నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. పవన్ అటాక్.. వైసీపీ బెంబేలు
posted on Jul 15, 2023 @ 10:02AM
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో మాఫియా డాన్ ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశిస్తూ షియాజీ షిండే ఓ డైలాగ్ చెబుతాడు.. కరెక్ట్ ఆఫీసర్ తగల్లేదు నీకు.. అప్పుడు తెలుస్తుంది.. అంటాడు. అచ్చం ఇదే డైలాగ్ అధికార వైసీపీ నేతలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే వాదన ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంది. ఈ నాలుగేళ్లలో ఆ పార్టీ నేతల అరాచకాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. టీడీపీ నేతలనైతే ఓ ఆటాడుకున్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సైతం వదిలిపెట్టలేదు. ఆయన కుటుంబ సభ్యులనుసైతం అసభ్యకరంగా అవమానించిన పరిస్థితి. చంద్రబాబుపై మాటల దాడికి ఒకరిద్దరు మంత్రులతోపాటు, పలువురు ఎమ్మెల్యేలను సీఎం జగన్ ప్రత్యేకంగా కేటాయించారన్న ప్రచారం కూడా గతంలో జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వీలుచిక్కినప్పుడల్లా చంద్రబాబుపై దూషణలు చేయడమే పని అన్నట్లుగా కొందరు వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తించారు.
అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయటా చంద్రబాబును, టీడీపీ ముఖ్యనేతలను టార్గెట్ చేసి వైసీపీ నేతలు మాటల దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒకానొక దశలో మా అధినేత చంద్రబాబును తిట్టకండి అని టీడీపీ నేతలు మొరపెట్టుకునే స్థాయికి వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రవర్తించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్‌మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై ఇదే ఫార్ములాను అమలు చేసుకుంటూ వచ్చారు. మొదట్లో జగన్ ఫార్ములా మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే ఫార్ములా జగన్ మెడకు చుట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడుతున్నాడు. అయితే, టీడీపీపై ప్రయోగించిన ఫార్ములానే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పైనా ప్రయోగించారు. కానీ, అది బెడిసికొట్టడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడల్లా పవన్ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ విమర్శలన్నీ బూతుల స్థాయిలోనే ఉన్నాయి. అయితే పవన్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎప్పటికప్పుడు సీఎం జగన్‌మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ వచ్చాడు. ఇటీవల వారాహి విజయ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వారం రోజుల క్రితం వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వస్తున్నారు. అయితే, పవన్‌ను విమర్శించడం తమకే నష్టం వాటిల్లుతుందన్న భావనలో వారు ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్
నేరుగా జగన్‌ను టార్గెట్‌చేసి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జగ్గుభాయ్ అంటూ ర్యాగింగ్ సైతం చేస్తున్నాడు. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. పవన్‌తో గొడవ వద్దని జగన్‌కు కొందరు సీనియర్ నేతలు నచ్చజెబుతున్నట్లు తెలుస్తోంది. పవన్‌తో పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా గోదారి జిల్లాల్లో ఎన్నికల సమయంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లూ తాము చేసిందే విమర్శ అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు పవన్ దూకుడు చెక్ పెట్టిందనే చెప్పాలి. అటు అధినేతకు నచ్చజెప్పలేక, మరోవైపు పవన్ పై ఎదురుదాడి చేయలేక ఇబ్బంది నానా ఇబ్బందులూ పడుతున్నారు.
పవన్ విమర్శల దాడి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పొరుగు రాష్ట్రంతో అనవసర వివాదానికి సైతం సిద్ధ పడుతున్నారు. పవన్ చేత తిట్టించుకునే కంటే పొరుగు రాష్ట్రం మంత్రుల చేత తిట్టించుకోవడం మేలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. రెండురోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అలాగే పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బొత్స పొద్దుపొద్దున్నే మాకు ఇదేకర్మ అంటూ వ్యాఖ్యానిచటం వారిలో అసహనం, ఆందోళన పీక్స్ కు చేరిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు.