తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్దమైంది  తాజాగా, తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. అభ్యర్థులను కూడా త్వరలో వెల్లడించనుంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు... 1. కూకట్ పల్లి,2. పటాన్ చెరు,3. ఎల్బీ నగర్,4. సనత్ నగర్,5. ఉప్పల్, 6. కుత్బుల్లాపూర్, 7.శేరిలింగంపల్లి, 8. మల్కాజిగిరి, 9. మేడ్చల్ ,10. మునుగోడు,11. ఖమ్మం, 12. వైరా,13. నాగర్ కర్నూలు,14. కొత్తగూడెం,15. అశ్వరావుపేట,16. పాలకుర్తి,17. నర్సంపేట,18. స్టేషన్ ఘన్ పూర్, 19.హుస్నాబాద్, 20. రామగుండం,21. జగిత్యాల,22నకిరేకల్, 23. హుజూర్ నగర్, 24.  మంథని, 25.కోదాడ, 26. సత్తుపల్లి, 27.వరంగల్ వెస్ట్,28. వరంగల్ ఈస్ట్, 29. ఖానాపూర్,30. పాలేరు,31. ఇల్లందు,32. మధిర కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఏపీలో ఉన్నది ఏ రాజ్యాంగం? వైసీపీకి చట్టాలు వర్తించవా?

ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమన్యాయం అన్న పదానికే అర్ధం కనిపించడం లేదు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తున్నదన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ వ్యవస్థ విపక్ష నేతల పట్ల ఒకలా.. అధికార పార్టీకి చెందిన వారి విషయంలో మరోలా వ్యవహరిస్తున్నది. తాజాగా తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు విషయంలో పోలీసు శాఖ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలౌతున్నది. బండారు అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానానికే తప్పుడు సమాచారం ఇచ్చారని తేటతెల్లమైంది. నిబంధనలతో పని లేదు.. అరెస్టు చేయాలని జగన్ సర్కార్ అనుకుంటే చాలు.. పోలీసులకు నిబంధనలు, ప్రొసీజర్స్ గుర్తుకు రావు. ఏదో విధంగా అరెస్టు చేసేయడమే. చంద్రబాబు విషయంలో ఏపీ సీఐడీ అలాగే వ్యవహరించింది. సాంకేతిక అంశాల కారణంగా గత పాతిక రోజులుగా చంద్రబాబు నిర్బంధంలోనే ఉన్నారు. న్యాయనిపుణులు సహా అందరూ చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ఉద్ఘాటిస్తూనే ఉన్నారు.  తాజాగా పోలీసులు బండారు సత్యనారాయణను అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టడంతో బండారు సోదరుడు హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. కానీ పోలీసులు బండారు సత్యనారాయణకు నోటీసులు ఇచ్చినట్లు న్యాయమూర్తికి తెలిపడంతో ఆయన విచారణ చేయలేదు. అదే అదునుగా తీసుకుని పోలీసులు బండారును అరెస్టు చేశారు. వాస్తవానికి పోలీసులు నిజంగానే నోటీసులు ఇచ్చి ఉండే బండారును విచారణకు పిలవాలి తప్ప అరెస్టు చేయడానికి అవకాశం లేదు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు.   ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఎన్నికల వేళ... 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి.  నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. శిశశంకర్ కమిటీ సిఫారసు మేరకు కొత్త పీఆర్సీ ప్రకటించనుంది. అప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి ఐదు శాతం ఐఆర్ ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారికే ఈ ఐఆర్‌ వర్తించనుంది. రాష్ట్ర జ్యుడిషియల్‌, ఆల్‌ ఇండియా సర్వీసుల వారికి, కాంట్రాక్డు ఉద్యోగులు, సొసైటీలు, స్వతంత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారికి వర్తించదని స్పష్టంచేసింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల మంది, మరో 3 లక్షల మంది పింఛన్‌దారులకు ఐఆర్‌ వర్తిస్తుంది. దీని అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా ఆర్థికభారం పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీని అమలుచేయడం ఇది మూడోసారి.

స్కిల్ స్కాంలో ఉండవల్లి పిటిషన్ పై విచారణ ఎప్పుడంటే?

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందంటూ ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తూ.. ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంవద్రబాబునాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే స్కిల్ స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు ఇంకా నోచుకోలేదు. ఈ పిటిషన్ విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు వచ్చింది. అయితే ఆ బెంచ్ లో ఒకరైన జస్టిస్  రఘునందన్ రావు రఘునందనరావు నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు.   దీంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి ఉంది. ఇక జస్టిస్ రఘునందనరావు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారిలో కొందరి తరఫున తాను గతంలో వాదించి ఉన్నాననీ, అందుకు ఈ కేసు విచారణ నుంచి తనను తప్పించాలని పేర్కొన్నారు. కాగా ఉండవల్లి తన పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,   చంద్రబాబునాయుడు, ఈడీ, డిజైన్ టెక్, సీమెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లను చేర్చారు. ఉండవల్లి చేర్చిన ప్రతివాదులలో  కొందరి తరపున గతంలో  జస్టిస్ రఘునందన్ రావు వాదించారు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఆయన ఉండవల్లి కేసు విచారణ నుంచి వైదొలిగారు. దీంతో కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసిన తరువాత విచారణ తేదీ నిర్ణయమౌతుంది.  

తెలుగు రాష్ట్రాల్లో తటస్థులు డిసైడైపోయారు! అందరి నోటా ఐయామ్ విత్ బాబు మాట!

ఎన్నికలు హోరాహోరీ జరుగుతే జయాపజయాలను నిర్ణయించేది తటస్థుల ఓట్లే అని అంటారు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా (కొన్ని మీడియా సంస్థలు ఇఎన్డిఐ అలయెన్స్ అంటున్నాయి) కూటముల మధ్య హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ కూటమి వైపు తటస్థులు మొగ్గు చూపితే ఆ కూటమి విజయం సాధిస్తుందన్న మాట. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో కూడా తటస్థుల మొగ్గే ఏ రాష్ట్రంలోనైనా తదుపరి ప్రభుత్వం ఎవరిదన్నది నిర్ణయిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ  ఒకే ఒక్క సంఘటన తటస్థులనే వారే లేకుండా చేసింది. ఔను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తటస్థులు లేరు. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో సైతం గత పాతిక రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా సేవలందించిన నాయకుడిని ఆధారాలు లేకుండా, కేవలం ఆరోపణలతోనే అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఐదేళ్లు పని చేసిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు, అనితర సాధ్యమైన దార్శనికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ అటువంటి నేత అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తటస్థులు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో తటస్థులు బేషరతుగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే చంద్రబాబు అరెస్టు తరువాత రోజు రోజుకూ తెలుగురాష్ట్రాలలో తెలుగుదేశంకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అదే సమయంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీపై, ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఐటీ  ఉద్యోగులతో మొదలైన నిరసనల పర్వం.. ఆ తరువాత సమాజంలోని అన్ని వర్గాలలోనూ కనిపించింది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కూడా చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండించాయి. అలా ఖండించిన పార్టీలలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీల ఖండనలు పార్టీ పరంగా కాకుండా ఆయా నాయకుల వ్యక్తిగత స్థాయిలోనే ఉన్నాయి. బీజేపీ తెలంగాణ నాయకులు బండి సంజయ్ వంటి వారు చంద్రబాబు అరెస్టును ఖండించినా.. ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం కనీసం స్పందన కూడా లేకుండా ఉండిపోయింది. అలాగే  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో కూడా కొందరు నేతలు చొంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా ప్రత్యక్ష ఆందోళనల్లో కూడా పాల్గొన్న.. ఆ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడకు కేటీఆర్ మాత్రం స్పందించలేదు. హైదరాబాద్ ప్రగతిలో, పురోగతిలో అడుగడుగునా చంద్రబాబు ముద్రలు కనిపిస్తుంటాయని గతంలో స్వయంగా చెప్పిన కేటీఆర్.. ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలేమిటి? అంటూ మీడియా సమావేశంలో రుసరుసలాడారు కూడా.  ఆయన ఒక్క మాటతో తెలంగాణలోని ఆంధ్రసెటిలర్స్  భగ్గుమన్నారు. అప్పటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. ఈ పరిస్థితితో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయాయి. అంత వరకూ త్రిముఖ పోటీగా ఉన్న పరిస్థితి ఒక్క సారిగా ముఖాముఖీగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ పోటీలో ఉన్నట్లుగా కనిపించిన బీజేపీ సోదిలోకి లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. మోడీ మహబూబ్ నగర్ సభకు బీజేపీ సీనియర్లే డుమ్మా కొట్టారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో ఇట్లే అవగతం చేసుకోవచ్చు.  అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం అనూహ్యంగా బలోపేతమైంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 40 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయడమే కాకుండా.. పాతిక స్థానాలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో తప్పులో కాలేసినట్లు గ్రహించిన చంద్రబాబు అరెస్టు విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోయినా గొంతు సవరించుకున్నారు. అలాగే మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టుతో మాకేం సంబంధం అనడం నుంచి చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం అంటూ మాట మార్చారు. అయితే అప్పటికే నివారించడానికి వీలు లేనంత నష్టం జరిగిపోయింది, తటస్థులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలరైజ్ అయిపోయారు. చంద్రబాబు అరెస్టుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను నిలబెట్టిన విధానాన్నీ గుర్తు చేయడమే కాదు. అటువంటి నాయకుడి అరెస్టును ఖండిచే పాటి సంస్కారం, ధైర్యం లేని కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖాముఖీ పోరు అనివార్యమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పట్ల వ్యక్తమౌతున్న సానుకూలత బీఆర్ఎస్ కు తేరుకోలేని నష్టం చేకూర్చడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. జగన్ పట్ల వ్యతిరేకత చంద్రబాబు అరెస్టుకు ముందునుంచీ ఉన్నప్పటికీ ఆయన అక్రమ అరెస్టుతో ఒక్కసారిగా అది ద్విగుణీకృతం, అంతకంటే ఎక్కవ అయ్యిందని అంటున్నారు. ముఖ్యంగా తటస్థలు చంద్రబాబు అరెస్టుతో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ, చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ తటస్థుల మొగ్గు ఎటువైపు అన్న విషయంలో స్పష్టత లేదనీ, ఇప్పుడు స్పష్టత వచ్చేయడంతో అధికార పక్షానికి వచ్చే ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనీ అంటున్నారు. అరెస్టుకు ముందు వరకూ తటస్థుల మొగ్గుతో సంబంధం లేకుండా వైసీపీ ఓటమి ఖాయమన్న విశ్లేషణలు చేసిన పరిశీలకులు అరెస్టు తరువాత తటస్థుల మొగ్గు తెలుగుదేశం వైపే అని ఖరారు కావడంతో అధికార పార్టీ పని ఇక అయిపోయినట్లేనని చెబుతున్నారు. పోలింగ్ రోజున ఎటు మొగ్గు చూపితే ఆటే గెలుపు.

చంద్రబాబు స్వ్యాష్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం (సెప్టెంబర్3) విచారణ జరగనుంది.  జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రానుంది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించవద్దంటూ ఏపీ సర్కార్ ఇప్పటికే కేవియెట్ దాఖలు చేసింది.  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వెంటనే తన అరెస్ట్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పించారు. అయితే సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసి రిమాండ్ విధించింది. ఆ తరువాత చంద్రబాబు తరపున న్యాయవాదులు   ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో సిద్ధార్థ్ లూధ్రాతో పాటు హరీష్ సాల్వే కూడా వాదనలు విన్పించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  వాస్తవానికి సుప్రీంకోర్టులో గత బుధవారమే   జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ ధర్మాసనంలో విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మి అంటూ విచారణ నుంచి తప్పుకోవడంతో  విచారణ వాయిదా పడింది.   కేసు అత్యవసర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని త్వరగా విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ముందు ప్రస్తావించారు.   ఇరువర్గాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేసు విచారణను మంగళవారం(అక్టోబర్ 3)కు వాయిదా వేశారు.  ఈ కేసు విచారణను జస్టిస్ నిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది. 

బాబు అరెస్ట్ ఎఫెక్ట్.. జనాగ్రహం ధాటికి వైసీపీ బెంబేలు!

ఇటు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ యువగళం పాదయాత్ర, అటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వరస పర్యటనలు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడతల వారీ  వారాహీ యాత్రలు.. ప్రతిపక్ష నేతలు ఎక్కడ అడుగు పెట్టినా పోటెత్తుతున్న జనం.. జగన్ రెడ్డీ నాలుగేళ్ళలో చేసిందేంటో చెప్తావా అంటూ నిలదీస్తూ సవాళ్లు. నో డౌట్ ఈసారి తెలుగుదేశం విజయం పక్కా అని దాదాపుగా రాజకీయ వర్గాలు ఫిక్సయిపోయాయి. ఒకపక్కసొంత సర్వేలు సహా అన్ని సర్వేలూ వైసీపీ ఓటమి అనే చెబుతుండటంతో   వైసీపీకి దిక్కు తోచకుండా అయ్యింది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే మంత్రుల నోటి నుండి మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడిక్కడ వైసీపీ నేతలు మీడియా ముందుకు రావడం కూడా మానేసి మొహం చాటేస్తున్న పరిస్థితి.  ఏ జిల్లాకు ఆ జిల్లా స్థాయిలో నేతలంతా పక్క చూపులు చూసే వేళ  ఏం చేయాలో అర్ధం కాని వైసీపీ చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం దూకుడుకు బ్రేక్ వేయొచ్చని భావించింది.   చంద్రబాబును అరెస్ట్ చేస్తే క్యాడర్ నిరుత్సాహపడుతుంది.. పార్టీ నేతలకు వణుకు పుడుతుంది.. ప్రజలలో చంద్రబాబును దోషిని చేసి రాష్ట్రానికి ఒకే ఒక్క  ప్రత్యామ్నాయంగా వైసీపీని చూపించాలని తాపత్రయపడ్డారు.  కానీ  సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ ఒకటి తలిస్తే మరోకటి జరిగింది.   చంద్రబాబు తప్పు చేశారని ప్రభుత్వం ఎంత అరిచి గీపెట్టినా, సీఐడీ చీఫ్ తో అమరావతి నుంచి హస్తిన వరకూ పర్యటనలు చేయించి, మీడియా సమావేశాలు పెట్టించి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పినా జనం నమ్మడం లేదు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సి టీవీల ముందు చంద్రబాబును దోషి అంటుంటే నమ్మడం మాట అటుంచి  అలా చెబుతున్న వారిపై   ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతున్నది. చట్టం, న్యాయం గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు అనకొండలా పేరుకుపోయి ఉన్న ఆయన అవినీతి కేసుల చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లలో రోజూ అదే పనిగా చంద్రబాబును దోషిగా చిత్రీకరిస్తూ సంబరపడుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సోషల్ మీడియాను ఉపయోగించి కోటాను కోట్ల రూపాయలను కుమ్మరించి దుష్ప్రచారం చేస్తున్నా ప్రజలు  స్వచ్ఛందంగా వాటికి కౌంటర్లు వేస్తున్నారు.  ఇక టీడీపీ నేతల విషయానికి వస్తే పార్టీ అధినేత జైల్లో ఉన్నా నేతలలో ఎలాంటి వణుకు, బెరుకు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ఏ తెలుగుదేశం నేతా తొణకడం లేదు. నాలుగేళ్ల ఈ పాలనలో భరించాల్సిన నష్టాలను, కష్టాలను ఇప్పటికే చాలా చూసాం.. చాలానే భరించామని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదంటూ టీడీపీ క్యాడర్ తెగించి పోరాడుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా బలమైన శక్తులు కుట్రలు చేస్తున్నాయని తెలిసినా ఎక్కడా ధైర్యం సడలిపోవడం లేదు. ప్రతి కార్యకర్త ఎదురొడ్డి నిలబడుతున్నారు. ప్రతి  నేత కూడా తగ్గేదేలే అంటూ తెగించి ముందుకు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అధినేతను అక్రమంగా అరెస్ట్ చేశారన్నది అందరికీ తెలిసిన నిజమే కనుక ఈ అరెస్టుతో పార్టీకి వచ్చిన నష్టం లేదని, పైపెచ్చు  మేలే జరుగుతుందన్న ధైర్యం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది.  తమ అధినేతను అక్రమ కేసులో గత 24 రోజులుగా  జైల్లో ఉంచారన్న బాధ ఉన్నా.. జగనే ఈ అరెస్టు ద్వారా తెలుగుదేశం  విజయానికి బాటలు వేశారన్న భావన ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్నది.  తెలుగుదేశంను దెబ్బకొట్టాలని, తన ఈగోను శాటిస్ ఫై చేసుకోవాలన్న దుష్ట తలంపుతో, దురహంకారంతో  సీఎం జగన్ చంద్రబాబు అక్రమ అరెస్టుకు తెగబడినా.. అది టీడీపీకి సానుభూతిపరంగా మంచి మైలేజీ ఇచ్చిందనీ ఇదు ముందు ముందు మరింత ఎక్కువై ప్రజాగ్రహ ఉప్పెనై వైసీపీని నిలువునా ముంచేయడం ఖాయమని ఇప్పటికే విశ్లేషకులు తేల్చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉన్నా.. ఆ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపిస్తుండం విశేషం. రాయలసీమ నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే చర్చలు   పూర్తయినట్లు తెలుస్తున్నది. వైసీపీ నేతలు మరికొంత మంది కూడా చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉండగానే వీరంతా టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది. కనీసం పది మంది వైసీపీ కీలక నేతలు తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీ అయ్యారని చెబుతున్నారు.  దీంతో చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ దూకుడుకు కళ్లెం వేద్దామని జగన్ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయ్యి.. జగన్ కే రివర్స్ లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో బీజేపీ చతికిలపడినట్లేనా.. మోడీ సభకే కొందరు సీనియర్ల గైర్హాజర్!

తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. ఓ మూడు నాలుగు నెలల కిందటి వరకూ వచ్చే ఎన్నికలలో విజయమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీ నేతలు నానా హంగామా చేశారు. అటు అధికార బీఆర్ఎస్ కూడా తమకు పోటీ బీజేపీయే కానీ కాంగ్రెస్ కాదు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. ఎంత సేపూ ఎన్నికల యుద్ధం బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే తప్ప కాంగ్రెస్ అసలు సోదిలోనే లేదు అన్నట్లుగా ఇరు పార్టీలూ వ్యవహరించాయి. ఆ రెండు పార్టీల ఆర్భాటం, హంగామా కారణంగా కాంగ్రెస్ కు సంబంధించిన విశేషాలేమీ మీడియాలో పెద్దగా కవర్ కాలేదు. బీజేపీ, బీఆర్ఎస్ లకు అవసరమైన తీరులో కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు, సీనియర్ల అసమ్మతి రాగాలకు మాత్రం మీడియా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అంతెందుకు దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని, జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో ఎప్పుడు సాగింది, ఎప్పుడు ముగిసిందీ తెలియనంత తక్కువగా రాష్ట్రంలో మీడియా కవరేజ్ ఉందని చెప్పవచ్చు. కాగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య బంధమే ఈ పరిస్థితికి కారణమంటూ పరిశీలకులు విశ్లేషించారు. కాంగ్రెస్ సైతం అదే విమర్శలు చేసింది.  అయితే ఒక్క సారిగా పరిస్థితి తల్లకిందులైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం అండగా నిలిచి అసమ్మతికి చెక్ పెట్టడంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో త్రిముఖపోటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి బాగా దిగజారిందని పరిశీలకులు ఇటీవలి విశ్లేషణల్లో కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ పోటీ ఉనికి కోసమే తప్ప విజయం కోసం కాదని తేల్చేశారు. సింగిల్ డిజట్ స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో తమ విజయం దక్షిణాదిన పార్టీకి గేట్ వేగా మారుతుందని వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో ఆ పార్టీ దయనీయ స్థితికి తాజాగా ఆదివారం (అక్టోబర్ 1) ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనే అద్ధం పడుతోందని పేర్కొంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినా పలువురు బీజేపీ సీనియర్ నాయకులు మోడీకి ముఖం చాటేశారు. ఆయన పాల్టొన్న బహిరంగ సభకు డుమ్మా కొట్టారు.   బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు మహబూబ్ నగర్ లో జరిగిన మోడీ బహిరంగ సభకు గైర్హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా వీరంతా రహస్య సమావేశాలతో పార్టీని వీడే యోచన చేస్తున్నారన్న వార్తలకు మోడీ సభకు వీరి గైర్హాజర్ బలం చేకూర్చింది.  అలా గైర్హాజరైన వారిలో అత్యధికులు ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారే. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా తాము కమలం గూటికి చేరామని వీరు గతంలోనే ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో బీజేపీ పని చేస్తున్నట్లుగా కనిపించడం లేదంటూ గత కొంత కాలంగా వీరంతా పార్టీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న వారే కావడం విశేషం. వీరు బీజేపీలో ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్ న రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తాము ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతూ వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా వీకె బీర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.   బీజేపీ స్వయంగా తెలంగాణలో బీఆర్ఎస్ ను గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు తాము రాష్ట్రంలో బీజేపీని గద్దె దించే సత్తా కాంగ్రెస్ కే ఉందని నమ్ముతున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ గూటికి చేరే యత్రాలు కూడా చేస్తున్నారు. రాములమ్మగా రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తాను పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన సంగతి విదితమే.  కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇంతకాలం చెబుతూ వచ్చిన అధినాయకత్వం ఆ దిశగా మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని బీజేపీలో అసమ్మతి నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా మోడీ సభనే బాయ్ కాట్ చేయడం ద్వారా తమ ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా చాటారనీ, వీరంతా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేసీఆర్ కుటుంబంలో మూడో తరం పొలిటికల్ ఎంట్రీ!?

 కేసీఆర్ కుటుంబంలో మూడో తరం కూడా రాజకీయక్షేత్రంలో ప్రవేశించింది. ఎన్నికల వేళ ముచ్చటగా మూడో సారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంటే, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కుమారుడు అయిన కల్వకుంట్ల హిమాన్షురావు.. రాజకీయాలలోని ఘనంగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ప్రజా వ్యతిరేకత పట్ల ఆందోళన వ్యక్తమౌతున్న తరుణంలో కల్వకుంట్ల హిమాన్షురావు ఒక ట్వీట్ తో అందరి దృష్టినీ ఆకర్షించారు.  వాస్తవానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయపార్టీల కంటే ముందుగా సన్నద్ధమైన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ మాత్రమే. మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. కొత్తకొత్త పథకాలను ప్రకటించేసి.. హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి బయటపడ్డాయి.  సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రత్యర్థులకు అందని వేగంతో వ్యూహాలు రచించడంలోనూ మేటిగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎత్తుగడలు పారడం లేదు. వ్యూహాలు ఫలించడం లేదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. అటువంటి వేళ ఆయన వైరల్ ఫీవర్ తో గత పది రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. తన నివాసంలోనే వైద్యుల బృందం పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు.  అదలా ఉంటే.. మోడీ తెలంగాణ పర్యటనతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించేసింది. జనం నమ్ముతారా? నమ్మరా అన్న విషయంతో పని లేకుండా గత ఎన్నికల ముంగిట ఇచ్చి అమలు చేయని పసుపుబోర్డు హామీని మరోసారి ఈ ఎన్నికల ముంగిట మోడీ ప్రకటించేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా రాష్ట్రంలో ఒక బలీయమైన రాజకీయ శక్తిగా మారింది. గెలుపు ధీమాతో ముందుకు సాగుతోంది. ఆ పార్టీకి సహజ లక్షణం అని అంతా చెప్పుకునే గ్రూపు విభేదాలు, అసమ్మతి, అసంతృప్తి గళాలు ఈ ఎన్నికల ముంగిట పెద్దగా కనిపించడం లేదు. ఒక వేళ అవి వినిపించినా, కనిపించినా వెంటనే అధిష్ఠానం జోక్యం చేసుకుని ఎవరి హద్దులు వారికి గట్టిగా అర్ధమయ్యేలా చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత, సమష్టితత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధినేతపైనే అసమ్మతి ఆస్త్రాలు సంధిస్తోంది. అదే సమయంలో గతంలోలా కేసీఆర్ ఆధిపత్యం పార్టీపై పెద్దగా కనిపించడం లేదు. నేరుగా కేసీఆర్ ను విమర్శించకపోయినా, అసమ్మతులు ఆయన బుజ్జగింపులకు, హెచ్చరికలకు తలొగ్గి సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. అన్నిటికీ మించి అసమ్మతులు పిలుపు వచ్చినా ప్రగతి భవన్ కు వెళ్లేందుకు పెద్దగా సుముఖత చూపడం లేదని పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నది.  ఇటువంటి తరుణంలో కేఃసీఆర్ కుటుంబం నుంచి మూడో తరం నాయకత్వం రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తాజా ట్వీట్ ను తార్కానంగా చూపుతున్నారు.  కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు.. కానీ తాను మాత్రం తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్నాను అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షురావు ట్వీట్ చేశారు. దానికి  KCROnceAgain అనే హ్యాగ్‌ట్యాగ్‌ను  జత చేశారు. ఎన్నికల ముంగిట హిమాన్షు చేసిన ఈ  ట్వీట్ ప్రాధాన్యత  సంతరించుకుంది. హిమాన్షు ఇంకా విద్యార్థే, చదువుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. అదే సమయంలో సామాజిక మాధ్యమంలో మాత్రం ఇటీవలి కాలంలో యాక్టివ్ అయ్యారు.  బీఆర్ఎస్ సర్కార్ కు, కేసీఆర్ కు అనుకూలంగా తరచూ ట్వీట్ చేస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలకు కేంద్ర బిందువుగా మారారు.  కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుడుతున్నాడు. సరిగ్గా రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంగా కేసీఆర్ వన్స్ ఎగైన్ హ్యాష్ ట్యాగ్ తో హిమాన్షు చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, అందరి దృష్టినీ ఆకర్షించింది.   వచ్చే ఎన్నికల్లో హిమాన్షురావు సామాజిక మాధ్యమం వేదికగా బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తారనడానికి ఆయన తాజా ట్వీటే తిరుగులేని ఉదామరణ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సత్యాగ్రహం.. జైలులో చంద్రబాబు, హస్తినలో లోకేష్, రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరాహార దీక్ష

జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికి అందించిన మహా ఆయుధం సత్యాగ్రహం. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఆయన బాటలో నిరాహారదీక్ష చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, హస్తినలో నారా లోకేష్, రాజమహేంద్రవరం క్యాంపు సైట్ లో నారా భువనేశ్వరి నిరశన దీక్ష చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, శ్రేణులు కూడా నిరశన దీక్ష చేపడుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలోనూ తెలుగుదేశం నిరసన దీక్షలు చేపట్టింది. గాంధేయ పద్ధతుల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున దేశ విదేశాల్లో తెలుగుదేశం అభిమానులు, ప్రజాస్వామ్య వాదులు ఒక రోజు నిరాహాద దీక్ష చేస్తున్నారు.  చంద్రబాబును జగన్ రెడ్డి సర్కార్ అక్రమంగా, అరెస్టు చేసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తున్న ప్రజాగ్రహాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో ప్రణాళికాబద్ధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ  మోత మోగిద్దాం అంటూ ఇచ్చిన పిలుపునకు అనూహ్య ప్రజా స్వందన వచ్చింది.  జనబాహుల్యం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలకడం, వారి, వారి పని ప్రదేశాల్లోనే ఈలలు, డప్పులు, పళ్లేలతో మోతమోగించడం పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు అరెస్టు, గత 23 రోజులుగా జైల్లో ఉంచడం, న్యాయస్థానాలలో ఆయన పిటిషన్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో జనాగ్రహం రోజు రోజుకూ ఇనుమడిస్తోంది. చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. తమ ఆగ్రహాన్నీ, నిరసనను వ్యక్తం చేయడానికి తెలుగుదేశం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మద్దతుగా ఉప్పెనలా కదిలేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుస కార్యక్రమాలతో జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాగ్ని చల్లారకుండా ఉండేందుకు వరుస కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని తెలుగుదేశం భావిస్తున్నది. అందులో బాగంగానే గాంధీ జయంతి రోజున చేపట్టిన నిరశన దీక్ష కార్యక్రమంలో జనం పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నది.  ఇక మంగళవారం సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించడానికి ముందు తమ వాదన కూడా వినాలంటూ కేవియట్ దాఖలు చేఃసింది. ఇలా ఉండగా మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలో జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి క్వారీ సెంటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలి వద్ద  సత్యమేవ జయతే  దీక్ష ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటల వరకూ దీక్ష చేస్తారు. అనంతరం ఆమె ప్రసంగిస్తారు. భువనేశ్వరితో పాటు దీక్షలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. 

జనం నిర్దేశించిన పొత్తు.. ఇక జగన్ చిత్తు!

ఏపీ రాజకీయముఖ చిత్రం మారిపోయింది. విపక్ష నేతను జైల్లో పెట్టి.. రాష్ట్రం మొత్తాన్ని జైలుగా మార్చేసి వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలన్న జగన్ రెడ్డి ఎత్తుగడ చిత్తైనట్లే కనిపిస్తోంది. ఇంత కాలం ఉంటుందా? ఉండదా అన్న ఊగిసలాటలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు విషయంలో లుకలుకలు, అసమ్మతి గళాలు, ఆగ్రహజ్వాలలకు తావనేదే లేకుండా అసలా విషయాన్నే పెద్దగా ప్రస్తావించకుండా ఇరు పార్టీలూ పైనుంచి క్షేత్రస్థాయి వరకూ జగన్ రెడ్డి ఉన్మాన పాలనను, నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ఏకతాటిపైకి వచ్చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు రాజకీయ సమీకరణాల కోసం కాకుండా.. ప్రజాభీష్టం మేరకు ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని, పోలీసు వ్యవస్థను విపక్షాలను వేధించే ఒక టూల్ గా మార్చేసి గత నాలుగేళ్లుగా జగన్ ఆడుతున్న వికృత క్రీడకు చరమగీతం పాడటమే లక్ష్యంగా జనం తెలుగుదేశం, జనసేనలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. గత రెండేళ్లుగా పొత్తల విషయంలో ఇరు పార్టీల మధ్యే కాకుండా, జనబాహుల్యంలోనూ చర్చ జరుగుతున్నప్పటీ ఆ చర్చలకు ముగింపు మాత్రం జనాభీష్టం మేరకే జరిగింది. జగన్ ను గద్దెదింపడమే లక్ష్యంగా ఇరు పార్టీలూ కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న ప్రజాభిప్రాయమే.. ఇరు పార్టీల నిర్ణయాన్నీ ప్రభావితం పచేసింది.  ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను, పురోగతిని నిలువునా పాతేసిన జగన్ కు బుద్ధి చెప్పాలి, యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఉరివేసిన జగన్ ను అధికారం నుంచి దించాలని జనం ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఆ నిర్ణయం ఫలితమే తెలుగుదేశం, జనసేనల పొత్తుగా ప్రతిఫలించింది. జగన్ పాలనలో రాష్ట్ర ప్రగతి కుంటుపడింది. యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సర్కార్ అడ్డగోలుగా చేస్తున్న అప్పులు జనాలకు గుదిబండగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలన రాష్ట్రం పాలిట మహమ్మారిగా మారింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కరోనా కారణంగా జరిగిన నష్టం కంటే కొన్ని రెట్లు ఎక్కువ నష్టం జగన్ పాలన కారణంగా జరిగింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్నట్లే.. జగన్ అనే మహమ్మారిని తరిమికొట్టడానికి జనం కనుగొన్న వ్యాక్సినే తెలుగుదేశం, జనసేన పొత్తు. ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తన నాలుగో విడత వారాహియాత్రలో భాగంగా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమేనని, జగన్ రెడ్డి సేన కౌరవులైతే.. తెలుగుదేశం, జనసేన పాండవులని ఉద్ఘాటించారు. జగన్ పాలనలో ఉద్యోగాలు లేవు. విపక్ష నేతగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాట తప్పారు. మెగా డిఎస్సీ అంటూ మడమతిప్పారు.  విపక్ష నేతగా చేసిన  పాదయాత్రలో జగన్ ఇవ్వని హామీలు లేవు..అరిచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన తరువాత జనాలకు నరకం చూపించారు. జనం అన్నీ గమనించారు. అందుకే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత  ఒక్కసారిగా పెల్లుబికిన జనాగ్రహమే పవన్ కల్యాణ్ చేత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్దనే పొత్తును ప్రకటించేలా చేసింది. తాజాగా వారాహి నాలుగో విడత యాత్ర తొలి రోజు అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలోనూ అదే చెప్పారు. వచ్చే ఏన్నికల్లో జగన్ రెడ్డి పార్టీకి  15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. జగన్ అధికారమదాన్ని ఎలా అణచాలో తమకే కాదు, జనానికీ తెలుసునని ఉద్ఘాటించారు.   ప్రజాసమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చాలా కాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుతమ్ముళ్లు, జనసైనికులు ఉమ్మడి పోరాటాలు చేస్తున్నా.. యువగళం పాదయాత్రలో జనసేన జెండాలు రెపరెపలాడినా, ఆ రెండు పార్టీల ఐక్యత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చేసిందన్నది అవనిగడ్డ సభలో ప్రస్ఫుటంగా కనిపించింది. తెలుగుతమ్ముళ్లు, జనసైనికులు, ఇరు పార్టీల నేతల కలయికతో అవనిగడ్డ జనసంద్రాన్ని తలపించింది.  

ముగిసిన డెడ్ లైన్.. పట్టించుకోని కాంగ్రెస్.. పాపం షర్మిల!

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగిస్తారా? లేక షర్మిల కోరినట్లుగానే ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణం తెలంగాణలో సాగుతుందా? షర్మిల తెలంగాణలోనే ఉంటే ఆమెను అసెంబ్లీ బరిలో దింపుతారా? లేక రాజ్యసభకు పంపిస్తారా? ఇదీ నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ హాట్ గా నడిచిన వ్యవహారం. కాంగ్రెస్ హై కమాండ్   షర్మిలతో సంప్రదింపులు చేసిందనీ.. వైఎస్సార్టీపీ విలీనానికి ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కర్ణాటక నుండి డీకే శివకుమార్, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల తన మనసులో ఉన్నదేంటో చెప్పగా.. అందుకు కాంగ్రెస్ కూడా ఒకే చెప్పేసిందని, సోనియా, రాహుల్ తెలంగాణకు రాగానే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానిస్తారని విపరీతమైన ప్రచారం సాగింది. సోనియా వచ్చారు.. వెళ్లారు. కానీ, షర్మిల ఊసేలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కూడా షర్మిల టాపిక్కే లేకుండాపోయింది. ఇంతన్నాడే అంతన్నాడే గంగరాజు చివరికి నట్టేట ముంచేశాడే గంగరాజు అన్న చందంగా చివరికి షర్మిలను  కాంగ్రెస్ పట్టించుకోకుండా వదిలేసింది.   సోదరుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిలకు తొలినాళ్లలోనే ఆమె సొంత పార్టీ భవిష్యత్తుపై స్పష్టత వచ్చేసి ఉంటుంది. కానీ, ఏ మాత్రం బెరుకు లేకుండా తానే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నా.. వాస్తవానికి వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. చివరికి షర్మిల తప్ప చెప్పుకొనే పేరున్న ఒక్క లీడరు లేకుండా షర్మిల పార్టీలో లేకుండా పోయారు. ఆఖ‌రికి ఆమె పార్టీ భవిష్యత్తు ఏంటో ఎటూ తేల‌కపోవ‌డంతో కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. అనుకున్నదే తడవుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు   హైకమాండ్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండి వ్యతిరేకత వస్తున్నా.. తనదంతా ఢిల్లీ స్థాయి అన్నట్లే షర్మిల వ్యవహారం నడిచింది. అందుకు తగ్గట్లే ఢిల్లీ హైకమాండ్ నుండి కూడా సానుకూల స్పందన రావడంతో రేపో మాపో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అనే ఊహాగానాలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ, అవేమీ నిజం కాలేదు.  ముందుగా అనుకూలంగానే కనిపించిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి షర్మిలను పట్టించుకోవడమే మానేసింది. మధ్యవర్తిత్వం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా రేపు మాపు అన్నట్లు షర్మిల వ్యవహారాన్ని సాగదీశారు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే అసలు షర్మిలను పట్టించుకొనే పట్టించుకోలేదు. కొందరైతే ఆమెను వెళ్లి ఏపీలో రాజకీయం చేసుకోమని కూడా సలహాలిచ్చారు. ఇక ఇలా అయ్యే పని కాదని ఇటీవల షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని  కలిసి తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ఈ భేటీతో షర్మిల పార్టీ విలీనం కన్ఫర్మ్ అయినట్లే అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు స్పష్టత లేదు. చివరికి షర్మిల త‌న విలీనం గురించి కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ కూడా విధించారు.ఆమె  కాంగ్రెస్‌కు పెట్టిన డెడ్ లైన్ శనివారం (సెప్టెంబర్ 30)తో ముగిసిపోయింది కూడా. అయినా హస్తం పార్టీ అసలా డెడ్ లైన్ ను ఖాతరు చేసినట్లు కానీ, కనీసం కన్సిడర్ చేసినట్లు కానీ లేదు.   అయితే కాంగ్రెస్ షర్మిలను పట్టించుకోవడం వెనక పలు కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయడం  చాలామంది కాంగ్రెస్ నేతలకు ఇష్టంలేదు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టీ విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్ లాంటి వాళ్ళకు షర్మిల వలన ప్రయోజనం లేదని అధిష్ఠానానికి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. వైఎస్ఆర్ కుమార్తెగా తెలంగాణలో ఆమె వల్ల కలిగే లాభం ఏమీ లేకపోగా.. ఆంధ్రా నాయకురాలన్న ముద్రతో జరిగే నష్టమే ఎక్కువని వివరించారు. పైగా ఇప్పుడు పార్టీలో ఎటు చూసినా సీనియర్ నేతలే చేరిపోయారు. టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ లెగసీతో షర్మిలను తీసుకొచ్చి ఆమెకి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర నేతల అభిప్రాయంతో హైకమాండ్ కూడా ఏకీభవించిందంటున్నారు. పైపెచ్చు షర్మిల కోరిక మేరకు ఖమ్మం జిల్లా పాలేరు సీటు ఆమెకి కేటాయించే పరిస్థితి అసలు లేదు. అందుకే రాష్ట్ర నేతలు ఆమె రాకను స్వాగతించలేదు. దీంతో  హైకమాండ్ షర్మిలను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు రాజకీయవర్గాలలో ఇప్పుడు పాపం షర్మిల అన్న మాటే వినిపిస్తున్నది. 

దసరాకు బీఆర్ఎస్ మేనిఫెస్టో?

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముందు వరసలో ఉంది. దసరాకు పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంద‌ని  తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాలు సంతోషప‌డే విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లోనే శుభ‌వార్త చెబుతార‌ని ఆయన  తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ సంచలనాన్ని క్రియేట్ చేసిన బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది. రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ము తదితర అనేక పథకాలను రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ఈసారి రైతులతో పాటు యువత, మహిళలపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణా కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ఆరు హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా.. బీఆర్ఎస్  తన ఎన్నికల మేనిఫెస్టోను మరింత ఆకర్శనీయంగా తీర్చిదిద్దేందుకు కసరత్తును చేస్తోంది. విజయదశమి రోజున బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకాలు, హామీలతోపాటు ఇప్పటికే ఉన్న వాటిని మరింత ప్రయోజనాలతో కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల మాదిరిగా అధికారిక మ్యానిఫెస్టో కమిటీ లేనప్పటికీ.. తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు ఇచ్చిన వాగ్దానాలను అధ్యయనం చేయడం ద్వారా మేనిఫెస్టోలో పని చేయాలని ఎస్ మధుసూధనా చారితో సహా సీనియర్ నాయకులను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. రైతుబంధు తరహాలో రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులు (యూరియా, డీఏపీ, ఎన్‌పీకే)లను సీఎం ప్రకటించాలని భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ రుణాలపై లక్ష వరకు రుణమాఫీని ఈసారి ప్రకటించనున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉచిత ఎరువుల పథకం తీసుకొస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. అదే విధంగా అన్ని రకాల ఆసరా పింఛన్‌లను కూడా 1000 పెంచాలని సీఎం యోచిస్తున్నారు. ఇటీవల, ప్రభుత్వం వికలాంగుల పెన్షన్‌ను నెలకు 3,016 నుండి 4,016 కు పెంచిందని బీఆర్ఎస్  సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. 2014, 2018 ఎన్నికలకు ముందు హామీ ఇవ్వని బిఆర్‌ఎస్ డజన్ల కొద్దీ కొత్త పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. అమలు చేయని ప్రధాన హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి. ప్రకటించాలా వద్దా అనే సందిగ్ధంలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. 

జగనే ఎందుకు?.. నిలదీస్తున్న జనం

 ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చు. కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలను ప్రజలు మరిచి పోతారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అంతే కాదు  అలా ఎవరైనా అనుకుంటే వారు అమాయకులు అవుతారు లేకుంటే అజ్ఞానులు అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో  తెలియదు కానీ అయన మాత్రం అలాంటి భ్రమల్లో నే ఉన్నారని చెప్పక తప్పదు.  కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని ఆయన చూడలేక పోతున్నారు. నిజానికి నాలుగున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో  రాష్ట్రం అన్ని విధాలా అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు .  ఇలా ఎటు చుసినా అష్టమ దిక్కే దర్శనమిస్తోంది.  అవి చాలవన్నట్లు జగన్ రెడ్డి  కుట్ర పూరితంగా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.  చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ... గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారు.  చెంపలేసుకుని మరీ చేసిన తప్పు  మళ్ళీ చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. నిజానికి  చంద్రబాబు అరెస్ట్ కు ముందే రాష్ట్ర ప్రజలు  జగన్ రెడ్డి అరాచక అవినీతి పాలనకు స్వస్తి చెప్పాలనే  నిర్ణయానికి వచ్చేశారు.  ఇక చంద్ర బాబు అరెస్ట్ తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయాన్నిబహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జనం రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ముగింపు పలికే శుభ ఘడియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత కాలం సంక్షేమం పేరుతో తమ వద్ద ముక్కుపిండి వసూలు చేసిన సొమ్మునే బటన్ నొక్కి తమకే పందేరం చేసిన జగన్ కు ఎన్నికలలో తామే బటన్ నొక్కి  సాగనంపేందుకు ఎదురు చూస్తున్నామని బాహాటంగానే చెబుతున్నారు.  క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే  జగన్ రెడ్డి మాత్రం ఇంకా  పగటి కలలు  కంటున్నారు. ఇప్పటికీ వై నాట్ 175... భ్రమల్లోనే ఉన్నారు. నిజానికి  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న గడప గడపకు వైస్పీ ప్రభుత్వం, నువ్వే మా నమ్మకం కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి,  తలుపులు తడుతూనే ఉన్నారు. అయినా  ఫలితం లేదు. ప్రజలు చీత్కారాలు, చీవాట్లు భరించ లేక చాలా వరకు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  అయితే జగన్ రెడ్డి ప్రతి మూడు నాలుగు నెలకు ఒకసారి గడప గడపకు సమీక్ష పేరున, ఈ కార్యక్రమం ద్వారా ఏదో బ్రహ్మాండం జరిగిపోతోందనే భ్రమలు సృష్టిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు,  జగన్ రెడ్డి  తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేసేందుకు... గడపగడప నివేదికలను ఉపయోగించుకుంటున్నారు.  తాజాగా రెండు రోజుల క్రితం మళ్ళీ  అదే క్రతువును కానిచ్చారు. యథాతధంగా, తన గొప్పలు తనే చెప్పుకున్నారు. తన భుజాలను తానే చరుచుకున్నారు. ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు. ఇంతవరకు చేసింది ఒకెత్తు, రానున్న ఐదారు నెలలు నెలలు మరో ఎత్తు.రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలంటూ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారు. అంతే కాదు. మళ్ళీ జగనే ..ఎందుకు కావలి? అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారు. అయితే మళ్లీ జగన్ ఎందుకు వద్దంటే వంద కారణాలు చెప్పగలం, ఎందుకు కావాలంటే ఏమి చెపుతామని, వైసీపీ నేతలే సైటైర్లు వేస్తున్నారు. నిజానికి, ఇప్పటికే, ప్రజాదరణ పూర్తిగా కోల్పయిన జగన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా, ఇంటికి వెళ్ళడం ఖాయం అన్నదే జనవాక్యంగా వినిపిస్తోంది. అందుకే  జనం అవును జగన్  ఎందుకు ? వద్దే వద్దు అంటున్నారు . ఏపీకి జగన్ అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

మీరే అండా దండా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశానికి జగన్ సన్నాహాలు!

అప్పు చేసి బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడమే పాలన అన్నట్లుగా గత నాలుగున్నరేళ్లుగా గడిపేసిన ముఖ్యమంత్రి జగన్ ను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అధికారంలో ఉన్న  వైసీపీని పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.  పడకేసిన అభివృద్ధి, అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చెప్పిన డైలాగులు, విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, నవరత్నాల పేరిట పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను విస్మరించి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులు, నానాటికీ దిగజారిపోతున్న   కొనుగోలు శక్తి.. ఇలా అన్నీ లెక్కలేసుకున్న ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో మీకు ఇచ్చిన ఒక్క చాన్సే ఎక్కువ.. ఇప్పటిదాకా మీరు నొక్కిన బటన్లు చాలు.. ఇక ఎన్నికలు రాగానే మేం బటన్ నొక్కి ఇంటికి పంపిస్తాం అంటూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ప్రతిపక్ష నేతల పర్యటనలు, సభలలో ప్రజా స్పందనలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన జగన్ విపక్ష నేతలను తిరగనీయకుండా చేస్తే చాలని భావించారు. ఆ కారణంగానే   కక్షకట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయిం చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూ అరెస్టు చేయిద్దామనుకున్నా ఆయన కోర్టును ఆశ్రయించడంతో అది వీలు కాలేదు. ఇక చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనలకు దిగుతుంటే ఆంక్షలు విధించి  ప్రజా నిరసనాగ్రహాన్ని అణచివేయాలని చూశారు. దీంతో ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీంతో సీఎం జగన్ ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలా అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ప్రతినిధులతో సమావేశమైన జగన్.. ఏపీకి జగనే ఎందుకు కావాలి? అంటూ ఓ కొత్త కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. అలాగే సీఎం జగన్ స్వయంగా 4 వేల మంది  పార్టీ ద్వితీయ  శ్రేణి నేతలతో సమావేశం కావాలని ప్రణాళికలు రచించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  అక్టోబర్ లో ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.  పార్టీ అధిష్టానం నుండి ఇప్పటికే దీనిపై ఆదేశాలు కూడా వెళ్లాయని చెబుతున్నారు. మేథోమథనం సదస్సు పేరుతో అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో  నిర్వహించనున్న ఈ సమావేశానికి నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణి నేతలను ఈ సమావేశానికి తరలించనున్నారట. అభ్యర్థి ఎంతటివాడైనా,  పార్టీ తరపున అభ్యర్ధులు గెలవాలంటే ద్వితీయశ్రేణి నేతల మద్దతు చాలా అవసరం. వీరి అండ లేకుండా  పార్టీ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదు.  నగదు పంపిణీ నుండి కుల సమీకరణ ఆధారంగా ఓటర్లను పోగేయడం వరకూ అన్నీ ద్వితీయ శ్రేణి నేతల చేతుల మీదనే జరుగుతుంది. అందుకనే ఇలాంటి సుమారు 4 వేలమంది ద్వితీయ శ్రేణి నాయకులను నేతలను గుర్తించి ఈ సమావేశానికి పిలిచినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో సీఎం జగన్ ఈ సమావేశంలో ఈ 4 వేల మందికి వివరిస్తారని చెబుతున్నారు. అలాగే పనిలో పనిగా ఆయా  నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల అభిప్రాయం, అక్కడ ఈసారి పోటీచేసే   వారి విజయావకాశాలు ఇలా అన్ని విషయాల మీద జగన్ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంపై వైసీపీ వర్గాలలో  ఆసక్తిగా వ్యక్తమౌతోంది. నిజానికి వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుయాయులూ  ఈ నాలుగేళ్లలో బాగానే వెనకేసుకున్నారనీ,  నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న తాము మాత్రం తీవ్రంగా నష్టపోయామనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ప్రభుత్వం వచ్చిన కొత్తలో చిన్నా చితకా పనులు చేసినా వాటి బిల్లులు మాత్రం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ తరువాత అప్పులమోతతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించే పరిస్థితులు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టి అప్పులపాలైన నేతలు.. ప్రభుత్వం వచ్చాక ఏదొక పని  చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని చూసినా.. చెప్పుకొనేందుకు ఒక్క పని కూడా దక్కలేదు. చేసిన పనులకు బిల్లులూ రాలేదు. దీనికి తోడు  గ్రామ, మండల స్థాయి నేతలు తమకి అది కావాలి.. ఇది కావాలి అంటూ పలుమార్లు విన్నపాలు చేసుకున్నా నిధుల కొరతతో ఆ పనులు కూడా చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు వారికి నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ ఫలితమే గడపగడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నేరుగా తగిలిన నిరసన సెగలు అని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో  ఏపీకి మళ్లీ జగనే  కావాలో ప్రజలకు చెప్పమంటే ఏం చెప్పాలంటూ ద్వితీయ స్థాయి నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీన సమావేశంలో జగన్ ఏం చెప్పనున్నారు? అందుకు నేతలు ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తిగా మారింది.

కోడి కత్తి శీను కోసం రంగంలోకి అయేషా మీరా హత్యకేసు లాయర్!

వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శీను నేరం ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ   జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోర్టు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరు కావడం లేదు. బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు హాజరైంది లేదు. కాగా  ఇప్పుడు ఈ కేసులో ఇదే విషయాన్ని హైలెట్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ తరపున ఇన్నాళ్లు ఈ కేసులో వాదనలు వినిపించిన సలీం అనే లాయర్ తప్పుకోగా.. ఆ స్థానంలో పిచ్చుకుల శ్రీనివాసరావు అనే లాయర్ తాజాగా వాదనలు వినిపించారు. జగన్ ఎందుకు కోర్టుకు రావడం లేదనే అంశంపై లాయర్ శ్రీనివాసరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం ఇవ్వటానికి కోర్టుకు రావాలంటూ లాయర్ శ్రీనివాసరావు చేసిన డిమాండ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోడి కత్తితో దాడి చేశాడు.  అప్రమత్తమైన   వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి మూడు వారాల వరకూ అక్కడే ఉన్నారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. అప్పట్లో కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందో ఆ ఆసుపత్రి వైద్యులకే తెలుసు కానీ.. దాని వలన జగన్ పొందిన లబ్ది ఎంతన్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ దాడిని కూడా జగన్ తనకు సానుభూతి దక్కేలా మలచుకున్నారు. చిన్నదో పెద్దదో దాడి అయితే జరిగింది కదా. ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది అనవసరం. అసలే ఎన్నికల సమయం. జరిగిన దానిని తనకు ఎంత అనుకూలంగా మలచుకుంటే అంత బెనిఫిట్. అందుకే చిన్న గాయానికి ఆసుపత్రిలో మూడు వారాల రెస్ట్ అవసరం అయింది. ఆ తర్వాత ఈ కేసు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడకి చుట్టాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు. శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు.   పలు మార్లు  బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు వేసినా ఫలితం దక్కలేదు.  వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నది ఎన్ఐఏ కావడంతో.. బాధితుడి వాంగ్మూలం లేకుండా బెయిలు ఇచ్చే అవకాశం లేదని కోర్టులు అశక్తత వ్యక్తం చేస్తున్నాయి. ఇటు కేసు తేలక.. బెయిల్ రాక నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు. కాగా ఇప్పుడు ఈ కేసు విచారణకు రాగా శ్రీనివాస్ తరపున పిచ్చుకల శ్రీనివాసరావు అనే కొత్త లాయర్ వాదనలు వినిపించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో వాదనలు వినిపిస్తున్నది కూడా ఈయనే కాగా.. ఇప్పుడు కోడికత్తి శ్రీనివాస్ తరపున కూడా ఈయనే వాదనలు వినిపించడంతో ఈ కేసు కూడా ఆసక్తికరంగా మారింది. నిందితుడి తరఫు న్యాయవాది పిచ్చుకల శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. కుమార్తె కోసం లండన్ కు వెళ్లిన సీఎం జగన్.. కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు రాలేరా? అని ప్రశ్నించారు. ఈ కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు జగన్ కోర్టుకు రావాల్సిందేనన్న ఆయన.. రాకపోతే కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొన్నారు. జగన్ తరపు న్యాయవాది వాదిస్తూ.. సీఎం బిజీగా ఉన్నారని.. అడ్వొకేట్ కమిషన్ ఏర్పాటు చేయాలనీ కోరారు.  దీనికి కూడా శ్రీనివాస్ న్యాయవాది గట్టి వాదనలు వినిపించారు. సాక్షి వద్దకే అడ్వొకేట్ కమిషన్, నిందితుడు వెళ్లాలనటం మొత్తం న్యాయ విధానాన్నే మార్చినట్లు అవుతుందని వాదించారు. ఫైనల్ గా కేసు అక్టోబరు 13కు వాయిదా పడింది. మరి తదుపరి ఈ కేసు ఎలా నడుస్తుందో చూడాలి.