మహానాడుపైనే అందరి దృష్టీ
posted on May 25, 2023 @ 10:11AM
తెలుగుదేశం పార్టీని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించి.. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా అని పిలుపు ఇవ్వగానే.. తెలుగు నేలపైన ఉన్న ప్రజలంతా ప్రభంజనంలా కదిలారు.
అంతే పార్టీ స్థాపించిన జస్ట్ 9 నెలల్లోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని.. తెలుగువాడిలోని వాడిని.. వేడిని..చురుకుని.. చమక్కుని డిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానానికి తగిలేలా.. తెలిసేలా చేయడమే కాదు.. అప్పటి వరకు రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. హైదరాబాద్‌లోని హస్తం పార్టీ ముఖ్యమంత్రులు.... ఢిల్లీ అధిష్టానానికి తెలిపి... వారి నిర్ణయం వచ్చే వరకు చేతులు కట్టుకొని చేష్టలుడిగి... ఆధిష్టానం నిర్ణయం కోసం వెయిటింగ్ చేయడం.. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ఆధిష్టానం దూతలు.. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించడం.. అదే విధంగా అంతర్గత ప్రజాస్వామ్యనికి కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో రేగిన అసమ్మతి రాగాన్ని సవరించేందుకు ఢిల్లీ నుంచి భాగ్యనగరానికి చేరిన దూతలు... కూల్ కూల్ అంటూ అసమ్మతి నేతలను కూల్ చేయడం వంటి వగై రాజకీయాలకు హోల్‌సేల్‌గా చెక్ పెట్టిన ఒకే ఒక్కడు.. మూడుక్షరాల మహాశక్తి ఎన్టీఆర్.
ఆ యుగ పురుషుడు ప్లస్ శక పురుషుడి జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా.. మే 27వ తేదీన పసుపు పార్టీ పండుగ.. మహా పండగ.. మహానాడు ప్రారంభం కానుంది. మరోవైపు ఆ కథానాయకుడు ప్లస్ మహానాయకుడు శత జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఆ క్రమంలో ఈ మహానాడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నగారి ఆత్మబంధువులు.. లక్షలాదిగా తరలిరానున్నారు. అందుకోసం ఏర్పాట్లు వాయువేగంతో జరుగుతున్నాయి.
ఇంకోవైపు.. ఈ ఏడాది చివర లేకుంటే.. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్నాయనే ఓ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ సైకిల్ పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై అటు అన్ని వర్గాల ప్రజలే కాదు.. ఇటు వివిధ రాజకీయ పార్టీలు, నేతలల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఈ వేడుక వేదికగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయనున్నారని.. అందులోభాగంగా అన్న గారు స్థాపించి పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలను ఈ వేదికపై నుంచి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జగన్ గద్దెనెక్కిన తర్వాత.. అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ కీలక నేతలు సైతం విమర్శనాస్త్రాలు సందించేందుకు తమ మాటలకు పదును పెడుతోన్నట్లు సమాచారం.
ఇప్పటికే సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు,ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో ప్రజల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకొని.. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా అశేష జనాదరణతో ముందుకు సాగుతోంది. ఈ మహనాడు వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. సమరశంఖం పూరించి.. వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకొనే దిశగా ఈ దర్శనికత కలిగిన అధినేత ఆడుగులు వేయనున్నాయనే ఓ చర్చ సైతం సైకిల్ పార్టీ శ్రేణుల్లో ఊపందుకొంది.