగా సీబీఐ దర్యాప్తు చాలా పకడ్బందీగా ఉందనీ నిపుణులు అంటున్నారు. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను బట్టి ఇక నుంచి ప్రతి శనివారం అవినాష్ సీబీఐ విచారణలో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, ఎక్కువ కాలం విచారణకు సహకరించకుండా ఉండే  అవకాశం ఉండదనీ అంటున్నారు. ఒక వేళ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించకుంటే సీబీఐ ఆయన బెయిలు రద్దు కోసం కోర్టును ఆశ్రయించి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. 

మరో ‘మహా ’ సంక్షోభం ?

మహారాష్ట్రలో రాజకీయం మరో మారు వేడెక్కింది. గతేడాది ఇదే జూన్ నెలలో  అప్పటి అధికార కూటమి మహా వికాస్ అఘాడి లో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మూడు పార్టీల కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేన నిట్టనిలువునా చీలి పోవడంతో ఏర్పడిన సంక్షోభం చివరకు కూటమి సర్కార్  కూలి బీజేపీ, శివసేన చీలిక వర్గం ( షిండే వర్గం) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీసింది. శివసేన చీలిక వర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫన్డవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నెల రోజులకు పైగా సాగిన మహా సంక్షోభం గత సంవత్సరం జూన్ 30 న ముగిసింది.   అయితే సంక్షోభం మూగిసి సంవత్సరం దాటినా మహా రాజకీయాల్లో వేడి మాత్రం తరచూ తెరపైకి వస్తూనే వుంది. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్  పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి  ఉప సంహరించుకున్న ఎపిసోడ్ ముగిసిన కొద్ది రోజులకే, మరో మహా రాజకీయం తెరపై కొచ్చింది. శివసేన చీలిక వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారంతా మాతృ సంస్థకు తిరిగోస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ వినాయక్ రౌత్ పేర్కొన్నారు. అలాగే, 13 మంది ఎంపీల్లో 9 మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన బాంబు పేల్చారు.  షిండే సేనలోని ఎంపీలు కూడా తమ పనులు జరగడం లేదని,  తమను ధిక్కరిస్తున్నారని కలత చెందారని రౌత్ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ తమ పట్ల బీజేపీ సవతి తల్లిగా వ్యవహరిస్తోందని షిండే గ్రూపు ఎంపీ గజానన్ కీర్తికర్ అసమ్మతి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర మంత్రి శంభురాజే దేశాయ్ 15 రోజుల కిందట ఉద్ధవ్ ఠాక్రేకు ఒక సందేశం పంపారని, వారు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే దాని గురించి మాట్లాడారని రౌత్ చెప్పారు. కేవలం దేశాయ్ మాత్రమే కాదు తానాజీ సావంత్, గజానన్ కీర్తికర్ తమ అసంతృప్తి వెళ్లగక్కారని గుర్తు చేశారు. షిండే సేన తన మిత్రపక్షమైన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలపై కలవరపడుతోందని వ్యాఖ్యానించారు. అయితే  దీనిపై స్పందించిన దేశాయ్.. తాను ఉద్ధవ్‌కు ఎటువంటి మెసేజ్ పెట్టలేదన్నారు. రౌత్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు.  వినాయక్ రౌత్ వ్యాఖ్యలపై రెండు రోజుల సమయం ఇస్తున్నా.. రౌత్ తన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.. పరువు నష్టం నోటీసులు పంపుతాను  అని మంత్రి స్పష్టం చేశారు. అయితే, మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు  దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

కేసినేని నానికి వైసీపీ గాలం..?

క్రికెట్ లో ఎవరు విజేతలు అవుతారో..  రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో  చెప్పడం జూదంలాంటిదేనని అంటారు.  అంచనాలు ఒక్కొక్కసారి నిజమవుతాయి..మరోసారి ఫెయిల్ అవు తాయి. మరీ ముఖ్యంగా రాజకీయాలలో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. అంటే రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని అర్ధం. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీని వైసీపీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని అధికార పార్టీ రాజ్యసభ  సభ్యుడు అయోధ్య రామిరెడ్డి  వ్యాఖ్యలతో తెలుగుదేశం వైసీపీ పార్టీల్లో కలకలం రేగింది.   అసలు కేశినేని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారన్న చర్చ కూడా ఎక్కడా జరగడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పట్ల కించింత్ అసంతృప్తితో ఉన్నారన్నది తెలిసిందే. ఆ ఈసంతృప్తితో కేశినేని నాని ఒక వేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినా  వైసీపీ లో చేరుతారని ఎవరూ కూడా ఊహామాత్రంగానే  భావించలేదు. దీంతో  అయోధ్య రామిరెడ్డి కేశినేని నానిని వైసీపీలోకి ఆహ్వానిస్తాం అనడం కేవలం తెలుగుదేశం, వైసీపీలలోనే కాదు అందరిలోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.   2019-20 ల కాలంలో... కేశినేని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరుతారనే ప్రచారం జరిగింది. దాన్ని ఆయన ఖండించారు కూడా. అప్పటి నుంచి పార్టీ మారే విషయంలో ఎంపీ పై ఎలాంటి వార్తలు లేవు. అయితే  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తో ఎంపీ కి మంచి సంబంధాలు లేవన్నది వాస్తవం. ఎందుకంటే ఎంపీ ఏ రోజు ఎలా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఎంపీని బలంగా వ్యాతిరేకిస్తున్న బోండా ఉమ,  బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, జలీల్ ఖాన్ లాంటి నేతలను చంద్రబాబు కట్టడి చేయటం లేదు. ఇదే సమయంలో ఎంపీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అంటే ఈ  రెండువర్గాల్లోని  నేతలు ఎవరికి  వ్యతిరేకంగా ఎవరు ఫిర్యాదు  చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. ఎందుకంటే విజయవాడ లో ఈ రెండు వర్గాల నేతలూ పార్టీకి అవసరమే. వీళ్ళ మధ్య పంచాయితీల పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంతో చంద్రబాబు కూడా వీళ్ళని అలా వదిలేశారని భావించాలి. అయితే రాజకీయ పరిణామాల్లో ముందు జాగ్రత్తగా కేశినేని తమ్ముడు కేశినేని శివధర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారనే  ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే అది  కేవలం ప్రచారమే అని కేశినాని నాని పట్టించుకోకుండా వదిలేయడానికి వీల్లేకుండా, నిదర్శనాలు కూడా కనిపిస్తున్నాయి.   ఈ పరిణామాల నేపథ్యంలోనూ  కేశినేని నాని అధికార పార్టీ కి చెందిన వారితో సఖ్యతగా ఉంటున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే  మొండితోక జగన్మోహన్ రావుతో  సన్నిహితంగా మెలుగుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పిలిస్తే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని పార్టీలో కి వస్తే ఆహ్వానిస్తామని అయోధ్య రామిరెడ్డి  చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.   గత రెండు ఎన్నికలలోనూ విజయవాడ పార్లమెంటు స్థానంలో వైసీపీ పరాజయం పాలైంది. కాబట్టి సహజంగానే  బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ గాలిస్తోంది. ఆ బలమైన అభ్యర్థి ఆ పార్టీకి కేశినేని నాని రూపంలో లభించాడని అయోధ్యరామిరెడ్డి వ్యాఖ్యలు చెబుతున్నాయి. దీనిని బట్టి   కేశినేని తొందరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

 మజ్లిస్ కు వోటేస్తాం, బిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాం

పాతబస్తీ వోటర్లు విభిన్న శైలి. ఇక్కడి ముస్లింలు వోటు వేసేది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేసేది మాత్రం బిఆర్ఎస్ కు. పాతబస్తీలో ఈ రెండు పార్టీలు తప్పితే మరే ఇతర పార్టీలు పాతబస్తీలో కనీసం కాలు పెట్టజాలవు. ఇది బిజెపికి మింగుడుపడడం లేదు. మజ్లిస్ టార్గెట్ గా బిజెపి ఇవ్వాళ ఆరోపణలు చేసింది.  ​ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. దారుస్సలాంలో కూర్చొని మాట్లాడడం కాదు.. దమ్ముంటే ఎంఐఎం రాష్ట్రమంతటా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ను సంకలేసుకొని వస్తారో.. కాంగ్రెస్ సహా గుంట నక్కలా పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దామని కౌంటర్ వేశారు బండి. ప్రస్తుతం బిఆర్ఎస్ మిత్ర పక్షాలలో మజ్లిస్ పార్టీకి తప్పితే మరో పార్టీకి స్థానం లేదు. బిఆర్ఎస్ కంటే ముందు మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. బిజెపితో ఉన్న శత్రుత్వంతో మజ్లిస్ అప్పట్లో  కాంగ్రెస్ తో జత కట్టింది. కాంగ్రెస్ మాత్రమే సెక్యులర్ పార్టీ అని ఓవైసీ కితాబిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి  సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ హాయం నుంచి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదు కూలి పోయింది. బిజెపి, సంఘ్ పరివార్ ను దూషించిన మజ్లిస్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దోషిగా నిలబెట్టలేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీకి ఊపిరిపోశారు. మజ్లిస్ కోరిక మేరకు పాతబస్తీలో పునర్ విభజన చేపట్టారు. ఈ పునర్ విభజనతో పాత బస్తీలో మెజారిటీ సీట్లు మజ్లిస్ దక్కించుకుంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. అదే సాంప్రదాయాన్ని బిఆర్ఎస్ కొనసాగిస్తుంది. పాత బస్తీలో మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు బలమైన వారు లేకపోవడంతో బిఆర్ఎస్ అధికారంలో వచ్చిన రెండు పర్యాయాలు మజ్లిస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. షాదీ ముబారక్ వంటి స్కీంతో పేద ముస్లి అమ్మాయిలు లక్షలాది మందికి పెళ్ళిళ్లు జరుగుతున్నాయని గాజిబండకు చెందిన హజ్మత్ భాయ్ అంటున్నారు. బిఆర్ఎస్ ను పాతబస్తీ వాసులు ఓన్ చేసుకుంటున్నారు. 

అలాంటి వీడియోలతో ఆత్మహత్యలు పెరుగుతాయి

హైద్రాబాద్ లో సెల్ఫీ సుసుడ్ కలకలం రేపింది. జగిత్యాల జిల్లాకు చెందిన హీరో షోరూం యజమాని నరేష్ హైదరాబాద్ లో  ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు నరేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు వివరించారు. వ్యాపారంలో నష్టం రావడానికి తనే కారణమని ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో అప్పటికే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఈ వీడియోలు ప్రేరణ ఇస్తాయని సైకియాట్రిస్ట్ లు అంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలో మెడికో ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు వైరల్  అవడం వల్ల  మనస్థాపంతో మెడికో ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు వచ్చి ఆ మెడికోను గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో మెడికో తీవ్ర మనస్థాపానికి గురైంది. పరువు పోయింది నేను బతకడం అనవసరం అనుకుంది ఆ మెడికో. వెంటనే ఆత్మహత్య చేసుకుంది.  అదే రోజు నుంచి తెలంగాణలో కొందరు అమ్మాయిలు  ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా చేసుకోవడం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులకు శిక్షలు ఉంటాయి.  ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాగానే ఇతర సబ్జెక్టు మీద మనసును డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలను నిరోధించవచ్చని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు. యూట్యూబ్ లలో ఇలాంటి వీడియోలు వెంటనే డిలీట్ అయ్యే టెక్నాలజీ ప్రవేశ పెడితే కొంతవరకు ఆత్మహత్యలను నిరోధించవచ్చని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. 

అవినాష్ కు ముందస్తు బెయిలు.. షరతులు వర్తిస్తాయి!

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిలు లభించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదనీ, అలాగే ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా  చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఇలా ఉండగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో గత శుక్ర, శనివారాలలో సుదీర్ఘ వాదలను జరిగాయి. ఆ సందర్భంగా సీబీఐ  తన కౌంటర్ అఫిడవిట్ లో తొలి సారిగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించింది. అవినాష్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అనంతరం కోర్టు అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం దృష్ట్యా బుధవారం (మే 31) వరకూ అరెస్టు చేయద్దని ఆదేశిస్తూ ముందస్తు బెయిలుపై తన నిర్ణయాన్ని అదే రోజు వెలువరిస్తామని పేర్కొంది. ఈ రోజు ఉదయం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ కు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వెకేషన్ బెంచ్  ఉత్తర్వులపై సీబీఐ, వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని అంటున్నారు.   ఇలా ఉండగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు లభించడంపై న్యాయ నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా అవినాష్ రెడ్డిపై ఉన్న ఆరోపణలనే ఎదుర్కొంటున్న ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఇంత కాలం అవినాష్ ను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందస్తు బెయిలు విషయంలో  తెలంగాణ హై కోర్టు, సుప్రీం కోర్టూ కూడా ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా, అరెస్టు చేయకుండా ఎటువంటి ఆదేశాలూ ఇవ్వకపోయినా సీబీఐ ఆయనను అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. సీబీఐ అవినాష్ కు అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలనూ ఇచ్చిందనీ అంటున్నారు. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పుకు భిన్నమైన ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. హైకోర్టు కూడా తన విచారణలో సీబీఐ తప్పులనే ఎత్తి చూపిందని, అవినాష్ పోన్ ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదనీ ప్రశ్నించింది. మొత్తం మీద అవినాష్ కు ముందస్తు బెయిలు విషయంలో సీబీఐ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడిందంటున్నారు. 

జగన్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత?!

ఒక వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఎందుకు అని ప్రశ్నిస్తారు. ఆ బ్లాక్ కమెండోల భద్రతే లేకపోతే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవారని హెచ్చరిస్తారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ఐసీఎస్  వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రానికి లేఖ రాశారు.  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి భద్రతకు ముప్పు అధికార వైసీపీ మూకల నుంచే ఉందని కళ్లెదుటే కనిపిస్తుండగా తమ్మినేని సీతారాం భద్రత తీసేయమని ఏపీ స్పీకర్ హోదాలో కేంద్రానికి సిఫారసు చేస్తానని వైసీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఇక ఐసీఎస్ వంటి ఉగ్రసంస్థల నుంచి ఎవరికైనా ముప్పు ఉంటే అది ముందుగా తెలిసేది కేంద్ర నిఘా సంస్థలకే కానీ ఏపీ ఇంటెలిజెన్స్ కు కాదు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల కదలికల గురించి తెలుసుకునేందుకు కేంద్ర నిఘా సంస్థలకు పటిష్టమైన అత్యున్నతమైన వ్యవస్థ ఉంది. ఆ నిఘా సంస్థల ద్వారానే రాష్ట్రాలకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థల కదలికలకు సంబంధించిన సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటిది జగన్ కు ఐసీఎస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ.. కేంద్ర నిఘా సంస్థలకు కూడా తెలియని సమాచారాన్ని ఏపీ ఇంటెలిజెన్స్  కనిపెట్టేసి  జగన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరింది.  అదే సమయంలో రాష్ట్రంలో పరిస్థితి చూస్తే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఆల్రెడీ ఉన్న  విపక్ష నేత నారా చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా అధికార పార్టీ మూకలు దాడులకు సంబంధించి సమాచారం మాత్రం ఏపీ ఇంటెలిజెన్స్ కు అందదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి గురించి కానీ, కుప్పం, నందిగామ, అనపర్తి సంఘటనలకు సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో నిఘా వైఫల్యాల గురించి పట్టించుకోని ఏపీ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ ఉగ్రవాదుల అనుపానులు గమనించి ఏపీ ముఖ్యమంత్రికి ఐసీఎస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ ఆయన భద్రత రాష్ట్ర పోలీసుల వల్ల కాదు కనుక జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరడం విడ్డూరంగా ఉంది.   ముఖ్యమంత్రిగా జగన్ కు ఇప్పుడు ఉన్న భద్రత కారణంగా కిలోమీటర్ వరకూ ఆయన అనుమతించిన వారు తప్ప  ఇతరులు ఉండే అవకాశం లేదు.  అత్యున్నత స్థాయి ముప్పు ఉందని నివేదికలు ఉంటేనే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు.  సీఎంలలో యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ లకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇతర బీజేపీ సీఎంలకూ ఆ స్థాయి భద్రత లేదు.

ఆదరణ లేక కళ తప్పిన ఆర్ట్స్ కోర్సులు

ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవలి కాలంలో ఆర్ట్స్ కోర్సులలో చేరే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. పడిపోతోంది. ఇంటర్ లో ఆర్ట్స్ చదివే విద్యార్థులు తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో 2% మంది మాత్రమే ఉన్నట్లు కేంద్ర విద్యా శాఖ ఇటీవల తెలిపింది. వివిధ రాష్ట్రాల సెకండరీ, హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్షల్లో పాసైన విద్యార్థుల నిష్పత్తిని వివరిస్తూ విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. త్రిపురలో 85%, గుజరాత్లో 82%, ఈశాన్య రాష్ట్రాల్లో 75% మంది విద్యార్థులు ఆర్ట్స్ కోర్సులు చదువుతున్నారు. సైన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ (76% ), తెలంగాణ(65%), తమిళనాడు (62%)లలో అత్య ధికంగా ఉన్నారు. కర్ణాటకలో కామర్స్ కోర్సును అత్యధి కంగా 37% మంది ఎంచుకున్నారు. పదేళ్లుగా దేశవ్యాప్తంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులు బాగా ప్రజాదరణ పొందున్నాయి. ఈ రెండు కోర్సుల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య 2012లో 31శాతం ఉండగా 2022 నాటికి 40శాతానికి పెరిగింది. ఇదే సమయంలో కామర్స్ చేసే విద్యార్థుల సంఖ్య పదేళ్లుగా 14% కే పరిమిత మైంది. అన్ని కేటగిరీ విద్యార్థుల్లో 42% సైన్స్, 40% ఆర్ట్స్, 14% కామర్స్, 3% ఇతర కోర్సులు తీసుకుం టున్నారు. ఇక... అన్ని కేటగిరీ బాలికల్లో 46% ఆర్ట్స్, 38% సైన్స్, 14% కామర్స్, 2% ఇతర కోర్సు లను ఎంచుకుంటున్నారని కేంద్ర విద్యా శాఖ వివరిస్తోంది.   ఓ వైపు ఎన్సీఈఆర్టీ .. చరిత్రలో ప్రముఖుల జీవిత చరిత్రలను, విజ్ఞాన సంబంధిత పాఠాలను తీసివేస్తోంది. మరో వైపు.. వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి భారీగా తగ్గిపోతుంది. వర్తమానం, భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి చరిత్ర దోహదపడుతుంది. ఆర్ట్స్ పై అయిష్టత .. రాబోవు తరానికి ఓ పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, విద్యా శాఖ ..ఆర్ట్స్ పై విద్యార్థులకు అవగాహన, ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సీపీఎస్ రద్దు హామీకి తూట్లు.. అదేమంటే నేరమా..?

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ధర్మా చౌక్ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు హామీకి ఇప్పటి వరకూ అతీ గతీ లేదని, కేంద్ర ప్రభుత్వం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయడం లేదని వారంటున్నారు. ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ ఇస్తామని ప్రకటించారని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు అంటున్నారు. రాబోయే రోజులన్నీ.. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులదేనని, ఉద్యమం చేయడం వల్లే మళ్లీ అవినీతి నిరోధక శాఖ దాడులు మొదలయ్యాయని చెప్పుకొస్తున్నారు. ఇలా దాడులు చేస్తూ... ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, చట్టబద్దంగా రావాల్సి వాటిని మాత్రమే తాము అడుగుతున్నామని, ఇది నేరమా అని వారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఉద్యమం ఆగాలంటే డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదని, ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత   అంటున్నారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ వాదనే వినిపిస్తున్నారని... బొప్పరాజు గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, డీఏలు అవసరం లేదా అని అడిగారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి చెప్పినవన్నీ ప్రభుత్వం చెప్పినట్లుగానే తాను భావిస్తున్నారని.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనపై ఇటీవలే ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణం అని విమర్శించారు. ఇటీవలే కాకినాడలో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఏ నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పడుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రతీ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చినా కూడా..ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని వారు చెందుతున్న ఆవేదనకు ఏపీ ప్రభుత్వం దిగి వస్తుందా? రానున్న రోజుల్లో ఉద్యోగుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. 

ఫినిష్ చేసేస్తారా? ప్రజాస్వామ్యమా? అరాచకమా?

ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది... అలాంటి వేళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం   అమదాలవలసలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఆయన ఫినిష్ అయిపోతారని, వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన  మాట్లాడుతున్నారంటూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎవరిని ఉద్దరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత అంటూ ప్రశ్నించారు. ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఉపసంహరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని కూడా తమ్మినేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిలో ఉండి  తమ్మినేని సీతారాం ఇలా మాట్లాడడం... దేనికి సంకేతమని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటువంటి వ్యాఖ్యలు జగన్ పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు.. అంటే మాజీ మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, అలాగే ప్రస్తుత మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా లాంటి వాళ్లు చేస్తే.. రోటిన్ అనుకోవచ్చు. కానీ తమ్మినేని సీతారాం చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇంకోవైపు వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలూ, శ్రేణులే అంగీకరిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు.. వెళ్తున్నారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. అలాగే గతే ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడు సక్సెస్ అయిందని. అదేవిధంగా ఈ ఏడాది రాజమహేంద్రవరం వేదికగా తాజాగా నిర్వహించిన మహానాడు సైతం సూపర్ డూపర్‌ సక్సెస్ అయింది. తెలుగుదేశం కార్యక్రమాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.   ఇక గతంలో చంద్రబాబు నివాసంపైకి మంది మార్బలంతో అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వెళ్లడం.. అలాగే జగ్గయ్యపేట పర్యటనలో ఉన్న చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగడం... ఆ సమయంలో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు కావడం.. ఒక కమెండోకు నిజమైన కుట్లు పడటం తెలిసిందేప. ఇక కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబును అడ్డగించడం.. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే గతేడాది డిసెంబర్ చివరలో చంద్రబాబు రోడ్డు షో సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది విగత జీవులు కాగా. ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే గుంటురులో చంద్రన్న కానుక పంపిణి సందర్బంగా జరిగిన తోపులాటలో పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ (1) తీసుకు వచ్చింది. సదరు జీవోపై ప్రతిపక్షాలను అణగదొక్కేందుకేనంటూ విపక్షాలు సైతం నిరసన వ్యక్తం చేశాయి.ఆ జీవోను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.   గతంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపైన.. అలాగే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపైన అధికార పార్టీ శ్రేణులు దాడి చేస్తుంటే...రక్షక భట వర్గం ప్రేక్షక పాత్ర వహించడం వినా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటం. రాష్ట్రంలో నెలకొన్న అరాచకత్వానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతోన్నాయి. అందుకు పార్టీ అధికార ప్రతినిధి కె. పట్టాబి అంశమే ఓ ఉదాహరణగా ,చెప్పవచ్చు.   మరోవైపు అధికారం అందుకోవడం కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై ఎయిర్ పోర్ట్ వేదికగా కోడికత్తి దాడి ఎపిసోడ్ చోటుచేసుకోవడం... అలాగే వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్య కావింప బడడం.. సదరు కేసులన్నీ కాలం గడుస్తున్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థల చేతి లో భద్రంగానే ఉన్నాయని వారు వివరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలకు పోలీసులు సాక్షీభూతంగా నిలుస్తున్నారు.. తప్ప వాటిని నియంత్రించే పనిని వారు చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు చంద్రబాబు భద్రతపై ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయనీ, అటువంటి వ్యాఖ్యలు చేసిన తమ్మినేనికి ఒక్క క్షణం కూడా స్పీకర్ గా కొనసాగే అర్హత లేదనీ తెలుగుదేశం శ్రేణులే కాదు, రాజకీయ పండితులు, న్యాయ నిపుణులు సైతం అంటున్నారు. 

ఎవరీ దర్షిత్

అలా వచ్చాడు.. ఇలా స్టేజ్ ఎక్కాడు.. చెప్పాల్సింది.. కట్టె కొట్టే తెచ్చే తరహాలో నాలుగు ముక్కల్లో నలగ్గొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే.. స్ప్రైట్ తాగినట్లు ఎక్కడ సుత్తి లేకుండా.. చాలా నేర్పుగా... నేరుగా చెప్పేశాడు.. దటీజ్ పోట్లూరి దర్షిత్. అతిరథ మహారధులు పాల్గొన్న రాజమహేంద్రవరం మహానాడులో నూనుగూ మీసాల  యువకుడు దర్షిత్ జగన్ నాలుగేళ్ల పాలన గుట్టును జస్ట్ 4 నిమిషాల 44 సెకన్లల్లో విప్పేశాడు. అతగాడి వాగ్దాటికి.. వేదికపై ఉన్న సీనియర్లే కాదు.. ఈ మహానాడుకు విచ్చేసిన వారు సైతం ముగ్దులయ్యారు. దీంతో మహానాడులో దర్షిత్ వజ్రంలా మెరిశాడు. అయితే ఇంతకీ ఈ దర్షిత్ ఎవరు,  ఏం చేస్తుంటాడంటూ నెటిజన్లు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.  పోట్లూరి దర్షిత్. స్వస్థలం విజయవాడ. బాల్యం నుంచి విద్యాభ్యాసమంతా విజయవాడలోనే జరిగింది. ప్రస్తుతం స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోన్నారు. 2015లో దర్షిత్ వయస్సు 11 ఏళ్లు... అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ క్రమంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టగా.. దర్షిత్... తాను దాచుకొన్న 2 వేల రూపాయిల నగదును సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. అలా పోట్లూరి దర్షిత్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.   రాజధాని, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహాన ఉన్న పోట్లూరి దర్షిత్.. 2019 ఎన్నికల వేళ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 10 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు మాత్రం జగన్ పార్టీకి పట్టం కట్టారు. అయితే అదే ఏడాది అంటే 2019 డిసెంబర్ 17న రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రకటన చేయడంతో.. రాజధాని ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు డిసెంబర్ 18 నుంచి ఆందోళన బాట చేపట్టారు.  ఆ క్రమంలో ఆందోళనకు దిగిన రైతులపై జగన్ ప్రభుత్వం   పోలీసులను  ప్రయోగించింది. అణచివేతకు గురిచేసింది. అమరావతి స్టూడెంట్ కో-ఆర్డినేషన్ సైతం ఈ ఆందోళనలో భాగస్వామ్యం అయింది. దీంతో మైనర్‌ దర్షిత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడమే కాకుండా.. అతడిని గృహనిర్భంధం చేశారు. దాంతో దర్షిత్‌పై పోలీసుల ఆమానుష చర్యను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు దర్షిత్ స్వయంగా రెండు పేజీల లేఖ రాశారు. తెలుగులో.. ఆ లేఖలో సారాంశం, రాసిన తీరు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను ఆకట్టుకుంది. దర్షిత్ లేఖకు జవాబు రాశారు. అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టి ఆయన తొలిసారి.. తన సొంత ఊరుకు వస్తున్నానని.. ఈ సందర్భంగా వచ్చి తనను కలవాలంటూ సందేశం పంపగా.. జస్టిస్ ఎన్. వి. రమణను  దర్షిత్ కలిశారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును సైతం దర్షిత్ కలిశారు. దర్షిత్ వాగ్దాటి, ఆలోచన తీరు, రాష్ట్ర పరిస్థితులపై అతి చిన్న వయస్సులోనే అంతగా అవగాహన ఉండడం పట్ల వెంకయ్యనాయుడు శుభాశీస్సులు  అందుకున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనపై చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదిగాక ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు శ్రమిస్తున్నాడు దర్షిత్.   ఇక పోట్లూరి దర్షిత్‌లోని దీక్ష, పట్టుదల, ఆలోచన సరళి, ప్రజా సమస్యలపై పోరాడే గుణం, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నించే తత్వం   చూసి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అచ్చెరువొందారు.  దీంతో 2021లో టీడీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధిగా దర్షిత్‌ని నియమించారు.  అయితే జగన్ ప్రభుత్వంలో అదీ  తొలి కేబినెట్‌లో మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్‌ వగైరా వగైరా.. మలి కేబినెట్‌లో మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా లాగా తొడలు కొట్టలేదు.. మీసాలు మెలేయ లేదు.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పచ్చి బూతులు మాట్లాడలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, ప్రజలు పడుతోన్న ఇబ్బందులపైన కనీస అవగాహన లేని వీరి వల్ల.. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్... మరింత నష్టపోతుందనే భావన ప్రజల్లో నిగూఢంగా ఉంది.  అయితే వయస్సులో చాలా చిన్నవాడైన దర్శిత్‌ ఆలోచన సరళి, అతడి మాట్లాడే విధానం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదన్నది సుస్పష్టం. మరోవైపు జగన్ అధికారలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని చేసిన ప్రతీ విమర్శకు.. అంతే ఇదిగా.. చాలా పద్దతిగా కౌంటర్ ఇచ్చిన ఒకే ఒక్కడీ దర్షిత్. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియలో సైతం ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.