ఎన్డీఏలోకి జగన్?..మోడీ, షాలతో డీల్ సెట్టవుతుందా?

మాయ చేసి మతలబు చేసి.. ఏదోకటి చేసి మళ్ళీ అధికారం దక్కించుకోవాలి. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక్క టార్గెట్. ఇందు కోసమే రకరకాల ఎత్తులు వేస్తున్నారు, జిమ్మిక్కులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్ములను ఇప్పటికే బటన్ నొక్కుడు పథకాల ద్వారా పప్పు బెల్లాల మాదిరి పంచి బెడుతున్నా ప్రజలు రాష్ట్ర అభివృద్ధి మాటేమిటని నిలదీస్తున్నారు. రూపాయి ఇచ్చి వంద రూపాయలు వసూలు చేస్తున్న జగన్ రెడ్డి పాలన ఇక మాకు వద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా ఎన్ని  ఎత్తులు వేసినా అవేవీ వర్క్ అవుట్ కాలేదు. ఒకవైపు తెలుగుదేశం ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి  మళ్ళీ అధికారం దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. దీనికి తోడు తెలుగుదేశంతో జనసేన కూడా కలవడంతో ఆరు నూరైనా.. నూరు పదహారైనా చంద్రబాబు మరోమారు సీఎం కావడం ఖరారైని తేటతెల్లం అయిపోయింది. దీంతో వైసీపీ ముందుగా తెలుగుదేశం, జనసేన మధ్య చీలిక తేవాలని ప్రయత్నించింది. దీనికి కోసం వైసీపీ నేతలు జనసేనను రెచ్చగొడుతూ అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతోనే ప్రయాణమని ఫిక్సయ్యారు.  తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో వైసీపీ దింపుడు కళ్ళెం ఆశలతో ఎలాగైనా బీజేపీ మద్దతు తమకు కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల వేళ కేంద్రం అండ దండలు ఉంటే  తెలుగుదేశం,జనసేనపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఎన్నికల కార్యాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలన్నది వైఎస్ జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసమే బీజేపీ.. తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకుండా, తమతో రహస్య బంధాన్ని కొనసాగేలా చేసుకోవాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ టూర్ లో జగన్ తనదైన వ్యూహాలతో కేంద్ర పెద్దలను కలుస్తారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకూ కూడా టీడీపీ, జనసేన నేతలు కూడా బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నారన్న భావన ఉండేది. కానీ, చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకు ముందే కేంద్రంపై ఏపీలో అసంతృప్తి ఉండగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత అది బీజేపీపై ఆగ్రహంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూడా బీజేపీతో కలిసి నడిచే పరిస్థితి లేకుండా పోయింది.  తాజాగా, జనసేనాని పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అవనిగడ్డ సభలో మాట్లాడిన పవన్ కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ అవినీతి సంగతి కేంద్ర పెద్దలకు తెలియదా అంటూ నేరుగానే ప్రశ్నించారు. ఇక పెడన సభకు రాగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చానని కూడా చెప్పేశారు. దీంతో ఎన్డీయేతో జనసేన ఇక కటీఫ్ అని మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన బీజేపీకి దూరమైతే వైసీపీ దాన్ని అవకాశంగా మలచుకోవడానికి సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఆ ప్రయత్నాలే జరుగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనలో అడుగులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కచ్చితంగా వైసీపీ ఎంపీలు బీజేపీకే మద్దతు ఇచ్చేలా జగన్ కేంద్రం పెద్దలకు హామీ ఇవ్వడంతో పాటు ఏపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా బీజేపీ క్యాండిడేట్లను గెలిపించేలా ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  అయితే, ఏపీలో బీజేపీ ఎవరితో కలిసినా వారికి నష్టాలే ఎక్కువ ఉండే అవకాశం ఉందని సర్వేల ఫలితాలు చెప్తుండగా.. వైసీపీ, బీజేపీ పొత్తు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. గత నాలుగేళ్ళలో వైసీపీ,బీజేపీ బంధం బహిరంగ రహస్యమే. ఇప్పుడు కూడా అది అలాగే కొనసాగే  చాన్స్ ఉందని భావిస్తున్నారు. అవసరమైతే బీజేపీ కోరినట్లు బీజేపీ క్యాండిడేట్లను వైసీపీ ముసుగులో గెలిపించే హామీలు ఇస్తారని కూడా భావిస్తున్నారు. పైకి మాత్రం సింహం సింగిల్ గా పోటీకి వస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూనే... లోపల మాత్రం బీజేపీతో దోస్తీ చేస్తూ ఎన్నికల మేనేజ్మెంట్ చేసుకోవాలని వైసీపీ ఆశపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే వైసీపీ యుక్తులు, కుతంత్రాలు ఈ సారి పని చేసే చాన్స్ లేదని అంటున్నారు. 

సరిపోయింది ఇద్దరికీ..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు జగన్ పార్టీలోని కీలక నేతలు శాయశక్తుల ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా వైరల్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి ఆర్కే రోజా.. మీడియా ముందు మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమవడమే కాకుండా.. టీడీపీ నేతలపై తనదైన శైలిలో ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయారు.  అయితే బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దాదాపు వారం రోజుల తర్వాత.. మంత్రి ఆర్కే రోజా మీడియా ముందు ప్రత్యక్షమై.. కన్నీటి పర్యంతమవుతూ.. టీడీపీ నేతలను టార్గెట్ చేయడంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా.. క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా.. చేస్తున్నా.. ఆ వెంటనే రంగంలోకి దిగిపోయి.. వాటిజ్ దీస్.. ఇవేం మాటలు.. సీడీలు ఎక్కడా?.. బయటకు తీయండి?.. వాటిని తీసుకు రండి.. మీ దగ్గర ఉందా? ఆ సీడీలు తీసుకు వచ్చే దమ్ము  ధైర్యమంటూ మీడియా ముందు నానా యాగీ చేస్తే.. నా సామిరంగా సీడీ సంగతి దేవుడెరుగు.. ఎగస్ పార్టీలో సౌండ్ కూడా వస్తుందో రాదో తెలిసిపోయేదని... కానీ దొంగలు పడ్డా ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్లుగా.. వారం రోజుల తర్వాత.. ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చి.. కన్నీరు మున్నీరు కావడం ఏం బాగోలేదని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. టీడీపీ నేత బండారు వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత వారం రోజులకు రోజా స్పందించిన తీరు చూస్తుంటే.. ఫ్యాన్ పార్టీలోని పెద్దలు రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నట్లుగా ఉందనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.  ఇక గతంలో అంటే.. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఫ్యాన్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తితో దాడి చేయడం.. ఆ వెంటనే అక్కడే ఉన్న వారు... ఆయనకు ప్రాథమిక చికిత్స కోసం.. విశాఖపట్నంలోని స్థానిక ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించడం.. అయితే అందుకు ఆయన ససేమిరా అనడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు వ్యవస్థ పట్ల తనకు నమ్మకం లేదంటూ.. విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానంలో వెళ్లిపోయి.. ఆ వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ న్యూరో సెంటర్‌లో చేరిపోయి.. అక్కడ చికిత్స చేయించుకోవడమే కాకుండా.. రెండు రోజుల పాటు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కి విశ్రాంతి అవసరమంటూ సదరు ఆసుపత్రి వైద్యులు ప్రకటించడం కోసమెరుపు. అలా చేతికి గాయమై.. స్ట్రేచర్ మీద పొడుకున్న వైయస్ జగన్ చిత్ర రాజులు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేయడమే కాదు.. ఆ తర్వాత ఇదే విషయాన్ని.. అంటే విశాఖ ఎయిర్ పోర్ట్‌ సాక్షిగా తనపై హత్యయత్నం జరిగిందంటూ.. పులివెందుల్లో తన సొంత చిన్నాన్న వైయస్ వివేకా దారుణ హత్యకు గురైన సమయంలో ఆయన మృతదేహాన్ని సందర్శించిన తర్వాత చెప్పారని.. దీంతో ఇదంతా చూస్తుంటే.. ఫ్యాన్ పార్టీలోని అగ్రనేతలు తెర వెనుకు ఉండి నడిపిస్తున్న ఓ ప్రాయోజిత కార్యక్రమంలాగా నేడు ఆర్కే రోజా వ్యవహారం.. నాడు ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ వ్యవహరం ఉందనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. అయినా ఎన్నికలు సమీపించాయనగానే.. ఐ ప్యాక్ చెప్పినట్లు.. ఏ మాత్రం అక్షరం పొల్లు పోకుండా తూ.చా తప్పకుండా చేసుకుపోవడం జగన్ అండ్ కో విధానమని.. అలాంటి వేళ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు మరెన్ని చూడాల్సి వస్తుందోననే ఓ అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.  అదీకాక.. ఆర్కే రోజాను టీడీపీ నాయకుడు ఇన్ని మాటలు అన్నప్పుడు.. జగన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ నేతలను, రాజకీయాలతో సంబంధం లేని వారి ఫ్యామిలీలోని వ్యక్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు.. జగన్ ప్రభుత్వంలోని మహిళ ప్రజాప్రతినిధులు కనీసం.. ఇలా మాట్లాడడం తప్పు అని నాడే వారి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించి ఉంటే.. నేడు మీ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదనే ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.  ఇక ఆర్కే రోజా కన్నీటి పర్యంతమవుతూ.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో చూపించారు కానీ.. అదే జగన్ పార్టీలోని తొలి కేబినెట్‌లోని మంత్రులు, జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు..  మహిళల పట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చూపిస్తే.. పరిస్థితి మరోలా ఉండేదనే ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. అయినా పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కి మంత్రి ఆర్కే రోజా ఇద్దరు ఇద్దరేనని.. ఎందుకంటే.. ఆయన కోడికత్తి దాడి జరిగిన తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ ప్రయాణించి.. విశ్రాంతి తీసుకున్నారని.. అలాగే ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆరోపణలు గుప్పిస్తే.. వారం రోజుల తర్వాత స్పందించడం చూస్తే.. వీరిద్దరికీ సరిపోయిందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

యాడకి పోయనారబ్బా...! 

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చి కన్నీటి పర్యంతమవుతూ.. బండారు సత్యనారాయణ మూర్తిపై నిప్పులు చెరిగారు. అంతవరకు ఓకే కానీ.. ఆర్కే రోజాపై ఇంతగా అబండాలు వేస్తే.. తన సొంత పార్టీ నుంచే ఆమెకు మద్దతు లభించకపోవడం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తుంది. ఇక సహచర మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉష శ్రీ చరణ్‌లు స్పందించి ఉంటే బాగుండేదనే ఓ అభిప్రాయం సైతం సదరు వర్గంలో వ్యక్తమవుతోంది. కనీసంలో కనీసంగా హోం మంత్ర తానేటి వనిత అయినా స్పందించి ఉండాల్సిందనే చర్చ సైతం ఆ వర్గంలో కొన.. సాగుతోంది.  పోని జగన్ తొలి కేబినెట్‌లో నోరున్న మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు వగైరా వగైరా.. అలాగే ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అయినా స్పందించి ఉంటే.. మీకు అండగా మేమంతా ఉన్నామంటూ.. ఆర్కే రోజాకు ఓ భరోసా కల్పించినట్లుగా ఉండేదని చర్చ సైతం సదరు వర్గంలో నడుస్తోంది.  అయినా ఫ్యాన్ పార్టీని తిడితే నన్ను తిట్టినట్టే.. మా పార్టీ అధినేత సీఎం వైయస్ జగన్‌ని విమర్శిస్తే.. నన్ను విమర్శంచినట్లేనంటూ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల అధినేతలపై ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయే రోజమ్మకు రాకూడని కష్టం కమ్ముకొచ్చిందనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గంలో వైరల్ అవుతోంది.   అయినా తమ పార్టీలోనే నేతలంతా.. పార్టీ అధినేత వైయస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తేనే స్పందిస్తారా? అంతేకానీ.. సహచర మంత్రికి కష్టం వచ్చినప్పుడు స్పందించే గుణం వారికి లేదా అనే ఓ విధమైన సందేహం సైతం ఆ వర్గంలో పెల్లుబికుతోంది. అదీకాక  తిరుమలలో ఆ దేవదేవుడిని సందర్శించుకొన్న తర్వాత ఆనందనిలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలపై తన మాటలతో ఆర్కే రోజా విరుచుకు పడిపోతుందని.. అంతేకానీ.. దేవుడి దర్శనానికి వచ్చాం.. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస జ్జానం కూడా ఆమెలో ఏ కోశాన లేదని సదరు వర్గంలో విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి.  అదీకాక అటు వెండితెర మీదే కాదు.. ఇటు బుల్లి తెర మీద సైతం ఎన్నీ ప్రోగ్రామ్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు ఆర్కే రోజా  వ్యవహరించేదని.. కానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటుందని..  అలాంటి వేళ.. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం చిత్ర సీమలోని వారైనా ఆర్కే రోజాకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటన చేసినా బాగుండేదనే ఓ అభిప్రాయం సైతం సదరు వర్గంలో వినిపిస్తుంది.  అయినా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైన.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైన.. చిన్నంతరం పెద్దంతరం అనేదే లేకుండా తమ మాటలతో దాడికి దిగే ఆర్కే రోజా లాంటి వాళ్లకి ఇటువంటి శాస్తి తప్పక జరగాల్సిందేనని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తుంది. పోనీ జగన్ ప్రభుత్వంలో నామినేటిడ్ పోస్టుల్లో కొలువు తీరిన పోసాని కృష్ణమురళి, ఆలీ లాంటి వాళ్లు అయినా స్పందిస్తే బావుంటుందని.. అయినా జగన్ పార్టీ గద్దెనెక్కిన నాటి నుంచి అంటే.. ఈ నాలుగున్నరేళ్లలో.. పలువురు మంత్రులు, కొంత మంది మాజీ మంత్రులు, అతికొద్ది మంది ఎమ్మెల్యేలు మీసాలు తిప్పుతూ... తొడలు కొడుతూ, బూతులు తిడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలు, అధినేతలపై చెలరేగిపోతూ ఉంటారని.. అలాంటి వారంతా.. ఆర్కే రోజాకు ఆపద వచ్చినప్పుడు ఏమైయ్యారు. ఎక్కడికి పోయారని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం ఒకింత ఆందోళనతో ప్రశ్నిస్తోంది.

బాబు అరెస్ట్‌కు నిరసనగా మరో వినూత్న కార్యక్రమం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్ని పోలీసులు తరలించారు. దీంతో మరో వినూత్న నిరసనకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అందులోభాగంగా ఈ నెల 7వ తేదీ అంటే శనివారం కాంతితో క్రాంతి పేరిట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.  ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి...వాహనాల లైట్లు బ్లింక్‌ చేయడం ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు బాబుతో నేను.. అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. వాకిళ్లు, బాల్కానీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకొని వెలుగు చూపించాలని ప్రజలకు లోకేశ్ సూచించారు.  మరోవైపు ఈ కార్యక్రమంపై నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలియదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమానికి  ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకోమంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టి క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి? అక్టోబర్ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్ ఫోన్ టార్చ్, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామని బ్రాహ్మణి స్పష్టం చేశారు.  ఇంకోవైపు ఢిల్లీ నుంచి గురువారం రాత్రి రాజమండ్రి తిరిగి వచ్చిన నారా లోకేశ్.. అక్టోబర్ 6వ తేదీతో తన తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు. అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. 28రోజులగా చంద్రబాబును జైలులో ఉంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కిల్ కేసులో తొలుత 3 వేల కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని చెప్పారని.. అనంతరం 300 కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని ఆరోపించారని. మళ్లీ ఇటీవల 27 వేల కోట్ల రూపాయిల అవినీతి అని మాట మార్చారని లోకేశ్ తెలిపారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.  ఇక చంద్రబాబు అరెస్ట్‌పై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులోభాగంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రలలోని తెలుగు ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తుండగా... విదేశాల్లో సైతం చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. గత శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు.. మోత మోగిద్దాం పేరుతో టీడీపీ శ్రేణఉలు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. అదే తరహాలో రేపు శనివారం సైతం చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మరో వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చేపట్టింది.

బీఆర్ఎస్ ఎన్టీఆర్ జపం.. ఓట్ల కోసమేనా?

ఎన్టీఆర్.. ప్రతిసారి ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు కోసం కొట్లాట అంతా ఇంతా కాదు. తమకి తాము ఆయన్ను దైవంగా చెప్పుకొనే వారి నుండి.. అసలు ఎన్టీఆర్ శిష్యులం మేమే అనే వరకూ దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో ఈ పేరు కలవరిస్తూనే ఉంటాయి. నాలుగేళ్ల కాలం ఎలా ఉన్నా సరే ఎన్నికల ఏడాదిలో మాత్రం ఎన్టీఆర్ అందరికీ కావాల్సిన వారే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్ పేరు, వారసత్వం తెలుగు దేశం పార్టీ సొంతం.   నేటికీ ఆయన సిద్ధాంతా ఆశయాలతోనే తెలుగుదేశం కొనసాగుతోంది.  కాలానుగుణంగా మార్పులు చేర్పులలో నారా చంద్రబాబు నాయుడు ముద్ర కనిపించినా ఎన్టీఆర్ సిద్ధాంతాల అనుగుణంగానే టీడీపీ పనిచేస్తున్నది.   ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అందించింది కూడా ఎన్టీఆర్ పై ప్రేమ చాటుకోవడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో కొందరు సోకాల్డ్ నేతలు కూడా ఎన్టీఆర్ జపం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తుంటారు.  ఏపీ సంగతలా ఉంటే ఎన్టీఆర్ పేరు కోసం చేసే రాజకీయం తెలంగాణలో మరో రకంగా ఉంటుంది. తెలంగాణలో టీడీపీ బలహీన పడిన అనంతరం ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం క్యాడర్ కోసం దాదాపుగా అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేసున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ కొంత మేర సక్సెస్ అయింది. తెలుగుదేశం నేతలందరినీ   కారు ఎక్కించుకున్న కేసీఆర్.. సమయం వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ ను కీర్తిస్తూ వస్తుంటారు. తెలుగుదేశం పార్టీనీ,  చంద్రబాబును విమర్శిస్తూనే ఎన్టీఆర్ ను కీర్తిస్తుంటారు. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ అయితే ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు విజనరీని మెచ్చుకుంటూ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర శాశ్వతం అంటూ చెబుతూ వచ్చేవారు. అయితే, ఈసారి కేటీఆర్ కూడా తండ్రి కేసీఆర్ బాటలోనే చంద్రబాబును మరచి కేవలం ఎన్టీఆర్ పేరును మాత్రమే తెరమీదకి తెస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తమకేం సంబంధమన్న కేటీఆర్.. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో ఆందోళనలను కూడా తప్పుబట్టారు. దీనిపై సీమాంధ్ర సెటిలర్లలో తీవ్ర అసంతృప్తి కనిపించింది. ఈసారి సెటిలర్లు బీఆర్ఎస్ కు దూరం జరుగడం ఖాయమని పరిశీలకులు కూడా విశ్లేషించారు. ఒకింత ఆలస్యంగానైనా తన మాటల వల్ల జరిగిన, జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన కేటీఆర్ నష్ట నవారణ కోసం.. ఔను నష్టనివారణ, సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ నామస్మరణ మొదలు పెట్టారు. మాకు రాముడైనా.. కృష్ణుడైనా సీనియ‌ర్ ఎన్టీఆర్ ఒక్క‌రే అంటూ కేటీఆర్ కీర్తించారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్ల వ్య‌యంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ప్ర‌పంచంలో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. వారంద‌రి ఆరాధ్య దైవం ఎన్టీఆరేన‌ని కేటీఆర్ అన్నారు. ఈ మధ్యనే ములుగులో పర్యటించిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేశారు. పేదలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్ బాటలో పాలిస్తున్నారని చెప్పుకున్నారు. ఈ ఇద్దరే కాదు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ కలవరిస్తున్నారు.  కాగా, తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఓట్ల కోసమే తెలంగాణాలో కొందరు తన తండ్రి ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని బాలకృష్ణ విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అనంతరం  బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం తెలంగాణలో కొందరు ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది.  చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఇప్పటికీ మౌనంగా ఉండడంతో బీఆర్ఎస్ నష్టపోవడం ఖాయం అన్న భావనతోనే ఎన్టీఆర్ పేరు చెప్పుకుని నష్టాన్ని పూడ్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని అంటున్నారు.   అయితే, అనూహ్యంగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్ నేతల ఓట్ల రాజకీయంపై చేసిన వ్యాఖ్యలు  సీమాంధ్ర ఓటర్లకు స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిందనే  భావించాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సీమాంధ్రులే కాదు.. తటస్థులు కూడా తెలుగుదేశంకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించేసుకున్నారని, బాలకృష్ణ వ్యాఖ్యలతో వారి నిర్ణయం మరింత ధృఢంగా మారడం ఖాయమనీ అంటున్నారు. 

 లోక్ పాల్ సర్వేలో బిఆర్ఎస్ కు 45 నుంచి 51 మాత్రమే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి.  10వ తేదీ లోపు  ఎలెక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉండగా... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇతర పార్టీల నుంచి చేరికలతో కాంగ్రెస్ శిబిరం మంచి ఊపు మీద ఉంది. కాంగ్రెస్ సీనియర్లు కూడా గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే  115 అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందే  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంకోవైపు బీజేపీకి రాష్ట్రంలో ఊపందుకుంటుంది. ప్రధాని సభలతో తెలంగాణలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది.  కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ మొదటి వారంలో ఒకే  విడతలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  అనేక సర్వేలు బిఆర్ఎస్ కు  వ్యతిరేకంగా వస్తున్నాయి. హ్యట్రిక్ కొట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ సర్వే నివేదికలు వ్యతిరేకంగా ఉంటున్నాయి. తాజాగా లోక్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించబోతోందని సర్వేలో తేలింది. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ కు 61 నుంచి 67 సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొంది రెండో స్థానానికి పరిమితమవుతుందని వెల్లడించింది. ఎంఐఎం 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇతరులు సున్నా లేదా ఒక్క స్థానాన్ని గెలుచుకోవచ్చని తెలిపింది. ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ సర్వేను నిర్వహించినట్టు లోక్ పోల్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే శాంపిల్ సైజ్ 60 వేలు అని పేర్కొంది.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు... 10న ఎన్నికల నోటిఫికేషన్

దేశంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం హీటెక్కిస్తుంది. 2018 ఎన్నికల్లానే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒక విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్టు సమాచారం.కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే తెలంగాణలో పర్యటించారు మహబూబ్ నగర్, నిజామా బాద్ బహిరంగ సభల్లో పాల్గొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ వోటర్లను ఆకర్షించే  కార్యక్రమాలతో  బిజీగా ఉంటోంది. కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. చేరికలకు పెద్ద పీట వేస్తుంది.  ఈ ఏడాది  రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8-10 మధ్య ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి.   డిసెంబరు మొదటి వారంలో కానీ పోలింగ్ జరగొచ్చని సూచనా ప్రాయంగా పేర్కొంది.   అలాగే, గతంలో నిర్వహించినట్టుగానే చత్తీస్‌గఢ్‌లో  రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎన్నికల తేదీలు మాత్రం వేర్వేరుగా ఉండనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 10-15 మధ్య ఉండే అవకాశం ఉంది.  తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. 

జైల్లో చంద్రబాబు.. జగన్ తో పాటు మోడీకీ తగులుతున్న నిరసన సెగ!

తెలుగుదేశం అధినేత   చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నాలుగు వారాలు కావస్తుంది. ఒకటి రెండు రోజుల్లో బాబు బయటక వచ్చేస్తారని ముందుగా అంతా భావించారు. టీడీపీ శ్రేణులైతే మహా అయితే వారం రోజులలో తమ అధినేత కడిగిన ముత్యంలా వచ్చేస్తారని ఊహించారు. కానీ, కోర్టులలో మాత్రం వారాలకు వాయిదాలు పడుతోంది. తెలుగుదేశం  శ్రేణులేమో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.  చంద్రబాబు కుటుంబ సభ్యులు రాజమండ్రిలో మకాం వేశారు. ఏసీబీ కోర్టు నుండి హైకోర్టు.. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు అన్నట్లే ఈ కేసు వ్యవహారం సాగుతోంది. అటు విచారణకు ఆదేశిస్తారా? లేక కేసు కొట్టేస్తారా?.. విచారణకు సహకరించాలని చెబుతూనే బెయిల్ మంజూరు చేస్తారా అన్న స్పష్టత లేదు. నాలుగు వారాలు అవుతున్నా అసలు ఈ కేసు విషయంలో చంద్రబాబు అవినీతికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సీఐడీ చూపలేకపోయింది. అరెస్టు చేశాం కదా, ఇప్పుడు చంద్రబాబును విచారించి ఆధారాలు సంపాదిస్తామనే చెబుతోంది. ఇంత స్పష్టంగా ఏసీబీ డొల్లతనం బట్టబయలైనా.. సాంకేతిక కారణాలతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంలో వాయిదాల పర్వంతో నడుస్తోంది. ఇక  సుప్రీం కోర్టు ఏం చెప్తుందన్న అంశంపై ఆధారపడి ఏసీబీ కోర్టు ఇక్కడ వారాలకు వారాలు చంద్రబాబు  రిమాండ్ ను పొడిగిస్తున్నది.  అయితే చంద్రబాబు కేసు వాయిదాలపై ఇప్పుడు జనంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నదే అక్రమమని, కేవలం కక్షపూరిత చర్యలో భాగంగా వైసీపీ ప్రభుత్వం సీఐడీని ఉసిగొల్పిందని పరిశీలకులు విశ్లేషణలతో సహా ఎప్పుడో చెప్పేశారు. చంద్రబాబుపై బనాయించిన సెక్షన్లు కూడా తీవ్ర అభ్యంతరమైనవని చెప్తూ న్యాయనిఫుణులు,రిటైర్డ్ సివిల్ సర్వీసు అధికారులు కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుకు మద్దతుగా   నిలిచారు. కేవలం సీఎం జగన్  కక్ష సాధింపు కోసమే సీఐడీ ద్వారా చంద్రబాబును అరెస్టు చేయించారని జనం నమ్ముతున్నారు. అంతే కాదు కేవలం సీఎం జగన్ ఒక్కరే ఈ కుట్రలో భాగం కాదని.. చంద్రబాబు అరెస్ట్ కేంద్ర పెద్దలకు తెలిసే జరిగిందని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల అండతోనే ఇది సాధ్యపడిందని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. వైసీపీ నేతలు కూడా బహిరంగంగానే చంద్రబాబు అరెస్టుకు కేంద్రం పెద్దల మద్దతు ఉందని చెబుతున్నారు.   ఇప్పుడు న్యాయస్థానాలలో ఈ కేసు వారాల తరబడి సాగదీతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే కేంద్ర పెద్దలు ఈ కేసు కొలిక్కి రాకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ వాయిదాల మీద వాయిదాలు వేయడం, తీర్పును రోజుల తరబడి రిజర్వ్ చేయడం వంటి వాటితో పాటు..  సీఐడీని కేసు వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ వారాల తరబడి గడువు ఇవ్వడం చూస్తుంటే  న్యాయ వ్యవస్థను కూడా   కేంద్రం పెద్దలు ప్రభావితం చేస్తున్నారా అనే పరిశీలకులే కాదు.. సామాన్య జనం కూడా అనుమానిస్తున్నారు  అసలే ఈడీ, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను  కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నదన్న విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే ఉండగా.. చంద్రబాబు విషయంలో  కూడా  కేంద్రం హస్తం ఉందన్న నమ్మకం జనబాహుల్యంలో రోజురోజుకూ బలపడుతోంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో సత్వర విచారణకు నోచుకోకపోవడం వెనుక మోడీ, షాల ఒత్తడి, ప్రమేయం ఉందని జనం భావిస్తున్నారు.  దీంతో తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రధాని మోడీపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే  పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ నుండి ఫరూక్ అబ్దుల్లా వరకూ.. అఖిలేష్ యాదవ్ నుండి తెలంగాణ నేతల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూనే ఉన్నారు. చివరాఖరికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదనీ, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారనీ పేర్కొన్నారు.   చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు దన్నుగా నిలిచిందన్న ఆగ్రహం బీజేపీపై వ్యక్తమౌతున్నది. ఆ పార్టీ ఏపీ నాయకులు కూడా చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే చెబుతున్నారు. త్వరలో ఏపీ బీజేపీ నేతల బృందం హస్తినకు వెళ్లి పరిస్థితిని తమ హైకమాండ్ కు వివరిస్తామనీ, కచ్చితంగా మోడీ, షాలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన చేసేలా చూస్తామని అంటున్నారు.  మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఖరారు చేసేసిందనీ, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రభావం జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా వెల్లడైన శ్రీ ఆత్మసాక్షి సర్వే  కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొంది. 

సప్తపది లేని పెళ్లిళ్లు చెల్లవా ? 

హిందూ వివాహ వ్యవస్థ ఆచార వ్యవహారాల్లో విశిష్ట స్థానం ఉంది.  ఈ ఆచార వ్యవహారాల్లో సప్త పది ఆచారం ప్రత్యేకమైనదని చెప్పొచ్చు.  వధువు, వరుడు కలిసి యజ్ఞగుండం చట్టూ తిరిగే సప్తపదితో పాటు, ఇతర ఆచారాలను పూర్తి చేయకపోతే దానిని హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. అయితే, తన భార్య రెండో వివాహం చేసుకొని వేరే వ్యక్తితో కలిసి ఉంటోందని పేర్కొంటూ జంటలోని వరుడు అదే ఏడాది మేజిస్ర్టేటు కోర్టులో కేసు పెట్టాడు. కోర్టు ఆమెకు సమన్లు పంపించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అత్తింటివారు తనను వేధిస్తున్నారని, రెండో పెళ్లి చేసుకోలేదని వాదించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సదరు మహిళ రెండో పెళ్లి జరగలేదని నివేదిక ఇచ్చారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 7(2) ప్రకారం సప్తపది (సాత్‌ ఫేరీ), ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. పరిశీలించిన ధర్మాసనం అన్ని సంప్రదాయాల ప్రకారం జరిగితేనే అది వివాహంగా చెల్లుబాటు అవుతుందని, ఇలాంటివి లేకుండా ఒకవేళ జరిగినా చట్టం దృష్టిలో అది వివాహం కాదని స్పష్టం చేసింది. ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది. పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. కొన్ని కుటుంబాల్లో  సప్తపది మాండేటరీ.  పెద్దల సమక్షంలో జరిగే పెళ్లిళ్లు అయితే పర్వాలేదు కాని రిజిస్టర్ మ్యారేజ్ లు చేసుకుంటున్న అనేక  ప్రేమ జంటలు  సప్తపది లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. రిజిస్టర్ మ్యారేజిలు చేసుకున్న వారు సప్తపది లేకుండానే వివాహతంతును పూర్తి చేసుకుంటున్నారు.  1955 నాటి వివాహ చట్టం ప్రకారం.. సప్తపది వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. మరి రిజిస్టర్ మ్యారేజ్ లు జరిగినప్పుడు   న్యాయస్థానాలు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.   

ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్నకు ఊరట

తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్నకు ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ బుద్ధ వెంకన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఇటీవల గన్నవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే పేర్ని నాని ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై అత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బుద్దా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు. బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు   వెంకన్నను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.  

రేవంత్ దూకుడు! కేసీఆర్‌ చేతులెత్తేసినట్లేనా

తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడితో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల‌కు సై అంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో అభ్యర్థుల జాబితాను పక్కనెట్టి మిని మేనిఫెస్టో, గ్యారంటీ స్కీములను ప్రకటించి జనాల్లోకి దూసుకెళ్తోంది. ఇక బీజేపీ అయితే.. కేంద్రం నుంచి ప్ర‌ధాన‌మంత్రినే తీసుకొచ్చి వరాల జల్లు కురిపించే యత్నం చేస్తూ వస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బి‌ఆర్‌ఎస్ ..తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు మాదిరిగా ముందుకెళుతున్నామ‌ని చెబుతున్నారు. అవి కొనసాగాలంటే మళ్ళీ బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్ర‌చారం చేసుకుంటున్నారు.  అయితే ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి.  కేసీయార్ ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో కనీసం 35 నియోజకవర్గాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అభ్యర్ధులకు నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లకు, ద్వితీయ శ్రేణినేతలకు ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య సయోధ్య కుదర్చాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కవుటవటంలేదు. అలాగే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు. దాంతో అసంతృప్తి నేత‌లను బుజ్జగించటం, రాజీనామాలను ఆపటం కేసీయార్ కు పెద్ద సమస్యగా మారిపోయింది.   మ‌రో ప‌క్క‌ కాంగ్రెస్  అభ్యర్ధుల పేర్లు ఖ‌రారు చేసే  విషయంలో ఆచి తూచి కాంగ్రెస్ అడుగులేస్తుంది. అయితే మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ ముందు ఉంది. అందరికంటే ముందు 6 గ్యారెంటీలు అంటూ మేనిఫెస్టో ప్రకటించేసింది. ఇక ప్రత్యర్ధి బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తూ..పెద్ద ఎత్తున వలసలని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ‘బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనివ్వమంటున్నారు. తెలంగాణలో 19% అన్ డిసైడెడ్ ఓట్లు  ఉన్నాయి. ఆ ఓట్ల‌న్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి,  రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదు’ అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.  అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే.... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర, తెలంగాణా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌ పేపర్ లీకేజీపై పోరాటం, ధరణి రద్దు, తదితర అంశాలపై చేపట్టి కార్యక్రమాలతో పార్టీ యాక్టివిటీ పెరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్ననమ్మకం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో, నాయకత్వంలో ఏర్పడింది. దీంతో మెజార్టీ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీకీ ఆశావాహుల సంఖ్య పెరిగింది. సీనియర్ లీడర్లు మినహా మిగిలినచోట్ల అభ్యర్థిత్వం కోసం నేతలు పోటీపడుతున్నారు.   అభ్యర్దుల ప్రకటనకు ఢిల్లీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. టికెట్ల కోసం పెరిగిపోతున్న ఒత్తిళ్ళ నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపిక అంత సులభంకాదని చెప్ప‌వ‌చ్చు.  బి‌జే‌పి విషయానికొస్తే..ఆ పార్టీలో విచిత్ర పరిస్తితులు ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపిక ఇంకా జరగడం లేదు. మేనిఫెస్టో అంశంపై చర్చ లేదు. నాయకుల మధ్య సమన్వయం లేదు. అందులో కొందరు నేతలు పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అడపాదడపా రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే అభ్యర్ధుల గుర్తింపే పార్టీకి పెద్ద సమస్యగా మారుతోంది.  కేంద్ర మంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలు లేరు. ఇతర పార్టీల నుండి నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలని అనుకుంటే అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే మహాయితే 35 నియోజకవర్గాలకు మించి గట్టి అభ్యర్థులు లేరు. ఉన్న గట్టి అభ్యర్ధుల్లో కూడా గ్రూపు గొడవలు బాగానే పెరిగిపోయియి.  తెలంగాణాలో ప్ర‌స్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌లంగానే వుంది. బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్నఅభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. నిజామాబాద్ స‌భ‌లో మోదీ రెచ్చిపోయి కేసీఆర్‌ను విమ‌ర్శించినా అంత‌గా ఎఫెక్ట్ క‌నిపించ‌లేదు. ఎందుకంటే మ‌జ్లిస్ పార్టీ బిజెపి పార్టీ తిట్టుకున్న‌ట్లే, అదే త‌ర‌హాలో బిజెపి బిఆర్ ఎస్ గ్రాఫ్ పెంచ‌డానికి మోదీ ప్ర‌య‌త్నించార‌నే చ‌ర్చ అయితే  జ‌రుగుతోంది. మ‌జ్లిస్ పార్టీ బిజెపి గ్రాఫ్ పెంచ‌డానికి ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తుందో అదే త‌ర‌హాలో బి ఆర్ ఎస్ గ్రాఫ్ పెంచ‌డానికే మోదీ రెచ్చిపోయార‌నే చ‌ర్చ తెలంగాణాలో జ‌రుగుతోంది.  కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే  అధికార బీ ఆర్ ఎస్ కాస్తంత డల్ గా కనిపిస్తుంది.  చేతులు ఎత్తేసినట్లుగా ప్రచారం జరుగుతున్నా..  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. తమ వద్ద సిద్ధం చేసిన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీయనున్నట్లుగా తెలుస్తోంది.   ప్ర‌స్తుతం గ్రౌండ్ లెవెల్లో చూస్తే  రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. బి‌ఆర్‌ఎస్ కు, ఈ సారి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వనుంది. ఇక బి‌జే‌పి 10 శాతం లోపు ఓట్లకు పరిమితమై, అక్క‌డ‌క్క‌డ‌ కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా బి‌జే‌పి రావడం కష్టమే.  మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల యుద్ధం అనేది ప్రధానంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరిగేలా క‌నిపిస్తోంది.   ఎన్నిక‌ల నేప‌థ్యంలో చాలా స‌ర్వేలైతే వ‌స్తున్నాయి. కొన్ని స‌ర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, మ‌రి కొన్ని స‌ర్వేల్లో బీ ఆర్ ఎస్‌కు అనుకూలంగా వున్నాయి.  ఇలా ఏ సర్వే చూసుకున్న బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించి అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.  

చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విజయవాడలోని ఏసీబీ కోర్టు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్  గురువారం (అక్టోబర్ 5)తో ముగియనుండగా ఆ రిమాండ్ ను   ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. అయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుల విచారణ సందర్భంగా  ఇటు చంద్రబాబు, అటు సీఐడీ తరఫు న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు.   స్కిల్ కేసులో చంద్రబాబుకు విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దానిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక చంద్రబాబు బెయిలు పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఏసీబీ కోర్టు విచారణను శుక్రవారం (అక్టోబర్ 6)కు వాయిదా వేసింది. కాగా చంద్రబాబు తరఫున ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున   అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

జగన్ హస్తిన పర్యటన సరే.. మోడీ, షా అప్పాయింట్ మాటేమిటి?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ఒక రోజు ముందుకు జరిగింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం కాకుండా ఒక రోజు ముందే ఆయన హస్తినకు బయలుదేరారు. ఆయన హస్తిన పర్యటన సరే.. అయితే వైసీపీ ప్రచారం చేసుకుంటున్న విధంగా జగన్ కు ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు కన్ ఫర్మ్ అయ్యాయా అంటూ  అనుమానమే అంటున్నారు పరిశీలకులు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆయనను ఏపీ సీఐడీ స్కిల్ కేసులో అరెస్టు చేసింది. ఆ అరెస్టు అక్రమమంటూ రాజకీయాలకు అతీతంగా దేశ వ్యాప్తంగానే కాదు, విదేశాలలో సైతం ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సరే అరెస్టు తరువాత ఆయన క్వాష్ పిటిషన్ ను తొలుత ఏసీబీ కోర్టు, తరువాత హైకోర్టు కొట్టివేశాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. మరో వైపు మరిన్ని కేసులలో ఆయనను విచారించాలంటూ కోర్టులో పీటీ వారంట్లు దాఖలు చేసింది.అదలా ఉండగా..  జగన్ విదేశీ పర్యటన నుంచి ఇలా వచ్చీ రాగానే హస్తిన  పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు తీసుకున్నారనీ, చంద్రబాబు అరెస్టు, స్కిల్ కేసులో ఆయన పాత్ర తదితర అంశాలపై వారికి వివరిస్తారనీ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఏమయ్యిందో కానీ ఆయన హస్తినకు వెళ్లలేదు. అసలా ఊసే ఎత్తలేదు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై కేంద్రం పెద్దలు స్పందించనూ లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక  కేంద్రం పెద్దల హస్తం ఉందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. అయితే ఆ విషయంపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి విమర్శలూ, వ్యాఖ్యలూ రాలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం బాహాటంగా.. చంద్రబాబు అవినీతి రుజువైంది కనుకనే బీజేపీ పెద్దలు (మోడీ, షా)లు చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. అన్నిటికీ  మించి మరిన్ని అరెస్టులు అంటూ పేర్లు  చెబుతూ హడావుడి చేశారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ  సీఐడీ చీఫ్ నారా లోకేష్ ను సైతం అరెస్టు చేస్తామంటూ మీడియా సమావేశంలోనే ప్రకటించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రకంపనలు హస్తిననూ కుదిపివేయడంతో కేంద్రం పెద్దలు జగన్ తీరుపై ఒకింత గుర్రుగా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముందుగా శుక్రవారం (అక్టోబర్ 6)హస్తినకు బయలుదేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఒక రోజు ముందే హడావుడిగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హస్తినలో ఆయన కార్యక్రమాల షెడ్యూల్ చూస్తే మోడీ, షాలతో భేటీ ఉన్నట్లు కనిపించడం లేదు. సీఎంవో ప్రకటించిన మేరకు జగన్ గురువారం (అక్టోబర్ 5) ఉదయం హస్తినకు బయలు దేరి వెడతారు. ఆ రోజుకు ఆయన ఎవరెవరిని కలుస్తారు, ఆయన కార్యక్రమాలేమిటి అన్నది ఆ ప్రకటనలో లేదు. గురువారం రాత్రి (అక్టోబర్ 5) ఆయన నంబర్ 1 జన్ ఫథ్ నివాసంలో బసచేస్తారని మాత్రమే ఉంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 6) ఉదయం ఆయన విజ్ణాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొని తిరిగి జన్ పథ్ నివాసానికి చేరుకుంటారు.  అంతకు మించి జగన్ హస్తిన పర్యటన గురించి సీఎంవో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఏమీ లేదు. ఒక వేళ నిజంగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీలు ఖరారై ఉంటే సీఎంవో కచ్చితంగా ఆ వివరాలను వెల్లడించి ఉండేది. కానీ అలా జరగక పోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో అప్పాయింట్ మెంట్ క న్ ఫర్మ్ అన్నది వైసీపీ ప్రచారార్భాటంలో భాగంగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ కు మోడీ, షా మద్దతు ఉందని చాటుకోవడానికి  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే జగన్ హస్తిన పర్యటనలో వారితో భేటీ కన్ఫర్మ్ అన్న ప్రాచారం సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే హస్తిన వెళ్లి మోడీ, షాలతో భేటీ కావాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వారి అప్పాయింట్ మెంట్లు దొరకలేదని హస్తిన వర్గాల సమాచారం. చివరాఖరకు ఎట్టకేలకు గురువారం (అక్టోబర్ 5) ఆయన హస్తిన వెళ్లినా హోంశాఖ సమీక్ష ఉండటంతో నే వెడుతున్నారు. హస్తినలో ఉండే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించే అవకాశాలున్నా.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వెనుక మోడీ, షాల ఆశీస్సులు, ప్రొత్సాహం ఉన్నాయన్న  అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నందున వాటికి మరింత బలం చేకూర్చేలా జగన్ కు మోడీ, షాలు అప్పాయింట్ మెంట్ ఇచ్చే అవకాశాలు దాదాపు శూన్యం అని అంటున్నారు.  

కేసీఆర్ చీటర్.. ఈటల ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చీటర్ గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కేసీఆర్ వెంట నడిచిన ఈటల తరువాత కేసీఆర్ తో విభేదించి..పార్టీ నుంచి బహిష్కృతుడైన సంగతి విదితమే. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే 2018లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటలకు స్థానం కల్పించలేదు. అప్పటికే కేసీఆర్ విధానాలపై ఈటల తన అసంతృప్తి వ్యక్తం చేశారనీ, అందుకే దూరం పెట్టారనీ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అనివార్యంగా మంత్రివర్గ విస్తరణలో ఈటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నా.. ఆ తరువాత ఆరోపణల నెపంతో ఆయన మంత్రిపదవి నుంచీ, పార్టీ నుంచీ కూడా తొలగించారు.  అనంతరం ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి సత్తా చాటారు. అదే సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బండి సంజయ్ తో విభేదాలు వచ్చినా, ఒక దశలో కమలం గూటిలో ఈటల ఉక్కపోతకు గురౌతున్నారు, ఆయన ఏ క్షణంలోనైనా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారన్న వార్తలు వచ్చినా పార్టీ హైకమాండ్ మాత్రం ఈటలకు మద్దతుగా నిలిచింది. చేరికల కమిటీని ఏర్పాటు చేసి మరీ ఈటలకు ఈ కమిటీ నేతృత్వ బాధ్యతలు అప్పగించింది.  ఆ తరువాత పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఒక విధంగా చెప్పాలంటే అత్యంత కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈటల బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను, వాటిని విస్మరించిన తీరును గుర్తు చేస్తూ  విమర్శల దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ను దొంగ వాగ్దానాలతో జనాలను మోసం చేసిన ఛీటర్ గా అభివర్ణించారు. దళితుడిని సీఎం చేస్తానని చేసిన వాగ్దానం, దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇస్తానంటే చేసిన వాగ్దానాలను కేసీఆర్ విస్మరించారనీ, అలాగే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అంటూ వాగ్దానం చేసి ఆ తరువాత భూమి లేదంటూ దానినీ అటకెక్కించేశారనీ.. ఇలా పబ్బం గడుపుకోవడం కోసం వాగ్దానాలు చేయడం ఆ తరువాత వాటిని విస్మరించడం ద్వరా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్ నంబర్ వన్ గా మారానని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు.  ప్రధాని మోడీపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించి మర్యాద తెలియని నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ బాటలోనే ఆయన కేబినెట్ మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని ఈటల అన్నారు. మాట ఇవ్వడం, తరువాత మరచిపోవడం రివాజుగా మార్చుకున్న కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి మారుపేరులా మారితే.. అన్నమాటకు కట్టుబడి విశ్వసనీయతకు మరోపేరుగా మోడీ నిలిచారన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు తహతహలాడారన్న మోడీ మాటలను జనం విశ్వసిస్తున్నారనీ, తాను ఎన్డీయేలో చేరేందుకు సంసిద్ధుడైనందునే మోడీ చెప్పిన మాటను కేసీఆర్ ఇప్పటి వరకూ ఖండిం చలేదని ఈటల పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావం తరువాత కుటుంబ సమేతంగా అప్పటి కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన కేసీఆర్ బీఆర్ఎస్( అప్పటికి టీఆర్ఎస్) ను కాంగ్రస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పిన విషయం నిజం కాదా అని నిలదీశారు.   

నందమూరి కుటుంబంలో జూనియర్ ఏకాకేనా?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో తెలుగుచలనచిత్ర పరిశ్రమ ప్రముఖుల మౌనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై తెలుగుదేశం పార్టీలోనే కాకుండా, సామాన్య జనంలో కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత కేఎస్ రామారావు, నటుడు, దర్శకుడు రవిబాబు వంటివారితో పాటు, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనటుడు, జగన్ అభిమాని విశాల్  కూడా స్పందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండించారు. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడేందుక ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రోత్సాహమే కారణమనడంలో సందేహం లేదు. అటువంటిది చంద్రబాబునాయుడిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలూ ఎవరూ పెద్దగా స్పందించలేదు. నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్లుగా మౌనంగా మిగిలిపోయారు. కారణాలేమైనా చిత్ర పరిశ్రమ నుంచి  సరైన స్పందన లేకపోవడంపై మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మిగిలిన వారి విషయం వేరు జూనియర్ ఎన్టీఆర్ విషయం వేరు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండిచకపోవడం, కనీస స్పందన కూడా కరువవ్వడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తీరుపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఐడోంట్ కేర్ అంటూ బదలివ్వడాన్ని సమర్ధిస్తున్నారు   రాజకీయ విభేదాలను విస్మరించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారంటూ మీడియా సమావేశంలో ఘాటు విమర్శలు చేశారనీ, అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట్లాడకపోవడం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదనీ అంటున్నారు. అంతే కాకుండా గతంలో కూడా... అంటే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును జగన్ సర్కార్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందన సముచితంగా లేదనీ, కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా ఆయన స్పందన ఉందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   అయినా మాటకు ముందు ఒకసారి మాటకు తరువాత ఒక సారి తాత.. తాత అంటూ ఎన్టీరామారావును స్మరించుకుని భక్తి గౌరవాలను చాటుకునే జూనియర్ ఎన్టీఆర్.. ఆయన పెట్టిన పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని నిలదీస్తున్నారు.   తన కట్టె కాలే దాకా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అది ఆయన ఇష్టం.  ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాలని కూడా ఎవరూ కోరడం లేదు.   అయితే నందమూరి  తారకరామారావు  పేరును చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నా, పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలన్న కుట్రలు జరుగుతున్నా, నందమూరి కుటుంబ సభ్యులకు అవమానం జరిగినా.. నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జూనియర్ తీరును మాత్రమే తప్పుపడుతున్నారు.  చలన చిత్ర పరిశ్రమను పాదాక్రాంతం చేసుకోవడం కోసం జగన్ సర్కార్ సినీ ఇండస్ట్రీని ఎంతగా ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా జూనియర్ ఒక అగ్ర హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కనీస స్పందనను, వ్యతిరేకతను వ్యక్తం చేయకపోవడాన్ని ఆయన అభిమానులు సైతం తప్పుపడుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా అధికారిక పార్టీ నేతలు  తన మేనత్త భువనేశ్వరిని  అవమానిస్తే.. ‘అలా మాట్లాడటం తప్పు’ అంటూ ఏదో  మొక్కుబడిగా చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు తాత స్థాపించిన పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేస్తే కనీస స్పందన కూడా లేకుండా మౌనంగా ఉండటమేమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన హీరోయిజం కేవలం  సినిమాలకే పరిమితమా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.     ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఏకతాటిపై నిలబడి ఖండిస్తున్నా.. ఆ కుటుంబ సభ్యుడిగా జూ.ఎన్టీఆర్‌ కనీస స్పందన లేకుండా మౌనంగా మిగిలిపోవడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య ‘ఐ డోంట్ కేర్’ అని అనడాన్ని సమర్ధిస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని అధికార వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నా   జూనియర్ ఎన్టీఆర్ కిమ్మనకుండా ఊరుకోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. తరచూ వైసీపీ ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు వేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాలను జూనియర్ ఖండిచకపోవడాన్ని ఆయన అభిమానులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ సర్కార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై తన వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన అభిమానులే కాదు.. సామాన్య జనులు కూడా కోరుతున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకున్నా.. నందమూరి కుటుంబ సభ్యుడిగానైనా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించి, అందుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నారు.  

దాడి జరిగితే చూద్దాం.. ఫిర్యాదు ఎందుకు చేశారు.. పవన్ కు పోలీసుల నోటీసు

ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. భరోసా ఇవ్వాల్సిన పోలీసులు ఫిర్యాదు దారుడికే నోటీసులు ఇస్తున్నారు. భద్రత కల్పించాల్సిన వారు.. మీకు భద్రత ఎందుకు కల్పించాలో చెప్పండంటూ నిలదీస్తున్నారు. దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ స్పష్టమైన సంకేతాలు చూపి మరీ భద్రత కోరితే.. ఆ ఆధారాలు చాలవు.. ముందు దాడి జరగనివ్వండి తరువాత చూద్దాం అంటున్నారు. ఏపీలో పోలీసులు విపక్షాల విషయంలో వ్యవహరిస్తున్న తీరిది. పోనీ  దాడి జరిగిన తరువాతైనా బాధితులవైపు నిలబడతారా అంటే అదీ లేదు. బాధితులపైనే కేసులు. నిరసన తెలపడంలో దాడులు ఒక భాగమంటూ భాష్యాలు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా లేదు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా పెడనలో తనపై దాడి జరిగే అవకాశాలున్నాయనీ, ఇందుకు సంబంధించి తన వద్ద  విశ్వసనీయ సమాచారముందనీ భద్రత కల్పించాలనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకోగానే  పోలీసులు చేయాల్సిన పని భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం, దాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేయడం, దాడులు చేస్తారన్న అనుమానం ఉన్న వారిని అదుపులోనికి తీసుకోవడమో, నియంత్రించడమో చేయాలి. కానీ మన పోలీసులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. అసలు  మీ మీద దాడి జరుగుతుందని భావించడానికి ఉన్న ఆధారాలేమిటో చూపండి అంటూ పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.  ఇంతకీ పవన్ కల్యాణ్ తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. అధికార పార్టీకి చెందిన వారే పెడనలో అసాంఘిక శక్తులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఠాట్ అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడమేమిటని పోలీసులకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. అందుకే రివర్స్ లో పవన్ కల్యాణ్ కు ఆధారాలు చూపడం అంటూ నోటీసులు ఇచ్చారు.  అధికార పార్టీ విపక్షాలపై, విపక్ష నేతలపై, కార్యకర్తలపై, వారి కార్యాలయాలపై దాడులు జరపడం కొత్తేమీ కాదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే జోగి రమేష్.. (ఆయన ఇప్పుడు మంత్రి) ఆధ్వర్యంలో జరిగిన దాడి, అంతకు ముందు, ఆ తరువాత  విపక్షాలపై జరిగిన దాడుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన ఫిర్యాదుకు వేరే ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదు. పైపెచ్చు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి నేతృత్వం వహించి మంత్రిగా ప్రమోషన్ పొందిన జోగి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పెడన. అటువంటి పెడనలో తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేస్తే.. ఆ అవకాశాలపై ఆధారాలివ్వండి అంటూ పోలీసులు పవన్ కల్యాణ్ కు ఎదురు నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మందికి కాదంటూ జనసేనానికి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హితవచనాలు చెప్పారు. ముందు దాడి జరగనివ్వండి.. ఆ తరువాత ఫిర్యాదు చేయండి అన్నదే ఆయన హిత వచనాల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ  పోలీసులు అధికార పార్టీకి చెందిన వారి ఫిర్యాదులు తప్ప మరెవరి ఫిర్యాదులూ పట్టించుకోరనీ, అందుకే దాడులు చేసి.. దాడికి గురైన వారిపై వైసీపీ మూకలు ఇస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారనీ అంటున్నారు. అంతే తప్ప.. దాడి జరగకుండా తాము భద్రత కల్పిస్తామన్న భరోసా మాత్రం విపక్షాలకు ఇవ్వడానికి ఏపీ పోలీసులుర రెడీగా లేరు.  దాడి జరుగుతుందనడానికి ఆధారం చూపమంటూ తామిచ్చిన నోటీసుకు పవన్ కల్యాణ్ నుంచి సమాధానం రాలేదని పేర్కొంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పవన్  కల్యాణ్ కు మళ్లీ  నోటీసులు ఇచ్చారు. సరే చివరకు జరిగిందేమిటంటే.. పెడనలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను  వైసీపీ శ్రేణులు తొలగించారు. ఆ సందర్భంగా జనసేన, వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది.   వైసీపీ కౌన్సిలర్‌ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. అంగళ్లు, భీమవరం, మాచర్ల ,నందిగామ, కుప్పం సహా పలు ప్రాంతాలలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులకు పాల్పడింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోనికి తీసుకుని తరువాత వదిలేయడం, దాడికి గురైన వారిపై మాత్రం హత్యాయత్నం  సహా తీవ్రమైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం అన్నది ఏపీ పోలీసులకు రివాజుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనలో తారకరత్న భార్య

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై నందమూరి తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి స్పందించారు. నారా చంద్రబాబు నాయుడికి ఆయన కుటుంబానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చే వరకు తమ కుటుంబం పోరాడుతూనే ఉంటుందన్నారు. అలాగే నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డిల కుమార్తె నిషిక సైతం తనదైన శైలిలో స్పందించారు. తన తాతగారు చంద్రబాబు నాయుడికి లక్షలాది మంది మద్దతు తెలుపుతున్నారని.. అలాగే తాను సైతం తన తాత గారికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి తారక రత్న తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశంలోనే ఉన్నారని... తెలంగాణలో ఆయన పార్టీ ప్రచారం  నిర్వహించారని ఈ సందర్భంగా నిషిక గుర్తు చేసుకున్నారు.   చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని, ఆయనకు న్యాయం జరగాలంటూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఇటీవల ఆందోళన చేపట్టారు. ఇందులో నందమూరి, నారా ఫ్యామిలీతోపాటు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఆందోళనలో నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలేఖ్య రెడ్డి మాట్లాడుతూ.. తన భర్త నందమూరి తారకరత్న జీవించి ఉంటే.. ఆయన సైతం ఈ దీక్షలో పాల్గొనే వారని అన్నారు.      తారకరత్న కుటుంబాన్ని బాగా ప్రేమించే వారని... అలాగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ , పార్టీ ప్రచారం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారని.. టీడీపీకి ఆయన మద్దతు ఎల్లప్పుడు ఉండేదని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్ గారితోపాటు చంద్రబాబు నాయుడు గారిలో కష్టపడి పని చేసే తత్వాన్ని తారకరత్న బాగా ఇష్టపడేవారని... ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు బాటను తన భర్త తారక రత్న అనుసరించారని.. ఇక తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చివరి నిమిషం వరకు ఆలోచిస్తునే ఉండే వారని.. అలాంటి తారకరత్న మధ్య లేకపోవడం బాధాకరమని ఆలేఖ్య రెడ్డి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.  అలేఖ్య రెడ్డిని నందమూరి తారకరత్న ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే అలేఖ్య రెడ్డి వైయస్ఆర్ సీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు.  2023, జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నందమూరి తారక రత్న తీవ్ర అనారోగ్యానికి గురై కుప్పకూలి పోయారు. దీంతో ఆయన్ని బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ చికిత్స పొందుతూ.. తారకరత్న తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో అంటే.. తారక రత్న ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయన మరణం.. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు విజయసాయిరెడ్డి.. అలేఖ్య కుటుంబానికి అన్ని తానై వ్యవహరించారు. ఆ క్రమంలో తారకరత్న సమీప బంధువులు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్, నందమూరి బాలకృష్ణలతో విజయసాయిరెడ్డి అత్యంత దగ్గరగా మెలిగిన విషయం విదితమే.  అయితే ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ.. విజయసాయిరెడ్డి వ్యంగ్య బాణాలు సంధిస్తు ఉండేవారు. కానీ తారకరత్న మరణం తర్వాత.. చంద్రబాబు, లోకేశ్‌ని టార్గెట్ చేయడం దాదాపుగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌కు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఓ చర్చ సైతం నాడు హల్ చల్ చేసింది.  ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నారా చంద్రబాబు, నారా లోకేశ్‌పై నిప్పులు చెరుగుతుండడం ప్రారంభించారు.  ఆ తర్వాత.. అంటే ఇటీవల గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందంటూ.. జగన్ ప్రభుత్వం ఆరోపిస్తూ.. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసింది.   ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగానే ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో అలేఖ్య రెడ్డి, నిషికా పాల్గొన్నారు. అయితే విజయసాయిరెడ్డి సమీప బంధువు అలేఖ్య రెడ్డి.. సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలవడంపై ఫ్యాన్ పార్టీలో అప్పుడే గుసగుసలు మొదలైయ్యాయి.

రో(త)జాకీయం!

రాజకీయాన్ని రాజకీయంగా.. రాజకీయంలా చూడాలి. అలా అయితే రాజకీయం.. రాజకీయం అవుతుంది. అంతేకానీ.. ఇంట్లో గుట్టుగా తమ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ.. వాళ్లు బాగుంటే మనం బాగుంటామనుకొనే ఆడవాళ్లను సైతం బయటకు లాగేసి.. వాళ్లు ఇలాంటి వాళ్లు.. వీళ్లు అలాంటి వాళ్లంటూ.. ఇంటికే పరిమితమైన ఆడవారి మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టి మరీ దగుల్బాజీ రాజకీయం చేస్తూ.. ఓ విధమైన సైకో ఆనందం పొందడం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పాలక పక్షానికి అలవాటుగా మారి పోయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి   రోజాపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన్ని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కావడం.. అలాగే ఈ అంశంపై మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తూ.. రోదించారు.  ఈ నేపథ్యంలో గతంలో  రోజా.. బుల్లెతెరపై పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ  సందర్భంగా  రోజా ఓ చర్చా కార్యక్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌తో మాట్లాడిన అభ్యంతరక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నావ్? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టూ  ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా చేరుకున్న సమయంలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ఆర్కే రోజు వ్యవహరించిన తీరు.. దీంతో నాటి అసెంబ్లీ స్పీకర్ కొడెల శివ ప్రసాదరావు.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సాక్షిగా రోజా తెలుగుదేశం మహిళా నాయకురాళ్లు వంగలపూడి అనిత, పీతల సుజాతలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.  ఏమమ్మా రోజా.. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీ పార్టీలోని మంత్రులు ఎంత మంది ఎన్ని బండ బూతులు మాట్లాడినా.. మీ పార్టీలోని పెద్దలు కానీ.. అగ్రనేతలు కానీ.. పోనీ పార్టీ అధ్యక్షుడు కానీ.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు.. అని ఎన్నడైనా అన్నారా? రాజకీయాన్ని రాజకీయంలాగా చూడండి.. రాజకీయంగా ఎదుర్కొండి అంతేకానీ.. ఇంట్లోని మహిళలపై వ్యక్తిగత విమర్శలకు దిగ వద్దంటూ.. ఎవరైనా.. ఎప్పుడైనా చెప్పారా? అలా చెప్పి ఉంటే... ఈ రోజు నీవు ఇలా ప్రెస్‌మీట్ పెట్టి.. కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి ఉండేది కాదని  నెటిజన్లు పేర్కొంటున్నారు.  ఓ నెటిజన్ అయితే.. అడు చెప్పాడా?... వీడు చెప్పాడా? నీ అమ్మ మోగుడు చెప్పాడా? అంటూ ఓ మంత్రిగారు.. ఏకంగా మీడియా ముందే తొడ కొట్టి మీసం మెలేసి,.. అరిచి పెడబొబ్బలు పెట్టి మరో మంత్రి, ఇక మరో ఆమాత్యుడైతే అయితే.. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆర్చుకు తీర్చుకొని ఛలోక్తులు విసురుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం గుర్తులేవా అని నిలదీశాడు.  జగన్ మలి కేబినెట్‌లో చోటు దక్కించుకొన్న నోరున్న మంత్రుల్లో ఒకరు అదీ అసెంబ్లీలోనో.. బహిరంగ సభలో తెలియక.. మైకు కనబడగానే మైకాసురుడిలాగా మారిపోయి.. మాస్ హిస్టిరియాతో ఊగిపోవడం.. అలాగే ఇంకో మంత్రివర్యుడు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందంటే.. ఆ ఒక్కటి అడక్కు అంటూనే.. సంక్రాంతి పండగకు జనంలో కలిసి స్టెప్పులేస్తూ.. ఊగిపోవడమే కాకుండా.. ఆనంద తాండవం అంటే ఇలా ఉంటుందంటూ.. తాను నడిరోడ్డుపై వేసిన చిందులకు కొత్త పేరు పెట్టి మరీ ప్రాచుర్యం పొందడం.. ఇలా జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రుల గురించి చెప్పుకొంటూ పోతే.. ఓ పెద్ద పురాణమే అవుతుందని.. అందులో ఏ మాత్రం సందేహలే లేదని పేర్కొంటున్నారు.  ఇక   రోజా.. తనపై టీడీపీ నేత విమర్శలకు కన్నీటి పర్యంతం కావడంతో ఇంకో నెటిజన్ అయితే తనదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత   రోజా.. అసెంబ్లీకి ఎన్ని సార్లు హాజరయ్యారో ఏమో కానీ.. అలాగే ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఎన్ని సార్లు  పర్యటించారో తెలియదు కానీ... మంత్రిగా తిరుమలలో శ్రీవారిని మాత్రం  రికార్డు స్థాయిలో దర్శించుకొన్నారని..  కామెంట్ చేశాడు.  మరో నెటిజన్ అయితే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన తర్వాత.. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనే కాకుండా ఆయన ఫ్యామిలీపైన చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను.. ఓ మహిళగా  రోజా ఆ రోజే ఖండించి ఉంటే.. నేడు  ఇలా మీడియా ముందు కన్నీటి రోజాయణం వినించే పరిస్థితి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నాడు.  అయినా... ఇంట్లో చిన్న పిల్లవాడు తప్పు మాట్లాడితే.. మూతి మీద ఒకటి కొట్టి.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అని పెద్దవారు చెబితే... ఆ పిల్లవాడు మరోసారి అలా మాట్లాడడానికి జంకుతారని.. ఈ విషయం రోజాకూ తెలుసునని.. కానీ వైసీపీలో రోజా సహా పలువురు ప్రజా ప్రతినిధులు.. బూతుల పంచాంగమే మన పదవి యోగానికి ఆదృష్ట మంత్రమని అనుకొని పఠించారో ఏమో కానీ.. మీడియా ముందు అయినా.. వేదిక మీద అయినా.. ప్రజల ఎదుట అయినా.. మాస్ హిస్టిరియాతో ఊగిపోతూ మాట్లాడడం..  మినహా   మరో పని చేయడంలేదని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటి వరకూ దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో  వైసీపీ ప్రజా ప్రతినిధులు  మా బూతులే మా భవిష్యత్తుఅన్నట్లుగా కదం తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు.   జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాని నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా.. అలాగే జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు  రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా లు, అలాగే  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, చివరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం లాంటి ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలు వింటుంటే.. జగన్ ప్రభుత్వం ఇంతగా అపకీర్తిని,అప్రతిష్టను మూట కట్టుకుందంటే.. ఆ పాపం ఎవరిదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆ పాపంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ది సింహభాగమనీ, ఆ తరువాత పార్టీలోని మంత్రుల నుంచీ కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ ఆ పాపంలో భాగముందని చెబుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ నామ స్మరణతో చెక్క భజన చేస్తుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం చేతులు అడ్డం పెట్టుకొని, భుజాలు ఎగరేసుకొంటూ మరి ముసి ముసి నవ్వులు చిందించడం చూస్తుంటే ఈ విషయం ప్రస్ఫుటంగా అర్థమవుతోందని నెటిజన్లు సోదాహరణగా పేర్కొంటున్నారు.