బీఆర్ఎస్ ఎన్టీఆర్ జపం.. ఓట్ల కోసమేనా?
posted on Oct 6, 2023 @ 1:49PM
ఎన్టీఆర్.. ప్రతిసారి ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు కోసం కొట్లాట అంతా ఇంతా కాదు. తమకి తాము ఆయన్ను దైవంగా చెప్పుకొనే వారి నుండి.. అసలు ఎన్టీఆర్ శిష్యులం మేమే అనే వరకూ దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో ఈ పేరు కలవరిస్తూనే ఉంటాయి. నాలుగేళ్ల కాలం ఎలా ఉన్నా సరే ఎన్నికల ఏడాదిలో మాత్రం ఎన్టీఆర్ అందరికీ కావాల్సిన వారే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్ పేరు, వారసత్వం తెలుగు దేశం పార్టీ సొంతం. నేటికీ ఆయన సిద్ధాంతా ఆశయాలతోనే తెలుగుదేశం కొనసాగుతోంది. కాలానుగుణంగా మార్పులు చేర్పులలో నారా చంద్రబాబు నాయుడు ముద్ర కనిపించినా ఎన్టీఆర్ సిద్ధాంతాల అనుగుణంగానే టీడీపీ పనిచేస్తున్నది. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అందించింది కూడా ఎన్టీఆర్ పై ప్రేమ చాటుకోవడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో కొందరు సోకాల్డ్ నేతలు కూడా ఎన్టీఆర్ జపం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తుంటారు.
ఏపీ సంగతలా ఉంటే ఎన్టీఆర్ పేరు కోసం చేసే రాజకీయం తెలంగాణలో మరో రకంగా ఉంటుంది. తెలంగాణలో టీడీపీ బలహీన పడిన అనంతరం ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం క్యాడర్ కోసం దాదాపుగా అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేసున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ కొంత మేర సక్సెస్ అయింది. తెలుగుదేశం నేతలందరినీ కారు ఎక్కించుకున్న కేసీఆర్.. సమయం వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ ను కీర్తిస్తూ వస్తుంటారు. తెలుగుదేశం పార్టీనీ, చంద్రబాబును విమర్శిస్తూనే ఎన్టీఆర్ ను కీర్తిస్తుంటారు. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ అయితే ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు విజనరీని మెచ్చుకుంటూ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర శాశ్వతం అంటూ చెబుతూ వచ్చేవారు. అయితే, ఈసారి కేటీఆర్ కూడా తండ్రి కేసీఆర్ బాటలోనే చంద్రబాబును మరచి కేవలం ఎన్టీఆర్ పేరును మాత్రమే తెరమీదకి తెస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తమకేం సంబంధమన్న కేటీఆర్.. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో ఆందోళనలను కూడా తప్పుబట్టారు. దీనిపై సీమాంధ్ర సెటిలర్లలో తీవ్ర అసంతృప్తి కనిపించింది. ఈసారి సెటిలర్లు బీఆర్ఎస్ కు దూరం జరుగడం ఖాయమని పరిశీలకులు కూడా విశ్లేషించారు. ఒకింత ఆలస్యంగానైనా తన మాటల వల్ల జరిగిన, జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన కేటీఆర్ నష్ట నవారణ కోసం.. ఔను నష్టనివారణ, సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ నామస్మరణ మొదలు పెట్టారు.
మాకు రాముడైనా.. కృష్ణుడైనా సీనియర్ ఎన్టీఆర్ ఒక్కరే అంటూ కేటీఆర్ కీర్తించారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. వారందరి ఆరాధ్య దైవం ఎన్టీఆరేనని కేటీఆర్ అన్నారు. ఈ మధ్యనే ములుగులో పర్యటించిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేశారు. పేదలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్ బాటలో పాలిస్తున్నారని చెప్పుకున్నారు. ఈ ఇద్దరే కాదు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ కలవరిస్తున్నారు.
కాగా, తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఓట్ల కోసమే తెలంగాణాలో కొందరు తన తండ్రి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని బాలకృష్ణ విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం తెలంగాణలో కొందరు ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఇప్పటికీ మౌనంగా ఉండడంతో బీఆర్ఎస్ నష్టపోవడం ఖాయం అన్న భావనతోనే ఎన్టీఆర్ పేరు చెప్పుకుని నష్టాన్ని పూడ్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని అంటున్నారు.
అయితే, అనూహ్యంగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్ నేతల ఓట్ల రాజకీయంపై చేసిన వ్యాఖ్యలు సీమాంధ్ర ఓటర్లకు స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిందనే భావించాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సీమాంధ్రులే కాదు.. తటస్థులు కూడా తెలుగుదేశంకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించేసుకున్నారని, బాలకృష్ణ వ్యాఖ్యలతో వారి నిర్ణయం మరింత ధృఢంగా మారడం ఖాయమనీ అంటున్నారు.