మంత్రి రోజా.. తిట్ల పురాణంలో కొత్త పుంతలు
posted on Jul 15, 2023 @ 3:58PM
రోజా.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో వెండితెర మీద హీరోయిన్‌గా వెలుగు వెలిగినా.. నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద జబర్దస్త్ వంటి కామెడీ షోల్లో న్యాయ నిర్ణేతగా కమేడియన్లకు మార్కులేసినా.. రియాల్టీ షోల్లో లేడీ పెదరాయుడిలా తీర్పులు చెప్పినా.. మంత్రి పదవి వచ్చిన తరువాత వాటన్నింటికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేశారు. జగన్ తన తొలి కేబినెట్ లో రోజాకు హ్యాండిచ్చి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా మంత్రి రోజాకు జగన్ తొలి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదు. దానికి రోజా అలిగినా గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనంగానే ఉన్నారు. ఆ తరువాత ఎన్నాళ్లో వేచిన ఉదయం ఎదురైన చందంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచీ ఆమె కామెడీ షోలకు స్వస్తి చెప్పారు. అయితే పారే ఏరు.. పాడే నోరు ఊరుకోవన్నట్లుగా.. కామెడీ షోలలోనూ, రియాల్టీ షోలలోనూ ప్రసంగాల్లాంటి మాటలకు అలవాటుపడిన రోజా తన వాగ్ధాటిని విపక్షాలపై ప్రయోగించడం ప్రారంభించారు. జగన్ పై విపక్షాలకు చెందిన నేతలు చిన్న పాటి విమర్శ చేసినా రెచ్చిపోతారు. నోటికి హద్దూపద్దూ లేదన్నట్లుగా విమర్శలు గుప్పించేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె పలుమార్లు పరిధి మీరారు. మాట తూలారు కూడా. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశంసించడాన్ని రోజా తప్పుపడుతూ రజనీకాంత్ పై చేసిన విమర్శలు సంచలనం సృష్టించడమే కాకుండా, ఏపీ, తెలంగాణలలో ఆమెపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆమె నోటి దురుసు, దుందుడుకు వైఖరి కారణంగా సొంత జిల్లాలోనే, సొంత పార్టీలోనే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురౌతున్నది. సంయమనంతో సొంత పార్టీలోని వ్యతిరేకతను తగ్గిచుకునే ప్రయత్నం చేయడానికి బదులు.. జగన్ కు మద్దతుగా ఆయనపై ఈగకూడా వాలనీయని విధంగా విపక్షాలపైనా, జగన్ విమర్శకులపైనా నోరెట్టుకు పడిపోతే తన పదవికి, వచ్చే ఎన్నికలలో టికెట్టుకు ఢోకా ఉండదన్న భావనతో రోజా ముందుకు సాగుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.
తాజాగా ఆమె జనసేనాని పవన్ కల్యాణ్ పై తనదైన ప్రత్యేక శైలిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడమే రోజా విమర్శలకు కారణం. వాలంటీర్ల వ్యవస్థపైనా, జగన్ పైనా పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయ విమర్శలకు రాజకీయంగా సమాధానాలు దొరకక వైసీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో వారు దూషణలు, బూతుల పర్వానికి తెరలేపుతున్నారు. మంత్రి రోజా కూడా అదే రీతిలో పవన్ పై విరుచుకుపడ్డారు. విషయం లేకుండా పవన్ ఎదురుగా వస్తే లాగిపెట్టి కొట్టాలనుందనీ, వాలంటీర్లపై విమర్శలు చేస్తున్న పవన్ క కల్యాణ్ కు గతంలో జన్మభూమి కమిటీలపై నోరెత్తలేదెందుకు అని ప్రశ్నిస్తూ అప్పుడేమైనా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా అంటూ, జగన్ సంస్కారం గురించి పవన్ వ్యాఖ్యానిస్తుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుందంటూ మంత్రి స్థాయికి తగని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె తాను కూడా ఒకప్పుడు నటినేనన్న సంగతి మరిచి వ్యాఖ్యలు చేశారు. మరో నటి సన్నీలియోన్ ను చులకన, పలుచన చేసేలా రోజా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అయినా రోజా మంత్రిగా కలెక్షన్ క్వీన్ అనే బిరుదును సంపాదించుకున్నారే తప్ప.. రాష్ట్రానికి, రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి ఆమె చేసిందేమిటన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ మంత్రి రోజాగారు పవన్ పై ఈ విమర్శలు ఏదో పార్టీ కార్యక్రమంలోనో సభలోనో చేసినవి కాదు. తన శాఖకు సంబంధించిన ఓ సమీక్షా సమావేశంలో. సమీక్షా సమావేశంలో అధికారులతో తన శాఖకు సంబంధించిన విషయాలను చర్చించాలి కానీ.. ఈ రాజకీయ విమర్శలేమిటన్న ప్రశ్నకు సమాధానం సులువుగానే దొరికేస్తున్నది. మంత్రి హోదాలో రోజా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే అధికారులెవరూ హాజరు కాలేదు. దీంతో ఈ సమావేశం వేదికగానే మీడియా ముందు రోజా పవన్ కల్యాణ్ వేదికగా విమర్శలు గుప్పించేశారు. అధికారులు సమావేశానికి గైర్హాజర్ కావడాన్ని లైట్ గా తీసుకుని నామ్ కే వాస్తేగా సమీక్షకు డుమ్మా కొట్టిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సిఫారసు చేసి చేతులు దులిపేసుకున్నారు. మంత్రిగా సమీక్షలు చేయడం కంటే ఫైర్ బ్రాండ్ ముద్ర కాపాడుకోవడం వల్లనే తన రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉందన్నది రోజాకు బాగానే తెలుసునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.