టీడీపీ, జనసేన తొడకొడుతున్నా వైసీపీలో చలనం లేదేంటి?
posted on Jul 15, 2023 @ 9:36AM
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రం ఎన్నికల ఏడాదిలో కి అడుగుపెట్టేసింది. సమయం దగ్గర పడే కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై దండయాత్ర మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా చెప్తున్నాయి. బీజేపీ కూడా సమరానికి సిద్దమవుతున్నది. బీజేపీ జాతీయ నేతలు వచ్చిన ప్రతిసారి వైసీపీ ఫెయిల్యూర్ అని గంట కొట్టి మరీ చెప్పి వెళ్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈసారి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ రెండు వేల కిమీ చుట్టేయగా రాయలసీమలో సైతం ఊహించని స్థాయిలో లోకేష్ పాదయాత్రకి ఆదరణ వచ్చింది. లోకేష్ రోజులు గడిచే కొద్దీ మాటలలో వేడి పెంచుతున్నారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయయాత్రతో కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ఒక విడత వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా ఈ మధ్యనే రెండో విడత కూడా యాత్ర మొదలైంది. పవన్ అధికార పార్టీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే కట్టలు తెంచుకొనే ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ తొలి విడత యాత్రలో ఆ నైజం పక్కన పెట్టగా.. రెండో విడత యాత్రలో ఆ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. సూటిగా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సంస్కార హీనులని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తెచ్చిన వాలంటీర్లు దేశద్రోహులకు సహకరిస్తున్నారంటూ భారీ ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా.. వార్నింగులు ఇచ్చినా వెనక్కు తగ్గక మరికాస్త డోస్ పెంచి వైసీపీని దుయ్యబడుతున్నారు.
ఇంకా చెప్పాలంటే.. పవన్, లోకేష్ భాషలలో చెప్పాలంటే.. జగన్ ఒక క్రిమినల్ అనీ, వైసీపీ అంటే జగ్గూభాయ్ గ్యాంగ్ అని, అసమర్ధ సీఎం జగన్, మరో హిట్లర్ జగన్, జగన్ అనే రౌడీ చేతులు రక్తంతో తడిసిపోయాయని పెద్ద పెద్ద బాంబుల లాంటి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే జగన్ అనే వ్యక్తి మిత్రుడిగా కాదు శత్రువుగా కూడా పనికిరాడని తీసి పడేశారు. మరి ఇంతలా భీకరమైన మాటల దాడి జరుగుతూంటే వైసీపీ మాత్రం సైలెన్స్ మైంటైన్ చేస్తుంది. ఒకప్పుడు జగన్ ను ఒక్క మాట అంటే ఆ అన్న వారిని వైసీపీ నేతలు, శ్రేణులు ఎదురుదాడి చేసి చీల్చి చెండాడే వారు. వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని సైతం బజారుకీడ్చి నోటికి పనిచెప్పే వారు. కానీ ఇప్పుడు అవేవీ వైసీపీ నేతలలో కనిపించడం లేదు. దీంతో వైసీపీ ఎందుకు ఇలా మౌనంగా ఉంటుందన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నది.
పోయిన వాళ్ళు పోయినా.. వెళ్లగొట్టిన వాళ్ళను తీసేసినా ఇంకా వైసీపీలో 130కి పైగా ఎమ్మెల్యేలు యాక్టివ్ ఉన్నారు. వాళ్ళలో 30 నుండి 40 మంది సీనియర్లు కూడా ఉన్నారు. పాత మంత్రులు, కొత్త మంత్రులు ఓ 20 మంది వరకూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంపీలు, మాజీలు, సలహాదారులు, చైర్మన్లు, డైరక్టర్లు ఇలా భారీ సైన్యమే ఉంది. ఇంత మంది ఉండి కూడా వాళ్ల అధినేతని పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నా ఒక్కరూ కదలడం లేదు.. మెదలడం లేదు. విజయసాయి, సజ్జల లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకురావడం లేదు. జగన్ ను ఒక్క మాట అంటే వంద వడ్డించే రోజా.. జగన్ కోసం ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా అనే కొడాలి నానీ, జీవితమంతా జగన్ కోసమే అని చెప్పిన ఒకరిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతున్నది? ఎందుకిలా అంతా కట్టకట్టుకుని మౌనవ్రతం పాటిస్తున్నారు అన్నది ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీస్తున్నది.