పోటీ ఎక్కడ నుంచి.. పొంగులేటి సందిగ్ధం
posted on Jul 16, 2023 7:04AM
తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతలు ఏకమయ్యారు. ఇదే క్రమంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ తరువాత రాష్ట్రంలో ఊహించని రీతిలో పుంజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.
మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని పొంగులేటి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కొద్ది కాలానికి పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు.
కేవలం భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరక ముందు వరకు ఖమ్మంలో భట్టి విక్రమార్క, రేణుక చౌదరి వర్గాలు ఉన్నాయి. భట్టి విక్రమార్క కనుసన్నల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లయింది. అయితే, పది నియోజకవర్గాల్లో కనీసం ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో పొంగులేటి వర్గీయులే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం సైతం అందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. ప్రత్యేకంగా పొంగులేటి అంటే అభిమానించేవారు దాదాపు అన్ని గ్రామాల్లో ఉన్నారు. వారిలో చాలామంది పొంగులేటి వెంట కాంగ్రెస్ వైపు వచ్చారు. ఇప్పటికే భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి వంటి నేతలతో పాటు పొంగులేటి చేరిక కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో తిరుగులేని విజయాన్ని ఇస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొంగులేటి అప్పటి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరారు. నామా సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటికి కాకుండా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నామా నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి పొంగులేటి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు జనరల్ స్థానాలుగా ఉన్నాయి. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పొంగులేటి ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి షర్మిల పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. షర్మిల సైతం తాను పాలేరు నుంచే పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో పొంగులేటి ఆ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మిగిలిన ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై పొంగులేటి సందిగ్దంలో ఉన్నారట. రెండు నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలుసైతం పొంగులేటి తమ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుతున్నారట. దీంతో పొంగులేటి వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే అంశం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.