రాజకీయం అంటే.. జగన్ నిర్వచనం.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!
అదేంటో పాపం సీఎం జగన్ బహిరంగ సభకి వచ్చి ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్.. ఒకటికి నాలుగైదు సార్లు చదువుకున్న స్క్రిప్ట్.. సభలో కూడా చూసే చదివినా అది తేడా కొట్టేస్తుంది. ఎవిరిథింగ్ ఈజ్ ఫైనూ అనుకున్నా జగన్ నోటి నుండి ఆ మాటలు రాగానే ఎక్కడివాళ్ళకి అక్కడే చిర్రెత్తుకొస్తుంది. ఆ వీడియోలు కట్ చేసి మాంచి బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రోలింగ్ చేస్తుంటారు. తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీఎం జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజన్ల చేతికి ఫుల్ స్టఫ్ ఇచ్చాయి. సభలో ఎన్నికలు, మ్యానిఫెస్టో, కార్యకర్తల నుండి నేతల వరకూ ఏం చేయాలో చెప్పిన జగన్.. యధావిధిగా ప్రత్యర్థులపై అదే ఊకదంపుడు విమర్శలు చేశారు. ఇక, కొత్తగా ఈ సభలో జగన్ రాజకీయానికి ఒక నిర్వచనాన్ని చెప్పారు.
రాజకీయం అంటే ఏంటో తెలుసా.. రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా నిలవడం.. మరణించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మనం కనిపించటడమంటూ సీఎం జగన్ సూత్రీకరించారు. నిజానికి జగన్ ఈ నిర్వచనం చెప్పిన తర్వాత సభలో ఉన్న వారెవరికీ ఆయన ఏం చెప్పారో చాలా సేపటి వరకూ అర్ధం కాలేదు. దీంతో జగన్ దానిని ఇంకాస్త వివరించి చెప్పారు. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుండెలో కూడా ఉండటం తనకు తెలిసిన రాజకీయం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్ ఏం చెప్పారో అర్ధం అయింది అన్నట్లు అందరూ చప్పట్లు కొట్టారు. అలా చప్పట్లు కొట్టకపోతే మళ్లీ చెబుతారనుకున్నారో ఏమో. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటమే రాజకీయం అనే మాటను చెప్పేందుకు జగన్ అన్ని ఇబ్బందులు పడ్డారన్న మాట. ఇక పనిలో పనిగా మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని, రాజకీయ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాడని, అబద్ధాల్ని నమ్మొద్దని, మోసాలను నమ్మొద్దని పార్టీ క్యాడర్ ను కోరారు.
కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు అంత సులభంగా మార్చిపోలేరని.. ఆంధ్రా చరిత్ర ఉన్నన్నాళ్ళు, ఆయన పాలనను చూసిన ప్రజలు ఉన్నంత కాలం ఎవరూ మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతలా ప్రజలను పీక్కుతిన్న ముఖ్యమంత్రి, ఇంతలా కక్షకట్టి పాలించిన నేత ఎవరూ ఉండరని, రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను, చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలించిన సీఎం బహుశా జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని, ఆలాంటి వ్యక్తిని ఎలా మర్చిపోతామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా ప్రజలపై ప్రేమతో పాలిస్తారు.. తన పేరు మర్చిపోకుండా మంచి పనులు చేయాలని చూస్తారు.. కానీ జగన్ మాత్రం తనను తప్పు అన్న వారిని లేకుండా చేయాలనీ చూస్తారని.. అలాంటి వ్యక్తిని ప్రత్యర్థులే కాదు ప్రజలు కూడా అంత సులభంగా మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇక అబద్ధాల్ని, మోసాలను నమ్మొద్దని జగన్ చెప్పిన మాటపై కూడా నెటిజన్లు పెద్ద చర్చ పెట్టారు. నిజమే ఈ నాలుగేళ్ళ పాలనలో ప్రజలు అబద్దాలు, మోసాలు అంటే ఏమిటో తెలుసుకున్నారని, ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోరని పేర్కొంటున్నారు. అబద్దాల గురించి, మోసాల గురించి, నేరాల గురించి, అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. 16 వేల కోట్ల అవినీతి కేసులో ఉన్న వ్యక్తి 27 కోట్ల అక్రమ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేరస్తుడిగా పేర్కొనడం, సొంత బాబాయ్ హత్యకేసులో నిందితులను కాపాడుతూ మోసపోకండని ప్రజలను కోరడం, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, 45 ఏళ్లకు పెన్షన్ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి గాలికి వదిలేసిన వ్యక్తి ఇప్పుడు అబద్దాలను నమ్మవద్దని కోరడం చూస్తుంటే ప్రజలంటే సీఎంకు ఇంత చులకనగా కనిపిస్తున్నారా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.