నందులు గత వైభవ చిహ్నాలేనా?
posted on Jul 15, 2023 @ 5:36PM
తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి రాష్ట్రవిభజన తర్వాత అగమ్యగోచరంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన మన తెలుగు సినీ పరిశ్రమలో అంగట్లో అన్నీ ఉన్నా అన్న సామెతను గుర్తు చేసేలా ఉంది. అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో కొరత కనిపిస్తున్నది. కోట్లకు కోట్లు కలెక్షన్లు తెచ్చే పెట్టే సినిమాలు వస్తున్నా.. తెలుగు సినీ పరిశ్రమ ఖండాలు దాటి ఖ్యాతి దక్కించుకుంటున్నా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి మాత్రం ఇసుమంతైనా ప్రోత్సాహం అందడం లేదు. కోట్లకు కోట్లు సినీ పరిశ్రమ పన్నులు కడుతున్నా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం పరిశ్రమపై ఎటువంటి శ్రద్ధా చూపడం లేదు. త్రుణమో పణమో ఇచ్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడమే లేదు. సినిమా వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వడమే తప్ప.. ప్రభుత్వాలు మాత్రం సినిమా వాళ్లకి తిరిగి ఏదీ ఇవ్వడం లేదు.
రాష్ట్ర విభజన అనంతరం తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోయింది. షూటింగులు, ఎడిటింగులు, మీటింగులు అన్నీ ఇక్కడ నుండి నడుస్తున్నాయి. సినిమా వాళ్ళ నుండి ఆదాయం కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమని అరకొరగానే పట్టించుకుంటున్నది. సినిమా వాళ్ళు పిలిస్తే మంత్రులు తలసాని, కేటీఆర్ లాంటి వారు హాజరై ఆశీర్వదించడం, షూటింగులకు, కొత్త సినిమా విడుదల సమయంలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం తప్ప అభివృద్ధి, ప్రోత్సాహకాల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను పక్కన పెట్టేసిన తెలంగాణ ప్రభుత్వం ఉగాది ఉత్సవాలు లాంటి వేడుకలను సైతం జరిపించడం లేదు. కేవలం షూటింగుల వలన వచ్చే ఆదాయాన్ని, టికెట్ల పైసలను తన ఖజానాలో వేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తిరిగి సినిమా కోసం ఖర్చు పెట్టేందుకు ఇష్టపడడమే లేదు.
ఇక ఏపీలో పరిస్థితే వేరు. సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉండగా చేయడానికి మా దగ్గర ఏముంది అన్నట్లు ఏపీ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖలో చాలా సినిమాలు షూటింగ్స్ చేసేవారు. కానీ, ఇప్పుడు విశాఖ వైపు దర్శక, నిర్మాతలు వెళ్లడమే మానేశారు. సినిమా విడుదల సమయంలో మాత్రం ఈవెంట్లు నిర్వహించి ప్రమోషన్లు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ఏపీకి రావాలని కోరుతున్నారు తప్ప.. వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు అనువైన అభివృద్ధి మాత్రం చేయడం లేదు. పైగా ఆ మధ్య సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే అమ్మాలని ఆలోచన చేయడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సమయంలో సినీ పెద్దలు కొందరు తాడేపల్లి గూడెం జగన్ నివాసానికి వచ్చి ఒంగి ఒంగి మరీ దండాలు పెట్టి సమస్యను చెప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి తెలంగాణ కొత్త రాష్ట్రం కనుక.. పాత రాష్ట్రమైన ఏపీనే యధావిధిగా నంది అవార్డులు ఇచ్చినా అభ్యంతరం లేదు. కానీ, ఏపీ ప్రభుత్వం అసలు రాష్ట్రంలోనే లేని పరిశ్రమకి అవార్డుల ఖర్చు కూడా దండగే అన్నట్లు ఉండిపోతుంది.
అయితే, తెలుగు సినీ పరిశ్రమకి ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ అంతా తెలంగాణలోనే ఉన్నా అందులో ఆంధ్రా వాళ్లే ఎక్కువ. వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా వారిగానే చూస్తున్నట్లుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ యాస హిట్టు కొడుతోంది. తెలంగాణ నటులు, టెక్నీషియన్లు కూడా పెరుగుతున్నారు. దీంతో భోజ్ పురి సినీ పరిశ్రమ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ సినీ పరిశ్రమ ఎదగాలని భావిస్తోంది. అందుకే ఆంధ్రా వారి ఆధిపత్యం అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం పరిశ్రమను పట్టించుకోవడం లేదు. పరిశ్రమలో తెలంగాణ వారిని అభివృద్ధిలోకి తీసుకు రావాలని చూస్తుంది. దీంతో పరిశ్రమలో ఆంధ్రా నటులు, ఆంధ్రా టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు ఇప్పుడు అటు ఏపీలో చెల్లక.. తెలంగాణ పట్టించుకోక ఎవరికీ పట్టని వారిలా మిగిలిపోయారు. దీంతో ప్రతిభామంతులైన నటీనటులకు వారి ప్రతిభకు గుర్తుగా ఇచ్చే నంది పురస్కారాలు గత వైభవ చిహ్నాలుగానే మిగిలిపోయాయి.