యాడకి పోయనారబ్బా...!
posted on Oct 6, 2023 @ 5:12PM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చి కన్నీటి పర్యంతమవుతూ.. బండారు సత్యనారాయణ మూర్తిపై నిప్పులు చెరిగారు. అంతవరకు ఓకే కానీ.. ఆర్కే రోజాపై ఇంతగా అబండాలు వేస్తే.. తన సొంత పార్టీ నుంచే ఆమెకు మద్దతు లభించకపోవడం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తుంది. ఇక సహచర మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉష శ్రీ చరణ్‌లు స్పందించి ఉంటే బాగుండేదనే ఓ అభిప్రాయం సైతం సదరు వర్గంలో వ్యక్తమవుతోంది. కనీసంలో కనీసంగా హోం మంత్ర తానేటి వనిత అయినా స్పందించి ఉండాల్సిందనే చర్చ సైతం ఆ వర్గంలో కొన.. సాగుతోంది.
పోని జగన్ తొలి కేబినెట్‌లో నోరున్న మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు వగైరా వగైరా.. అలాగే ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అయినా స్పందించి ఉంటే.. మీకు అండగా మేమంతా ఉన్నామంటూ.. ఆర్కే రోజాకు ఓ భరోసా కల్పించినట్లుగా ఉండేదని చర్చ సైతం సదరు వర్గంలో నడుస్తోంది.
అయినా ఫ్యాన్ పార్టీని తిడితే నన్ను తిట్టినట్టే.. మా పార్టీ అధినేత సీఎం వైయస్ జగన్‌ని విమర్శిస్తే.. నన్ను విమర్శంచినట్లేనంటూ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల అధినేతలపై ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయే రోజమ్మకు రాకూడని కష్టం కమ్ముకొచ్చిందనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గంలో వైరల్ అవుతోంది.
అయినా తమ పార్టీలోనే నేతలంతా.. పార్టీ అధినేత వైయస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తేనే స్పందిస్తారా? అంతేకానీ.. సహచర మంత్రికి కష్టం వచ్చినప్పుడు స్పందించే గుణం వారికి లేదా అనే ఓ విధమైన సందేహం సైతం ఆ వర్గంలో పెల్లుబికుతోంది. అదీకాక తిరుమలలో ఆ దేవదేవుడిని సందర్శించుకొన్న తర్వాత ఆనందనిలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలపై తన మాటలతో ఆర్కే రోజా విరుచుకు పడిపోతుందని.. అంతేకానీ.. దేవుడి దర్శనానికి వచ్చాం.. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస జ్జానం కూడా ఆమెలో ఏ కోశాన లేదని సదరు వర్గంలో విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి.
అదీకాక అటు వెండితెర మీదే కాదు.. ఇటు బుల్లి తెర మీద సైతం ఎన్నీ ప్రోగ్రామ్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు ఆర్కే రోజా వ్యవహరించేదని.. కానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటుందని.. అలాంటి వేళ.. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం చిత్ర సీమలోని వారైనా ఆర్కే రోజాకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటన చేసినా బాగుండేదనే ఓ అభిప్రాయం సైతం సదరు వర్గంలో వినిపిస్తుంది.
అయినా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైన.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైన.. చిన్నంతరం పెద్దంతరం అనేదే లేకుండా తమ మాటలతో దాడికి దిగే ఆర్కే రోజా లాంటి వాళ్లకి ఇటువంటి శాస్తి తప్పక జరగాల్సిందేనని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తుంది. పోనీ జగన్ ప్రభుత్వంలో నామినేటిడ్ పోస్టుల్లో కొలువు తీరిన పోసాని కృష్ణమురళి, ఆలీ లాంటి వాళ్లు అయినా స్పందిస్తే బావుంటుందని.. అయినా జగన్ పార్టీ గద్దెనెక్కిన నాటి నుంచి అంటే.. ఈ నాలుగున్నరేళ్లలో.. పలువురు మంత్రులు, కొంత మంది మాజీ మంత్రులు, అతికొద్ది మంది ఎమ్మెల్యేలు మీసాలు తిప్పుతూ... తొడలు కొడుతూ, బూతులు తిడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలు, అధినేతలపై చెలరేగిపోతూ ఉంటారని.. అలాంటి వారంతా.. ఆర్కే రోజాకు ఆపద వచ్చినప్పుడు ఏమైయ్యారు. ఎక్కడికి పోయారని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం ఒకింత ఆందోళనతో ప్రశ్నిస్తోంది.