మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.  ఛత్తీస్ గఢ్ ,రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మిజోరం, తెలంగాణ  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది జరగనున్నసార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.   దీంతో  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను   బీజేపీ  కూటమి (ఎన్డీయే), కాంగ్రెస్ కూటమి (ఇండియా), ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం రాజస్థార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో నవంబర్ రెండవ వారం, డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.   తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన షెడ్యూల్ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫాలో జరుగుతాయి.  వచ్చే నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన అదే నెల 13న జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు నవంబర్ 15. నవంబర్ 30 పోలింగ్ తేదీ కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న  జరుగుతుంది. కాగా ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయి. ఇక రాజస్థాన్, మిజోరం, మధ్య ప్రదేశ్ లలో  ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి.  మధ్య ప్రదేశ్ లోని 230 స్థానాలకు ఒకే దఫాలో నవంబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ ఈ నెల 21న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 30. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 31. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 2. పోలింగ్ నవబంబర్ 17 కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది.  ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే దఫాలో జరుగుతాయి. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకూ ఒకే విడతలో  నవంబర్ 23న పోలింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్ 6 కాగా నామినేషన్ల పరిశీలన నవంబర్ 7న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 9. పోలింగ్ నవంబర్ 23 కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్3న జరుగుతుంది.  ఛత్తీస్ గఢ్ లో రెండు విడతలుగా నవంబర్ 7, 17 తేదీలలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. మొదటి విడత కు అక్టోబర్ 13న, రెండో విడతకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తొలి విడతకు నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 20 తుదిగడువు కాగా, రెండో విడతకు అక్టోబర్ 30 చివరి తేదీ. ఇక తొలి విడత నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 21న, రెండో విడత నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 31న ఉంటుంది. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 23 కాగా రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 2. రెండు విడదల ఓట్ల లెక్కింపూ కూడా డిసెంబర్ 3న ఉంటుంది.  ఇక మిజోరాం విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో కూడా ఒకే విడతలో  నవంబర్ 7,పోలింగ్ జరుగుతుంది.  

జగన్ తో రణమా.. శరణమా.. బీజేపీ హైకమాండ్ కు రాష్ట్ర నేతల అల్టిమేటమ్!?

తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణ అంటూ గొప్పగొప్ప కబుర్లు చెప్పే కమలనాథులు.. ఎన్నికల సమయానికి వాటన్నిటినీ గాలికొదిలేసి.. నాలుగు ఓట్లు సంపాదించిపెట్టగలిగే నాయకుడు ఉంటే చాలు లాగేయండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  నిన్న మొన్నటి దాకా తెలంగాణలో అధికారం మాదే.. అంటూ ఘనంగా చాటుకున్న నేతలు ఇప్పుడు పరోక్షంగానైనా.. హార్స్ ట్రేడింగ్ లో మేం దిట్టలం.. హంగ్ వచ్చినా అధికారం మాదే అనే స్థయికి దిగజారిపోయారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే.. అవినీతి కేసీఆర్ పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామని ఢిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఒకే పాట పాడేవారు. ఇప్పుడు గల్లీ నేతలు అసలు మాట్లాడటమే మానేశారు. ఢిల్లీ నేతలు మాత్రం వరుసకట్టి తెలంగాణలో పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అధికారం మాదేనని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీ సైతం.. కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానంటూ కాళ్లావేళ్లా పడినా తాను పట్టించుకోలేదంటూ తెలంగాణ గడ్డపై ప్రకటించి చులకన అయ్యారు. నాలుగేళ్ల కిందట ఎప్పుడో కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానని అన్నారనీ, తాను పట్టించుకోలేదనీ ఆయన ఇప్పుడు చెప్పడంపై బీజేపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని ఆ నాడే వెళ్లడించి ఉంటే.. అప్పుడే బీఆర్ఎస్ గాలి పోయేదికదా.. అంటూ వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర నేతల నుంచే వినవస్తున్నాయి. ఇంత కాలం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలకు మోడీ వ్యాఖ్యలు మరింత దోహదం చేసి.. తెలంగాణలో పార్టీ పరువును మంటగలిపాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే మొత్తం మీద మోడీ తరువాత రాష్ట్రంలో పర్యటించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ నిష్టూరమే అయినా నిఖార్సైన నిజాన్ని బయటపెట్టేశారు. మోడీ, షా, నడ్డా ఇలా అగ్రనేతల మాటలను పూర్వ పక్షం చేసే విధంగా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం లేదని కుండబద్దలు కొట్టేశారు. అయినా రాష్ట్రంలో పార్టీ ఉనికి బలంగానే ఉందనీ, తిమ్మిని బమ్మిని చేసైనా అధికారాన్ని దక్కించుకుంటామని పార్టీ నేతలకు, శ్రేణులకూ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాదనీ, రాబోయేది హంగ్ అసెంబ్లీయేననీ చెప్పి.. హంగ్ పరిస్థితి బీజేపీకే అనుకూలమనీ, అధికారం మనదేననీ చెప్పారు. అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకుండా హార్స్ ట్రేడింగ్ కు తెరలేపేశారు.   ఇటీవల కొన్ని సర్వేలు పేర్కొన్నట్లు రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని బీఎల్ సంతోష్ కూడా అంగీకరించేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సరే తెలంగాణ సంగతి పక్కన పెడితే.. ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు అధిష్ఠానం తీరుతో విసిగిపోయారు. ఒక వైపు జనసేనతో మైత్రి, మరో వైపు అధికార వైసీపీతో రహస్య బంధం.. మూడో వైపు.. తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అన్న చందంగా   వ్యవహరిస్తోంది. వాస్తవానికి బీజేపీకి ఏపీలో ఏ మాత్రం స్టేక్ లేదు. ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా  ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం ఒకటి  కంటే తక్కువే. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ఒకే ఒక్క ధీమాతో ఎక్కడైనా చక్రం తిప్పేస్తామంటూ బీజేపీ  నేతలు ఇంత కాలం ఏపీలో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ  ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఆ పార్టీ పప్పులు ఉడకడం లేదనీ, అసలు ఉడకవనీ తేటతెల్లమైపోయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలే ఇక ముసుగులో గుద్దులాట వద్దంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత.. అదే స్థాయిలో బీజేపీ మీదా రిఫ్లెక్ట్ అవుతోందని వారు అధిష్ఠానానికి స్పష్టం చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీని తెలుగుదేశం, జనసేన కూటమి కూడా దరి చేర నిచ్చే పరిస్థితి లేదన్న పరిశీలకుల విశ్లేషణలను బీజేపీ రాష్ట్ర నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎటూ రాష్ట్రంలో పార్టీకి ఎన్నికలో వచ్చేదీ, పోయేదీ లేదు.. కనీసం ఉనికి చాటుకోవడానికి పోటీలో దిగినా.. నోటాకు మించిన ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దోబూచులాటలను స్వస్తి చెప్పి జగన్ పార్టీతో రణమా..ఆ పార్టీకి శరణమా? అన్నది తేల్చేస్తే.. బెటరని పార్టీ రాష్ట్ర నేతలు అంటున్నారు.  ఒక వేళ ఇంత కాలం రాష్ట్రంలోని అధికార పార్టీకి వంత పాడుతూ కొనసాగించిన రహస్య మైత్రి అలాగే కొనసాగుతుందన్న స్పష్టత వస్తే అందుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామనీ, ఒక వేళ పార్టీ విధానంతో విభేదిస్తే మౌనం వహిస్తామనీ, అంతే కాక.. తమను అధికార పార్టీపై వాడవాడలా చార్జిషీట్లు వేయండి అంటూ అక్కడ హస్తినలో మాత్రం జగన్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆడుతున్న డబుల్ గేమ్ కారణంగా ఇక్కడ రాష్ట్రంలో తాము నవ్వుల పాలౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ సర్కారు అప్పులపై తాము యుద్ధం చేస్తుంటే.. అడ్డగోలు అప్పులు, ఆర్థిక అరాచకత్వం అంటూ విమర్శలు గుప్పిస్తుంటే.. కేంద్రం మాత్రం ఆ అడ్డగోలు అప్పులకు అంత కంటే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తూ  రక్షణ కవచంలా నిలబడుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్ సర్కారుపై బీజేపీ అగ్రనేతల వైఖరి ఏమిటి? రాష్ట్రంలో తాము చేయాల్సిన పని ఏమిటి? అన్నది తేల్చుకునేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో ఒక బృందం హస్తిన బయలు దేరేందుకు రెడీ అయ్యిందంటే.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అవగతమౌతుంది. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏమిటన్నది తేల్చక పోతే తమ దారి తాము చూసుకునేందుకు కూడా రాష్ట్ర నాయకులు సిద్ధపడుతున్నారని సమాచారం.

పొన్నవోలు ముంచేశారు.. వైసీపీలో అంతర్మథనం?

జగన్ సర్కార్ స్కిల్ స్కాం పేరిట తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో కోర్టులలో సమర్పిస్తున్న పత్రాలు, కేసులో చంద్రబాబు పాత్రను రుజువు చేయడానికి  చేస్తున్న ప్రయత్నాల కారణంగా జగన్ దుష్టపన్నాగాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అంతే కాదు.. ఈ కేసు పుణ్యమా అని దేశంలో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వస్తున్నాయన్న రహస్యం కూడా వెలుగులోకి వచ్చింది.  స్కిల్‌ కేసు అవినీతి సొమ్ము తెలుగుదేశం  మళ్లిందంటూ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణ, అందుకు ఆధారంగా చూపిన వివరాలు బూమ్ రాంగ్ అయ్యాయి.  పొన్నవోలు చేసిన ఆరోపణ, చూపిన ఆధారం వైసీపీ మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో వైసీపీలో గాభరా మొదలైంది.  ఆ ఆరోపణతో వైసీపీతో పాటు, బీజేపీని కూడా పొన్నవోలు ఇరుకున పడేశారు. స్కిల్ కేసులో తెలుగుదేశం ఖాతాలోకి లంచం సొమ్ము 27 కోట్లు మళ్లాయంటూ పొన్నవోలు చేసిన ఆరోపణ వైసీపీ కాళ్ల కింద నేలను కదిలించివేస్తున్నది. ఎన్నికల విరాళాల రూపంలో వచ్చిన నిధులను కోర్టుకు సమర్పించి దానికి అవినీతి సొమ్ముగా పేర్కొనడంపై తెలుగుదేశం తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు, అలాగే అందుకు సంబంధించి  బ్యాంకు వివరాలను వెల్లడించిన తెలుగుదేశం, అదే సమయంలో  వైసీపీకి వచ్చిన విరాళాల లెక్కల గుట్టు రట్టు చే సింది.  వైసీపీ ఖాతాలకు ఏపీలో కాంట్రాక్టు పనులు చేస్తున్న ఏ కంపెనీలు విరాళాలు జమచేశాయన్న సమాచారాన్నీ వివరంగా పేర్కొంది.  పార్టీకి వచ్చిన విరాళాలను కూడా స్కిల్‌ స్కాంకు లింకు చేయడంపై దుమ్మెత్తి పోసింది. పార్టీకి వచ్చిన విరాళాలను  ఎప్పటికప్పుడు ఆడిట్‌ చేయించి, ఎన్నికల సంఘానికి పంపిస్తామని పేర్కొన్న తెలుగుదేశం. స్కిల్‌  కేసులో ఆధారాలు  చూపలేక.. తాము ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను.. డౌన్ లోడ్ చేసుకుని దానినే కోర్టుకు సమర్పించి  గోల్ మాల్ చేయడానికి ప్రయత్నించిన  పొన్నవోలుపై కోర్టు ధిక్కరణ చర్యలకు డిమాండ్ చేసింది. మొత్తంగా స్కిల్ అవినీతి సొమ్ము అంటూ పొన్నవోలు కోర్టుకు సమర్పించిన వివరాల డొల్లతనం బయటపడటంతో పాటు.. వైసీపీకి అందిన వివరాల గుట్టుమట్లు కూడా బయటపడటంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జగన్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆ పార్టీకి 600 కోట్ల రూపాయలు విరాళాలు అందాయన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది.ఆ సొమ్ము ఏపీలో కాంట్రాక్టులు చేసిన కంపెనీల నుంచి వసూలు చేసినదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ విరాళాలలో అధికభాగం ఏపీలో కాంట్రాక్టులు చేస్తున్న మేఘా, హెటిరో, వైకాపా ఎంపి ఎంవివి కంపెనీల నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ విరాళాలలో పోలవరం కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ లో దక్కించుకున్న మేఘా కంపెనీ 22 కోట్ల రూపాయలు, కడప స్టీల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 14 కోట్ల రూపాయలు, అలాగే వివాదాస్పద భూములను దక్కించుకున్న హెటిరో డ్రగ్స్ 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. 

మూడు కోర్టులు.. ఆరు తీర్పులు.. సర్వత్రా ఉత్కంఠ

ఏపీలోని జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగా విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై వరుసగా కేసులు బనాయిస్తోంది. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారం (అక్టోబర్ 9)న సుప్రీం కోర్టు విచారించనుంది. అది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసులలో హైకోర్టు సోమవారం నాడే తీర్పులు వెలువరించనుంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిలు పిటిషన్ లపై తీర్పు రానుంది. మొత్తంగా ఈ తీర్పుల విషయంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావద్ధేశంలో ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది.   ముఖ్యంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. కేవలం సాంకేతిక అంశాల కారణంగా ఏసీబీ, హైకోర్టులలో ఆయన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యిందనీ, సరైన ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్టు చేయడమే కాకుండా.. ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాము కనుక ఆయనను విచారించి ఆధారాలు సేకరిస్తామంటూ ఏపీ సీఐడీ వింత వాదనను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో 17ఏ సెక్షన్ వర్తిస్తుందా? వర్తించదా? అన్న అశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 3న సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ  వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు.  ఆ సందర్భంగా సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు.  ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.   కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు.  ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని బాబు తరఫున వాదించిన మరో న్యాయవాది సిద్ధార్థ లూధ్రా పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి అంటే అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం ఆభిప్రాయపడుతున్నారు. 

ఇంత భయమేల జగన్ రెడ్డి?

సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది.. వెన్ను చూపని ధీరుడు, వెనకడుగు వేయని మొనగాడు.. రాయలసీమ ముద్దుబిడ్డ.. పులివెందుల పులి బిడ్డ.. రాజన్న బిడ్డ, రాయలసీమ రత్నం.. ఇవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలూ, శ్రేణుల నినాదాలు, ఇచ్చే బిల్డప్ లు. కానీ, ఆయనేమో పోలీసులు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి  బయటకి రారు. పరదాలు, బారికేడ్లు లేకుండా గేటు దాటరు. రెండు మూడు కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయడానికి కూడా ధైర్యం చేయరు. అసలు జనాలకు కనిపించకుండా ఆకాశమార్గానే ప్రయాణిస్తున్నారు. ఇక బటన్ నొక్కేందుకు ఆయన పర్యటనను చేసినా.. ఆ పర్యటన మార్గంలో   మార్గంలో మనుషులనే వారు కనిపించకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు ఒక రోజు ముందు నుంచే   మల్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసి  ఆయన ప్రజల కంటికి కూడా కనిపించకుండా పరదాలు కట్టేస్తున్నారు. పరదాటు కట్టేందుకు అడ్డం వస్తాయనుకుంటే చెట్లను నరికేస్తున్నారు. జగన్ కనిపిస్తే ప్రజలు దాడి చేస్తారని భయమో లేక ఓటేశాక వాళ్ళతో ఇంకేం అవసరం ఉందిలే అనుకున్నారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ఇష్టపడటం లేదు. సరే అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఏకంగా జగన్ కు, ఆయన కుటుంబానికి ఐదంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కోసం ఏకంగా చట్టమే తీసుకొచ్చారు. తనకు, తన భార్య, పిల్లలకు, తల్లికి, దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా అత్యంత సమీపం నుంచి భద్రత కల్పించడానికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుని ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏకంగా ప్రత్యేక చట్టమే తీసుకొచ్చారు. దేశంలో తొలిసారిగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేనివిధంగా ఏపీ సీఎం, ఆయన కుటుంబ భద్రత కోసం ఇలా ప్రత్యేకంగా ఎస్ఎస్జీని ఏర్పా టు చేస్తున్నారు. ఈ చట్టంతో ఇప్పటికే ఉన్న వందలాది మంది సీఎం భద్రతా సిబ్బందితో పాటు జగన్ భద్రత కోసం మరికొంత మంది తోడు కానుండగా.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్ భార్య భారతీకి, హైదరాబాద్ నగరంలో ఉన్న జగన్ తల్లి విజయమ్మకు, ప్రస్తుతం విదేశాల్లో  ఉన్న జగన్ ఇద్దరు కుమార్తెలకు కూడా భద్రత కల్పించనున్నారు. ఎస్ఎస్జీ చట్టం ప్రకారం జగన్ కుమార్తెలకు అక్కడ కూడా భద్రత కల్పించాల్సి ఉంది.  ఈ ఎస్ఎస్జీ భద్రత గ్రూపు కోసం ఏటా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించనున్నారు. సీఎం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా వీరు తోడుగా ఉంటూ రక్షణ కల్పిస్తారు. సీఎంకు సాధారణంగానే నాలుగైదు అంచెల సెక్యూరిటీ ఉంటుంది. వారికి తోడుగా ఇప్పుడు ఈ ఎస్ఎస్జీ భద్రత కూడా కలవనుంది. ఇలాంటిదే దేశ ప్రధానికి ఉంటుంది. ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా ఎస్పీజీ ఉంటుంది. అదే స్థాయిలో ఇప్పుడు జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఎస్ఎస్జీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీని కోసం చట్టం తీసుకురాగా ఇక గవర్నర్ ఆమోదం లభిస్తే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ  వెంటనే ఎస్ఎస్జీ చట్టం అమల్లోకి వస్తుంది. అయితే, అసలు   సీఎంకు, ఆయన కుటుంబానికి ఇప్పటికిప్పుడు ఈ స్థాయి భద్రత ఏం అవసరం వచ్చిందన్నదే చర్చ. రాష్ట్రంలో మావోయిస్టుల ఊసేలేదని ప్రభుత్వమే కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జగనే స్వయంగా రాష్ట్రంలో మావోయిస్టులను కట్టడి చేశామని చెప్పారు. ఇక ఏపీలో మాఫియా ఉందా అంటే,,  ఉంటే గింటే ఆ మాఫియా వైసీపీ నేతల అండదండలతోనే సాగుతున్నది కనుక దాంతో ప్రజలకే తప్ప సీఎంకు వచ్చిన నష్టం లేదు. పోనీ తెలుగుదేశం నుండి   థ్రెట్ ఉందా అంటే..  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బయటకొచ్చిన కార్యకర్తలను కూడా పోలీసులు లోపలేసి కేసులు పెడుతున్న పరిస్థితి.  మరి ఇప్పటికిప్పుడు ఏడాదికి రూ.ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టి ఈ ప్రత్యేక భద్రత ఎందుకు తీసుకొచ్చారన్నది ఆ జగన్మోహనరెడ్డికే తెలియాలి.   హక్కుల్ని కాలరాస్తూ, అణచివేత, అరాచకాలు, ప్రతీకారం, రాజకీయ కక్ష సాధింపు పాలన చేస్తున్న జగన్ రెడ్డి తన నీడను చూసి తానే భయపడుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైసీపీ రుణమాఫీ హామీ.. నమ్మెదెలా అంటున్నజనం !

ఏపీలో ఎన్నికలకు నిండా ఆరేడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో పప్పుబెల్లాల్లా సొమ్ములు పంచినట్లే పంచి అంతకు అంతా   ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న అసంతృప్తి ప్రజలలో వ్యక్తమవుతోంది. భూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి కనిపించని పరిస్థితుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా అని వేచి చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో లెక్కలేసి మరీ ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. జనం కూడా అదే చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? జగన్ సర్కార్ ను సాగనంపుదామా అని ఎదురు చూస్తున్నారు.   అంతకు ముందు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పావలా వడ్డీ రుణాల పథకాలను కూడా నీరుగార్చి కేవలం బటన్ నొక్కడం, దీనికి దానికి అని లేకుండా పన్నులు బాది పీక్కుతినడమే పనిగా పెట్టుకోవడంతో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ నరకం నుండి విముక్తి లభిస్తుందా అని పంటి బిగువున బాధను దిగమింగి ఉంటున్నారు. అయితే వైసీపీ మాత్రం మరోసారి ఏం చెప్పి ప్రజలను నమ్మించాలా అని కొత్త కొత్త పథకాల ప్రకటనపై దృష్టి పెట్టింది.  జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో రైతుల రుణ మాఫీ  హామీ అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామనే హామీతో వైసీపీ ఈసారి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నదంటున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ హామీ ఇచ్చింది. నాడు 87 వేల కోట్ల రైతుల రుణాల మాఫీ చేయాల్సి ఉండగా టీడీపీ నాలుగేళ్ళ పాలనలో నలభై వేల కుటుంబాలకు పైగా పూర్తి రుణమాఫీ చేసింది. మొత్తం కుటుంబాలకు మూడు విడతలను చెల్లించింది. యాభై వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేసిన టీడీపీ ప్రభుత్వం అంతకు పైగా ఉన్న రుణాలను ఐదు విడతలలో మాఫీ చేసే టార్గెట్ పెట్టుకుంది. మూడు విడతల రుణాలను చెల్లించగా చివర ఏడాదిలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం, అప్పటి ప్రతిపక్షం వైసీపీతో చేతులు కలిపిన బీజేపీ అడుగడుగునా టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే ఏకైక లక్ష్యంతో  చివరి రెండు విడతల రుణమాఫీ  విడుదల చేసినా ఎలక్షన్ కమిషన్ ను అడ్డం పెట్టుకొని  లబ్ది దారులకు  ఆ సొమ్ములు అందకుండా చేయగలిగింది.   కాగా, ఇప్పుడు వైసీపీ అదే రుణమాఫీ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. అయితే, నినాదం ఏదైనా, హామీ ఏదైనా జగన్ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలోని సంపూర్ణ మద్యపాన నిషేధం, అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు, ఇల్లు, ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉన్నా పింఛన్లు, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో హామీలను జగన్ ప్రభుత్వం విస్మరించింది. జగన్ మాట తప్పను అంటూనే మాట తప్పారు. మడమ తిప్పను అంటూనే మడమ తిప్పారు.ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేసినా  అమలు చేసినా సవాలక్ష కొర్రీలు పెట్టి ప్రజలను మానసిక వేదనకు గురి చేసిన జగన్, ఇప్పుడు ఎన్నికల ముంగిట రైతు రుణమాఫీ అంటూ చెబితే   నమ్మి అధికారం కట్టబెట్టేందుకు జనం సిద్ధంగా లేరు. గత ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపేలా వాగ్దానాలు కురిపించి అధికారంలోకి వచ్చాకా నరకం చూపుతున్న జగన్ ను ఎలా నమ్ముతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడితే విశ్వసనీయత, విశ్వసనీయత అనే జగన్ మోహన్ రెడ్డి ఊరూరూ తిరిగి ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి ఇప్పుడు కొత్త హామీలంటూ మరో సారి ఎన్నికల ముందు చెబితే  ప్రజలు ఎలా నమ్మతారని పరిశీలకులు కూడా అంటున్నారు. నాలుగేళ్ళ పాలనలోనే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను పీల్చి పిప్పి చేసిన జగన్.. మరో ఐదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని ఇంకెంత అధోగతి పాలు చేస్తారు, ప్రజలను ఇంకెంతగా పీల్చి పిప్పి చేస్తారో అనే భయం సర్వులలోనూ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఆదాయాన్ని, ప్రభుత్వ ఆస్తులను, దేవాలయాల భూములను, చివరికి లిక్కర్ మీద ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు చేసిన జగన్.. మరోసారి అధికారమిస్తే ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అరాచకాలు, అక్రమాలును ప్రశ్నిస్తే దాడులు, కేసులతో రాష్ట్రం అంతటా అందరిలో అభద్రతా భావం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఒక్క ఛాన్స్ చాలని జనం నిర్ధారణకు వచ్చేశారు. ఈ సమయంలో వైసీపీ ఎన్ని ఆశలు చూపినా.. ఏ హామీలు ఇచ్చినా జనం విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. 

బెడిసి కొట్టిన జగన్ రాజకీయ వ్యూహం!

విభజించు పాలించు.. అప్పుడెప్పుడో రాజరికాలు ఉన్న సమయంలో కొందరు రాజులు ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టి పాలన సాగించారని చెప్పుకొనేవారు. ఇప్పుడు సీఎం జగన్  అచ్చం అలాంటి సిద్ధాంతాన్నే నమ్ముకొని ఏపీలో పాలన సాగించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సిద్ధాంతం ఆధారంగానే తన రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు.   వైసీపీ ఆవిర్భావం నుండే వైఎస్ జగన్ ఈ తరహా వ్యూహాలతోనే ఇంతవరకూ వచ్చారు. అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్లుగా   ఇదే వ్యూహంతో రాష్ట్రంలో పరిపాలన సాగించారు.  మరోసారి విజయం సాధించడం కోసం కూడా ఇదే వ్యూహాన్ని నమ్ముకున్నారు.  అయితే  ఇక ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదేళ్లుగా జగన్ వ్యూహాలను అర్ధం చేసుకోలేని ప్రజలు.. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పాలన సాగించిన తీరుతో   ఆయన వ్యూహాలతో పాటు మనస్తత్వాన్ని కూడా అర్ధం చేసుకోగలిగారు.  అందుకే ఇప్పుడు వైసీపీకి గడ్డు పరిస్థితులు వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విశాఖ క్యాపిటల్.. ఏమో ఏపీకి కూడా మూడు రాజధానులు రావచ్చు. పరిపాలన, న్యాయ, శాసన రాజధానులుగా మూడు ప్రాంతాలలో మూడు ఏర్పాటు చేస్తే తప్పేముంది అని సీఎం జగన్ మూడేళ్ళ క్రితం ఒక శీతాకాలం నిండు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత హడావుడిగా దాన్ని చట్టం కూడా చేశారు. అక్కడ నుండి రాష్ట్రం రావణకాష్టంలా మారింది. నిత్యం  ఏదో ఒక వివాదం  అన్నట్టుగానే ఉంది.   ఇంతవరకూ ఒక్క రాజధానికి కూడా ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు కానీ.. ఈ నినాదంతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు మాత్రం పెట్టారు. మూడు రాజధానులు న్యాయ సమీక్షకు నిలబడకపోవడంతో హైకోర్టులో విచారణకు ముందే తాము చేసిన మూడు రాజధానుల చట్టాన్ని వైసీపీ ఉపసంహరించుకుంది. దీనిపై వైసీపీ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అది ఈ డిసెంబర్ నుంచి విచారణ జరగనుంది.  అయితే, వైసీపీ ఇలా మూడు రాజధానులుగా విడదీయడం వెనక ఓ ఎత్తుగడ ఉంది. మరోసారి అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను మూడు ముక్కలుగా విడదీసి సీట్లు లెక్కేసి వైసీపీ ఈ మూడు రాజధానుల వ్యూహాన్ని తెరమీదకి తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అమరావతిని అభివృద్ధి చేస్తే తనకు ఒరిగేదేమీ లేదన్న భావనలోనే జగన్.. మూడు రాజధానులు అంశాన్ని తెరమీదకి తెచ్చి లబ్ది పొందాలని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉండగా అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 2019 ఎన్నికల్లో 28 అసెంబ్లీ, నాలుగు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్న జగన్,  ప్రభుత్వ వ్యతిరేకతను రూపుమాపేలా అనధికారికంగానైనా విశాఖ నుండి పాలన చేసి ఉత్తరాంధ్ర తన అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే విశాఖలో ఏర్పాట్లు కూడా మొదలవగా.. ఈ దసరా నుండి జగన్ అక్కడ నుండే పాలన చేయాలని భావిస్తున్నారు. అటు ఉత్తరాంధ్రతో పాటు అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని, రాయలసీమలో న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు అదే పాట పాడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల మాదిరి కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఫలితాలు రాబట్టాలని వైసీపీ ఈ మూడు రాజధానుల పాట పాడుతూనే ఉంది. అయితే, ఈ ప్లాన్ బెడిసికొట్టింది. కోస్తాంధ్రలోని గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలలో 67 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఈసారి  ఇక్కడ వైసీపీకి భారీ గండి పడుతుందని విశ్లేషణలు ఉన్నాయి. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2019లో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి అక్కడ కూడా ఆ స్థాయి హవా లేదు. నెల్లూరులో గతంలో పదికి పది గెలుచుకుంటే ఈసారి పదికి పది స్థానాలలో పరాజయం వైసీపీకి పరాజయమే ఎదురౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పన్నెండు సీట్లు ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా ఈసారి టీడీపీ పది స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ ఒక ఆలోచనలో ఈ మూడు ముక్కలాట మొదలెట్టినా అది బెడిసికొట్టిందని పరిశీలకులు అంటున్నారు. 

లేని ప్రాజెక్టులో అవినీతా?.. తెలుగుదేశం డైరెక్ట్ అటాక్

టీడీపీ అధినేత చంద్రబాబు కలల సౌధం రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు కొంత కసరత్తులు కూడా జరిగాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఇప్పుడు జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచన చేసింది తప్ప.. ఎక్కడా ఒక్క ఎకరం భూసేకరణ చేయలేదు.. ప్రభుత్వం తరుఫున ఒక్క రూపాయి నిధులు కేటాయించ లేదు. ఇంకా చెప్పలంటే కనీసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా ఇవ్వలేదు. అయితే ఏమీ లేని దానిలో అవినీతి జరిగిందని ఇప్పుడు వైసీపీ తప్పుడు ఆరోపణలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. వైసీపీ కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి పిచ్చి అంశాలను తెరపైకి తెస్తూ అరెస్టులు చేయాలని కుట్రలు పన్నుతోంది. దీనిని ఇలాగే ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న టీడీపీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది.  అసలు 'లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎలా జరిగింది  అనే పుస్తకాన్ని తెలుగుదేశం కేంద్ర  కార్యాలయంలో తాజాగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతో పాటు తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, నిమ్మల రామానాయుడు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పీతల సుజాత, అశోక్ బాబు, రాకేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అసలు లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతి లేని ప్రభుత్వం, బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలంటూ టీడీపీ నేతలు నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కు, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని జగన్ సర్కారే హైకోర్టుకి చెప్పిందని.. ప్రతి దానిలో లోకేష్ పేరుని తీసుకొచ్చి రాజకీయం ఆనందం పొందాలని ఈ సైకో సీఎం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధినేతను జైలుకు పంపి 30 రోజులవుతున్నా.. ఈ సీఎం, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆయన తప్పుచేశారని రుజువు చేయలేకపోయింది. న్యాయ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా ప్రవేశపెట్టలేకపోయింది. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేని ఈ దద్దమ్మలు చివరకు ఏమీ తేల్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చిన విరాళాలపై పడ్డారని ఎద్దేవా చేశారు. సీఐడీ చంద్రబాబుని ఏ కేసులో అరెస్ట్ చేసిందో.. ఆ కేసులో ఆయన తప్పు చేశారని నెల రోజులుగా నిరూపించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేసి, తన అవినీతిని సీబీఐ, ఈడీ సంస్థలు న్యాయస్థానాల్లో రుజువు చేస్తేనే జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ, మీరు రుజువు చేయలేకనే నెల రోజులుగా కక్షకట్టి చంద్రబాబును జైల్లో ఉంచారని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకోకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడో నేలమట్టమయ్యేదన్న అచ్చెన్నాయుడు.. సెక్షన్ 144.. సెక్షన్ 30లు తెలుగుదేశం చేపట్టే శాంతియుత నిరసనలు, ధర్నాలకే వర్తిస్తాయా?వైసీపీకి వర్తించవా అని ప్రశ్నించారు. తెలుగుదేశం విడుదల చేసిన ఈ పుస్తకంతో ఏపీలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయిది. ఏంటి అసలు లేని ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని లోకేష్ ను అరెస్ట్ చేస్తామని శపథాలు చేశారా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కేసు విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ చేతులెత్తేయడంతో ఈ కేసు మూలన పడింది. అయితే  వైసీపీ నేతల నోళ్లు మాత్రం మూతపడలేదు. దీంతో టీడీపీ పుస్తకం విడుదల చేసి నిజాలు బయట పెట్టడంతో వైసీపీ నేతల మొహాలు వాడిపోతున్నారు. అసలు లేని రోడ్డు, మొదలే కానీ ప్రాజెక్టు, నిధులే విడుదల కాని పనులలో అవినీతి జరిగిందని కేసులు పెట్టిన  ఏకైక ప్రభుత్వం ఈ దేశం మొత్తంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే నని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అసలు ఇలాంటి ఐడియాలు ఇచ్చిన సలహాదారులు ఎవరంటూ నెటిజన్లు  ట్రోల్ చేస్తున్నారు.

చంద్రుడి కోసం కాంతితో క్రాంతి!

వెన్నెల చిన్నబోయింది. చందమామ భవిలో తన వెలుగులను మరపించేలా ఆ దీపాలేంటని నివ్వెరపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పిలుపుమేరకు శనివారం(అక్టోబర్ 7)  రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకూ జరిగిన కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమంలో జనం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బాబు అరెస్టుకు నిరసనలు చేపట్టాలంటే ఏపీకి పోయి చేసుకోండి.. తెలంగాణలో మాత్రం కుదరదు అన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాటలను ఖాతరు చేయకుండా బీఆర్ఎస్ నేతలూ మంత్రులూ కూడా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. నారా చంద్రబాబుకు మద్దతుగా వెలుగుల నిరసనలో రాజకీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారూ పాల్గొన్నారు. చంద్రబాబును వైసీపీ సర్కార్ అక్రమంగా  అరెస్టు చేసిందని జనం విశ్వసిస్తున్నారు. ఈ అరెస్టు క్షక్ష పూరితం, కుట్ర పూరితం అని నమ్ముతున్నారు. అందుకే ఆయన అరెస్టై నెల రోజులు కావస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశ,విదేశాల్లోనూ ఆగకుండా, తగ్గకుండా జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపేందుకూ వెనుకాడటం లేదు.   చంద్రబాబుది అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నిత్యం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే కాంతితో క్రాంతి పేర శనివారం (అక్టోబర్ 7) రాత్రి  7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు.  రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేశ్ దీపాలు వెలిగించిన నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అభిమానులు సైతం కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లతో తమ నిరసన తెలిపారు.  మంగళగిరి ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలు ఏమిటి అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేసినా తెలంగాణ వ్యాప్తంగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులూ, మంత్రులూ కూడా కాంతితో క్రాంతి కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు.  మణికొండ చౌరస్తా నుంచి ల్యాంకోహిల్స్ వరకు తెలుగుదేశం అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు   అలాగే బెంగళూరు, చెన్నైలోనూ లైట్లు ఆపి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.   హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రారంభించారు. నందమూరి రామకృష్ణ, అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, జ్యోత్స్న, శ్రీపతి సతీశ్‌, మురహరిగౌడ్‌, బంటు వెంకటేశ్వర్లు, కొత్తపల్లి మధుసూదన్‌రావు పాల్గొన్నారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హైదరాబాద్‌లో తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ అభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడు చంద్రబాబునాయుడు అని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌ కూడలి నుంచి చైతన్యపురి శివాజీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశంఉపాధ్యక్షురాలు సుహాసిని, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరివింద్‌కుమార్‌గౌడ్‌ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సిరిసిల్లలో సంఘీభావ ర్యాలీ చేపట్టడంతో పాటు ఏపీ సీఎం జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్‌, వనపర్తి, ఖమ్మంలలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ సెటిలర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో త్వరలో  మిలియన్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ప్రసూన తెలిపారు. సనత్‌నగర్‌   కాలనీలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరానికి అనుమతి లేదని   పోలీసులు శనివారం ఉదయం నిర్వాహకులను స్టేషన్‌కు పిలిచారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పోలీసులకు ఫోన్‌ చేసి నచ్చజెప్పారు. దీక్షా శిబిరానికి చేరుకుని తన మద్దతు ప్రకటించారు.

జగన్ ను దూరం పెట్టేసిన మోడీ.. వైసీపీ వాట్ నెక్స్ట్?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.   రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. నిలదీశారని కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే, అసలు మంత్రులతో ఏం మాట్లాడారన్నది మాత్రం వీడని సస్పెన్నే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తి రేగింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి జగన్ ఢిల్లీ వెళ్తుండడంతో.. ఢిల్లీలో జగన్ ఎవరిని కలుస్తారు? ఏం మాట్లాడతారు?   రాజకీయాలలో ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయా అన్న చర్చలు సాగాయి. ముఖ్యంగా ఏపీలో బీజేపీ ప్రయాణం ఎటు వైపు అనే దానిపై ఏదైనా స్పష్టత వస్తుందా అన్న ఆసక్తి కూడా కనిపించింది.  అయితే, స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లిన జగన్ అదే ఫ్లైట్ లో మళ్ళీ తాడేపల్లి కూడా రానే వచ్చారు. అక్కడ ఏం జరిగిందో ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాల్సింది చెప్పారు. అయితే, ఇప్పటికైతే జగన్ ఢిల్లీ పర్యటనతో అద్భుతాలేమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు చర్చించిన అంశాలు కూడా జరిగేవి కాదు.   కేంద్రాన్ని జగన్ ఎంత మేర ప్రశ్నించారో కూడా ఏపీ ప్రజలు అర్ధం చేసుకోగలరు. అయితే, ఒక్కసారి జగన్ ఢిల్లీ పర్యటనను పరిశీలిస్తే రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. గట్టిగా మాట్లాడితే జగన్ ఢిల్లీ వెళ్లేముందు వైసీపీ వర్గాలు ఊహించుకుంది వేరు.. అక్కడ జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధం. జగన్ ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆయన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారని ప్రభుత్వ వర్గాలు చెప్పుకున్నాయి. అలాగే రాజకీయ అంశాలు ఇద్దరు నేతల మధ్యన ఖచ్చితంగా వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే, ఎన్నో ఆశలతో హస్తినకు వెళ్లిన సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మొహం చాటేశారు. జగన్ కు పీఎంఓ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లభించకపోవడం చర్చకు దారితీస్తోంది. నిజానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అందుబాటులో ఉంటారన్న కచ్చితమైన సమాచారంతోనే  సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. అసలు లండన్ పర్యటన నుంచి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్న జగన్ అప్పట్లో   ప్రధాని అందుబాటులో ఉండరని, అప్పాయింట్ మెంట్ దొరకదని ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈసారి ఇద్దరు అందుబాటులో ఉంటారనే పక్కా సమాచారంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారు. ఆ ఇద్దరి నేతల అపాయింట్మెంట్లు దొరికాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ ఒక్క హోం మంత్రి అమిత్ షా మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే, కృష్ణా జలాల వివాదంపై జగన్ ప్రధానికి లేఖ రాసి వెనుతిరిగినట్లు ప్రభుత్వం మీడియాకు సమాచారం ఇచ్చింది. కానీ, జగన్ ను కలవడం ఇష్టం లేకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఢిల్లీ వర్గాల సమాచారం.  ఏపీ సమస్యలు, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ బీజేపీ పెద్దలకు తెలిసిందే.  పైగా చంద్రబాబు అరెస్టు అంశంలో బీజేపీ అండ ఉందని జగన్ పార్టీ నేతలు చేసిన ప్రచారం,  మరోవైపు జగన్ కారణంగానే ఏపీలో ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన కూడా దూరం జరగడం కూడా ప్రధాని మోడీ జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వక పోవడానికి కారణంగా చెబుతున్నారు. అదీ కాక  తెలంగాణలో ఎన్నికల సమయం కనుక జగన్ ప్రస్తావించాలనుకున్న కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోగలిగే అంశం కాదు. పాము చావాలి.. కర్ర విరగకూడదు అన్న సిద్ధాంతాన్ని పాటించే బీజేపీ ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాలపై ఓపెన్ కావడం ఇష్టం లేకనే   మోడీ సీఎం జగన్ కు అపాయింట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక అమిత్ షా అయితే చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలు, బాబు అరెస్టుకు కేంద్రం మద్దతు ఉందన్న వైసీపీ ప్రచారం తదితర అంశాలపై జగన్ కు గట్టిగా క్లాస్ పీకినట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి.  2014 నాటి పరిస్థితి ఏపీలో పునరావృతం కావాలన్నది తన అభిమతమని, తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీ కూడా కలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ,  ఏపీలో   ఇప్పటికైతే తటస్థంగా ఉండాలనే బీజేపీ భావిస్తోందనీ, అందుకే మోడీ జగన్ ను దూరం పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పస లేని విమర్శలు, ఆధారాలు లేని ఆరోపణలు.. వైసీపీ నేతలకు ఇదే తెలుసా?

చిన్న చిన్న విషయాలకు కూడా నానా రాద్ధాంతం చేసే వైసీపీ నేతలు  గత నాలుగు నెలలుగా హఠాత్తుగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని విపక్షాలు విమర్శలతో చెండాడేస్తున్నా ఖండించేందుకు కూడా మీడియాకు ముఖం చూపించని పరిస్థితి.  అయితే ఇప్పుడు   ఒక్కొక్కరుగా ఎక్కడ మైకు దొరికితే అక్కడ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.   నిన్న మొన్నటి వరకూ   మీడియా సంస్థలు పిలిచినా పలకని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు  కలుగులో నుండి బయటకి వచ్చిన ఎలుకల  మైకులు పట్టుకుని తెలుగుదేశం, జనసేన పై విమర్శలు గుప్పిస్తూ నానా హడావుడి చేసేస్తున్నారు. ముఖ్యంగా స్కిల్  కేసులో చంద్రబాబును దోషిగా ఆరోపిస్తూ మీడియా ముందు మాట్లాడి జగన్ దృష్టిలో పడేందుకు ఎక్కడ లేని ఆత్రం కనబరుస్తున్నారు. పేరుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయినా.. సకల శాఖల మంత్రిగా పెత్తనం, ఆధిపత్యం చెలాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణ ప్రసాద్, ప్రస్తుత మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా వరసబెట్టి అందరూ మీడియా సమావేశాలలో మాట్లాడేస్తున్నారు. మీడియా సమావేశాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నా ఏదో కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు అందరూ చంద్రబాబు అవినీతి పరుడు అంటూ  ఒక్క ఆధారం కూడా చూపకుండా ఆరోపణలు గుప్పించేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని పనిచేస్తున్నాడంటూ పాత పాటనే, అవే  రొట్ట కొట్టుడు విమర్శలే గుప్పిస్తున్నారు. అదే ఆధారాలులేని ఆరోపణలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారంటూ  మరో సారి అసత్య ప్రచారానికి తెరలేపారు.  ఏపీలో అలజడులకు తెలుగుదేశం కుట్ర పన్నుతోందని ప్రజలను భయాందోళనకు గురిచేసి,  మళ్ళీ  జగనే కావాలంటూ , రావాలంటూ   ప్రజలను మభ్యపెట్టే వృధా ప్రయత్నం చేస్తున్నారు.  గత నెల రోజుల వరకూ ఎక్కడా కనిపించని ఈ నేతలంతా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెట్టడం వెనుక  చంద్రబాబు అక్రమ అరెస్టుతో  జగన్ పైనా, జగన్ ప్రభుత్వంపైనా వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని ఏదో మేర చల్లార్చి, తమకు అలవాటైన ఎదురుదాడి విధానంతో ప్రజలలో చంద్రబాబును దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇదంతా  వైసీపీ అధిష్టానం నుండి వచ్చిన ఆదేశాలతోనే  జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడపగడపకు అనుభవం తురవాత ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ధైర్యం చేయని మంత్రులు, నియోజవర్గాలను కూడా వదిలేసి పత్తాలేకుండా పోయిన  ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశంపై బురదజల్లేందుకు క్యూకడుతున్నారు.   స్కిల్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులను ప్రస్తావిస్తూ ఊకదంపుడు ఆరోపణలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.   వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా పరిపాలనను ఎప్పుడో పక్కన పెట్టేశారు. కేవలం విపక్షంపై విమర్శలు చేసేందుకే పరిమితమయ్యారు.  ఆ మధ్య పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో తనను కించపరిచారంటూ బయటకి వచ్చిన అంబటి రాంబాబు.. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు మాత్రమే బయటకు వచ్చారు. ఆయన శాఖ నీటిపారుదలపై ఒక్క రివ్యూ చేసింది లేదు.. తన శాఖలో ఏ పనులు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పింది కూడా లేదు. దాదాపుగా అందరు మంత్రులదీ అదే పరిస్థితి. మంత్రుల బాధ్యత కేవలం ముఖ్యమంత్రి భజన, ప్రతిపక్షాలపై నిరాధార ఆరోపణలు చేయడమేనన్న చందంగా వారి తీరు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత జనం ముందు ఎవరైనా జగన్ పేరు, వైసీపీ పేరు ప్రస్తావించడానికే భయపడే పరిస్థితి నెలకొంది. అంతగా ముఖ్యమంత్రిపైనా, అధికార పార్టీపైనా ప్రజలలో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దీంతో అనివార్యంగా  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మళ్లీ అవే పాత విమర్శలు, ఆరోపణలతో  మంత్రులు, ఎమ్మెల్యేలు భయం భయంగానైనా బయటకు వస్తున్నారు.  జగన్ ఆదేశించారు కనుక.. తమ పదవి ఏంటో, స్థాయి ఏంటో కూడా మరచిపోయిన నేతలు తెలుగుదేశంపై విమర్శలు గుప్పించేసి చేతులు దిలిసేసుకుంటే పోలా అన్నట్లుగా మీడియా ముందు మాటకు ముందు, మాటకు తరువాత చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ పస లేని, ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించేస్తున్నారు. 

కేసీఆర్ నష్టనివారణ చర్యలు ఫలించేనా? బీఆర్ఎస్ లో అసంతృప్తి చల్లారేనా?

పార్టీలో అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చేందుకు బీఆర్ కేసీఆర్ నడుం బిగించారా? ఆయన ప్రయత్నాలు సఫలీకృతమౌతాయా? ఎన్నికల షెడ్యూల్ కు రోజుల ముందు ఆయన చేపట్టిన నామినేటెడ్ పదవుల పందేరం అసమ్మతీయులను, అసంతృప్తులను సముదాయిస్తుందా? ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమౌతున్న సందేహాలివే. తొందరపడి ఒక కోయిలా ముందే కూసిందీ అన్నట్లుగా ఊరికి ముందే ఒకే దఫాలో ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. ఆ తరువాత తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి అన్నట్లుగా  మౌనం దాల్చిన సీఎం కేసీఆర్.. తీరా అసమ్మతి పార్టీ విజయావకాశాలను గండి కొట్టడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన తరువాత నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీలో  టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో భగ్గుమంటున్న వారికి పదవులు ఇచ్చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రోజుల ముందు కేసీఆర్ హడావుడిగా చేపట్టిన పదవుల పందేరం అసత్మతీయులను సంతృప్తి పరుస్తుందా? అంటే సందేహమేనని అంటున్నారు. ఉదాహరణకు జనగామ టికెట్ ను ఆశించి భంగపడిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు. జనగామ టికెట్ ను కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయించిన సంగతి విదితమే. కేసీఆర్ నిర్ణయం పై ముత్తిరెడ్డి ఓ రేంజ్ లో భగ్గుమన్నారు. పల్లాకు వ్యతిరేకంగా రోడ్లపై నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు కూడా దిగారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ముత్తిరెడ్డి తనకు దక్కిన ఆర్టీసీ చైర్మన్ పదవితో సంతృప్తి చెందుతారా? అంటే అనుమానమే అని పరిశీలకులు విశ్లేషించడమే కాదు. పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. పైకి నెమ్మదించినట్లు, సర్దుకున్నట్లు ముత్తిరెడ్డి చెప్పినా, చెప్పుకున్నా.. ఎన్నికల సమయంలో ఆయన సహాయనిరాకరణను పల్లా ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.  ఇక తాటికొండ రాజయ్య విషయంలోనూ అంతే.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాన్ని కేసీఆర్ మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేటాయించడాన్ని జీర్ణించుకోలేని తాటికొండ  రాజయ్య బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను రెబల్ గా రంగంలోకి దిగడం ఖాయమని ప్రకటన కూడా చేశారు. ఆ తరువాత కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో భేటీ సమయంలో కడియంకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని చెప్పి వచ్చారు. అయితే ఆ మాట మీద ఆయన నిలబడతారా అంటే అనుమానమే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అందుకు తగ్గట్టే కేసీఆర్ తో భేటీ అనంతరం కూడా రాజయ్య తన అసహనాన్ని, అసంతృప్తిని మీడియా ఎదుట వ్యక్తం చేశారు. తాను సమాధాన పడలేదనీ, సర్దుకు పోవడానికి రెడీగా లేననీ కుండ బద్దలు కొట్టారు. అటువంటి రాజయ్యకు  తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ పదవి కట్టబెట్టారు కేసీఆర్.  అలాగే కాంగ్రెస్ ను వీడి  ఇటీవలే బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న  మల్కాజిగిరి కాంగ్రెస్ నేత శ్రీధర్‌కు రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌  పదవి కట్టబెట్టారు. ఇలా కాంగ్రెస్ లో అవకాశం లేదని భావించి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరిన వారికీ, టికెట్ దక్కక అసమ్మతి గళమెత్తిన బీఆర్ఎస్ నేతలకూ ఏదో ఒక నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేశారు కేసీఆర్.   సర్వేలు, నివేదికలు అంటూ తొలి నుంచీ కూడా సిట్టింగులపై ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, పనితీరు బాగున్న వారు, ప్రజల మద్దతు ఉన్న సిట్టింగులకే పార్టీ టికెట్లు అంటూ చెబుతూ వచ్చిన కేసీఆర్..  ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తానే స్వయంగా సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించి మరో సారి పార్టీలో ప్రకంపనలకు కారణమయ్యారు. అసలు సిట్టింగులు ఉన్న నియోజకవర్గాలలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటానికి కూడా కేసీఆర్ అనుసరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులు బాహాటంగానే ఉంటున్నాయి. 2018 ఎన్నికల  తరువాత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్థి  పార్టీల నుంచి గెలిచిన వారిలో అత్యధికులను కారెక్కించేశారు. ఆయన అనుసరించిన వ్యూహం కారణంగా తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో కారెక్కేశారు. దీంతో పలు  నియోజకర్గాలలో  2018 ఎన్నికలలో ప్రత్యర్థులుగా ఉన్న వారు.. ఒకే గూటికి చేరిపోయారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో 2023 ఎన్నికలలో పోటీ చేయాలని భావించే ఆశావహుల సంఖ్య భారీగాపెరిగిపోయింది. దాదాపు సగానికి పైగా స్థానాలలో ఇటువంటి  పరిస్థితే ఉందని పరిశీలకులు అంటున్నారు.   అందుకే సిట్టింగులకు అత్యధిక టికెట్లు కేటాయించిన వెంటనే పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. అలాగే  టికెట్ దక్కని రాజయ్య వంటి వారిలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ కారణంగానే ఇప్పుడు కేసీఆర్ నష్టనివారణకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. కానీ సమయం మించిపోయిందనీ, నామినేటెడ్ పదవుల పందేరంతో అసమ్మతి చల్లారే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలహీనపడటం, కాంగ్రెస్ పుంజుకోవడం కూడా బీఆర్ఎస్ ను గాభరాపెట్టే అంశమేననీ అంటున్నారు.  

ప్రకాశం బ్యారేజికి   ప్రపంచ వారసత్వ కట్టడం అవార్డు

కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి   ప్రపంచ వారసత్వ కట్టడం అవార్డుకు ఎంపికైందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సెంట్రల్ వాటర్ కమీషన్ ఇఎన్ సి ఐడి     డైరెక్టర్ అవంతి వర్మ  రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి వ్రాసిన ఒక లేఖలో తెలియజేశారు. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే వారసత్వ కట్టడాలను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈఅవార్డులను ఏర్పాటు చేసిందని  ఆయన తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు -2023 అవార్డులకు ఐసిఐడి,ఐఎన్ సి డిల తరపున నామినేషన్లు కోరగా వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈఅవార్డులకు ప్యానల్ న్యాయమూర్తులు  సిఫార్సు చేసి ఎంపిక చేశారు. వాటిలో భారతదేశం నుండి 4 నిర్మాణాలను ఈ  ప్రపంచ వారసత్వ కట్టడాలు-2023 అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు. భారతదేశం నుండి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిస్సా లోని బలిద్హిహా ప్రాజెక్టు , జయమంగళ ఆనకట్టలు,తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఈఅవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు.ఈవిధంగా ఎంపికైన నిర్మాణాలను   ప్రపంచ వారసత్వ కట్టడాలకు సంబంధించిన ఐసిఐడి రిజిష్టర్ లో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ  ప్రపంచ వారసత్వ కట్టడాల  అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2నుండి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసిఐడి కాంగ్రెస్, 74వ ఐఇసి సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నట్టు డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికను త్వరలో ఆయా రాష్ట్రాలకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈఅవార్డులకు ఎంపికైన రాష్ట్రాలు 25వ ఐసిఐడి కాంగ్రెస్, 74వ ఐఇసి సమావేశానికి హాజరు కావడానికి  రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ణప్తి చేశారు.

జగనన్నతో మాట్లాడి సెట్ చేస్తా.. ఏపీ అంటే కేటీఆర్ కు ఇంత చులకనా?

అదేంటో పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే అందరికీ చులకన అయిపొయింది. ఇప్పటికే ఏపీలో పరిస్థితులపై పలుమార్లు ఎగతాళిగా మాట్లాడిన తెలంగాణ నేతలు మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. గతంలో ఏపీలో రోడ్లు, మౌలిక వసతులపై అయ్యో పాపం అన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పుడు.. కాస్త ఏపీలో కూడా కంపెనీలు పెట్టె ఆలోచన చేయండి.. కావాలంటే ఏపీ సీఎం జగనన్నతో తానే స్వయంగా మాట్లాడి సెట్ చేస్తానని కేటీఆర్ ఐటీ కంపెనీల యాజమాన్యాన్ని కోరారు.  హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ ప్రారంభించిన కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదన్న మంత్రి కేటీఆర్‌. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్‌ 2 నగరాలదే అని చెప్పారు. అలాగే ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని కేటీఆర్ ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు, ఏపీ పరిస్థితులు, ఏపీ మంత్రుల పనితీరుపై మరోసారి రాష్ట్రంలో చర్చకు దారి తీస్తుంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి సంస్థలు ముందుకు రావడం లేదు. వైసీపీ నేతలు ఎంత బుకాయించినా ఈ మాట మాత్రం వాస్తవం. కొత్త సంస్థలు రావడం దేవుడెరుగు నానా కారణాలతో పాత కంపెనీలను కూడా వెళ్లగొట్టేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే పలు రకాల నాన్ ఐటీ సంస్థలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవి. అధికారం చంద్రబాబు చేతిలో ఉంటే కాళ్ళకు బలపాలు కట్టుకొని అయినా కంపెనీలను పట్టుకొచ్చేవారు. కానీ, నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీ వైపు చూసే వారే లేకుండా పోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అభివృద్ధితో పాటు ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ఐటీని విస్తరిస్తున్నారు. ఎన్నారైలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఏపీ విషయానికి వస్తే తెలంగాణకు పూర్తి విరుద్ధం. ఇక్కడ అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు. అందునా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తారో, అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అలాంటిది ఆయన పరిశ్రమలను ఆకర్షించేందుకు ఏం చేస్తారన్నది ఊహించడం కూడా కష్టమే. సీఎం జగన్ కూడా ఏపీలో ఉద్యోగ, ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చిందే లేదు. కనీసం కంపెనీల రాకకోసం కానీ.. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు కానీ ఎలాంటి ప్రణాళికలు లేవు. ఈ క్రమంలోనే అసలు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని వ్యాపార వర్గాలలో అందరూ మర్చిపోయారు. ఇటువంటి నేపథ్యంలోనే, ఏపీ రాష్ట్రంపై, సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కనుక తెలంగాణ పార్టీలకు సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు కూడా కీలకమే. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కొద్దిరోజులుగా సీమాంధ్ర ఓటర్లకు రకరకాలుగా గాలమేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏపీలో కుంటుపడిన అభివృద్ధి దృష్టిలో అయ్యో పాపం అనే భావనలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. ఆంధ్రా కూడా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అనేలా బీఆర్ఎస్ వైఖరి ఉందనేలా కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కేటీఆర్ ఏ కోణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇది జగన్ ప్రభుత్వానికి మాత్రం కొరకురానిదే. పక్క రాష్ట్ర మంత్రి అయ్యో పాపం అంటూ ఏపీపై జాలి చూపించడం.. కంపెనీలు ఏర్పాటు చేయండి కావాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాను మాట్లాడతానని చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఎంతటి అసమర్ధ పాలన కొనసాగుతుందో తేటతెల్లం చేస్తుంది.

మంత్రి రోజాని వదిలించేసుకున్న టాలీవుడ్?!

ఏపీ మంత్రి   రోజాది ఆంధ్రప్రదేశా? లేక ఆమె సెలబ్రిటీగా3 ఎదిగిన తెలంగాణనా? లేక పెళ్లి చేసుకున్న తరువాత మెట్టిన  తమిళనాడా?.  ఉన్నపళంగా ఇప్పుడు ఆ డౌటానుమానం  ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటున్నారా! ఆ అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి రావడానికి ఆమె తీరే కారణం. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా  దుమారం రేపాయి. దీంతో అన్నీ సుదీర్ఘంగా ఆలోచించుకుని మరీ వారం రోజుల తర్వాత మంత్రి రోజా మీడియా ముందుకు వచ్చారు. కన్నీటి పర్యంతం అయ్యారు. అంతే కాకుండా టీడీపీ నేతలపై తనదైన శైలిలో ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయారు. స్వతహాగా నటి కనుక  తన నటనా పాటవాన్ని  మీడియా ముందు ప్రదర్శించారు. తనకు కుటుంబం ఉందని.. స్త్రీలంటే మీకు అంత చులకనేంటని ప్రశ్నలు గుప్పించేశారు. ఆ తరువాత  ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి  బండారు సత్యనారాయణపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, బెయిల్ దక్కడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ తతంగానికి ముందు రోజా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ మహిళలను ఇట్లా అనడం న్యాయమూ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ట్రోలింగ్ ఇంకా కొనసాగుతోంది.   వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అసలు ప్రత్యక్ష రాజకీయాలలోనే లేని మహిళపై ఇష్టారీతిన నిందలు వేయడం, నోరుంది కదా అని  రోజా దమ్ముంటే రేప్ చేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు, టీవీ షోలోనే కనీసం మహిళలు వినేందుకు కూడా ఇష్టపడని రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు అంతర్జాలం సాక్షిగా గుర్తు చేస్తున్నారు.  ప్రజలు ఇప్పుడు రోజా మీడియా ముందు కన్నీటి పర్యంతం కావడాన్ని పట్టించుకోవడం లేదు. చివరికి సొంత పార్టీలో కూడా రోజాకు మద్దతు లభించడం లేదు. పార్టీలోని తోటి మహిళా నేతలు కూడా రోజాపై మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలను  కనీసం ఖండించలేదు. రాష్ట్రానికి మహిళా హోమ్ మంత్రి ఉన్నా కూడా తోటి మంత్రి రోజాకు మద్దతుగా నిలవలేదు.  దీంతో సొంత పార్టీలో రోజాను పట్టించుకునే వారెవరూ లేరని తేటతెల్లమైపోయింది. సరే రాజకీయాలను పక్కన పెడితే.. ఆమె ఎదుగుదలకు కారణమైన సినీ పరిశ్రమ నుంచీ కూడా రోజాకు మద్దతు దక్కలేదు.  సహజంగా సినీ రంగంలోని వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలు, అందునా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు వస్తే  అదో బిగ్ ఇష్యూ అవుతుంది. కానీ, రోజాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఆమెకు కనీస మద్దతు దక్కలేదు. వివాదాలతో నిత్యం సహవాసమో, సహజీవనమో చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,  జగన్ పార్టీని ఎవరైనా ఏమైనా అంటే.. ఆ అన్నదేమిటో తెలియకపోయినా తనదైన శైలిలో, మ్యానరిజమ్ తో మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించేసే నటుడు పోసాని కృష్ణమురళి  ఆమెకు మద్దతుగా  గళమెత్తినా పెద్దగా జనం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ సపోర్టు రాలేదు. దీంతో వారు కూడా మౌనం వహించారు. వారి మాటలను జనం కూడా  వైసీపీ నేతలకు తక్కువ.. పేటీఎం బ్యాచ్ కు ఎక్కువ అనుకున్నారో ఏమో అసలు పట్టించుకోలేదు. ఇక రోజాతో పనిచేసిన హీరోలు, హీరోయిన్లు, సీనియర్ నటీమణులు, ఇండస్ట్రీ పెద్దలు.. చివరికి వైసీపీలోనే ఉంటూ పదవులు కూడా అనుభవిస్తున్న కమెడియన్ అలీ లాంటి వాళ్ళు కూడా రోజాపై మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలను ఖండించడం అటుంచి కనీస స్పందన కూడా తెలపలేదు. దీంతో   దీంతో టాలీవుడ్ రోజాను వదిలించేసుకుందా అని నెటిజన్లు అంటున్నారు.   అయితే, రోజాకు  స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, ఆమె రాజకీయంగా ఎదిగిన తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతుగా కనీస స్పందన లేకపోవడం చూస్తుంటే.. తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు రాష్ట్రాలు, చివరికి సొంత పార్టీ కూడా ఆమెను దూరం పెట్టడమే మంచిదని భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. లేకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ నెటిజన్లు రోజాను తెగ ట్రోల్ చేస్తున్నారు. 

బీఎల్ సంతోష్ హంగ్ ఆశలు.. సింగిల్ డిజిట్ పార్టీ అయినా పవర్ మాదే అంటూ గొప్పలు!

తెలంగాణలో అధికారం మాదేనంటూ బీజేపీ నేతలు ఘనంగా ప్రకటనలు గుప్పిస్తూ.. జాతీయ స్థాయి నాయకులను తీసుకు వచ్చి రాష్ట్రాన్ని చుట్టేయిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇప్పటికే పూర్తి స్పష్టత ఉన్న నేతలు కమలం పార్టీకి దూరం జరుగుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినా మొహం చాటేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం గాంభీర్యాన్ని వదలడం లేదు. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా అధికారం మాదే అంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న ఆ పార్టీ రాష్ట్ర నేతల మాటలకు భిన్నంగా.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో హంగ్ తప్పదని జోస్యం చెప్పి రాష్ట్ర బీజేపీ నేతల గాలి తీసేశారు. అదే సమయంలో రాష్ట్రంలో హంగ్ వచ్చినా.. అధికారం మాత్రం బీజేపీదేననీ ఇప్పటి నుంచే హార్స్ ట్రేడింగ్ కు తెరతీశారు. గతంలో కర్నాటక, గోవా, మహారాష్ట్రలలో ఎలా అయితే ప్రజా తీర్పును తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందో అలాగే తెలంగాణలో కూడా అధికారాన్ని చేపడతామని బీఎల్ సంతోషంగా పార్టీ నేతలు, వర్గాలకు సంకేతమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తాజాగా లోక్ పాల్ నిర్వహించిన సర్వే తెలంగాణలో బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలకు మించి రావని పేర్కొంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి రోజుల ముందు వెలువడిన ఈ సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ సాధించి బయట నుంచి ఎటువంటి మద్దతు అవసరం లేకుండానే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలుస్తుంది. ఇక బీజేపీ రెండు లేదా మూడు స్థానాలతో సరిపెట్టుకుంటుంది. ఎంఐఎం యథా ప్రకారంగా తనకు పట్టున్న 6 నుంచి 8 స్థానాలలో విజయం సాధిస్తుంది. లోక్ పాల్ సర్వే ఇలా వెలువడిందో లేదో అలా బీఆర్ఎస్ నేతలు ఖండనలకు దిగిపోయారు.  లోక్ పాల్ సర్వే ప్రకారం అధికార బీఆర్ఎస్ 45 నుంచి 51 స్థానాలకు పరిమితం అవుతుంది. కాంగ్రెస్ 61 నుంచి 67 స్థానాలలో విజయం సాధిస్తుంది. ఆ సర్వే ప్రకారం సీట్ల విషయంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కంటే  15 స్థానాల వరకూ  ఎక్కువ వస్తాయి. అయితే అదే సర్వే ఓట్ల విషయంలో మాత్రం రెండు పార్టీలకూ పెద్దగా తేడా లేదని చెబుతోంది. కాంగ్రెస్ కు 41 నుంచి 45 శాతం, బీఆర్ఎస్ కు 39 నుంచి 42శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. ఇక బీజేపీ అయితే 10 నుంచి 12 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని  లోక్ పాల్ సర్వే పేర్కొంది. ఇక  ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం 3నుంచి 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని లోక్ పాల్ సర్వే పేర్కొంది.   ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో  60 వేల శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే చేసినట్టు లోక్ పోల్ సంస్థ తెలిపింది. మొత్తం మీద ఈ సర్వే పరిశీలకుల అంచనాకు తగ్గట్టుగానే ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  తెలుగుదేశం ప్రభావంతో బీఆర్ఎస్ కు సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నది పరిశీలకుల అంచనా. ఆ అంచనాకు తగ్గట్టే.. దాదాపు పాతిక స్థానాలలో బీఆర్ఎస్ పై తెలుగుదేశం ప్రభావం తీవ్రంగా ఉంటుందని లోక్ పాల్ సర్వే ఫలితం కూడా పేర్కొందని అంటున్నారు. 

బాబు అరెస్టుకు నిరసనగా ఆగని ఆందోళనలు.. ఆయన విడుదల కోరుతూ కొనసాగుతున్న పూజలు

ఏపీ స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలలోనూ గత 29 రోజులుగా నిరంతరాయంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలన్నీ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నా.. ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం వాటిపై ఉక్కుపాదం మోపుతూ అణచివేత విధానాలను అనుసరిస్తున్నాయి. దీనిపై ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో  ప్రజాస్వామ్యం కాదు.. నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. అందులో భాగంగానే శనివారం (అక్టోబర్7) రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిముషాల పాటు.. అంటే 7.05 గంటల వరకూ కాంతితో క్రాంతి పేరిట నిరసన తెలపాలని పిలుపు నిచ్చింది.   ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.  అందుకే శనివారం రాత్రి రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి నిరసన తెలపాలనీ, అలాగే రోడ్లపై ఉన్న వారు తమ వాహనాల లైట్లు బ్లింక్‌ చేయడం ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని లోకేష్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని బాబుతో నేను.. అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. వాకిళ్లు, బాల్కానీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వెలుగులు ప్రసరింప చేసి చంద్రబాబు అరెస్టును నిరసించాలని కోరారు.   ఇదే విషయాన్ని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి   ట్విట్టర్ వేదికగా  చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు విర్రవీగుతున్నారనీ,  కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా తెలియజేయాలని కోరారు.  రాష్ట్రాన్ని,  భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకోమంటున్న పాలకులకు కళ్లు బైర్లు కమ్మేలా కాంతితో క్రాంతిని చూపాలని పిలుపునిచ్చారు.  ఒక వైపు పార్టీ పిలుపు మేరకు ప్రజా భాగస్వామ్యంలో నిరసనలు వెల్లువెత్తుతుంటే.. మరో వైపు చంద్రబాబు విడుదల కోరుతూ ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే  నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ , ఆయన జైలు నుంచి కడిగిన ముత్యంలా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ  ఉమ్మడి నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో  అభిమానులు కార్యకర్తలు గ్రామ దేవత చాగలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  కొట్టారు.   నంద్యాల జిల్లా తెలుగుదేశం బీసీసెల్ స్పొక్ పర్సన్ సల్లా నాగరాజు, టీఎన్ టీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తినరసింహులు, కొలిమి మాబు షరీఫ్ , అలాంసాగారి మౌలాలి , టిడిపి  మండల ప్రధాన కార్యదర్శి హనీఫ్ , మండల ప్రజార కార్యదర్శి ముల్లాగఫార్, క్లస్టర్ ఇంచార్జ్ ముల్లా అజిముద్దీన్ , అబ్దుల్లా, కామిశెట్టి రమేష్, కామిశెట్టి మధు , నాయకులు కొలిమి షరీఫ్ , ఖాసిం, హుస్సేన్ భాష , గాంధీ , వీరంరెడ్డి భాస్కర్రెడ్డి , సంజీవరెడ్డి , బషీర్ , కసినేని ఓబులేసు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐయామ్ విత్ బాబు అంటూ నినాదాలు చేశారు. 

ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాల సెంచరీ

నవ క్రీడా భారతం ఆవిష్కృతమైందని దేశం సంబరాలు చేసుకుంటున్నది. చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏషియన్ గేమ్స్ లో పతకాల సంచరీ సాధించింది. భారత పతకాల వేట ఇంకా కొనసాగుతోంది.  శనివారం ఉదయం భాతర మహిళల కబడ్డీ జట్లు చైనీస్ తైపీపై విజయం సాధించి పతకాన్ని ఖాతాలో వేసుకోవడంతో భారత్ ఈ ఏషియన్ గేమ్స్ లో పతకాల సెంచరీ సాధించింది.   ఇప్పటి వరకూ ఈ గేమ్స్ లో ఇండియా పాతిక స్వర్ణ, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. మొత్తం గా వంద పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 2018 ఏషియన్ గేమ్స్ లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 70. ఇప్పటి వరకూ ఏషియన్ గేమ్స్ లో భారత్ రికార్డు అదే.  ఈ సారి ఆ రికార్డును ఇండియా బ్రేక్ చేసింది.  కాగా, ఈ ఏడాది చైనాలో జరుగుతోన్న ఏషియన్  గేమ్స్ లో భారత్  పతకాల వేట కొనసాగుతోంది.  నేడు, రేపు జరిగే ఈవెంట్స్ లో భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు పడే అవకాశాలున్నాయి.