ఎన్డీఏలోకి జగన్?..మోడీ, షాలతో డీల్ సెట్టవుతుందా?
posted on Oct 6, 2023 @ 8:08PM
మాయ చేసి మతలబు చేసి.. ఏదోకటి చేసి మళ్ళీ అధికారం దక్కించుకోవాలి. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక్క టార్గెట్. ఇందు కోసమే రకరకాల ఎత్తులు వేస్తున్నారు, జిమ్మిక్కులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్ములను ఇప్పటికే బటన్ నొక్కుడు పథకాల ద్వారా పప్పు బెల్లాల మాదిరి పంచి బెడుతున్నా ప్రజలు రాష్ట్ర అభివృద్ధి మాటేమిటని నిలదీస్తున్నారు. రూపాయి ఇచ్చి వంద రూపాయలు వసూలు చేస్తున్న జగన్ రెడ్డి పాలన ఇక మాకు వద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా ఎన్ని ఎత్తులు వేసినా అవేవీ వర్క్ అవుట్ కాలేదు. ఒకవైపు తెలుగుదేశం ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి మళ్ళీ అధికారం దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. దీనికి తోడు తెలుగుదేశంతో జనసేన కూడా కలవడంతో ఆరు నూరైనా.. నూరు పదహారైనా చంద్రబాబు మరోమారు సీఎం కావడం ఖరారైని తేటతెల్లం అయిపోయింది. దీంతో వైసీపీ ముందుగా తెలుగుదేశం, జనసేన మధ్య చీలిక తేవాలని ప్రయత్నించింది. దీనికి కోసం వైసీపీ నేతలు జనసేనను రెచ్చగొడుతూ అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతోనే ప్రయాణమని ఫిక్సయ్యారు.
తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో వైసీపీ దింపుడు కళ్ళెం ఆశలతో ఎలాగైనా బీజేపీ మద్దతు తమకు కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల వేళ కేంద్రం అండ దండలు ఉంటే తెలుగుదేశం,జనసేనపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఎన్నికల కార్యాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలన్నది వైఎస్ జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసమే బీజేపీ.. తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకుండా, తమతో రహస్య బంధాన్ని కొనసాగేలా చేసుకోవాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ టూర్ లో జగన్ తనదైన వ్యూహాలతో కేంద్ర పెద్దలను కలుస్తారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకూ కూడా టీడీపీ, జనసేన నేతలు కూడా బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నారన్న భావన ఉండేది. కానీ, చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకు ముందే కేంద్రంపై ఏపీలో అసంతృప్తి ఉండగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత అది బీజేపీపై ఆగ్రహంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూడా బీజేపీతో కలిసి నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
తాజాగా, జనసేనాని పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అవనిగడ్డ సభలో మాట్లాడిన పవన్ కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ అవినీతి సంగతి కేంద్ర పెద్దలకు తెలియదా అంటూ నేరుగానే ప్రశ్నించారు. ఇక పెడన సభకు రాగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చానని కూడా చెప్పేశారు. దీంతో ఎన్డీయేతో జనసేన ఇక కటీఫ్ అని మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన బీజేపీకి దూరమైతే వైసీపీ దాన్ని అవకాశంగా మలచుకోవడానికి సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఆ ప్రయత్నాలే జరుగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనలో అడుగులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కచ్చితంగా వైసీపీ ఎంపీలు బీజేపీకే మద్దతు ఇచ్చేలా జగన్ కేంద్రం పెద్దలకు హామీ ఇవ్వడంతో పాటు ఏపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా బీజేపీ క్యాండిడేట్లను గెలిపించేలా ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే, ఏపీలో బీజేపీ ఎవరితో కలిసినా వారికి నష్టాలే ఎక్కువ ఉండే అవకాశం ఉందని సర్వేల ఫలితాలు చెప్తుండగా.. వైసీపీ, బీజేపీ పొత్తు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. గత నాలుగేళ్ళలో వైసీపీ,బీజేపీ బంధం బహిరంగ రహస్యమే. ఇప్పుడు కూడా అది అలాగే కొనసాగే చాన్స్ ఉందని భావిస్తున్నారు. అవసరమైతే బీజేపీ కోరినట్లు బీజేపీ క్యాండిడేట్లను వైసీపీ ముసుగులో గెలిపించే హామీలు ఇస్తారని కూడా భావిస్తున్నారు. పైకి మాత్రం సింహం సింగిల్ గా పోటీకి వస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూనే... లోపల మాత్రం బీజేపీతో దోస్తీ చేస్తూ ఎన్నికల మేనేజ్మెంట్ చేసుకోవాలని వైసీపీ ఆశపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే వైసీపీ యుక్తులు, కుతంత్రాలు ఈ సారి పని చేసే చాన్స్ లేదని అంటున్నారు.