జర భద్రం.. ఇది రోహిణి కార్తె!
posted on May 24, 2023 @ 4:13PM
వేసవి కాలం.. అదీ రోహిణి కార్తెలో కాచే ఎండలకు రోళ్లు సైతం పగిలిపోతాయంటారు. సంక్రాంతి వెళ్లిన తర్వాత శివరాత్రి మహా పర్వదినంతో అప్పటి వరకు పులిలా పంజా విసిరిన చలికి చెక్ పడి పోతుంది. ఆ తర్వాత నుంచి భానుడు.. తన భగ భగలను రోజు రోజుకు కొద్ది కొద్దిగా డోస్ పెంచుకొంటూ పోతాడు. మామూలుగా ఎండా కాలం.. అంటేనే మండే కాలం.. ఆ కాలంలో వేడిని తట్టుకోవడం ఆ సూర్యభగవానుడికి తప్పించి.. మానవ మాత్రులకు సాధ్యం కాదన్న సంగతి అందరికీ అనుభవైకవైద్యమే. అన్నిటికంటే ముఖ్యంగా వేసవి కాలం చివరి పక్షం రోజుల్లో.. అంటే రోహిణికార్తెలో సూర్యప్రతాపం తారస్థాయికి చేరుతుంది.
ప్రచండ భానుడి విజృంభణ మామూలుగా ఉండదు. వేసవి కాలం ముగిసి.. వర్షా కాలం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రభాకరుడు ప్లస్ దివాకరుడు అయిన ప్రత్యక్ష నారాయణుడు తన ప్రతాపాన్ని వేడిమి రూపంలో ప్రదర్శించి వెళ్లిపోతాడు. ప్రతి ఏడాది మే చివరి వారంలో ఈ రోహిణి కార్తె ప్రారంభమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సైతం మే 25వ తేదీ అంటే గురువారం ప్రారంభమై... జూన్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే ఈ పక్షం రోజులూ... వేడి గాలులు అధికం కావడం.. ఎండలు ప్రచండంగా కాయడం.. ఉక్కపోతలు.. దాహార్తి, వడదెబ్బలు, మరణాలు.. సంభవిస్తాయి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. ఇంటి పట్టునే ఉండాలి.. అత్యవసరమైతే తప్ప.. బయటకు రాకూడదు. అలాగే మట్టి కుండలోని నీటినే తాగాలి. మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, ఎలక్ట్రాల్ పౌడర్ వంటివి విరివిగా తీసుకోవాలి.
ఇక వేసవి కాలంలో మసాలా దట్టించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు, పచ్చళ్ళుతోపాటు అయిల్‌లో రంగరించి వండిన ఆహార పదార్ధాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ప్రతి ఒక్కరికీ శ్రేయస్కరం. ఇక ఈ రోహిణి కార్తెలో ప్రతి ఒక్కరు తప్పకుండా రెండు పూటలా స్నానం చేయాలి. అలాగే అందరు కాటన్ వస్త్రాలు.. అవి కూడా తెల్లని రంగుతోపాటు తేలికపాటి రంగులు కలిగిన వాటినే ధరిస్తే వేడి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే శారీరక వేడి సైతం తగ్గుతుంది. మరోవైపు మనం నివసించే ఇళ్లలోనే కాదు.. మన వీధుల్లో సైతం మొక్కలు నాటి.. వాటి ద్వారా సూర్యుని వేడితో.. భూతాపం పెరగకుండా కట్టడి చేయవచ్చు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమాజ హితం కోసం చేపట్టాల్సి ఉంటుంది.
అలాగే చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో వారి శరీరాన్ని తుడిచి బట్టలు మార్చడం చెప్ప తగ్గ సూచన. వేసవి కలంలో ముదురు రంగు దుస్తులు ధరించకపోవడం ప్రతి ఒక్కరికి శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా పశుపక్ష్యాదులకు, జంతువులకు డాబాలపైన లేకుంటే రహాదారుల పక్కన పాత్రల్లో నీరు ఉంచితే.. వాటి వల్ల.. మనము సైతం.. ఎంతొకొంత పరోపకారం చేసిన వారమవుతాము.
ఇక భూమి మీద వృక్ష జాతిని పెంచడం ద్వారా పర్యవరణాన్ని పరిరక్షించుకొంటే.. భవిష్యత్తులో సూర్యుడి భగభగలు కొంతలో కొంత అయిన తగ్గిడం ద్వారా.. మానవుడే కాదు.. భూతపం సైతం తగ్గుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా.. కూలర్లు, ఏసీలు, స్ల్పిట్ ఏసీలు మనకు ఉన్నాయనుకొంటే మాత్రం.. రోహిణి కార్తి వేసవి కాలంలోనే కాదు.. ఏడాది పొడుగునా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు.. భవిష్యత్తు తరాలను సైతం అలవిమాలిన చర్మ రోగాల బారిన పడేలా చేసిన వారం అవుతాము. అందుకే.. వర్షకాలంలో అయిన మొక్కలు నాటండి.. వచ్చే ఏడాది ఈ వేడి.. కాస్తా అయిన తగ్గుతుందని మనకు కనపడని, వినపడని ఓ హెచ్చరికను ఆ మార్తండుడు ప్రజలు ఇచ్చినట్లుగా వేసవిలో వచ్చే రోహిణి కార్తెను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం.