బాబాయికి శఠగోపం
posted on Jul 15, 2023 @ 1:47PM
టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఇకపై ఉత్తరాంద్ర జిల్లాల పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలకు మాత్రమే పరిమితం చేయాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వైసీపీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి బాబాయిని తప్పించాలని అబ్బాయి వైయస్ జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.
అదీకాక ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవిని.. ఒకసారి పొడిగించారని.. ఈ సారి ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. కాగా వచ్చే నెల 12వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ పదవీకాలం ముగియనుంది.
మరో వైపు అసెంబ్లీ,సార్వత్రిక ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుందని... అంతే కాకుండా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారని.. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నా.. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లో ఈ ఎన్నికలు జరిగినా కూడా.. ఫలితం మాత్రం ప్రతిపక్షానికి అనుకూలంగా రావడంతో.. సీఎం జగన్ అండ్ కో తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
ఇక విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు.. తాజాగా తన పదవికే కాదు.. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి.. ఫ్యాన్ పార్టీపై తనలో రగులుతోన్న అసంతృప్తిని ప్రెస్‌మీట్ పెట్టీ మరి వెళ్లగక్కారు. ఉత్తరాంధ్రలో ఇటువంటి అసంతృప్తి జీవులు చాలా మందే ఉన్నారని.. వారందరినీ ముందుగానే కట్టడి చేసే బాధ్యత బాబాయి వైవీ సుబ్బారెడ్డి భుజస్కందాలపై సీఎం జగన్ ఉంచనున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిగిలిన రాజకీయ పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడుతో పాటు కిమిడి నాగార్జున సైతం ఉత్తరాంధ్రలో సైకిల్ పార్టీని సూపర్ స్పీడ్‌తో సవారీ చేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇంకో వైపు బీజేపీ, జనసేన సైతం ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృషి సారించాయి. అటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని విజయ పథంలో నడిపించేందుకు వైవీ సుబ్బారెడ్డిని సీఎం జగన్ సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే గత ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని.. ఆ క్రమంలో పార్టీ గెలుపులో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తూ.. పక్కా ప్రణాళిక బద్దంగా పావులు కదిపారనే ఓ టాక్ అయితే వైవసీపీలో నేటికి హల్‌చల్ చేస్తోందని... అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని వైయస్ జగన్ నియమించారు.
అయితే విజయసాయిరెడ్డిలాగే వైవీ సుబ్బారెడ్డి కూడా చాలా పకడ్బందీ ప్రణాళికలతో.. ముందుకు సాగి రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్యాన్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తారా? లేకుంటే పార్టీని ముంచుతారా? అనే ఓ సందేహం సైతం పార్టీలోని సదరు వర్గంలో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.
ఇక వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవిలో కొత్త వారిని నియమించేందుకు వైయస్ జగన్ ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయం కోసం శ్రమిస్తున్న వారి జాబితాను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.అలాగే చైర్మన్ గిరి పదవి కట్టబేట్టేందుకు సామాజిక సమీకరణాలను సైతం సీఎం జగన్ పరిగణలోకి తీసుకొని మరీ పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.