జైల్లో చంద్రబాబు.. జగన్ తో పాటు మోడీకీ తగులుతున్న నిరసన సెగ!
posted on Oct 6, 2023 @ 12:16PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నాలుగు వారాలు కావస్తుంది. ఒకటి రెండు రోజుల్లో బాబు బయటక వచ్చేస్తారని ముందుగా అంతా భావించారు. టీడీపీ శ్రేణులైతే మహా అయితే వారం రోజులలో తమ అధినేత కడిగిన ముత్యంలా వచ్చేస్తారని ఊహించారు. కానీ, కోర్టులలో మాత్రం వారాలకు వాయిదాలు పడుతోంది. తెలుగుదేశం శ్రేణులేమో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు రాజమండ్రిలో మకాం వేశారు. ఏసీబీ కోర్టు నుండి హైకోర్టు.. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు అన్నట్లే ఈ కేసు వ్యవహారం సాగుతోంది.
అటు విచారణకు ఆదేశిస్తారా? లేక కేసు కొట్టేస్తారా?.. విచారణకు సహకరించాలని చెబుతూనే బెయిల్ మంజూరు చేస్తారా అన్న స్పష్టత లేదు. నాలుగు వారాలు అవుతున్నా అసలు ఈ కేసు విషయంలో చంద్రబాబు అవినీతికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సీఐడీ చూపలేకపోయింది. అరెస్టు చేశాం కదా, ఇప్పుడు చంద్రబాబును విచారించి ఆధారాలు సంపాదిస్తామనే చెబుతోంది. ఇంత స్పష్టంగా ఏసీబీ డొల్లతనం బట్టబయలైనా.. సాంకేతిక కారణాలతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంలో వాయిదాల పర్వంతో నడుస్తోంది. ఇక సుప్రీం కోర్టు ఏం చెప్తుందన్న అంశంపై ఆధారపడి ఏసీబీ కోర్టు ఇక్కడ వారాలకు వారాలు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తున్నది. అయితే చంద్రబాబు కేసు వాయిదాలపై ఇప్పుడు జనంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నదే అక్రమమని, కేవలం కక్షపూరిత చర్యలో భాగంగా వైసీపీ ప్రభుత్వం సీఐడీని ఉసిగొల్పిందని పరిశీలకులు విశ్లేషణలతో సహా ఎప్పుడో చెప్పేశారు. చంద్రబాబుపై బనాయించిన సెక్షన్లు కూడా తీవ్ర అభ్యంతరమైనవని చెప్తూ న్యాయనిఫుణులు,రిటైర్డ్ సివిల్ సర్వీసు అధికారులు కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. కేవలం సీఎం జగన్ కక్ష సాధింపు కోసమే సీఐడీ ద్వారా చంద్రబాబును అరెస్టు చేయించారని జనం నమ్ముతున్నారు. అంతే కాదు కేవలం సీఎం జగన్ ఒక్కరే ఈ కుట్రలో భాగం కాదని.. చంద్రబాబు అరెస్ట్ కేంద్ర పెద్దలకు తెలిసే జరిగిందని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల అండతోనే ఇది సాధ్యపడిందని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. వైసీపీ నేతలు కూడా బహిరంగంగానే చంద్రబాబు అరెస్టుకు కేంద్రం పెద్దల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇప్పుడు న్యాయస్థానాలలో ఈ కేసు వారాల తరబడి సాగదీతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే కేంద్ర పెద్దలు ఈ కేసు కొలిక్కి రాకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ వాయిదాల మీద వాయిదాలు వేయడం, తీర్పును రోజుల తరబడి రిజర్వ్ చేయడం వంటి వాటితో పాటు.. సీఐడీని కేసు వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ వారాల తరబడి గడువు ఇవ్వడం చూస్తుంటే న్యాయ వ్యవస్థను కూడా కేంద్రం పెద్దలు ప్రభావితం చేస్తున్నారా అనే పరిశీలకులే కాదు.. సామాన్య జనం కూడా అనుమానిస్తున్నారు
అసలే ఈడీ, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నదన్న విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే ఉండగా.. చంద్రబాబు విషయంలో కూడా కేంద్రం హస్తం ఉందన్న నమ్మకం జనబాహుల్యంలో రోజురోజుకూ బలపడుతోంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో సత్వర విచారణకు నోచుకోకపోవడం వెనుక మోడీ, షాల ఒత్తడి, ప్రమేయం ఉందని జనం భావిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రధాని మోడీపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ నుండి ఫరూక్ అబ్దుల్లా వరకూ.. అఖిలేష్ యాదవ్ నుండి తెలంగాణ నేతల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూనే ఉన్నారు. చివరాఖరికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదనీ, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారనీ పేర్కొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు దన్నుగా నిలిచిందన్న ఆగ్రహం బీజేపీపై వ్యక్తమౌతున్నది. ఆ పార్టీ ఏపీ నాయకులు కూడా చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే చెబుతున్నారు. త్వరలో ఏపీ బీజేపీ నేతల బృందం హస్తినకు వెళ్లి పరిస్థితిని తమ హైకమాండ్ కు వివరిస్తామనీ, కచ్చితంగా మోడీ, షాలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన చేసేలా చూస్తామని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఖరారు చేసేసిందనీ, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రభావం జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా వెల్లడైన శ్రీ ఆత్మసాక్షి సర్వే కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొంది.