షిక్కటి చిరునవ్వుల మర్మమేంటి?..ష్ గప్ చుప్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదవుల మీద చిరు నవ్వు చెరగదు. కానీ, ఆ చిరు నవ్వుల వెనక, ఏమి దాగుంది? అ నవ్వుల మర్మం ఏమిటి అనేది   కొద్ది మందికి తప్ప అందరికీ అర్ధమయ్యే విషయం కాదు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు  ఆయన రక్త సంబంధీకులు, బంధు వర్గమే. జగన్ చిరునవ్వుల వెనక ఎలాంటి కుట్రలు, కుయుక్తులు  పురుడు పోసుకుంటున్నాయో గుర్తించ లేమని అంటారు. అది బాబాయ్ మర్డరే, అయినా, తల్లీ చెల్లిని ఆర్థికంగా, రాజకీయంగా సైలెంట్ గా దెబ్బ తీయడమే అయినా  జగన్ రెడ్డి  తన చేతికి  మరకలు అంటకుండా నవ్వుతూనే కానిచ్చేశారని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ  రాష్ట్రంలో వీస్తున్న  చంద్రబాబు ప్రభంజనాన్ని ఎదుర్కునేందుకు జగన్ రెడ్డి మరో మారు సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. అందులో భాగంగానే చిరునవ్వులు చిందిస్తూనే, తెలుగు దేశం పార్టీ  జాతీయ అధ్యక్షడు,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రజలలో తిరగకుండా చేసేందుకు జగన్ రెడ్డి  కుట్రలకు  తెర తీశారని అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, అలాగే, ఆయన్ని జైలుకే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు.  అదలా ఉంచితే ఓ వంక చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే, మరో వంక జగన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో అటు ప్యాలెస్ లో గుట్టు చప్పుడు కాకుండా, గప్ చుప్’గా తమ పొలిటికల్ అండ్ పర్సనల్ అజెండాలను ముందుకు తీసుకుపోతున్నారని అంటున్నారు.   ముందుగా అసెంబ్లీ తంతు విషయానికి వస్తే  సమావేశాలు మొదలైన రోజునే  పొమ్మన కుండా పొగ పెట్టి తెలుగు దేశం సభ్యులను బయటకు పంపి  అడ్డు తొలగించుకున్నారు. ఇక అక్కడి నుంచి, సభ్యత, సంస్కారం, సభా మర్యాదలను పక్కన పెట్టి, చంద్రబాబు సహా సభలో లేని సమాధానం చెప్పుకునే అవకాశం లేని సభ్యులను ఉద్దేశించి ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. సభలో లేనివారిపై ఆరోపణలు కూడదన్న సభా నియమాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. జగనన్న మెప్పు కోసం మంత్రి రోజా, మరి కొందరు జగన్ ను ఇద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేశారు.  జబర్దస్త్’ రోజుల నుంచీ  రోజాకు అది  అలవాటైన విద్యే అనుకోండి. సరే అది పక్కన పెడితే..   ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ రెడ్డి గప్ చుప్ గా గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగించారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ఆమోదించిన జీపీఎస్‌ బిల్లులో  33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించ వచ్చనే నిబంధన వచ్చి చేరింది, అంటే, వయసుతో సంబంధం లేకుండా 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మెడ పట్టి బయటకు గెంటే విధంగా  కంపల్సరీ రిటైర్మెంట్  క్లాజును తీసుకొచ్చింది. నిజమే, సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌ పెన్షన్‌ నిబంధనలతోపాటు రివైజ్డ్‌ స్టేట్‌ పెన్షన్‌ రూల్స్‌-1980లోని 44వ నిబంధన ప్రకారం... ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించవచ్చు, అయితే ఇంత కాలం కేవలం కాగితాల్లో మాత్రమే ఉన్న నిబంధనను  తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయంలో నానా యాగీ చేసిన జగన్ రెడ్డి ఇప్పడు గుట్టు చప్పుడు కాకుండా,  జీపీఎస్‌ బిల్లులో చేర్చారు. నిజానికి అధికారంలోకి వచ్చిన  వారం రోజుల్లో   సీపీఎస్‌  రద్దు చేస్తామని మాటిచ్చి ఇప్పడు జీపిఎస్ బిల్లు తీసుకురావడమే  ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడం. అలాంటిది, అందుకు అదనంగా ఇప్పడు .. వయసుతో పనిలేకుండా ఉద్యోగుల  మెడ మీడకు  సర్వీసు కత్తిని తెచ్చారు. మరో వంక  ఎవరికీ తెలియకుండా  ఎవరికీ  చెప్ప కుండా ఛార్టర్డ్ ఫ్లైట్ లో దిగిన  వివాదస్పద పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి  జగన్ రెడ్డి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. ఎలాంటి అధికారిక హోదాలేని ఆయనకు... పోలీసు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ ఆయనకు విందు ఏర్పాటు చేసింది. సుమారు రెండుగంటలకు పైగాన అయన ప్యాలెస్ లో  ఉన్నారు. ఏ అధికార హోదా లేని ఒక వ్యాపార వేత్తకు ప్రభుత్వం రాచ లాంఛనాలతో స్వాగతం పలకడం ఏమిటి?  ఆయనతో ఏమి చర్చించారు?  దీపం ఉండగానే  ఇల్లు చక్కపెట్టుకునే ఉద్దేశంతో అధికారంలో ఉండగానే,  ఆదానీకి మరిన్ని మేళ్ళు చేసేందుకు జగన్ రెడ్డి సిద్డమయ్యారా? అనే సందేహాలు పరిశీలకుల్లో  వ్యక్త మవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రం, దేశం మొత్తం  అదే విషయంపై దృష్టిని కేద్రీకరించిన సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే  జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని మింగేసే  పెద్ద స్కెచ్ ఏదో వేసినట్లే  అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. అవును  ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవ్వులు చిందించారు  కానీ  పెదవి విప్పలేదు ఒక్క మాట మాట్లాడ లేదు. అందుకే ఈ చిరు నవ్వుల  మర్మమేమీ, అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది ? అదే ఇప్పడు రాష్ట్రం ముందున్న  పెద్ద ప్రశ్న.

బటన్ నొక్కినా సొమ్ములేవీ?.. ఏపీకి ఇక జగన్ వద్దు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన కేవలం కక్ష సాధింపులకు, బటన్ నొక్కి ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చన్న భ్రమలకే పరిమితమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా.. అధికారాన్ని మొత్తం విపక్షాలపై కేసులు, వేధింపులకు మాత్రమే వినియోగించిన జగన్ రెడ్డి.. ఎన్నికలు ముందుకు వచ్చే సరికి బటన్ నొక్కడానికీ, ఒక వేళ నొక్కినా ఆ మేరకు లబ్ధి దారుల ఖాతాలలో జమ కావడానికి నిధులు లేక బిత్తర చూపులు చూస్తున్నారు. గతంలో బటన్ నొక్కిన పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా పూర్తిగా నగదు జమకాలేదు కానీ ఇప్పుడు మరో కొత్త బటన్ నొక్కేందుకు రెడీ అయిపోయారు. వాహనమిత్ర పేరులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో పది వేల రూపాయల చొప్పున జమ చేస్తామంటున్నారు. అయితే ఆయన బటనైతే నొక్కు తారు కానీ అందుకు సంబంధించి సొమ్ములు మాత్రం ఖాతాలలో పడేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక ఇప్పుడు తాజాగా ఆయన వాహన మిత్ర పేరుతో ఏపీలో ఆటోలు, కార్లపై  ఆధారపడే వాళ్లకు సొమ్ములు జమ చేస్తామంటున్నారు. అది కూడా రెండు లక్షల మందికి. అంటే జగన్ దృష్టిలో రాష్ట్రంలో వాహనాలు నడపడం ద్వారా జీవనోపాధి పొందేవాళ్లు రెండు లక్షల మంది మాత్రమేనా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే అదలా ఉంచితే.. వాళ్లకైనా జగన్ బటన్ నొక్కగానే సొమ్ములు వారి ఖాతాలలో జమ అవుతాయా అంటే మాత్రం ఔనన్న సమాధానం రావడం లేదు. బటన్ నొక్కుకుంటే వెళ్లడమే ముఖ్యమంత్రి పని.. అందుకు సంబంధించి సొమ్ములు జమ అవుతాయా? అయితే ఎప్పుడు అవుతాయి? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నెల కిందట జగన్ బటన్ నొక్కి పదేరం చేశానని చెప్పుకున్న  ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు ఆయా లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదు. కానీ పీజురీయింబర్స్ మెంట్ కోసం జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మాత్రం కొట్లలో ఖర్చయ్యింది. పందేరం చేయని డబ్బుల కోసం సభలెందుకు అంటారా?   మరి జగన్ మాట్లాడేందుకూ, విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు వేదిక కావాలి కదా? అందుకు. బటన్ నొక్కే కార్యక్రమం కోసం మాత్రమే జగన్ రెడ్డి ప్యాలెస్ దాటి బయటకు వస్తారు.  తన ప్రభుత్వ పథకాలను చెప్పుకోవడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయరు. ఎందుకంటే విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  జనాలకు సొమ్ములు పందేరం చేస్తున్నామంటే కనీసం లబ్ధిదారులైనా తన సభకు వస్తారన్న ఉద్దేశంతోనే జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు మాత్రమే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు కూడా దారికి ఇరువైపులా పరదాలు కట్టుకుని.. తాను, లేదా తన పార్టీ ఎంపిక చేసిన వారు మాత్రమే సభకు హాజరయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ వేదిక ఎక్కుతారు. ఇక అక్కడ ఆయన వాగ్ధాటిని అడ్డుకునే వారెవరూ ఉండరన్న ధైర్యంతో ప్రభుత్వ కార్యక్రమం అని కూడా గుర్తించకుండా రాజకీయ ప్రసంగాలు చేస్తారు. తన రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించేస్తారు. తన విమర్శలను కనీసం సభకు వచ్చిన వారు వింటున్నారా? బటన్ నొక్కడం అయిపోగానే.. ప్రసంగం ప్రారంభించగానే వెనుదిరిగి వెళిపోతున్నారా అన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోరు. తన ప్రసంగం తాను కొనసాగించేసి మమ అనేస్తారు. అంతే ఆయన పబ్బం గడిచిపోతుంది. మళ్లీ మరో బటన్ నొక్కుడ కార్యక్రమంలో తప్ప ఆయన బయట కనబడరు.  బటన్ నొక్కినా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు జమ కాలేదు. అలాగే కాపు నేస్తం అంటూ బటన్ నొక్కారు. ఆ నిధుల విషయం కూడా అతీగతీ లేదు. అడుగుదామంటే బెదరింపులు.  ఇక అమ్మఒడికి ఆయన ఎప్పుడో బటన్ నొక్కేశారు. అందుకు సంబంధించిన సొమ్ముల కోసం అమ్మలు ఎదురు చూస్తూనే ఉన్నారు. విడతల వారీగా అప్పుడో కొంత మంది, ఇప్పుడో కొంత మంది అన్నట్లుగా నిధులు అక్కౌంట్లలో జమ అవుతున్నాయి.   ఇక వాహనమిత్రకు ఆయన బటన్ నొక్కి మాత్రం లబ్ధిదారులకు చేకూర్చే ప్రయోజనం ఏముంటుందని జనం అంటున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో  మహిళలకు అందాల్సిన చేయూత పథకం కోసం బటన్ నొక్కాల్సి ఉంది.  అది ఎప్పుడు అన్న విషయంలో స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో  ఏపీకి జగన్ ఎందుకు అంటూ కొత్త కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఔను జనం కూడా అదే అంటున్నారు. ఏపీకి జగన్ ఎందుకు? అవసరం లేదు అంటున్నారు.  

కాలం చెల్లిన రూ.2000 నోటు!.. ఖాతాలలో డిపాజిట్ కు ఇక ఒక్క రోజే గడువు

రెండు వేల రూపాయల నోట్ల చెలామణికి  శుక్రవారంతో గడువు ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నవంబర్ 18న రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అప్పట్లో అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు మోడీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పటికి చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. కొత్తగా 500 రూపాయలు, రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టింది.  సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టి ఈ ఏడాది నవంబర్ 18కి ఏడేళ్లు పూర్తి అవుతుంది. అయితే పెద్ద నోట్ల రద్దు అంటూ మళ్లీ పెద్ద నోటు రెండువేల రూపాయలను ప్రవేశ పెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. రెండు వేల రూపాయల నోటును ప్రవేశ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరే అది పక్కన పెడితే  రెండు వేల రూపాయల నోటు ప్రవేశ పెట్టిన లక్ష్యం నెరవేరిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి చెలామణిని రద్దు చేసింది. వాటిని ఖాతాలలో జమ చేసుకోవడానికి చివరి గడువుగా సెప్టెంబర్ 30ని నిర్ణయించింది. దీంతో ఇక శుక్రవారం (సెప్టెంబర్ 2 నుంచి రెండు వేల రూపాయల నోటకు కాలం చెల్లినట్లే.   ఇప్పటికీ ఇంకా  ఎవరి వద్దనైనా రెండు వేల రూపాయల నోటు భద్రంగా ఉండి ఉంటే దానికి తమ ఖాతాలలో జమ చేసుకోవడానికి తుది గడువుకు ఇక ఒక్క రోజే ఉందన్నమాట. ఆ తరువాత ఎంత భద్రంగా దాచుకున్నా రెండు వేల రూపాయల నోటు విలువలేని రంగుకాగితం మాత్రమే అవుతుంది.  

ఉండవల్లి..ఊసరవెల్లి!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి ఊసరవెల్లిగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత మేధావి  ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ఆయన జనంలో క్రెడిబులిటీ కోల్పోయి చులకన అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత సేపూ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు తెలిసిన వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రువు విమర్శించారు. స్కిల్ కేసు విచారణను సీబీఐ చేపట్టాలని కోరుతూ ఉండవల్లి హైకోర్టులో కేసు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించి జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ అక్రమ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించడం జగన్ కుట్రలో భాగమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందుగా అరెస్టు చేసేసింది. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామనీ, విచారణలో బయటకు వచ్చే అవకాశాలున్నాయనీ అంటూ కోర్టుల్లో చెబుతోంది. సెక్షన్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అరెస్టు అక్రమమని విస్పష్టంగా తేలిపోతున్నదని సీఐడీ చీఫ్ ఊరూరా తిరుగుతూ మీడియా సమావేశాలలో చెబుతున్న మాటలే తేటతెల్లం చేస్తున్నాయి.  అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించారు.  జగన్ సర్కార్ చంద్రబాబు జనంలో మమేకం అవ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో పన్నుతున్న కుట్రలకు ఉండవల్లి సహకారం అందిస్తున్నారు.  చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో విమర్శలు చేసిన ఉండవల్లి ఈ నాలుగున్నరేళ్లలో జగన్ మద్యం విధానాలపై ఒక్కసారి కూడా నోరు మెదపలేదు?  ఇసుక దోపిడీపై మాట్లాడింది లేదు.  రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఉండవల్లి మౌనం వహించారు. అయితే నిలవని కేసు విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాత్రం ఏకంగా సీబీఐ విచారణ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఉండవల్లి తీరు మొదటి నుంచీ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇబ్బందులలో పడినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. తనకు మాత్రమే సాధ్యమైన అసంబద్ధ లాజిక్ తో జనాలను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యమన్నట్లుగా ఉంది.  సమైక్య వాదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రాష్ట్ర విభజన సమయంలో బిల్డప్ ఇచ్చిన ఉండవల్లి.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం ప్రకటించిన ఉండవల్లి.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తూ వచ్చారు.   మార్గదర్శిపై పోరాటం అంటూ రచ్చ చేసే ఉ:డవల్లి జగన్ అరాచక పాలనపై ఒక్క సారి కూడా నోరెత్తలేదు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై మాట్లాడింది లేదు. ఏటువంటి ఫిర్యాదూ లేని మార్గదర్శిపై పోరాటం అనే ఉండవల్లి వేల మంది ఆరోపణలూ, ఫిర్యాదులూ చేస్తున్నా అగ్రిగోల్డ్ సమస్యపై ఎందుకు మాట్లాడరన్న ప్రశ్నకు ఆయన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు లేకుండా నోరెత్తరని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు.  ఉండవల్లికి ఒక నిశ్చితాభిప్రాయం ఉన్న దాఖలాలు లేవనీ, విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్న ఆయన ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి మద్దతు దారుగా, ఏపీలో ఆయన పార్టీకి తాను సంపూర్ణ మద్దతు ఇస్తానంటూ ముందుకు వచ్చారు. ఏకంగా జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే కేసీఆర్ తో భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. ఇరువురి మధ్యా జరిగిన చర్చలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ భేటీ తరువాత ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో బీఆర్ఎస్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తన రాజకీయగురువు వైఎస్ కుమారుడికి ప్రయోజనం చేకూర్చేందుకే కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన ఉండవల్లి.. విభజన వాదానికి కర్త, కర్మ, క్రియా అయిన కేసీఆర్ తో చేతులు కులిపారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి మేధావి ముసుగులో జగన్ కుట్ర రాజకీయాలకు వంత పాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అమరావతిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల జపంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ విధానాలపై పల్లెత్తు మాట అనకుండా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా నమోదు చేసిన సిల్క్ కేసులొ సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే ఆయన విశ్లేషణలూ, విమర్శల వెనుక ఉన్నది జగనేనని స్పష్టమౌతోందని పరిశీలకులు చెబుతున్నారు.  

సీఎం జగన్‌తో అదానీ రహస్య భేటీ? ఏ బిగ్ డీల్ కోసమో?

ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే పారదర్శకత ఉండాలి.  భరత్ అనే నేను సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇదే కదా అనుకుంటున్నారా? ఔను నిజమే కానీ.. అచ్చం అలాంటి డైలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే  అప్పటికి ఆయన సీఎం కాలేదు. కానీ,  ఆయన సీఎం అయ్యాక మాత్రం ఆ డైలాగ్ మర్చిపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? నాడు సినిమా డైలాగులు చెప్పిన జగన్ ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీ తనం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వం విడుదల చేసే జీవోలు రహస్యం. ఆయన నిర్ణయాలు రహస్యం. చివరాఖరికి ఆయన భేటీలూ రహస్యంగానే సాగిస్తున్నారు. మొత్తంగా జగన్ రహస్య పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియజేయాలి. ప్రతి అంశాన్ని జనాలకు వివరిస్తూ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు.. మేం  ప్రజలకు చెప్పేదేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. అసలు కనీసం సీఎంను ఎవరు కలుస్తున్నారో.. ఎందుకు కలుస్తున్నారో.. వ్యక్తిగతంగానే ఈ భేటీలు జరుగుతున్నాయా? లేక ప్రభుత్వ పరమైన విధానాల కోసమే జరుగుతున్నాయా అన్న కనీస సమాచారం కూడా ప్రజలకు తెలియజెప్పడం లేదు.   సీఎం జగన్మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ  భేటీ అయ్యారు. ఈ భేటీకి తాడేపల్లి  ప్యాలెస్ వేదికైంది. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్ కూడా చేశారు. అయితే  ఇంత సడన్‌గా ఏపీకి అదానీ ఎందుకొచ్చారు? అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి మరీ వీఐపీ హోదాలో ఆయనను తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లడంతో విషయం  బయట పడింది. ఏపీలో వ్యాపార సంబంధ వ్యవహారాలపై మాట్లాడేందుకు వచ్చారని వైసీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. కానీ, అదానీ ఎందుకొచ్చారన్నది మాత్రం స్పష్టంగా చెప్పే వారే లేరు.  జగన్ ఇప్పటికే అదానీకి అప్పనంగా కోట్ల రూపాయిలు విలువచేసే ప్రాజెక్టులు కట్టబెట్టారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు రాసిచ్చేశారు. విశాఖలో డేటా సెంటర్ పేరుతో కొండల్ని కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా ఇచ్చేయాలనుకున్నా.. చివరికి అదానీ సమస్యల్లో ఇరుక్కోవడంతో వెనక్కి తగ్గారు. ఇప్పటికే సంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరి ఇంకా ఏపీలో ఏం మిగిలుందని ఈ రహస్య భేటీ జరిగిందన్నదా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా మరో బిగ్ డీల్ ఏదైనా జరగబోతోందా అంటే నెటిజన్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అధికార వర్గాలలోనూ, రాజకీయవర్గాలలోనూ ఇదే చర్చ జరుగుతోంది.  గౌతం అదానీకి మన రాష్ట్రంలో రహస్య పర్యటనలు చేయడం కొత్తేమీ కాదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికే చాలా సార్లు రహస్యంగా వచ్చారు.  సీఎం జగన్ తో పలు దఫా రహస్య చర్చలు కూడా జరిపి వెళ్లారు. గతంలో కూడా ఆయన ఎందుకొచ్చారు? ప్రభుత్వ పని మీదనా? వ్యక్తిగత పని మీదనా అన్న విషయాలను సీఎంవో కానీ.. క్యాంప్ ఆఫీస్ వర్గాలు కానీ ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ సారి కూడా భేటీపై అధికారిక ప్రకటన వచ్చే అకాశం లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే, అదానీ స్వయంగా వచ్చి జగన్ తో డిన్నర్ చేసి వెళ్లారంటే ఖచ్చితంగా అది బిగ్ డీల్ అన్నది అర్ధమవుతుంది.  ఏ విషయమైనా దాచేస్తే దాగదులే అన్నట్లుగా  ఈ భేటీ ఏ బిగ్ డీల్ కోసం అన్నది ఇవాళ కాకున్నా రేపైనా బయటపడక మానదు. 

ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?.. వైసీపీ కొత్త నినాదం

 ఏంటో పాపం ఎన్ని పేర్లు మార్చినా ఏపీలో వైసీపీకి సౌండ్ పెరగడం లేదు. గడప గడపకి వైసీపీ, జగనే మా నమ్మకం, వైనాట్ 175 ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజలపై రుద్దాలని చూశారు. కానీ, ప్రజలు వాటిని  పట్టించుకోలేదు. గడప గడపకి కార్యక్రమంలో అయితే ఇళ్లకు వెళ్లిన వైసీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. మంత్రులు అని కూడా చూడకుండా ఏం సాధించారని నిలదీశారు. నాలుగేళ్ళ మీ పాలనలో నరకం చూశామంటూ మొహాల మీదనే తిట్టిపోశారు. ఆ దెబ్బతో చాలా మంది నేతలు మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఏమో ఏదోకటి నచ్చ జెప్పండి.. ఒక్కో కుటుంబానికి ఎంత ఇచ్చామో లెక్కలు చెప్పి ప్రజలను మచ్చిక చేసుకోండి అంటూ ఆదేశించినా.. ప్రజల వద్దకు వెళ్లిన నేతల పప్పులు ఉడకనేలేదు. ఇంతిచ్చామని వైసీపీ నేతలు లెక్కలు చెప్తే.. గత ప్రభుత్వం ఏం చేసిందో గణాంకాలతో సహా చూపిస్తూ జనం వైసీపీ నేతలను కడిగి పారేశారు.  ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. చేశామని చెప్పుకుంటున్నా ప్రజలలో వ్యతిరేకతే తప్ప సానుకూలత ఇసుమంతైనా కనిపించకపోవడంతో  వైసీపీ వ్యూహకర్తలు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. అలా ఇప్పుడు వైసీపీ నుండి వచ్చిన మరో పథకమే 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?'. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఈ కార్యక్రమంపై ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. త్వరలో చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన రిషిరాజ్.. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంపై పలు వివరాల్ని వెల్లడించగా.. ఈ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ.. ఇదే ప్రయోజనాలు కొనసాగాలంటే మళ్ళీ జగనే కావాలని ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, జగనన్నగృహ సారథులను భాగస్వాములుగా చేసుకుంటూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జగన్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరులో గడప గడపకు ప్రోగ్రాం ముగించనున్నట్లు చెప్పిన వ్యూహకర్తలు.. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని.. అందుకు పునాది  'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి'? కార్యక్రమం ఉంటుందని చెప్పారని అంటున్నారు.  నవంబరు నుండి కొత్త కొత్త కార్యక్రమాలతో నేతలంతా నిత్యం ప్రజల మధ్యనే ఉండేలా ఐప్యాక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో నేతలకు చెప్పిన జగన్.. ఇక నుండి ఎన్నికల వరకూ నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారని చెబుతున్నారు. కాగా, వైసీపీ కొత్త కార్యక్రమంపై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో ట్రోల్స్ మొదలయ్యాయి. 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి' అంటూ వైసీపీ కార్యక్రమం రూపొందిస్తుంటే ప్రత్యర్ధులు 'ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో' వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీ పరిపాలన మొదలు పెట్టిన రోజులలో కరకట్టపై ఉన్న ప్రజా వేదిక కూల్చివేత నుండి రంగుల కోసం వృధా చేసిన ప్రజా ధనం, అన్న క్యాంటీన్ల మూసివేత, మద్యం ధరలు పెంచి చేసిన ప్రజా దోపిడీ, ఇసుక కోసం ప్రజలు పడిన,పడుతున్న పాట్లు, రాష్ట్రంలో కొరవడిన ఉపాధి, కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు, వైన్ షాప్ ల వద్ద టీచర్ల కాపలా, మాస్కులు అడిగిన వైద్య సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, ఎమ్మెల్యేలు.. మంత్రుల బూతు పురాణాలు, అసెంబ్లీలో వైసీపీ నేతలు వేసిన వెకిలి వేషాలు, రాష్ట్రంలో  గుంతల మయంగా మారిన రోడ్లు, మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కుట్రలు, అటకెక్కిన పోలవరం నిర్మాణం, సీపీఎస్ రద్దు పేరిట ఉద్యోగులకు చేసిన మోసం, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నిలువునా ముంచిన తీరు ఇలా అన్నిటినీ వివరిస్తూ ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో ఆ పోస్టులలో సవివరంగా పెడుతూ వైసీపీ గాలి తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో   వైసీపీకి ఈ కొత్త నినాదం ఏమేరకు పనికి వస్తుందో చూడాలి. ఇది కూడా మరో గడపగడపకూ కార్యక్రమంలాగే అభాసుపాలు కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనంలోకి లోకేష్.. అరెస్ట్ కు సర్కార్ కుట్ర?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి యువగళం పాదయాత్ర  ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం ఏపీ  అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. లోకేష్ సైతం టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ రోజున యువగళం పాదయాత్ర ఎక్కడ ఆగిందో ఇప్పుడు తిరిగి అక్కడ నుంచే ప్రారంభం కానుంది. అయితే, లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టక ముందే అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతున్నదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసి, జగన్ సర్కార్ కక్షపూరిత చర్యలను ఎండగడుతూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్న లోకేష్ త్వరలోనే రాష్ట్రానికి వచ్చి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించనున్నారు. అయితే, జగన్ ప్రభుత్వం లోకేష్ ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసులు పెట్టి లోకేష్ పేరుని చేర్చిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చారు. అంతే కాదు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దీని మీద పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రి నారాయణపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే యాంటిసిపేటరీ  బెయిల్ తెచ్చుకున్నారు. కాగా, లోకేష్ పాదయాత్రను పున:ప్రారంభించాలని చూస్తున్న నేపథ్యంలో యాత్ర ప్రారంభించకుండానే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో మరో హడావిడి మొదలైంది. ఇప్పటికే చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేష్ కూడా అరెస్ట్ అయితే   ఏపీ రాజకీయాలు  మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతీకార చర్యగా పరిశీలకులు తేల్చేశారు. ప్రజలు కూడా దీనిపై అనేక రకాలుగా చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు, సీఐడీ కేసుల విచారణ చూస్తున్న సామాన్య ప్రజలు ప్రభుత్వం చేతిలో వ్యవస్థలు పావులుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ అరెస్టు చేస్తే కక్ష పూరితంగానే   ప్రభుత్వం ఈ కుట్రలకు తెగబడుతుందని ప్రజలు నిర్ధారణకు వచ్చేస్తారు. ఇప్పటికే జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం, తెలుగుదేశం శ్రేణులు లోకేష్ అరెస్టు అవుతారనే ప్రచారం నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎక్కడికక్కడ దీక్షలు చేపడుతూ నిరసనలు తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు లోకేష్ అరెస్టుతో ఎలాంటి నిర్ణయాలకు దిగుతారన్నది అంచనా వేయడం కూడా కష్టమే.  ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు అరెస్టుతో వస్తున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ.. లోకేష్ అరెస్ట్ కి కూడా ప్రయత్నిస్తున్నదంటే టీడీపీకి వస్తున్న సానుభూతి ఎన్నికలలో తనను ఏమీ చేయలేదని భావిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్ అరెస్టుతో టీడీపీని దెబ్బకొట్టి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నటు భావిస్తున్నారు. అధినాయకత్వాన్ని దెబ్బకొట్టి క్యాడర్ లో నిరాశను పెంచి తాను లబ్ది పొందే కుట్రలో భాగమే ఈ అరెస్టులని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ అరెస్టులు.. ప్రభుత్వ నిర్ణయాలు రోజురోజుకూ ప్రజలలో అసంతృప్తి, అగ్రహాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలోనే ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన దీక్షలు చేపడుతున్నారు. జగన్ ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలపై ప్రజలలో చర్చ జరిగేలా చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత నషాళానికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

తుగ్లక్, హిట్లర్, గోబెల్స్‌కు ప్రతిరూపం జగన్ ?

ఏది సత్యం, ఏది అసత్యం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అంశాలను ప్రజలు గుర్తించాల్సి వుంది. మరోసారి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబుని అవినీతిపరుడుగా చిత్రించేందుకు ఏటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి.. అన్యాయంగా  జైలులో పెట్టించి..  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్న దగా నాయకుడి చరిత్ర ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడిన ఆర్ధిక నేరస్థుడు ఎటువంటి నేరానికి పాల్పడని మచ్చలేని నాయకుడిపై అవినీతి ఆరోపణలు చెయ్యడం సిగ్గు చేటు. గాలి మంద గాలి ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో అవినీతికి పాల్పడి, ఏ స్థాయిలో కూడా నీతికి, నిజాయితీకి విలువ లేకుండా చేసి తెలుగువారంటే అంతా మోసం, దగా అన్న భావన ప్రపంచానికి కల్పించిన జగన్ రెడ్డి.. చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం చూసి ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకం ఛీ  కొడుతున్నారు. రెండవ సారి అధికారంలోకి రావడం కోసం ఆధారాలు లేని కేసులు పెట్టి చంద్రబాబును అవినీతి పరుడు గా చిత్రించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అవినీతి అంటూ చంద్రబాబుపై జగన్ గ్యాంగ్ చేస్తున్న రాద్దాంతం అంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే తప్ప మరొకటి మాత్రం కాదు. ఏ విధంగా అయినా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందటానికేనని అర్ధమవుతుంది.  ఒక పక్క రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడి కూడా అవినీతి గురించి సుద్దులు చెప్పడం అంటే అంతకన్నా మోసం మరోకటి లేదు. వైఎస్ఆర్ హయాంలో అంతా ప్రజల కోసమేనంటూ నిష్టగా సాగిన అవినీతి యజ్ఞంలో కొల్లగొట్టబడిన ప్రజాధనాన్ని నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు ఎంతగా శ్రమ పడ్డాయో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా సైతం చూశారు. రూ.43 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఏకంగా పెద్ద బొర్రే పెట్టినట్లు సిబిఐ తేల్చి 17 ఛార్జి షీట్లు వేసింది. అన్నీ ఛార్జిషీట్లలోను వైయస్ జగన్‌ని మొదటి ముద్దాయిగా తేల్చింది. తండ్రి అధికారానికి అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి, రాష్ట్రాన్ని మాఫియా మయం చేసి లక్ష కోట్ల ప్రజాధనం దిగమింగిన ఘనుడీ జగన్ రెడ్డి. జగన్ ఆర్ధిక నేరాలు పలు దేశాలకు సైతం విస్తరించాయని న్యాయస్థానాలు సైతం నివ్వెరపోయాయి. అవినీతిపరులను దీప స్తంభాలకు ఉరి తీయాలని తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు చట్టబద్దంగా అలా ఆదేశించే వీలు లేకపోయిందంటూ కొన్నేళ్ళ క్రితం బాధ పడింది, అలాగే చైనా జాతీయుడిగా వైయస్ జగన్ ఇంత దోపిడీకి పాల్పడి వుంటే అక్కడ అతనికి నిర్ధాక్షిణ్యంగా మరణ శిక్ష అమలు జరిగేది. ప్రపంచంలో మరే ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో అయితే జగన్ బతుకు శంకరగిరి మాన్యాలు పట్టి వుండేది. అయినా జగత్ కిలాడి అయిన జగన్ రెడ్డి తానే నిజాయితీ పరుడుగా అమాయక జనం చెవిలో పూలు పెడుతున్నాడు.  గతంలో ముంబయిని వణికించిన మాఫియా శక్తుల్లో అరుణ్ గావ్లీ ఒకడు. తరువాత అరుణ్ గావ్లీ 1997లో అఖిల భారతీయ సేన పేరిట ఓ రాజకీయ పార్టీ స్థాపించి 2004 లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే అతడి పాపం పండి నేడు జైల్లో వున్నాడు. సమాజానికి చీడ పురుగుల్లాంటి అరుణ్ గావ్లికి, జగన్ గ్యాంగ్‌కి ఎందులోనూ తేడా లేదు. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వుందని మొర పెట్టుకున్న కుటుంబం,  కర్నాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్ ప్లాంట్ 1998లో ఎవరి దగ్గరో కొని 2004 వరకు దాంతో కుస్తీలు పడుతున్న పుత్రరత్నం దశ  అయిదేళ్లలో తిరిగి వేల కోట్ల రూపాయల విలువ చేసే బహుముఖ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందంటే అది అంతా రాష్ట్రాన్ని ఏడాపెడా దోచిన దురాగతం కాదా? జగన్ బొక్కింది గాలికి పోయే పేలాల పిండి కాదని, ప్రజలకు దక్కాల్సిన వేల కోట్ల ప్రజాధనమని జగన్ గ్యాంగ్ గుర్తించాలి,  జలయజ్ఞం, గనులు, సెజ్‌లు, కారిడార్లు, పోర్టులు, నాలెడ్జ్ హబ్‌లు, లేపాక్షి, ఒడిస్సీ, ఎకనామిక్ సిటీలు, రస్ అల్ ఖైమా, ఎమ్మార్..  ఇలా రాజావారి కన్ను పడ్డ ప్రతిదీ కుంభకోణమే. ఏమీ జరగని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరిగిపోయిందని తన ముందుకు వస్తే నోరు పట్టే వారిని, వెనక్కి వస్తే దోచేళ్లు పట్టేవారిని ఊరూరు పంపించించి ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రచారం చేయిస్తున్నాడు.  తన తండ్రి వైఎస్ఆర్ వివిధ రూపాల్లో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సత్ పరిపాలనా సూత్రాలను, రాజ్యాంగ యత్రాంగాలను కాల రాసిన భ్రష్ట చరిత్ర వైఎస్‌ఆర్‌ది. జగన్ దాచింది అంతా జనాన్ని దోచిందే. రాష్ట్ర సర్వతొ ముఖాభివృద్దికి దోహద పడాల్సిన వనరులతో హవాలా నడిపి లెక్కలేనన్ని బినామీ కంపెనీలతో చట్టం కళ్ళు కప్పి నేర పూరిత కుట్రలకు పాల్పడిన జగన్ నేడు పత్తిత్తు మాటలు చెబుతున్నారు. రాజకీయ డ్రామాలు రక్తి కట్టించడంలో జగన్ అభినవ నటుడు ,ఆయన జగన్నాటకం ముందు పగటి వేషం అనేక కళారూపం వెనకబడి పోయింది. ఎంతగా నటిస్తే అంతగా రాజకీయం పండుతుందని జగన్ ఆశ. ప్రజల్ని ఏదో విధంగా మోసం చెయ్యడమే ఆయన లక్ష్యం. చట్ట బద్ద పద్దతుల్లో, ప్రజ్ఞా పాటవాలతో ఎవరు ఎదిగినా.. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎల్లవేళలా రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లలెరుగని కుంభకోణాలతో జన ఖజానాకు చెందాల్సిన సమస్తాన్ని తన కుటుంభానికి దోచిపెట్టిన తీరు నభూతో... అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాదనం దోపిడి తప్ప ప్రజాసేవ అంటే ఏమిటో తెలియని జగన్...  జనం కోసమే పుట్టినట్టు జగన్నాటకాలు ఆడుతున్నాడు.  అక్రమంగా తన తండ్రి తవ్విపోసిన మంది సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకొని నీతులు చెప్పడం సిగ్గు చేటు. నాలుగేళ్ల క్రితం వరకు ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిబడిన పెద్దమనిషి, ఆస్తులు జప్తు చేయించుకున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు అవినీతి పరుడుని  ప్రజలను నమ్మించడానికి ఎన్నో..ఎన్నేన్నో అవస్థలు పడుతున్నారు. ముస్సోలినీ, సద్దాం హుసేన్, ఇడీ అమీన్, హిట్లర్ ఆలోచనల ప్రతి రూపమే వైయస్ జగన్ అని చెప్పాలి. అధికార గర్వంతో, లెక్కలేని తనంతో, రాక్షస పాలన సాగిస్తున్నారు. అహంకారులకు గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రతిపక్షానికి, పౌరులకు రాజ్యాంగం కల్పించింది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ని అడ్డుకొనే చట్టమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు శాంతి యుతంగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించరాదంటూ అనుమతి నిరాకరించడం దుర్మార్గపు చర్య. జగన్‌ పరిపాలనలో ప్రజాస్వామ్యానికి  పెడరెక్కలు విరిచే వికృతం విశ్వరూపం దాల్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు, దర్నాలు, దీక్షలు నిర్వహించే హక్కు కూడా లేకపోతే ఇది ప్రజా స్వామ్యమా? జగన్ స్వామ్యమా?  రాష్ట్రం ఏమన్నా జగన్ జాగీర్ అనుకొంటున్నారా? జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 144  సెక్షన్, 30 యాక్టు నిరంతరం అమలు చేస్తూనే వున్నారు. తానూ ప్రతి పక్షంలో వున్నప్పుడు అనేక  రోజులు రోడ్లపై పాద యాత్రలు, దీక్షలు చేశారు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకొంటే జగన్ రెడ్డి పాద యాత్ర  చేసే వారా? స్వాతంత్రోద్యమంలో కానీ, 1975 నాటి ఎమర్జెన్సీలో కానీ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఏపీలో నయా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లారా చూసిన పెద్దలు చెబుతున్నారు. ఇందిరాగాంధీ  ఎమర్జెన్సీ విధించినా, పౌర హక్కులను కాలరాసినా ప్రజలు  రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినా  పోరాటాలు ఆగలేదు. కానీ ఇప్పుడు ఊరూరా పోలీసులే. హౌస్‌ అరె‌స్టులు చేస్తూ ఇళ్లనే జైళ్లుగా మార్చేస్తున్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టడం అంటే  రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్యులనూ వేధిస్తున్నారు. లాఠీ చార్జీ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ ఏలుబడిలో జగన్ రెడ్డి  రాజ్యాంగం అమలవుతోంది. ఐపీసీ కాదు. వైసీపీ చట్టం అమలవుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీలో మాత్రమే రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు హరించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీకి మించిన అణచివేత కొనసాగుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ బోర్డర్‌ను తలపించే విధంగా వందల మంది పోలీసులను, పారా మిలటరీ బలగాలను మోహరింప చేయడం దారుణం. అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు కుటుంబానికి  మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి బయలుదేరిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం సర్వ శక్తులు ఒడ్డింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ఎక్కడిక్కడ కార్లను ఆపేసి, రోడ్డు పక్కకు నిలిపేశారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అంటూ ప్రశ్నలు సంధించి మరీ వేధించారు. అయినా హైదరాబాద్‌లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు పట్టువదలని విక్రమార్కుల్లా అడ్డంకులు ఛేదించుకొని రాజమండ్రికి చేరుకొని నారా బ్రాహ్మణిని కలసి తమ మద్దతు తెలిపారు.    జగన్ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక, అక్కసుతో, దుర్భుద్దితో చంద్రబాబు అరెస్ట్‌కు ప్రతిగా జరుగుతోన్న నిరసనలు, దర్నాలు, దీక్షలు, ర్యాలీలను అడ్డుకొంటున్నది. ప్రతిపక్షాల స్వేచ్చకు గోరీ కట్టే  నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం  మనుగడ సాగించదు. స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికార పీఠం అధిష్టించిన జగన్ రెడ్డి ఆ ప్రమాణాన్ని పాతాళంలో పాతరేశారు. జగన్ ఫాసిస్ట్ క్రూర మనస్తత్వానికి అధికారం తోడు కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుంది. ప్రభుత్వం మాదే, వ్యవస్థలు మావే, మేము చేసిందే చట్టం, మేము చేసేదే పరిపాలన అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఎవ్వరూ ఎదురు రాకూడదని, తమకు అందరూ భయపడాలని నిరంకుశంతో, నిర్భందాలతో పాలన సాగిస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దానిని ఎవ్వరు అతిక్రమించరాదని . సభలు, సమావేశాలు, ప్రదర్శనలు జరిపే హక్కు రాజకీయ పక్షాలకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలకులు నిరంకుశంగా, నా ప్రభుత్వం నా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు, ప్రతిపక్షం మాత్రం చట్టాలను, జీవోలను ఎందుకు గౌరవించాలి?   రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన లేనప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్ ఉపేక్షించ రాదు. ప్రజాస్వామ్యాన్ని చెల్లని కాసుగా మార్చిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిదే. అఖిల భారత సర్వీస్ అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని,  చట్టాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ఐ ఏ ఎస్,ఐపిఎస్ అధికారులు  గుర్తించకపోవడం బాధాకరం.  ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఐదేళ్లకొక సారి మారుతోంటాయి. వీరు మాత్రం 60 ఏళ్ళు పదవుల్లో కొనసాగుతారు. అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాoగ నిర్మాతలు కల్పించిన హక్కులు, అధికారాలు సామాన్యమైనవి కావు. కానీ చట్టానికి,రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాధ్యత లేకుండా పనిచేస్తూ వ్యక్తి గుర్తింపు కోసం, ప్రమోషన్లకు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనలకు సభలకు, ర్యాలీలకు అనుమ్మతులు నిరాకరించడం, ముందస్తు అరెస్ట్‌లకు పాల్పడటం, గృహ నిర్బంధాలు వంటి నిరంకుశ చర్యలతో పాలన సాగిస్తున్నారు. అధికార పార్టీ దన్నుతో పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ రెడ్డి అహంకారంతో, ప్యూడలిస్ట్ స్వభావంతో పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వ, వేధింపులు, సాధింపులు, నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి అడుగులకు మడుగులోత్తుతూ ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. రాష్ట్రంలో పోలీసులు నేరం చేసిన వారిని కాపాడుతున్నారు. భాదితుల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలకు విధేయులుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా వున్నామని నిరూపించుకోవడానికి పోలీసు వ్యవస్థ అంతులేని ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపొయారు. జగనొక లెక్క కాదు. ప్రజలు ఇప్పటి వరకు సహనంతో  వున్నారు. ఇంక ప్రజలు సహించే పరిస్థితి లేదు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ గ్యాంగ్ అంతా సిద్ధంగా ఉండాలి. ప్రజాస్వామ్య పెడరెక్కలు విరిచే ధోరణిని అరికట్టాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక హిట్లర్, ఒక తుగ్లక్, ఒక గోబెల్స్‌లకు ప్రతిరూపంగా అయిన పరిపాలన సాగుతుందని,ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు.  నీరుకొండ ప్రసాద్ 9849625610

జగన్‌రెడ్డి గానుగెద్దులా ఐపీఎస్, ఐఏఎస్‌లు?

జగన్‌రెడ్డి ఆదేశాలకు తలొగ్గి గాను గెద్దుల్లా పని చేస్తున్నారు ఐఏఎస్, ఐపిఎస్‌లు అధికారులు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సీఐడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రతిపక్షనాయడు చంద్రబాబుపై కేసులు పెట్టడానికి పరుగెత్తుకు వస్తున్నారు. అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిర్ణయించడం తప్ప రోడ్డు వేయలేదు. కనీసం దాని కోసం భూ సేకరణ కూడా చేయలేదు. రోడ్డే లేకుండా రూ.2 వేల కోట్ల కుంభకోణం అంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆయన ఆదేశాలతో ఆధారాలు లేకుండా ఊహలతో సిఐడి అధికారులు కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి  తలుచుకుంటే కనీస ఆధారాలు లేకపోయినా ఎవరిపైన అయినా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించ వచ్చునని జగన్మోహన్‌ రెడ్డి రుజువు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించి ఏ ఆధారాలు చూపకుండా ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో నిర్బంధించారు. మళ్ళీ ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోఅరెస్టు అయి జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డ్ ఎలైన్‌మెంట్ కేసులో సిఐడి అధికారులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే సంబంధం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్డ్ కేసులో లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును, లోకేష్‌లను ప్రజల్లోకి వెళ్లకుండా చెయ్యడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కుట్రలకు తెర లేపింది.  ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో సీఐడీ మోపిన కేసుపై తెలుగుదేశం పార్టీ  సవివరంగా  నివేదిక విడుదల చేసింది.  సీఐడీ తప్పుడు ఆరోపణలకు నిర్దిష్టంగా సమాధానాలిచ్చింది. ఇది రాజకీయ ప్రేరేపితం,కల్పితం తప్ప వాస్తవాల ఆధారంగా పెట్టిన కేసు కాదని స్పష్టం అవుతున్నది. ఊరూ పేరూ లేని వారి తరపున థర్డ్‌ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చా? అలా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్ణయం వల్ల తమకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతారా? వాటి వల్ల అయాచితంగా లబ్ధి పొందిన వారు ఎవరో నిర్ధారించకుండా కేసులు పెట్టుకుంటూ పోతే అధికార యంత్రాంగం పని చేయగలదా? స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలదా? పరిపాలన పక్కన పెట్టి చంద్రబాబు, లోకేష్‌లను ఏయే కేసులలో ఇరికించేందుకు, కేసులను శోధించడమే జగన్‌ ప్రభుత్వం దినచర్యగా మారింది.       ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రజా రాజాధాని నగర నిర్మాణానికి సింగపూర్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని నగర ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కోసం సీఆర్‌డీఏ ఆరు నెలలకు పైగా సంప్రదింపులు జరిపింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా జరిగింది. దాదాపు 1100 మందిని సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి రూపొందించారు. అయినా ముఖ్యమంత్రి జగన్ మెప్పుకోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరాధార అసంబద్ధ ఆరోపణలతో సిఐడికి పిర్యాదులు చేస్తూనే వున్నారు. అమరావతిని అటకెక్కించి, మాస్టర్ ప్లాన్‌ను తుంగలో తొక్కేశారు. గీతల్లోనే ఉన్న ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌పై అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ప్రభుత్వం సీఐడీ కేసు పెట్టడం చూస్తే  జగన్ రెడ్డి ఎంత కక్షతో రగిలి పోతున్నారో అర్ధం అవుతుంది. ఇంత వరకు ఇన్నర్ రింగ్‌ రోడ్డు విషయంలో ఆరోపణలు రాలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత అసలే లేదు. గతంలో అలైన్‌మెంట్‌ నిర్ణయించినప్పుడు గానీ. ఆ తర్వాత గానీ వచ్చిన అభ్యంతరాలు కూడా లేవు. అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సిఐడి కార్యాలయం అడ్డాగా మారింది. సిఐడికి గాలి పోగేసి.. గాలి కేసులు పెట్టడం అలవాటుగా మారింది. కేసులు పెట్టడానికి ఏమి దొరక్క ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అవినీతి అంటూ మరొక నాటకానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ పిర్యాదు చెయ్యడమే ఆలస్యం విచారణ లేకుండా ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పని చేస్తున్నదీ సిఐడి.  రాజధాని అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరించడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా జరిగిందని దేశవ్యాప్తంగా ప్రశంసలు సైతం వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆ పని చేశారు కనుక రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట భూ కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని ఎత్తుకున్నారు  సీఐడీ అధికారులు ఏదో ఒక కేసు నమోదు చేయడం, దానిపై చంద్రబాబు కోర్టులను ఆశ్రయించవలసి రావడం జరుగుతూనే ఉంటుంది. అత్యున్నతమైన ఐపిఎస్‌ల, ఐఏఎస్‌ల వ్యవస్థ జగన్‌రెడ్డి ఇంటి ముందు గానుగెద్దులుగా పని చేస్తున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల్లో విలువలు క్షీణించి ముఖ్యమంత్రి అభీష్ట కామ్యార్ధ సిద్ది కోసం గులాం గిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చారు. అఖిల భారత సర్వీస్ చట్టం ప్రకారం ఈ అధికారులకు విశేషాధికారాలు వున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని. చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తూ, నిజాయితీతో రాజ్యాంగ నిబంధనలు పాటీంచాల్సిన అవసరాన్ని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు గుర్తించడం లేదు.  అఖిల భారత సర్వీస్ అధికారులకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు. అధికారాలు సామాన్యమైనవి కావు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకొన్నా అడ్డుపడే అధికారం బిజినెస్ రూల్స్ రూపంలో ఐఏఎస్‌లకు దాఖలు పడింది. నిబంధనలు ఒప్పుకోవంటూ ముఖ్యమంత్రుల పార్మెంట్‌నే సున్నితంగా తిరస్కరించిన అధికారుల శకం అంతరించి రాజకీయ బాసులతో కలసి అవినీతి మడుగులో ఈదులాడటం, ప్రతిపక్షాలను వేధించడం, సభలను అడ్డుకొనే సంతతి నేడు ప్రజాస్వామ్య నవనాడులను కుళ్లబొడుస్తోంది.. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి   లేదు. ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్, ఐఫిఎస్ అధికారులు సహకరిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం నేలబారుగా వ్యవహరించి దేశంలోనే అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దెందుకు నడుం బిగించే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది.          నిబద్దతతొ పనిచేసే యంత్రాంగం అంతరించి స్వామి కార్యంతొ పాటు స్వకార్యాన్ని సాధించుకొంటూ తరిస్తున్నారు. ప్రతిష్టాత్మక సివిల్.సర్వీస్ వ్యవస్థలో రుగ్మతలు రూపు మాపి.. విలువలు పునరుద్దరించాలని. తాము కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్దరించు కొవాలని, దాపరికం లేని విధానాలు అవలంభించాలని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సదస్సులో  తీర్మానించి ఏళ్ళకు ఏళ్లు గడిచింది. ప్రభుత్వానికి చుక్కానిగా  వ్యవహరించవలసిన సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహర శైలి మార్చి వ్యవస్థనే రాజకీయ సాధనంగా దిగజార్చిన వైనం తాలుకా దుష్పలితాలు జగన్ పాలనలో కళ్ళకు కడుతున్నాయి. అధికారులు రాజకీయ దినుసులుగా మారడం వల్లనే పాలనలో నైతిక ప్రమాణాలు  దిగజారాయి. నేడు జగన్ పాలనలో ఐ.ఏ.ఎస్. ఐపిఎస్‌ల ప్రతిష్టకు గ్రహణం పట్టించారు. జగన్ పాలనలో పౌరసేవలు రాజకీయ సర్వీసులుగా మారిపొయిన వాస్తవాలు ఎన్నో కళ్ళకు కడుతున్నాయి. ఒత్తిళ్లను  ప్రతిఘటించ లేని ఐ.ఏ.ఎస్. ఐ. పి.ఎస్‌లు సర్వీస్‌లో కొనసాగడం వల్ల ఎవరికి ప్రయోజనం.  ప్రజల, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాకుండా తమ ప్రయోజనాలే పరమావధిగా వ్యవరించడం అఖిల భారత సర్వీస్ వ్యవస్థకే అవమానకరం. పాలకులకు గులాంగిరి చేసే బదులు ప్రజలకు. విధేయులుగా ఉంటే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను ఎవరూ ఏమి చేయ్యలేరు. అంతేకాదు.. అటువంటి వారికి ప్రజలే అండదండగా ఉంటారన్నది మాత్రం వాస్తవం.  గతంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పై పెత్తనం చెయ్యడానికి రాజకీయ నాయకులు భయపడే వారు. ఆయా అధికారులు కూడా నిబద్దతతో నిజాయితీగా ప్రజల కోసం కష్టపడే వారు. ఇప్పుడు పోస్టింగులు కోసం అడ్డమైన పనులు చెయ్యడానికి కూడా ఆలిండియా సర్వీస్ అధికారులు వెనకాడటం లేదు. కీలక పోస్టింగ్‌ల కోసం పాలకుల అడుగులకు మడుగులోత్తే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగానే ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు ప్రభుత్వానికి ఉపయోగ పడుతున్నారు. తన పేరిట జీఓలు జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వ కార్యదర్శులైన ఐఏఎస్‌లకు గవర్నర్ వ్యవస్థ కట్టబెట్టడం వారిపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. తమపై అంతటి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన విషయాన్ని ఐఏఎస్‌లు విస్మరించడం ఎంత వరకు సమంజసం? ముఖ్యమంత్రి చెప్పాడని నిబందనలకు విరుద్దంగా జీఓలు జారీ చేసే పక్షంలో అందుకు ఐఏఎస్ అధికారులు ఎందుకు? సాధారణ ఉధ్యోగులు కూడా సరిపోతారు కదా? జగన్ పాలనలో ఐపిఎస్‌లు.. వై పీఎస్‌లుగా, ఐఏఎస్‌లు.. అయ్యా ఎస్‌లుగా మారి పోయ్యారు. ప్రభుత్వం ఇష్టాను సారం, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత ఐఏఎస్ అధికారి నెలబారుగా వ్యవహరించడం భాధ్యతా రాహిత్యం. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు పాలకులకు విధేయులుగా మారడం వల్లనే జగన్ పాలనలో  ఐఏఎస్, ఐపిఎస్‌ల పని తీరు పూర్తిగా మసక బారింది.      ఐఏఎస్ అధికారులను కోర్టుకు పిలిపించడమే కాదు న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. తమ ఆదేశాలను లెక్క చెయ్యని అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ  ఒత్తిళ్లకు లొంగి పోయి తప్పులు చేస్తూ హైకోర్టుతో చీవాట్లు తిని, శిక్షలు వేయించుకొని అఖిల బారత సర్వీసుల వ్యవస్థను చులకన చేశారు. ఆ మధ్య రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు అయ్యేలా చూడాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిపించి మరీ చెప్పాల్సి వచ్చిందంటూ  పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. పోలీసు అధికారులు, అధికారుల్లా కాకుండా జగన్ జేబు సంస్థగా మారడం వల్లనే ఈ దుస్థితి. పోలీసు వ్యవస్థను అదుపు చెయ్య లేకపోతే డిజిపి రాజీనామా చేయాలని కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో కూడా అధికారంలో వున్న పార్టీలకు ఐఏఎస్,ఐపిఎస్‌లు అనుకూలంగా వ్యవహరించడం సహజమే. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి  వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్‌ల వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి  లేదు. ఆంధ్రప్రదేశ్ అస్త వ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది.  రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు సహకరిస్తున్నారు. ఐ ఏ ఎస్ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలను గుడ్డిగా ఆచరించే విధానానికి స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. సొంత ప్రయోజనాల కోసం నెలబారుగా వ్యవహరించి అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చ కండి. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే ఐపిఎస్‌లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.                                                                                                                                                                    నీరుకొండ ప్రసాద్  9849625610

మేధావుల మౌనం నేరమే ?

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నా, వారసత్వ సంపదని దోపిడీ చేస్తున్నా, రాష్ట్రం ఏమై పోతున్నా మేధావుల పాత్ర మౌనమేనా? మేధావుల మౌనమే పాలకుల దౌర్జన్యం. మేధావుల ప్రేక్షక పాత్రే పాలకుల అరాచకం. మేధావుల మౌనం రాష్ట్రాభివృద్ధికి శరాఘాతం. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకొనే మేధావుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న పాలకులను మేధావులు ప్రశ్నించాల్సి వుంది. అసమర్ధ  పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెగిన గాలిపటం చందంగా మారింది.  అడ్డగోలు, అసంబద్ధ నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలు అయ్యింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా అంచుకు చేరింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. పనుల కోసం పోటీ పడే కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడని దుస్థితి దాపురించింది. సంపద పెంచకుండా అందిన కాడల్లా అప్పు చేసి సంక్షేమం పేరిట నగదు పంచడం సంక్షేమమా? ఆర్ధిక అరాచకమా అర్ధం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కానీ, అధికారులు బాధ్యులు కారు. చేసిన అప్పులకు బాధ్యత తీసుకోవలసింది ప్రజలే. ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఏ రాష్ట్రమైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పుడు అప్పులు తీసుకు రానిదే రోజు గడవని పరిస్థితి. జగన్‌రెడ్డి అప్పులు చేస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు పట్ల విజ్ఞత ఉన్న వారెవరికైనా ఆందోళన కలుగుతుంది.  రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతున్నది. సంక్షేమ పథకాలతో ఉద్ధరిస్తున్నానని చెబుతున్నా ఆ సంక్షేమ పథకాలకు కూడా అప్పులు పుట్టని దుస్థితి దాపురించినా మేధావులు మాత్రం ప్రశ్నించరు. అట్లాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఏ గతి పట్టించారో మేధావులకు కనపడటం లేదా? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా రాజధాని కూడా లేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు కారణం ఎవరు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పైసా ఖర్చు లేకుండా రైతులు వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారు.  రాజధాని నిర్మించే మహత్తర అవకాశాన్ని కాలదన్ని దుష్ట తలంపులతో అమరావతిని పాడు బెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినా రాష్ట్రంలో వున్న మేధావులు ప్రశ్నించారా? ప్రశ్నించాల్సిన బాధ్యత మేధావులకు లేదా? అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి.. రాష్ట్ర  ప్రజల భవిష్యత్ ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆధారపడి వుంది. అందుకే దీని నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గత ప్రభుత్వం  పోలవరం సాకారం దిశగా నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్న తరుణంలో..  2019 ఎన్నికలు జరిగి గత ప్రభుత్వం ఓడిపోయి అధికారం అసమర్ధుడికు దక్కి పోలవరం మళ్ళీ బలిపీఠమెక్కింది.  అసమర్ధ పరిపాలనలో జరిగే నష్టమేంటో చెప్పడానికి పోలవరం ప్రాజెక్టు కేస్‌ స్టడీ వంటిది. పోలవరాన్ని నాశనం చేసి ప్రాజెక్టు నిర్మాణంపై చేతు లెత్తేసినవారిని మేధావులు ప్రశ్నించరా? మేధావులు రాష్ట్ర ప్రయోజనాల పక్షమా? లేక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వారి పక్షమా? అనేది తేల్చుకోవాల్సింది మేధావులే. అదే ఇంకొక ప్రభుత్వం ఇంత మూర్ఖంగా, ఇంత అడ్డగోలుగా, మరి ఇంత అనాగరికంగా పరిపాలన సాగిస్తే కొందరు మేధావులు నానా యాగీ చేసేవారు కాదా? నిద్ర లేచింది మొదలు పేదల జపం చేస్తూ, పేదలను ముందుపెట్టి  రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన వారు ఆచరణలో చేస్తున్నది ఏమిటి?  సంక్షేమ పథకాల పేరిట ఈ నాలుగున్నరేళ్లలో మహా అయితే ఒక్కో కుటుంబానికి రూ. లక్షకు పైగా పంచి పెట్టి ఉంటారు. అందుకోసం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి సోకాల్డ్‌ సంక్షేమ పథకాలకు ప్రచారం పేరిట తన సొంత మీడియా సంస్థలకు ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.500 కోట్ల రూపాయలను దోచి పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూడా పేదలకు ఇచ్చింది రూ. లక్షకు పైగా  మాత్రమే. అదే జగన్ రెడ్డి, తన సొంత మీడియా వ్యవస్థలకు మళ్లించింది మాత్రం అక్షరాల 500 కోట్ల రూపాయలు. ఇంత కంటే మోసం, దగా ఉంటుందా? ఇటువంటి దారుణాలపై మేధావులు ఎప్పుడన్నా ప్రశ్నించారా? పాలకుల కపటత్వాన్ని కొందరు మేధావులు ఎందుకు ప్రశ్నించరు? 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికితే నిజమనుకున్న ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మర్చిపోయినా, జగన్ రెడ్డికి ఆ విషయం గుర్తు చేయడానికి ఒక్క మేధావి కూడా సాహసం చేయ్యరా? మహిళల భద్రతా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కళ్ళకు కనబడుతున్నా, మహిళల పట్ల మానవ మృగాలు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నా ఆడపిల్లలకు భద్రత ఎక్కడ? అని ఏ ఒక్క మేధావి ప్రశ్నించరు.  అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆ పని చెయ్యక పోగా 8 విడతలుగా విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై రూ.50 వేల కోట్లకుపైగా భారం మోపి.. నడ్డి విరుస్తున్నా.. ఒక్క మేధావి కూడా ప్రశ్నించరు? విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోయినా ఒక్క మేధావి మాట్లాడరు?  ఎందుకంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తనపై, తనవారిపై ఉన్న కేసుల నుంచి బయటపడటం, బయటపడేయటం ముఖ్యమైనదిగా మేధావులు భావిస్తున్నారా? సంపూర్ణ మధ్య నిషేధంలో భాగంగా దశల వారీగా మధ్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన వారు..  ప్రస్తుతం తాగే మద్యాన్నే కాకుండా భవిష్యత్‌లో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తెస్తున్నా, కల్తీ మద్యం అమ్ముతూ మందు బాబుల ఆస్తులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నా,  మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మరీ ఆదాయం పెంచుకుంటున్నా, మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు పోగేసుకొంటున్నా, మద్య నిషేధం అమలుకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం... అయినా ఏ ఒక్క మేధావి మాట్లాడరు? సమస్త పన్నులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదల బతుకు చిధ్రమవుతున్నా ఒక్క మేధావి కూడా ప్రశ్నించరు. నిలదీయరు.    రాష్ట్రంలో రోడ్లు సర్వనాశనం అయి మోకాళ్ళ లోతు గుంతలు పడి రహదారులు నరకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారినా రోడ్లు బాగా లేవని, రోడ్లు బాగు చేయమని గాని, దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించి ఒక్క మేధావి ప్రశ్నించరు. ఎందుకంటే పెట్రోల్‌ ఆదా చెయ్యడం కోసం.. ప్రయాణాలను తగ్గించడం కోసం.. రోడ్లు బాగుచేయడం లేదని చెబుతారేమోనని, ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో అధ్వాన్న స్థితి  అద్దం పడుతున్నది. ప్రజలు నమ్మి అధికారం అప్పగించినందుకు రాష్ట్రం కోల్పోయింది ఏమిటో  మేధావులు గుర్తించడం లేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు తెరవాల్సిన మేధావులు మౌనంగా ఉండటం ఏమిటి?   కుహనా మేధావుల సంఖ్య పెరిగిపోతుంది. వారు ప్రవచించే నీతులు కింద నిజం కప్పబడి పోయింది. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం జరగనిది, జరిగినట్లు, చెడును మంచిగా చెప్పడం వల్ల సమాజానికి ఎంత చేటు చేస్తున్నారో వారే అర్ధం చేసుకోవాలి.  నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పడానికి మేధావులు ముందుకు రాకపోతే  ప్రజలకు నష్టం చేసిన వారు అవుతారు. దీని వల్ల ఉగ్రవాదులు నుంచి వచ్చే ప్రమాదం కన్నా, అబద్దాలు చెప్పి  ప్రజలను మోసం చేస్తున్న మేధావుల వల్లనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నదన్నది సుస్పష్టం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలపై ప్రజాస్వామ్య వాదులు, మేధావులు గళం విప్పాలి. సంఖ్యా బలంతో ప్రభుత్వం.. పార్లమెంటరీ సాంప్రదాయాలను, పద్దతులను, చట్టాలను కాలరాసి ఇష్టానుసారం పాలన సాగిస్తోంది. కావునా జనచైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రభుత్వం సక్రమమైన పాలన అందించనప్పుడు ప్రశ్నించాల్సిన భాధ్యత మేధావులదే, అరాచకం, అహంకారం, స్వార్ధం, అవినీతి, నియంతృత్వం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మేధావులు ఇప్పటికైనా మౌనం వీడి పాలకుల  కపటత్వాన్ని ప్రశ్నించాలి.       నీరుకొండ ప్రసాద్  9849625610

సీజేఐ బెంచ్ కు చంద్రబాబు క్వాష్ పిటిషన్.. అక్టోబర్ 3న విచారణ

ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు  తన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఈ రోజు సుప్రీంలో విచారణకు వచ్చినప్పటికీ  న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ అనడంతో  అనివార్యంగా విచారణ వాయిదా పడింది.  మరో బెంచ్  కేసు విచారించాల్సి ఉందంటూ  సుప్రీం కోర్టు ఏకంగా వారం పాటు విచారణ వాయిదా వేసింది. ఈ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా  మధ్యంతర రిలీప్ కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ బెంచ్ ను ఆశ్రయించారు. పరిగణనలోనికి తీసుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చంద్రబాబు కేసును నెక్ట్స్ వర్కింగ్ డే అయిన మంగళవారం (సెప్టెంబర్ 3)విచారణ చేపడతామని అన్నారు. అంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ మంగళవారం సీజేఐ బెంచ్ ముందుకు విచారణకు వస్తుంది. అయితే   కింది కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ పై  ఎటువంటి నియంత్రణా విధింజాలమని సీజేఐ పేర్కొన్నారు. కాగా చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా  17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని.. ఎఫ్ఐఆర్ లో పేరు లేని చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనటువంటి కేసు ఇదని  వాదించారు. అలాగే తాము  బెయిల్ కోరుకోవడం లేదని అది మెరిట్ ప్రకారం వస్తుందన్నారు.  జడ్ ప్లస్ క్యాటగిరీ, ఎన్‍ఎస్‍జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసే విధానం ఇదా అని ప్రశ్నించారు. అలాగే  పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛను సంబంధించిన విషయమన్నారు. యశ్వంత్ సిన్షా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారని వివరించారు. ఈ దశలో సీజేఐ చంద్రచూడ్  చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను వచ్చే నెల మూడో తేదీన విచారణకు లిస్ట్ చేస్తామని  తెలిపారు. దీంతో కేసు మూడో తేదీకి వాయిదా పడినట్లయింది. అంతకు ముందు బెంచ్‌లో ఉన్న జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు.  చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2000-2003) పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశారు. దాంతో ఈ కేసులో కేసులో విచారణకు ఆయన నిరాకరించారు.  ఇటీవలే హైకోర్టులో చంద్రబాబుకు వ్యతిేకంగా ప్రభుత్వం తరపున వాదించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి .. అభ్యంతరం ఉంటే వైదొలుగుతానని ఇరు పక్షాల లాయర్లకు చెప్పారు. కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దీంతో విచారణ జరిపిన జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉండగా చంద్రబాబు ఏసీబీ వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్, చంద్రబాబు బెయిల్ పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరిగింది. రెండింటినీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వచ్చే నెల5వ తేదీకి వాయిదా వేసింది.  

జగన్ కంఠశోష.. వైసీపీ నేతలకు శిరోభారం!

జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సందర్భంలో ప్రసంగించినా ఆయన స్టైల్ ఒక్కటే.. ఆయనకు తెలిసిందీ ఒక్కటే.. అదే ఆత్మస్థుతి, పరనింద. తన భుజాలను తానే చరుచుకోవడం, ప్రత్యర్థులపై విరుచుకుపడటం. మరో సారి కూడా జగన్ మోహన్ రెడ్డి అదే చేశారు. ఆయనకు తీరిక దొరికినా, ఏమీ తోచకపోయినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజవకర్గ ఇన్ చార్జీలతో సమావేశమౌతారు. అలాగే మంగళవారం (సెప్టెంబర్ 26) కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ చార్జీలతో భేటీ అయ్యారు. గత భేటీలకూ, ఈ భేటీలకూ పెద్ద తేడా ఏమీ లేదు. గత భేటీలలో ఏం చేప్పారో.. ఈ సారి అదే చెప్పారు. అయితే  రాష్ట్రంలో తన పాలనపై తీవ్రంగా వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగా ఆయన మాటల్లో ధీమా తగ్గింది. స్వరంలో వాడి లేదు. పని తీరు మార్చుకోవాలన్న హెచ్చరికలు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరంతా నా వాళ్లు. మిమ్మల్ని నేను వదులు కోను అంటూ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, ఎమ్మెల్సీల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేశారు. అయితే గత సమావేశాలలో జగన్ టోన్ ఇలా లేదు. హెచ్చరికలు, పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇవ్వనంటూ ఆగ్రహం కనిపించాయి. అయితే ఈ సారి టోన్ పూర్తిగా మారిపోయింది. సిట్టింగులందరికీ టికెట్లిచ్చే పరిస్థితి లేదు అని చెబుతూనే టికెట్ దక్కని వారు కూడా తనవారేననీ, వారికి తప్పని సరిగా ఏదో ఒక పదవి ఇస్తానంటూ బుజ్జగింపు ప్రయత్నాలే జరిగాయి.  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆ వ్యతిరేకత పీక్స్ కు చేరింది. అంతే కాకుండా వైసీపీ నేతలు, శ్రేణులలో కూడా జగన్ తప్పు చేశారని, చంద్రబాబుది అక్రమ అరెస్టుననీ, దీని వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిందన్న అభిప్రాయమే వ్యక్తం అవుతున్నది. అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు, శ్రేణులూ ఈ విషయంపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ విషయాలన్నీ గ్రహించే జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. నష్ట నివారణ చర్యలలో భాగంగా చాలా సౌమ్యమైన స్వరంతో ప్రసంగించారు. జనంలో వచ్చిన వ్యతిరేకతను ఎటూ తగ్గించలేం. కనీసం పార్టీ నేతలు, శ్రేణుల్లో  ఉన్న భయాలు, ఆందోళనను అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో జగన్ ఈ భేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే సముదాయించడం, భయాలను, ఆందోళనలను తొలగించడం మాట అటుంచి జగన్ వారికి చెప్పింది ఆవు కథ మాత్రమే. గతంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాలలో చెప్పిన విషయాన్నే అక్షరం పొల్లుపోకుండా జగన్ మళ్లీ వల్లె వేశారు. ఇక్కడ కొత్తగా ఆయన చేసిన ప్రతిపాదన ఏమిటంటే జగనన్న సురక్ష,  వై జగన్ నీడ్ ఏపీ కార్యక్రమాలు నిర్వహించాలన్నది మాత్రమే. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని ఓ రేంజ్ లో ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు, నాయకులు మరోసారి పేరేదైనా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లేందకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత పలువురు ఇదే అభిప్రాయాన్ని ఒకింత బాధతో, ఒకింత నిర్లిప్తతతో ఒకరికొకరు చెప్పుకున్నారు.   బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడమే పాలన అనుకునే నాయకుడికి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న నాయకుల బాధలు ఎలా తెలుస్తాయని అంటున్నారు. రోడుకు ఇరువైపులా పరదాలు కట్టుకుని జనాగ్రహం కంట పడకుండా నేరుగా వేదికపైకి వచ్చి బటన్ నొక్కేసి డబ్బులు పంచేశానని ప్రకటించి.. జనం వింటున్నారా, సభ నుంచి పారిపోతున్నారా అన్నది పట్టించుకోకుండా ప్రసంగించేసి వెళ్లిపోయే జగన్ కు పార్టీ నేతల ఇబ్బందులు ఎలా తెలుస్తాయని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం మీద జగన్ తో భేటీలో మరోసారి ఆవుకథ విన్నామంతే.. అంతకు మించి జరిగిందేమీ లేదని పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. 

జగన్ కక్ష పూరిత రా జకీయాలు.. వ్యవస్థలే టార్గెట్!

జగన్ రెడ్డి కక్ష రాజకీయాలు దాటి, వ్యక్తులను దాటి ఏకంగా వ్యవస్థలనే టార్గెట్ చేసిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్రమాస్తుల కేసులో తనను జైలుకు పంపిన వ్యవస్థలపై ఆయన కక్షకట్టారనీ, అందుకే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో ఉన్న పెంపుడు చిలుకలుగా మార్చేసిన జగన్ ఇక న్యాయ వ్యవస్థపై కూడా పంజా విసరాలని భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్ రెడ్డి.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా ప్రశ్నించిన వారిపై వేధింపులకు దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ కస్టడీలో మ్యాన్ హ్యాండిలింగ్ కు గురైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.   ఇక అధికారం చరమాంకానికి వచ్చిన తరుణంలో జగన్ వైనాట్ 175 అన్న ధీమానుంచీ ఎట్ లీస్ట్ అధికారం మరో సారి అన్న అభ్యర్థనలను కూడా జనం వినరన్న నిర్ధారణకు వచ్చిన తరువాత.. తనతో పాటు అందర్నీ ముంచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులకు తెరతీశారని రామకృష్ణం రాజు ఆరోపించారు. నిజమే.. జగన్ విపక్షాలను అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో దిగ్బంధించేసి రాష్ట్రం మొత్తాన్ని భయం గుప్పెట బంధించేసి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో విశృఖలంగా వ్యవహరిస్తున్నారనీ, పీక్స్ చేరిన అధికార ఉన్మాదంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే జనం ఒక సారి డిసైడ్ అయితే.. ఎదుటి వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ఎంతగా మంద బలంతో అణచివేయాలని చూసినా ప్రజల చేతిలోని ఓటు అనే పాశుపతాస్త్రం సూటిగా లక్ష్యాన్నే తాకుతుందని, ఎంతటి వారినైనా ఓడించి ఇంటికి పంపుతుందనీ చరిత్ర పలుమార్లు రుజువు చేసిందంటున్నారు. అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుతుందని భావించిన నేతలు ప్రజాగ్రహానికి గురై ఇళ్లకే పరిమితమైన ఉదంతాలెన్నో ఉన్నాయని ఉదహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల ఆగ్రహాన్నీ చవి చూస్తున్నారనీ, ప్రజాగ్రహాన్ని కూడా దౌర్జన్యంతో అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవనీ అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు హామీ అంటూ గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదనీ, అలాగే అంగన్వాడీలు, ప్రభుత్వోద్యోగులు, సంపూర్ణ మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి మహిళల ఆగ్రహానికీ గురైన జగన్ను ఇప్పుడు ఆ ఆగ్రహ జ్వాలల సెగ తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. దొంగ ఓట్లు, డబ్బు, మద్యం, ప్రలోభాలూ ఇవేవీ జగన్ ను ఎన్నికలలో ఓటమి నుంచి కాపాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ అన్ని హద్దులూ దాటేసి జరగని కుంభకోణాలు, లేని కేసులతో విపక్ష నేతలను నిర్బంధించి గెలవాలని, గెలుస్తాననీ భావించడం భ్రమే అవుతుందని అంటున్నారు. జగన్ కు విజయం కనుచూపుమేరలో కూడా లేదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయని పరిశీలకులు ఉదహరిస్తున్నారు. 

 సిల్వర్ జూబ్లి వేడుకలు జరుపుకుంటున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ 

ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొన్న గూగుల్ ఇంజిన్ 25వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 04, 2023న ఈ శోధన ఇంజిన్ పుట్టింది.25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లి వేడుకలు జరుపుకుంటోంది.  1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనే ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులచే గూగుల్ ఇంజిన్  స్థాపించబడింది.  ఏదైని సమాచారాన్ని చిటికెలో తెల్సుకునే మార్గం గూగుల్ తప్ప మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.   ఇది కేవలం ఒకే క్లిక్‌తో  కనెక్ట్ అవ్వడానికి మార్గం  సులభతరం చేసింది. గూగుల్  ప్రధాన లక్ష్యం "ప్రపంచ సమాచారాన్ని సేకరించి తన వినియోగదారులకు అందించడమే’’.  దశాబ్దాలుగా ఈ టెక్ సెర్చ్ దిగ్గజం  అనేక ఇతర ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. కనెక్షన్ పరంగా వినియోగదారులకు  అత్యంత సులభతరంగా ఉంది.  భాష అనే అవరోధం లేకుండా  వివిధ దేశాలకు వెళ్లడానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ సులభతరం చేసింది.  ఇప్పుడు తమ కంప్యూటర్‌ల ముందు కూర్చుని గూగుల్ సెర్చ్ ఇంజిన్  ద్వారా భూగోళాన్ని అన్వేషించడం గూగుల్ సెర్చ్ ఇంజిన్ తప్ప మరొకటి కాదు అని నిరూపితం అయ్యింది. హ్యాపీ బర్త్ డే గూగుల్.   

తెలంగాణ బీజేపీ రేకులు రాలిపోనున్నాయా?

తెలంగాణ ఎన్నికల ముంగిట కమలం పార్టీకి అన్నీ అపశకునాలే ఎదురౌతున్నాయా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అలాగే  తెలంగాణలో పరిస్థితులు కూడా ముందుగానే ప్రతికూలతను చూపిస్తున్నాయా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఔను ఎన్నికల ముంగిట కర్నాటకలో కమలం రేకులు రాలిపోయాయి. సరిగ్గా తెలంగాణ ఎన్నికల ముంగిట కూడా అదే జరగనుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక్క సారి కర్నాటక ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలు గడువుకు ఒక్క రోజు ముందు వరకూ నాన్చి నాన్చి మరీ చివరి జాబితాలు బీజేపీ ఇలా ప్రకటించిందో లేదో అలా  పార్టీలో క్రమ శిక్షణ గేట్లు బద్దలైపోయాయి.   టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒకరివెంట ఒకరు క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిజానికి టికెట్ల విషయంలో నిత్య పంచాయతీగా నిలిచే కాంగ్రెస్ మాత్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో పంచాయతీలు దాదాపు లేకుండా టికెట్ల కేటాయింపు సజావుగా జరపగలిగింది. అదే సమయంలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో మాత్రం అసమ్మతి ఆరున్నొక్క రాగంతో బహిర్గతమైంది.   ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ కర్నాటక ఎన్నికల సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. అయితే ఇక్కడ టికెట్ల కేటాయింపు వరకూ పరిస్థితి రాకుండానే.. పార్టీ అధిష్ఠానం తీరుపై అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటోంది. ఇందుకు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కవిత అరెస్టులో జాప్యం కారణమని చెప్పవచ్చు. హస్తిన మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు గుప్పించి, కేసీఆర్ కుటుంబ అవినీతిపై గట్టిగా గళమెత్తిన తెలంగాణ బీజేపీ నేతలకు ఈ విషయంలో అధిష్ఠానం తీరు మింగుడుపడటం లేదు. కవిత కేంద్రంగా హస్తిన మద్యం కుంభకోణంపై విమర్శలు గుప్పించిన  బీజేపీ రాష్ట్ర నాయకులకు ఇప్పుడు పార్టీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా   అస్థిత్వమే ప్రమాదంలో  పడిన పరిస్థితి ఎదురైంది.    మద్యం కుంభకోణంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సహా పలువురు అరెస్టు అయినప్పటికీ.. ఈ కుంభకోణంలో అందరి కంటే ఎక్కువగా లబ్ధి పొందారంటూ బీజేపీ విమర్శలు గుప్పించిన కవిత మాత్రం ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొన్నప్పటికీ అరెస్టును మాత్రం తప్పించుకోగలిగారు. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీరే కారణమని బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా హైప్ కు వెళ్లిన బీజేపీ ఆ తరువాత క్రమంగా బలహీనపడి ఇప్పుడు గెలుపు సంగతి తరువాత కనీసం గౌరవప్రదమైన స్థానాలైనా వస్తాయా రావా అన్నట్లుగా చతికిల పడింది. ఇందుకు మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాకపోవడమే కారణమని బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. అధిష్ఠానం వద్ద కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కూడా. అయినా బీజేపీ అధినాయకత్వం వైఖరిలో ఇసుమంతైనా మార్పు లేకపోవడంతో  బీజేపీలోని పలువురు తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ సహా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరు వాటిని బలపరిచేవిధంగా ఉందన్న అసంతృప్తి నాయకులలో వ్యక్తం అవుతుంది. కాగా ప్రస్తుతం పార్టీ హై కమాండ్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలంతా దాదాపుగా కేసీఆర్ సర్కార్ పై బీజేపీ బలంగా పోరాడుతుందని నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారే కావడం, తమ నమ్మకాన్ని బీజేపీ హైకమాండ్ వమ్ము చేసిందని భావిస్తుండటంతో వారంతా కలిసి సమష్టిగా తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కు   గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ తెలంగాణ నేతలు ఇటీవలి కాలంలో ఒకటికి రెండు సార్లు రహస్యంగా భేటీ అయ్యారు.   విజయశాంతి, డీకే అరుణ వంటి వారితో సహా వీరి సంఖ్య పదికి మించే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితిని రాష్ట్రంలో ఎదుర్కొంటున్నది. వచ్చే నెల మొదటి తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మహబూబ్ నగర్ లో జరిగే పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అప్పటి వరకూ వేచి చూసి ఆ తరువాత రాష్ట్రంలోని బీజేపీ అసమ్మతి నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే బీజేపీ అసంతృప్త నాయకులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ టచ్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు. 

మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు? 

మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అందరి కంటే ముందే 115 అభ్యర్థులతో  బిఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన రోజే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ మంత్రి హరీష్ రావ్ మీద చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తనకు మల్కాజ్ గిరి టికెట్ కన్ఫమ్ అయినప్పటికీ తన కొడుకు డాక్టర్ రాహుల్ కు మెదక్ టికెట్ దక్కకపోవడంతో తిరుపతిలో మంత్రి హరీష్ రావ్ టార్గెట్ గా మైనంపల్లి హన్మంత్ రావ్ చేసిన వ్యాఖ్యలు అటు పార్టీలో , పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశమయ్యాయి.  బిఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావ్, ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. మైనంపల్లి పై వేటు పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి మైనంపల్లి బీఆర్ఎస్  కు రాజీనామా చేసే వరకు మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించకపోవడంతో రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన పార్టీకే అభ్యర్థులు వెతుక్కునే పరిస్థితి వచ్చింది అని తెలుస్తోంది. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి పేరు బయటకు వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రాకపోవడం గమనార్హం. మంత్రి మల్లారెడ్డి పై ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పటికీ మళ్లీ మేడ్చెల్ అభ్యర్థిగా అతని కే కేటాయించడం పార్టీలో అభ్యర్థుల లేమి సుస్పష్టంగా కనిపిస్తోంది. వివాదాస్పద మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇస్తే మల్కాజ్ గిరి సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.  

పేరుకు జాతీయ పార్టీ.. తీరుకు ప్రాతీయం.. ఇదెక్కడి చోద్యం కేటీఆర్ సర్

తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమోషన్ ఇచ్చి భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీని చేసేశారు.  ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్ర గర్భంలో కలిసిపోయిందనీ, ఇక బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందనీ ఆర్భాటంగా ప్రకటించారు. ఓ రెండు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆవిర్భావ సభకు ఆహ్వానించారు. అయితే కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాత్రం ఇంకా బీఆర్ఎస్ ఉనికిని గుర్తించడం లేదని అనిపిస్తున్నది. తెలంగాణ ఎన్నికల వేళ అయన కేటీఆర్ తమ పార్టీని బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికలలో ఏదో మేరకు ప్రయోజనం పొందాలంటే పార్టీ పేరులో తెలంగాణ ఉండి తీరాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకే ఆయన తమ పార్టీ ఇంకా టీఆర్ఎస్ అనే నమ్ముతున్నారు. భారత రాష్ట్ర సమితి అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. తాను స్వయంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైనప్పటికీ.. కేటీఆర్ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమ పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని అంటున్నారు. అదేదో ప్రైవేటు సంభాషణల్లో చెప్పడం కాదు.. బహిరంగంగానే విమల్ ఓన్లీ విమల్ అన్నట్లుగా  తెలంగాణ ఓన్లీ తెలంగాణ అని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెరాసను బీఆర్ఎస్ గా గుర్తించి నమోదు చేసిన తరువాత కూడా కేటీఆర్ తమది ఇంకా టీఆర్ఎస్ పార్టీయే అనడం పట్ల పార్టీ శ్రేణుల్లోనే కాదు, పరిశీలకులలో కూడా విస్మయం వ్యక్తం అవుతున్నది.   ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు అక్రమ అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ ర్యాలీలపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయ అరెస్టు విషయంలో ఇక్కడ ఆందోళనలు ఏమిటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. తమది తెలంగాణ రాష్ట్రమనీ, ఇక్కడ వేరే రాష్ట్రాలలో జరిగిన అంశాలపై స్పందన ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగులు చేశారని మరొకరు, వారు చేశారని ఇంకొకరు ఇలా నిరసన ప్రదర్శనలు చేసుకుంటే వెళ్లిపోతే శాంతి భద్రతల మాటేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయనో లాజిక్ మిస్సయ్యారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒకటి ఉందనీ, దానికి ఏపీలో ఓ కార్యాలయం ఉందనీ మరిచిపోయారు. మీది తెలంగాణ మాత్రమే అయినప్పుడు అక్కడ పార్టీ కార్యవర్గం ఎందుకు? అక్కడి సమస్యలపై బీఆర్ఎస్ స్పందన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర స్థానిక ఎన్నికలలో పోటీ గురించీ నిలదీస్తున్నారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పోస్టర్లనీ, కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలనూ గుర్తు చేస్తున్నారు.  ఇక ఏపీ రాజకీయాలు మనకెందుకు అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించిన కేటీఆర్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనలు ఎత్తి చూపారు. అలాగే తెలంగాణలోనే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చేసిన ప్రకటనలూ, ఆందోళనల్లో పాల్గొన్న ఉదంతాలను ఎత్తి చూపారు. రాజకీయాలకు అతీతంగా ఆందోళనకు దిగిన ఐటీ నేతలను అడ్డుకున్న కేటీఆర్ సొంత పార్టీ నేతలే.. చివరాఖరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహా పలువురు నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని గుర్తు చేశారు. ఏకంగా ఏపీ వెళ్లి మరీ సంఘీభావం తెలిపి వస్తున్న బీఆర్ఎస్ నేతలూ ఉన్నారు. అయినా జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడై ఉండి కూడా కేటీఆర్ సంకుచితంగా వేరే రాష్ట్రంలో ఏం జరిగితే మనకెందుకు అనడం ఏమిటని నిలదీస్తున్నారు.   అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోటా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పదేళ్ల కిందటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సైబరాబాద్ నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ క్రీడోత్సవాలు జరిగాయి. ప్రపంచ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు నిర్మాణమయ్యాయి. ఐటీ హబ్ గా బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి. అన్నిటికీ మించి ఐటీ ఉద్యోగాల విషయంలో తెలుగువారి ఆధిపత్యానికి కారణం ఆయన దార్శనికతే అనడంలో సందేహానికి తావులేదు. స్వయంగా ఇదే కేటీఆర్ చంద్రబాబు దార్శనికత వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందనీ, ఆయన బాటలోనే తాను దానిని మరింత విస్తరిస్తున్నానని పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి కేటీఆర్ ఇప్పుడు ఇలా చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో నిరసనలు అంగీకరించబోమనీ, కావాలంటే ఏపీ వెళ్లి చేసుకోండనీ చెప్పడం బాధ్యతారాహిత్యమే కాదు, అప్రజాస్వామికమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   మొత్తం మీద ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టు తెలంగాణలో బీఆర్ఎస్ కాళ్ల కింద భూమిని కదిలిస్తోందని, అందుకే కేటీఆర్ బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలేంటని రుసరుసలాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో  మెజారిటీ స్థానాలలో తెరాసకు నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతోనే కేటీఆర్ ప్రాంతీయ నినాదం అందుకున్నారనీ అంటున్నారు. అయితే కేటీఆర్ ప్రాంతీయ నినాదం బీఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేదనీ, ఇక అభివృద్ధి అజెండాతోనే ఎన్నికలకు వెడదామని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా చెప్పేసిన తరువాత నిజమైన అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగింది కదా? అంటూ నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. 

మోడీ తెలంగాణ పర్యటన.. కేసీఆర్ కు వైరల్ ఫీవర్.. లింకేమైనా ఉందా?

ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చినా.. అందరిలోనూ ఆయన పర్యటన కంటే.. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వాగతం పలుకుతరా? లేదా? ప్రధాని అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారా? లేదా? అన్న ఆశక్తే ఎక్కువగా కనిపిస్తుంటుంది.  ఎందుకంటే గత రెండేళ్లుగా ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు అధికారిక పర్యటనపై తెలంగాణకు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక సాకుతో రాష్ట్రం దాటి బయటకు వెడుతున్నారు. లేదా అనారోగ్యమంటూ ప్రగతిభవన్ కో.. ఫామ్ హౌస్ కో పరిమితమైపోతున్నారు. అంతే తప్ప  ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురుపడటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ముఖం చాటేస్తున్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలని శతధా ప్రయత్నించి భంగపడిన కేసీఆర్.. తానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తనను తాను జాతీయ నాయకుడిగా ప్రకటించుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం, మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యంగా ప్రకటించేసుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అటు మోడీకి, ఇటు విపక్ష కూటమికి కూడా చెందని వ్యక్తిగా, బీఆర్ఎస్ ఏ కూటమీ దరి చేరనీయని పార్టీగా మిగిలిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ విషయమేమిటంటే.. ఇటీవలి కాలంలో కేసీఆర్ బీజేపీ లక్ష్యంగా చేసే విమర్శలలో తీవ్రత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మోడీ, షా, బీజేపీలపై విమర్శలు చేయడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, ఆమెను ఒకటికి మూడు సార్లు ఈడీ, సీబీఐ విచారణ చేయడంతో ఆయన కేంద్రం లక్ష్యంగా విమర్శల దాడిని మానేశారు.   దీంతో మారిన పరిస్థితుల్లో  వచ్చే నెల 1న అధికారిక పర్యటనపై తెలంగాణ రానున్న ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెబుతారా? లేక  యథా ప్రకారం గతంలో వలె ముఖం చాటేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. వచ్చే నెల 1న హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తరువాత ప మహబూబ్ నగర్ లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు.  ఆ తరువాత మూడో తేదీన కూడా మరోసారి తెలంగాణ పర్యటనకు మోడీ వస్తారు. సరే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ముందే కేంద్రంపై అంటే మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్క సందర్బంలో కూడా ప్రధానికి ఎదురుపడలేదు. అలా ఎదురుపడాల్సి వచ్చిన ప్రతి సందర్బంలోనూ ఏదో ఒక కారణం చెప్పి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులలో వచ్చిన పెను మార్పులు కారణంగా, అలాగే బీజేపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన పరిస్థితుల్లో ఈ సారి కేసీఆర్ ప్రధాని మోడీకి స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు కూడా విశ్లేషించారు. అయితే వారి విశ్లేషణలకు తప్పాయి. కేసీఆర్ ఈ సారి కూడా మోడీకి ఎదురుపడే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయనకు ఐదుగురు వైద్యుల బృందం వైద్య సేవలు అందిస్తోంది. మరో వారం రోజుల పాటు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారంటూ ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మీడియా సమావేశంలో తెలిపారు. అంటే ఒక వేళ తన పట్టుదల పక్కన పెట్టి మోడీకి స్వాగతం చెబుదామని కేసీఆర్ భావించినా, అందుకు ఆయన అరోగ్యం సహకరించదని తేలిపోయింది. మొత్తం మీద మోడీకి కేసీఆర్ ముఖం చాటేయడమనే ఇటీవలి సంప్రదాయం ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి. 

రాజకీయాలలో బ్రాహ్మణి ఎంట్రీ.. నిర్బంధాల నడుమ పుట్టుకొచ్చిన నవ నాయకురాలు!

అరెస్టులు, నిర్బంధాలతో తెలుగుదేశం దూకుడుకు కళ్లెం వేద్దామని చూస్తున్న జగన్ సర్కార్ కు కొత్త నాయకత్వం తెరమీదకు రావడం మింగుడు పడటం లేదు. అక్రమకేసు అయితేనేమి, నిలబడదని స్పష్టంగా తెలిస్తేనేమి.. ఏదో విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేసేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో విచిత్రమైన కేసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేయాలని చూస్తోంది. ఈ ఇద్దరి అరెస్టుతో జనంలోకి బలంగా వెళ్లే నాయకులు లేకుండా చేయొచ్చనీ, తెలుగుదేశం ఎన్నికల ముందరు డీలా పడుతుందనీ ఆశించింది. అయితే చంద్రబాబు అరెస్టుకు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి దేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో కంగుతింది. ఇక నష్ట నివారణ ఎటూ సాధ్యం కాదు.. ఇదే ఒరవడిని కొనసాగించి నోరున్న నాయకులందర్నీ నిర్బంధించి.. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లే వ్యూహానికి తెరతీసింది. అందులో భాగంగానే  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ నారా లోకేష్ ను ఏ14గా చేర్చింది. ఇక ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ రోడ్లపైకి వస్తే అరెస్టులేనన్న సంకేతాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. నాలుగేళ్లుగా ప్రభుత్వ వేధింపులను, దమనకాండను, అప్రజాస్వామిక విధానాలను గట్టిగా ఎదిరించి నిలబడిన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలను నిర్బంధిస్తే నీరుగారిపోతుందని ఆశిస్తున్నది.  అయితే తెలుగుదేశం పార్టీ నిర్బంధాలను ఎదరించి నిలబడే విషయంలో చాలా గట్టిగా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ జగన్ సర్కార్ నిర్బంధకాండనే  నమ్ముకుంటుందని ముందుగానే ఊహించింది. అధినేత చంద్రబాబు తన అరెస్టును ముందుగానే ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి.. ఏదో అక్రమ కేసులో నన్ను అరెస్టు చేస్తారు. భయపడకుండా ఒకే సారి న్యాయపోరాటం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలను, కేడర్ ను ముందుగానే సన్నద్ధం చేశారు. వరుస అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించే వ్యూహంలో  అధికార జగన్ పార్టీ ఉందని ఆయన నాయకులు, శ్రేణులను ముందుగానే హెచ్చరించారు. ప్రతి కార్యకర్తా ముందుండి పార్టీని నడిపించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీని ఆయన సిద్ధం చేశారు. ఇప్పుడు చంద్రబాబును స్కిల్ స్కాం అంటూ అడ్డగోలుగా అరెస్టు చేసినా తెలుగుదేశం పోరాట పటిమను ఇసుమంతైనా కోల్పోలేదు. యువగళం పాదయాత్రతో ప్రజాబాహుల్యం మన్ననలు అందుకుంటూ, అశేష ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను నిర్బంధించేందుకు అధికార వైసీపీ రంగం సిద్ధం చేసిన తరుణంలో మరో యువ నాయకురాలు ముందుకు వచ్చారు. ఆమే నారా బ్రాహ్మణి. తెలుగుదేశం అగ్రనేతలను ఆధారాలు లేని కేసుల్లో జైల్లో పెట్టి.. వారికి బెయిలు రాకుండా వ్యవస్థలను మేజేన్ చేస్తున్నా పార్టీలో ధైర్యం, స్థైర్యం ఇసుమంతైనా సడలదని బ్రాహ్మణి విస్ఫష్టంగా చాటారు.  నారా బ్రాహ్మణి వైఫ్ ఆఫ్ నారా లోకేష్, డాటర్ ఇన్ లా ఆఫ్ చంద్రబాబు అండ్ డాటర్ ఆఫ్ బాలయ్య. నారా, నందమూరి కుటుంబాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నారా బ్రాహ్మణి తొలి మీడియా సమావేశంలోనే సూటిగా సుత్తి లేకుండా జగన్ రెడ్డి సర్కార్ ఆగడాలను ఎండగట్టారు. తడబాటు, తొట్రుపాటు లేకుండా మీడియా ముందు పార్టీ పోరాట పటిమను ఆవిష్కరించారు. మీడియా సమావేశంతోనే సరిపెట్టకుండా ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వ దమనకాండపైనా ఘాటు విమర్శలతో సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలలో చైతన్యం రగులుస్తున్నారు.  అంగన్‌వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల తీరును గర్హించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస  షాక్ కు గురి చేసిందంటూ ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగిన అంగన్‌వాడి కార్మికులపై పోలీసు దాడులు దుర్మార్గం, అప్రజాస్వామికం అని విమర్శించారు.. న్యాయం కోసం మహిళా నేతలు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతూంటే.. వారిపై దాడులకు పాల్పడటం శోచనీయమంటూ బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ప్రజలను కదిలిస్తున్నాయి.  నారా బ్రాహ్మణి పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో చర్చిస్తున్నారు. ఆ చర్చలలో బ్రాహ్మణి పరిణితి చూసి నేతలే విస్తుపోతున్నారు.  జనసేన నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. అటు ఐటీ ఉద్యోగులనూ కలుస్తున్నారు.   నిత్యం పార్టీ వ్యవహారాలపై చర్చలు జరుపుతున్నారు, సమాలోచనలు చేస్తున్నారు.  ఒక వేళ లోకేష్ ను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినా పార్టీ కేడర్ లో స్థైర్యం చెదరకుండా, ధైర్యం సడల కుండా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. క్రమశిక్షణ, స్థిర చిత్తం, ప్రజలలో కదలిక తీసుకురాగలిగే వాగ్ధాటితో బ్రాహ్మణి తెలుగుదేశం శ్రేణులలోనే కాదు, చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న జనాలకు కూడా ధైర్యాన్నీ స్థైర్యాన్నీ ఇస్తున్నారు.     ఇప్పటి వరకూ ఆమె   కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నారు. అయితే  సంక్షోభ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక నాయకురాలిగా ఆవిర్భవించారు.   ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తని నారా బ్రహ్మణి ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. భర్తను అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. అక్రమాలను, అన్యాయాలను సహించబోమంటూ.. పార్టీని నడిపించేందుకు తాను జనంలోకి వస్తానంటూ ముందుకు వచ్చారు. ఒక్క మీడియా సమావేశంతో ఆమె రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నారు. మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు నదురూబెదురూ లేకుండా ఆమె ఇచ్చిన సమాధానాలు అందరికీ ఆకట్టుకున్నాయి. స్పష్టమైన అవగాహనతో  జగన్ సర్కార్ తీరును ఎండగట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకత్వ పటిమను ఎత్తి చూపింది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని ఆమె  ప్రశ్నించిన తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలను బహిర్గతం చేశాయి.  ఇంత కాలం హెరిటేజ్ వ్యవహారాలు చూసుకునే యువ వ్యాపార వేత్తగా మాత్రమే అందరికీ తెలిసిన బ్రాహ్మణి.. రాజమహేంద్రవరంలో మీడియా ఎదుట స్కిల్ స్కామ్ పేరుతో జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా, ఎంత అప్రజాస్వామికంగా తన మామ, పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిందో వివరించిన తీరు.. పొలిటికల్ గా ఆమె పరిణితికి అద్దం పట్టాయి. మొత్తం మీద నారా బ్రాహ్మణి నందమూరి, నారా కుటుంబాల నుంచి వచ్చిన మరో సమర్ధవంతమైన, ప్రతిభామంతమైన నాయకురాలిగా జనం మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.