బాబును కెలికి జ‌గ‌న్ త‌ప్పు చేశారా? 

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా?  ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వున్నారా?  అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముంద‌స్తుకు ప్ర‌ధాని గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?  సోషల్ మీడియాలో బాగానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై చ‌ర్చ అయితే జ‌రుగుతోంది.  ప్ర‌స్తుత పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్తేనే.. టీడీపీని నిర్వీర్యం చేసి, తిరిగి అధికారంలోకి రావొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గుట్టుచప్పుడు కాకుండా మంత్రులు, వైసీపీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారట. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఎంతగానో నమ్మే, ఆరాధించే స్వరూపానంద సరస్వతిని జగన్ కలిశారట‌... అసెంబ్లీ రద్దుకు మంచి ముహూర్తం గురించి చర్చించారని తాడేప‌ల్లిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.    నిజానికి.. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే, వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇంత వరకూ రాజధాని లేకుండా ఏపీని ఏకాకి చేయడం, ప్రాజెక్టులు లేకుండా దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చడం, పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో.. జ‌గ‌న్ స‌ర్కార్‌పై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి తమకు భవిష్యత్తే లేకుండా చేశాడని జగన్‌పై ఏపీ జ‌నం తీవ్రంగా మండిపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. దీనికి తోడు.. వాలంటీర్ వ్యవస్థలోని పాపాల గుట్ట కూడా బయటపడటంతో, జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. ఇక నవరత్నాలను ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలిసిందేగా! మద్యపానం నిషేధం పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మద్యం ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తనపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు జగన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసుని తెరమీదకు తీసుకొచ్చి, చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ టీడీపీపై అవినీతి బురదజల్లి, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయితే.. అప్పుడు ముందస్తుకు వెళ్లడమే నయమని జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేస్తే.. తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని, ఫలితంగా మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చని జగన్ క‌ల‌లు కంటున్నార‌ని వాస్త‌వ ప‌రిస్థితులు భిన్నంగా వున్నాయ‌ని ప్రముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగుఒన్ తో అన్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌గ‌న్‌కు ఘోర‌ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఆయ‌న విశ్లేషించారు. ఏపీలో మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయ‌ని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఆయ‌న విశ్లేషించారు.  వివేకా హత్య కేసును పక్కదారి పట్టించి చంద్రబాబు అరెస్టుపైనే రాజకీయం నడిపిస్తున్నారని.. కానీ ఏపీ ప్రజలు వివేకా హత్య కేసును మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత సాహసం జగన్ చేయలేరని.. ఒకవేళ వెళ్లినా ఆయనకు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. త‌న అధికారాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నేత‌ల్ని భ‌య‌పెట్టేలా అరెస్ట్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అందులో భాగంగానే బండారును అరెస్టు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసిన‌ట్లైతే టీడీపీ లో హ‌ల్‌చ‌ల్ చేసిన మంత్రులు ముగ్గురున్నారు.  వారిలో ఒకరు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే,మరొకరు గంటా శ్రీనివాసరావు. వీరి మధ్యలో అంటే 1998 ప్రాంతంలో ఒక్కసారి మంత్రి చేశారు బండారు సత్యనారాయణమూర్తి. ఇలా ఈ ముగ్గురూ త్రిమూర్తులుగా ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు. ఇందులో మొదట అరెస్ట్ చేసింది అయ్యన్నపాత్రుడిని. ఆయన మీద దాదాపుగా పదిహేను కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయ్యన్న అరెస్ట్ ని పోలీసులు చూపించినా స్టేషన్ బెయిల్ తో ఆయన బయటకు వచ్చారు.  గడచిన నాలుగున్నరేళ్ళుగా అనేక సందర్భాలలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం పైన‌,  జగన్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ విధంగా ఆయన మీద పెట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.  ఇక ఆయన తరువాత బండారు సత్యనారాయణమూర్తి వంతు వచ్చింది. బండారు మీడియా మీటింగ్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా డోస్ ఎపుడూ ఒక స్థాయిలోనే ఉండేది. అలాంటి బండారు ఇటీవల సడెన్ గా మహిళా మంత్రి రోజా మీద  రెచ్చిపోయారు.  దాంతో ఆయన మీద రెండు కేసులు పెట్టి  అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూర‌వ్వ‌డంతో ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చారు.  ఇపుడు బండారు తరువాత ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది విశాఖ జిల్లాలో చర్చ జ‌రుగుతోంది. త్రిమూర్తులలో ఇద్దరు అయిపోయారు కాబట్టి మూడవ షాట్ మాజీ మంత్రి గంటా కే అని అంటున్నారు. గంటా ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకుంటున్నారు.   ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొనే  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌దైన స్టైల్‌లో టీడీపీని టార్గెట్ చేస్తున్నార‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయాల్లో భాగంగా ముఖ్య‌మంత్రి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని  ఆంధ్ర‌ప్ర‌జ‌లు జాగ్ర‌త‌గా గ‌మ‌నిస్తున్నారు.  అధికార పార్టీ చేసే కుట్రలు..... టీడీపీ నేతలకు, ప్రజలకు, కార్యకర్తలకు అర్థమైపోయింది.  చంద్రబాబును జైలుకు పంపి.. టీడీపీని ఏదో చేద్దామనుకుంటున్నారన్న స్పష్టత అందరికీ ఉంది. అన్ని రకాల వ్యవస్థల్నీ మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది.  ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఏమాత్రం భ‌య‌ప‌డ‌డం లేదు. భరించాల్సిన నష్టాలను.. కష్టాలను ఇప్పటికే భరించామని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదని టీడీపీ క్యాడర్ తెగించి పోరాడుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు వాళ్లు ఉన్న ప్రతీ దేశంలోనూ నిర‌సనలు జరుగుతూనే వున్నాయి.  అందరూ ఎవరికి వారు మాట్లాడుకుని నిరసనలు చేశారు. ఏపీలో తీవ్రమైన కట్టడి మధ్య ప్రజలు బయటకు వస్తున్నారు. టీడీపీని ముక్క‌లు చేయ‌డానికి  కుట్ర జరుగుతోందని, కాపాడుకోవాలన్న సంకల్పం టీడీపీ క్యాడ‌ర్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తోంది. చంద్ర‌బాబుపై నమ్మకం ఎక్క‌డా సడలిపోవడం లేదు. ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఒక్క నేత కూడా వెనక్కితగ్గలేదు. దీనికి తోడు స‌ర్వే రిపోర్ట్స్‌  కూడా టీడీపీకి అనుకూలంగా రావ‌డంతో  ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీలోని మరికొంత మంది నేతలు కూడా టీడీపీలో చేర‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. వైసీపీ నుంచి టికెట్ మ‌ళ్ళీ రాద‌నుకున్న నేత‌లంతా టీడీపీతో ట‌చ్‌లోనే వున్నార‌ట‌.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని ఏదో చేద్దామనుకున్నారు కానీ… గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే  టీడీపీ మరింత బలం పెంచుకుంది. ఇక్క‌డ ఓ విష‌యం మ‌నం గుర్తు చేసుకుంటే, అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్ర‌స్తుత సి.ఎం. జగన్ మోహ‌న్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు అప్ప‌ట్లో ఒక్కరు కూడా రోడ్లపైకి రాలేదు. కుటుంబసభ్యులు మాత్రమే రోడ్డుపై ధర్నా చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఊళ్ల కు ఊళ్లు కదులుతున్నాయి. టీడీపీ గ్రాఫ్ కూడా బాగా పెరిగింద‌ని ఇంట‌లిజెన్స్ స‌ర్వేల్లో కూడా వ‌చ్చింద‌ట‌.  ఆ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే త‌న‌కు అనుకూలంగా ముఖ్య‌మంత్రి స‌ర్వే చేయించుకున్నార‌నే తాడేప‌ల్లిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత జ‌రుగుతున్న ప‌రిణామాల్ని క‌నుక గ‌మ‌నిస్తే,  టీడీపీ, జనసేన మధ్య పూర్తి స్థాయిలో ఫెవికాల్ బంధం ఏర్పడింది.  టీడీపీ, జనసేన క్యాడర్ కలిసిపోయాయి.  రాష్ట్రమంతా కలిసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా రెండో అభిప్రాయానికి చోటు లేకుండా … జ‌గ‌న్ ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పవన్ వారాహి యాత్రలో టీడీపీ క్యాడ‌ర్ సందడి చేస్తుంది.   పవన్ కూడా టీడీపీ, జనసేన మధ్య బంధం ఎంత బలంగా ఉందో తేల్చి చెప్పేశారు. చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వైసీపీ కనీస ప్రయోజనం లభించలేదు. బలంపై స్పష్టమైన అవగాహనతో ఉన్న జనసేనానికి ఏపీ రాజకీయాలపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు.  పవన్ రాజకీయంగా రాటుదేలారని జ‌నం కూడా చెప్పుకుంటున్నారు.  మ‌రో వైపు టీడీపీ, జనసేన మధ్య బంధం.. లీడర్లు, క్యాడర్‌ స్థాయిలో  బాగానే కలిసిపోయింది.  జనసేనకు క్యాడర్ ఉంది. ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారు . కానీ బలమైన నేతలు పరిమితంగానే ఉన్నారు. టీడీపీకి లీడర్, క్యాడర్ ఉన్నారు. ప్రణాళికాబద్దంగా వీరు పని చేసుకుంటే.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయి. పొత్తులు ఇప్పుడున్న రీతిలో కొనసాగిస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఇటీవ‌ల వ‌చ్చిన తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మోడీ.. జగన్ నూ టార్గెట్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో జగన్ సర్కార్ విషయంలో ఒకలా, తెలంగాణ సర్కార్ విషయంలో ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, పరిమితిని మించి ఏపీకి అప్పులు మంజూరు అవుతుండగా, అవే నిబంధనల సాకుతో  తెలంగాణకు మాత్రం అప్పులు దక్కకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగడుగునా అడ్డుపడుతున్నది.  వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ కూడా మోడీ అడుగులకు మడుగులొత్తుతూనే మనుగడ సాగించాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందో  అప్పటి నుంచీ కేంద్రంతో బీఆర్ఎస్ బంధం ఉప్పూ నిప్పులా మారింది. అలా మారడానికి కారణమేమిటో ప్రధాని మోడీ నిజామాబాద్ బహిరంగ సభ సాక్షిగా మంగళవారం ( సెప్టెంబర్ 3) వెల్లడించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ప్రధాని మోడీ కేసీఆర్ హస్తినలో తనతో భేటీ అయిన సందర్భంగా ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది బయటపెట్టి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కాళ్ల కింద నేల భూకంపం వచ్చినట్లుగా కదిలిపోయేలా చేశారు. ఇంతకీ మోడీ ఏం చెప్పారంటే నాలుగేళ్ల కిందట.. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు బీజేపీ చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైంతరువాత కేసీఆర్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ను ఎన్డీయేలో చేర్చాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ కు పట్టం కట్టాలని భావిస్తున్నాననీ, అందుకు ఆశీర్వాదం కావాలని మోడీని అడిగారు. అలా అని మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు. అంతే కాదు.. తాను ఎన్డీయేలో బీఆర్ఎస్ ను చేర్చుకోవడానికి నిరాకరించాననీ వెళ్లడించారు. అంతే కాదు.. ఇదేమీ రాజరికం కాదనీ, ప్రజల ఆశీస్సులుంటేనే పదవులు దక్కుతాయనీ, కేటీఆర్ ప్రజామద్దతుతో ముఖ్యమంత్రి అయితే ఆశీర్వదిస్తాననీ అన్నానని కూడా సెలవిచ్చారు. ఆ తరువాత నుంచే కేసీఆర్ కేంద్రం, మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం ప్రారంభించారనీ, నాలుగో ఫ్రంట్, మూడో ప్రత్యామ్నాయం అంటూ.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ బయలు దేరారని మోడీ మాటలతో తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఆ తరువాత తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొనడంతో సైలంటయ్యారనీ, తన కుమార్తెను మద్యం కుంభకోణం నుంచి బయటపడేయమంటూ అమిత్ షా వద్దకు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పని చేసిన నరసింహన్ ను రాయబారం పంపారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో కీలెరిగి వాతపెట్టిన చందంగా కేసీఆర్ రాజకీయాలన్నీ స్వార్ధం కోసమేనని మోదీ కుండబద్దలు కొట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మోడీ కూడా ఎన్నికల సమయంలోనే ఆరోపణలు చేస్తారనీ, లేకుంటే నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన విషయాన్ని ఎన్నికల సమయంలోనే ఎందుకు వెల్లడించారనీ ప్రశ్నిస్తున్నారు.  ఇదే విధంగా  ఎన్నికల ముంగిట ఏపీలో జగన్ సర్కార్ బండారాన్ని కూడా మోడీ బయటపెట్టగలరా అని ప్రశ్నిస్తున్నారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లభించని విధంగా కోరినప్పుడల్లా ప్రధాని అప్పాయింట్ మెంట్ లభిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే.. సిఎం జగన్ సగటున నెలకొకసారి అయినా మోడీ, షాలతో హస్తినలో భేటీ అవుతుంటారు. ఆ భేటీలలో చర్చకు వచ్చే  అంశాలేమిటన్నది బ్రహ్మ రహస్యం అన్నట్లుగా ఉంటుంది. అధికారిక పర్యటనపై హస్తిన వెళ్లిన సీఎం మొక్కుబడి ప్రెస్ నోట్ విడుదల చేయడం తప్ప.. హస్తినలో కానీ, ఏపీలో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవు.  పైగా కేంద్రం పెద్దలతో జగన్  భేటీలన్నీ ఆయనపై అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చినప్పుడు,  సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచినప్పుడు ఉంటాయి. జగన్ హస్తిన వెళ్లి వచ్చిన తరువాత  సీబీఐ దూకుడు ఉండదు, అక్రమాస్తుల కేసుల విచారణ మందగిస్తుంది.   ఇప్పుడు పరిశీలకులు ఆ విషయాలనే సోదహరణగా ప్రస్తావిస్తూ.. జగన్ కు ఈ స్థాయిలో ప్రయోజనం కలిగిస్తున్న మోడీ తనతో భేటీ సందర్భంగా జగన్  ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పుడు స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ తన ప్రతిష్టనే కాకుండా తనకు అండదండగా ఉంటూ వస్తున్న మోడీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ ఏపీలో నడుస్తున్న స్కిల్ సెంటర్ల పేరును మార్చేసి అవి కేంద్రం స్పాన్సర్ షిప్ తో నడుస్తున్న కేంద్రాలుగా చూపే ప్రయత్నం చేసి మోడీని కూడా ఇరికించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ తనపై నింద పడకుండా ఉండేదుకైనా సరే జగన్ బండారాన్ని బయటపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే జగన్ ది కక్ష సాధింపు రాజకీయం అయితే మోడీది ఎన్నికల రాజకీయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని ఎలాగైతే ఎన్నికల వేళ వెల్లడించారో.. అలాగే జగన్ బండారాన్ని కూడా ఏపీలో ఎన్నికల సమయం మరింత దగ్గరపడిన సమయంలో మోదీ బట్టబయలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీఎస్పీ... 20 మందితో తొలి జాబితా 

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.  బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా... 1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్- సిర్పూర్,2. మేడి ప్రియదర్శిని- నకిరేకల్,3. పిలుట్ల శ్రీనివాస్- కోదాడ,4.జంగం గోపి- జహీరాబాద్,5 బానోత్ రాంబాబు నాయక్- వైరా,6.ఎన్.రాంచందర్-మానకొండూరు, 7. దాసరి ఉషా- పెద్దపల్లి, 8. నాగమోని చెన్  రాములుముదిరాజ్- వనపర్తి, 9. ప్రద్యుమ్నకుమార్ మహదేవ్ రావు ఏకాంబర్- జుక్కల్,10. ముప్పారపు ప్రకాశం- ఆందోల్,11.చంద్రశేఖర్ ముదిరాజ్- తాండూర్, 12. ఎర్రా కామేశ్- కొత్తగూడెం, 13.నక్కావిజయ్ కుమార్- ధర్మపురి,14. కొత్తపల్లి కుమార్- నాగర్ కర్నూలు,15. వట్టె జానయ్య యాదవ్- సూర్యాపేట,16.డాక్టర్ ముదావత్ వెంకటేశ్ చౌహాన్- దేవరకొండ,17. గడ్డం క్రాంతి కుమార్- వికారాబాద్18. బన్సీలాల్ రాథోడ్- ఖానాపూర్,19. కొంకటి శేఖర్- చొప్పదండి,20.అల్లికవెంకటేశ్వరరావు యాదవ్- పాలేరు

కేసీఆర్ రాజకీయం కుటుంబం కోసమే.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా?

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు. తెలంగాణ  ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం లోగా ఎప్పుడు అయినా వెలువడే అవకాశం ఉందన్న సమాచరం నేపథ్యంలో  ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నిజామాబాద్ నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో  చేసిన ప్రసంగంతో ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారనే చెప్పాలి.  నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసేసి ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధమైపోయినట్లు కనిపించిన బీఆర్ఎస్ ఆ తరువాత కారణాలేమైతేనేం ఎన్నికల సన్నాహకాలలో బాగా వెనుకబడిపోయింది. చంద్రబాబు అరెస్టు, కాంగ్రెస్ దూకుడు, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి ఇలా బీఆర్ఎస్ వెనుకబాటుకు చాలా చాలా కారణాలున్నాయి.  ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్లే కనిపించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తరువాత ఒక్కసారిగా చతికిల బడినట్లు కనిపించింది. దీంతో తెలంగాణలో పార్టీలో జోష్ నింపేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగానే మూడు రోజుల వ్యవధిలో మోడీ తెలంగాణలో రెండు బహిరంగ సభలలో  ప్రసంగించి పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు. అయితే కమలం పార్టీలో  అసమ్మగి భగభగలు చల్లారకపోవడం.. ప్రధాని మోడీ సభకు సైతం పలువురు సీనియర్లు డుమ్మా కొట్టడంతో రెండో సభలో ప్రధాని మోడీ తన ప్రసంగ వ్యూహం మార్చారు. అధికార పార్టీని బినీత్ ది బెల్ట్ కోట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడిని సీఎం చేయడం కోసం కేసీఆర్ అన్ని ప్రమాణాలనూ పక్కన పెట్టేయడానికి సిద్ధ పడ్డారనీ, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా చేరేందుకు కూడా వెంపర్లాడారనీ వెల్లడించారు. సహజంగానే మోడీ ప్రసంగం తరువాత బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ మోడీ చెప్పినవి అబద్ధాలంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని జుమ్లా పార్టీగా అభివర్ణించారు.  అయితే ప్రధాని మోడీ మాత్రం పక్కా వ్యూహంతోనే నాలుగేళ్ల కిందట కేసీఆర్ తనతో చర్చించిన వివరాలను సరిగ్గా ఎన్నికల వేళ వెల్లడించి బీఆర్ఎస్ గుక్కతిప్పుకోలేకుండా చేశారు.  కేసీఆర్ హస్తిన వెళ్లిన ప్రతి సారి ప్రధాని మోడీని కలిసి తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, పురోగతి వినా మరో విషయమే మాట్లాడేవారు కాదంటూ ఇంత కాలం గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్.. మోడీతో కేసీఆర్ విభేదించడానికి కారణం కూడా తెలంగాణకు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నందునే అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మోడీ కేసీఆర్ రాష్ట్ర ప్రగతి గురించి కాకుండా, తన కుమారుడి ప్రమోషన్ కోసమే హస్తినలో కేంద్ర పెద్దలతో భేటీ అయ్యేవారిని మోడీ స్వయంగా చెప్పడం వారిని కంగుతినిపించింది.  వాస్తవానికి కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించిన క్షణం నుంచీ ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. కేటీఆర్ కు పదోన్నతికి అడ్డుపడే అవకాశం ఉందన్న భావనతోనే  2018 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ తొలి కేబినెట్ లో హరీష్ రావు, ఈటల వంటి వారికి చోటుదక్కలేదు. ఆ తరువాత మారిన పరిస్థితుల కారణంగా వారిరువురికీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించినప్పటికీ.. వారి ప్రాధాన్యతను గణనీయంగా తగ్గించారు. ఇక ధిక్కార స్వరం వినిపించిన ఈటలను పార్టీ నుంచే సాగనంపారు. ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలంటూ కేసీఆర్ తనను కోరారని మోడీయే స్వయంగా చెప్పడంతో.. కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. మోడీ చెప్పినవన్నీ అబద్ధాలని కేటీఆర్ ప్రకటించినంత మాత్రాన సరిపోదు. మోడీ మాటలు వాస్తవం కాదని కేసీఆర్ స్వయంగా చెప్పాలి. వివరణ ఇవ్వాలి. అయితే ఇంత వరకూ అయితే కేసీఆర్ నుంచి ఎటువంటి ఖండనా, కనీసం స్పందనా రాలేదు.  దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు అవుతారా? అవ్వరా అన్నఉత్కంఠ మొదలైంది. మద్యం కుంభకోణం నుంచి కవితను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, మోడీపై విమర్శల దాడిని పూర్తిగా తగ్గించేశారన్న అనుమానాలు ఇప్పటికే తెలంగాణ సమాజంలో బలంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ కేసీఆర్ నాలుగేళ్ల కిందటే తనకు దాసోహం అన్నారనీ, తానే ఆయన ఎన్డీయేలో చేరుతానన్న ప్రతిపాదనను తిరస్కరించాననీ చెప్పడంతో కేసీఆర్ జాతీయ ఆకాంక్షలపైనే తెలంగాణ ప్రజలలో  అనుమానాలు మొదలయ్యాయి. కేసీఆర్ మౌనం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది.   ముఖ్యంగా కేటీఆర్ ను  ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నానంటూ కేసీఆర్ తనతో స్వయంగా చెప్పి కుమారుడిని ఆశీర్వదించాలని కోరిట్లు మోడీ వెల్లడించడంతో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమేనని ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే  ఉన్న ప్రరాన్ని మోడీ వ్యాఖ్యలు ధృవీకరించాయి. అయితే అందు కోసం ఎన్‌డీఏ కూటమిలో చేరడానికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారన్న మోడీ మాటలు బీఆర్ఎస్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భారత్ యాక్షన్ ప్లాన్ తో దారికొస్తున్న కెనడా

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.  ద్వైపాక్షిక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ తో ప్రైవేటుగా చర్చలను కెనడా కోరుకుంటున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య రాయబార చానళ్లు తెరుచుకునే ఉన్నాయని, రెండు వైపులా సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కెనడాకు ఢిల్లీలో ఎంబసీ, చండీగఢ్, బెంగళూరు, ముంబై లో కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 62 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి నుంచి 41 మందిని ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. భారత్ తో వివాదాన్ని కోరుకోవడం లేదని, కలసి బాధ్యతగా పనిచేయాలని అనుకుంటున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు.

అక్బరుద్దీన్ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ?

మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల  ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.  పురుషాధిక్య పార్టీగా ముద్రపడిన ఎంఐఎంలోకి త్వరలో ఓ మహిళా నేత ఎంట్రీ ఇవ్వనున్నారట.. ప్రజాసేవలో భాగమయ్యేందుకు లండన్ నుంచి వచ్చేస్తున్నారట. ఆ మహిళ మరెవరో కాదు పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ.. ప్రస్తుతం బారిష్టర్ చదువు కోసం లండన్ లో ఉన్న ఫాతిమా త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తుందని అక్బరుద్దీన్ చెప్పారు. వచ్చాక ప్రజాసేవలో పార్టీ తరఫున పాల్గొంటుందని వివరించారు. ఈమేరకు సోమవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి అక్బరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లండన్ నుంచి తన కూతురు ఫాతిమా తిరిగి వచ్చి ప్రజాసేవలో పాల్గొంటుందని తెలిపారు. పార్టీపై పడిన పురుషాధిక్య ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం పార్టీ మహిళా నాయకురాలిని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా పాతబస్తీలో ఎంఐఎంకు మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రభావం చూపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపినట్లు ఎంఐఎం నేతలు భావిస్తున్నారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే ఫాతిమా ఓవైసీని రాజకీయాల్లో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తద్వారా ఎంఐఎంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామనే సందేశాన్ని జనంలోకి పంపించాలన్నది పార్టీ లక్ష్యమని చెబుతున్నారు. కాగా, పార్టీలోకి ఫాతిమా ఎంట్రీ ఇవ్వగానే ఎమ్మెల్యేగా నిలబెడతారా లేక ఏదైనా నామినేటెడ్ పదవి అప్పగిస్తారా అనే విషయంపై ఎంఐఎం వర్గాల్లో స్పష్టత లేదు.

విద్యార్థులకు భారంగా పెరిగిన యూకే వీసా ధరలు.. నేటి నుంచే అమల్లోకి

పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి(అక్టోబర్ 4) అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు ఫీజు రూ. 11,835, స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము రూ. 50,428కి పెరిగింది. పెరిగిన ధరలు భారత విద్యార్థులపై ఆర్థికభారం మోపనున్నాయి. పెరిగిన వీసాల ధరలు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో వర్క్, విజిటింగ్ వీసాల ధరలలో 15 శాతం, ప్రాధాన్య, స్టడీ, స్పాన్సర్‌షిప్ వీసాల ధరల్లో 20 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది.

వారంలో తెలంగాణ ఎన్నికల నగారా!

వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. హస్తిన వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఆ షెడ్యూల్ మేరకు తెలంగాణ ఎన్నికలు తొలి దశలోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2018 లోనూ అలాగే జరిగింది. దానిని బట్టి ఈ సారి కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి విదితమే. అనారోగ్యంగా ఉండి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రక్రియలు ఏమైనా ఇంకా పూర్తి కాకుండా ఉంటే ఈ నెల 10లోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అనూహ్యంగా, హఠాత్తుగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం, దసరాకు ప్రారంభించాలనుకున్న సీఎం అల్పాహార పథకాన్ని ఈ నెల 6నే ప్రారంభించేందుకు నిర్ణయించడం ఇవన్నీ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల వారంలోగానే ఉంటుందన్నడానికి సంకేతాలుగా చెబుతున్నారు. అన్నిటికీ మించి ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో రెండు సార్లు పర్యటించి రెండు బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాలలో ఎన్నికల హామీలను గుప్పిస్తూనే అధికార పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సారథ్యంలో ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధత తదితర అంశాలపై చర్చలు జరుపుతోంది. సమీక్షలు నిర్వహిస్తోంది.   తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల గడువు 2014, జనవరి 24తో ముగియనుండగా, ఒక్క మిజోరంలో మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17 వరకే ఉంది. అందుకే ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. జమిలి ప్రతిపాదన, ప్రస్తావన వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లేదని తేలిపోవడంతో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు.  

మైనంప‌ల్లి వెనుక కేటీఆర్? హరీష్ కు చెక్ పెట్టేందుకేనా?

కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.  ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో  రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.   ఇక్క‌డ ఓ విష‌యం మ‌నం మాట్లాడుకోవాలి. అదేమిటంటే మైనంపల్లి హనుమంతరావు సొంత జిల్లా   గ‌తంలో మెదక్  నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ లో హరీష్ పెత్తనం కారణంగా ఆయన జిల్లాలో రాజకీయాలు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తన కుమారుడి కోసం హరీష్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ లో చేరిపోయి… ఉమ్మడి మొదక్ జిల్లా బాధ్యతల్ని తీసుకున్నారు.  అంతే కాదు బీఆర్ఎస్ కంచుకోటలపై దృష్టి పెట్టారు. రామాయంపేటకు చెందిన మైనంపల్లి గతంలో తెలుగుదేశం మెదక్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. మైనంపల్లి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మెదక్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ మెదక్ పై దృష్టి పెట్టారు. నర్సాపూర్ బాధ్యతల్ని కూడా తీసుకునేదుకు సిద్ధమయ్యారు. మెదక్‌ సొంత జిల్లా కావడంతో పాటు కార్యకర్తల్ని ఆదుకుంటారన్న పేరు ఉండటంతో మెదక్‌తో పాటు నర్సాపూర్ నియోజకవర్గాల్లో  ఆయనకు ఊరూరా అనుచగణముంది. వారినీ యాక్టీవ్‌ చేస్తున్నారు.  మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్‌ పేరిట  ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని గ్రామాల్లోనూ అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాలు, ఇండ్లు, కమ్యూనిటీహాల్స్‌ నిర్మాణం, వైద్య, విద్య అవసరాల కోసం సాయం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్నారు.  నర్సాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇవ్వడం లేదు. దీంతో ఆయనను కాంగ్రెస్‌లో కి లాగేందుకు మైనంప‌ల్లి ప్రోత్సహిస్తున్నారు. మైనంపల్లి దూకుడు హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే… ఉమ్మడి మెదక్ జిల్లాలో  తెలంగాణ ఆవిర్భావం నుంచీ హరీష్ రావు పెత్త‌న‌మే న‌డుస్తోంది.  అక్కడ క‌నుక పట్టు కోల్పోతే హరీష్ రావుకు రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుంది.  పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు మెదక్ జిల్లాపై పట్టు కోల్పోతే.. ఇక  పార్టీలో ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికీ పార్టీలో కేసీఆర్ తరువాత నంబర్ టూ స్థానం కోసం కేటీఆర్ తో పోటీ పడుతున్నది హరీష్ రావేనని పార్టీ  శ్రేణులే చెబుతున్నాయి. అటువంటి హ‌రీష్ రావుకు మెదక్ జిల్లాపై పట్టు జారితే.. ఇక ఆయన కేటీఆర్ కు సమఉజ్జీగా ఉండే అవకాశమే లేదు. అందుకే స్వయంగా కేటీఆరే మైనంపల్లిని హరీష్ కు వ్యతిరేకంగా  ప్రొత్సహించి పెంచారా అన్న అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం  అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  హ‌రీష్ రావు  మైనంపల్లికి చెక్ పెట్టేందుకు జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతున్నారు. మైనంప‌ల్లిని దెబ్బ‌తీయ‌డానికి అంది వచ్చే ఏ అవకాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్ట‌డానికి త‌న‌దైన స్టైల్‌లో  వ్యూహాలు రచిస్తున్నారు. ఫ‌లితం .... మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం వల్ల..ఆ పార్టీ బలం ఎంత పెరిగిందో తెలియదు గాని..  రెండు వికెట్లు ప‌డిపోయాయి.  దీని వెనుక హ‌రీష్ రావు హ‌స్తం వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మేడ్చల్‌ జిల్లా  కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.  మెదక్ సీటు మైనంపల్లి తనయుడికు కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేత కంటారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.   మరో ప‌క్క అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న సీనియ‌ర్లు మైనంపల్లి కేంద్రంగా అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. మైనంపల్లికి, ఆయన కుమారుడికీ కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. తమకు  కూడా డబుల్ టికెట్లు కావ్వాల్సిందే అంటున్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.  ఎందుకంటే ఉత్తమ్ దంపతులు ఎప్పటినుండో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని చెప్పింది.  ఈ విషయమై అధిష్టానం గట్టిగా ఉండటంతో  పార్టీ సీనియర్లు ఏమీ మాట్లాడలేకపోయారు.  అయితే బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కూడా అధిష్టానం మినహాయింపు ఇచ్చి మల్కాజ్ గిరి నుండి మైనపంల్లికి, మెదక్ నుండి ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్లు ఖాయం చేసింది. దాంతో చాలామంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లికి మినహాయింపు ఇచ్చినట్లే తమకూ మినహాయింపు ఇచ్చి తమ కుటుంబాలకు కూడా రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అంటే సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, కొండా సురేఖ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. అయితే మైనంపల్లిది ప్రత్యేక  కేసుగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నది. ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే వుంది.    మైనంపల్లి ప్రభావం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుందన్నది వాస్తవమే. ఆర్ధిక, అంగ బలం   ఉన్న మైనంపల్లికి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులున్నారు కాబ‌ట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. ఈ నేపథ్యంలోనే  మెదక్  కాంగ్రెస్ లో అస‌మ్మ‌తి ప‌తాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెదక్ టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు మైనంపల్లి పార్టీలో చేరడంతో తిరుపతి రెడ్డి ఆశలు కుప్పకూలాయి. మైనంపల్లి కుమారుడు రోహిత్ కే కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో తిరుపతి రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.     మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు రాక‌తో మ‌రో ముఖ్య‌నేత కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. మొద‌టి నుంచి మైనంప‌ల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు లేఖ రాశారు.  ఉద‌య్‌పూర్ తీర్మానానికి వ్య‌తిరేకంగా  కాంగ్రెస్ పార్టీ  మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం, బీసీనేత‌నైన త‌న‌ను కాంగ్రెస్ పార్టీ అణ‌గ‌క‌దొక్క‌డం బాధించింద‌ని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీకి, జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు నందికంటి శ్రీ‌ధ‌ర్ లేఖ‌లో వెల్ల‌డించారు. గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్‌కు పట్టు ఉంది. పైగా అక్కడ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేరు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లే. దీంతో ఇక్క‌డ పోటీ మరింత రసవత్తరంగా మార‌నుంది. మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్ బలమైన పార్టీ.. అయితే మైనంపల్లికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ బలం కాస్త తగ్గవచ్చు. అటు కాంగ్రెస్‌కు కొంత బలం ఉంది. అది కలిసిరావచ్చు. మల్లారెడ్డి అల్లుడు ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత..దీంతో గట్టి పోటీ తప్పదు. అయితే మైనంపల్లి బలమైన ఫాలోయింగ్ ఉన్న నేత. అటు కాంగ్రెస్ ఓటింగ్ కూడా కలిసిరావచ్చు. దీంతో మల్కాజిగిరి పోరు ఈ సారి రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ బి‌జే‌పికి కూడా ఒకింత  పట్టు ఉండటంతో  త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో గెలుపు ఎవరికీ నల్లేరుమీద బండినడక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మైనంపల్లి తనయుడు పోటీ చేసే  మెదక్ నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగానే ఉంటుందని అంటున్నారు. హరీష్ రావు.. మైనంపల్లిని, కాంగ్రెస్ ను బలహీనం చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనీ, మైనంపల్లిని దెబ్బకొట్టగలిగితే.. తన పట్టు నిలుపుకోవడమే కాకుండా, కేటీఆర్ కూ చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బాబు అరెస్టు.. కేసీఆర్ హౌస్ అరెస్ట్.. లింకుందా?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో  ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్ స్కాం అంటూ  తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడిని జగన్  సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడంపై  దేశ విదేశాల్లో వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు ఆందోళన బాట చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో నినదిస్తున్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. అయితేచంద్రబాబు అరెస్ట్‌పై సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికార  అగ్రనేతలు.. అంటే   కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం థియేటర్‌లో సినిమా ప్రారంభమైన తర్వాత.. సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయింది.   సమీక్షకుడిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం ఏపీలో ఎవరినో అరెస్టు చేస్తే తెలంగాణకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించి.. విమర్శలను ఎదుర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అనంతరం చోటు చేసుకొంటున్న ప్రతి అంశాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. మినిట్ టు మినిట్.. నివేదికను తెప్పించుకొంటున్నట్లు వరుస కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో  హల్  చల్ చేస్తున్నాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ పక్క రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల పంచాయతీ అని, దీనితో తమకేమి సంబంధమంటూ కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్  చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని సెటిలర్లలో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. అ సంగతి   ఇంటెలిజెన్స్ నివేదిక రూపంలో ఇప్పటికే  కేసీఆర్‌కు అందిందనీ,  ఆ నివేదిక చూసి ఆయనగారు గాభరా పడ్డారని  పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే ఆయన వైరల్ ఫీవర్ అంటూ ప్రగతి భవన్ కే పరిమితమై తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్నారంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.   చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు ఉదాసీనంగా వ్యవహరించడంతో.. తెలంగాణలోని ఆంధ్రుల్లో  బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడం, అలాగే ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల ఆందోళనలపై పోలీసులు ఉక్క పాదంమోపడం వెనుక  కేసీఆర్ ప్రభుత్వం తెర చాటు రాజకీయాన్నిఅమలు చేసిందని సెటిలర్లు భావిస్తున్నారు.  అదీకాక బాబు అరెస్ట్‌పై మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్లుడు పట్టుకొని తెలుగు వారు శాంతియుతంగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ... అక్కడెక్కడో బాబు అరెస్ట్ జరిగితే.. ఇక్కడ ఈ గోల ఏమిటని   కస్సు బస్సులు ఆడడం లేదని.. కానీ చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవితలు కారాలు మిరియాలు నూరడం ఏమిటన్న ఆగ్రహం సామాన్య  ప్రజలలో సైతం వ్యక్తం అవుతోంది. అలా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. సాక్షాత్తూ తెలంగాణ స్పీకరే చంద్రబాబు అరెస్టును ఖండించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.  అదీకాక.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుపునకు కేసీఆర్  సహకరించారని.. ఆ సహాయ సహకారాలు నేటికి కొనసాగుతోన్నాయన్న అభిప్రాయం   తెలుగు వారిలో బలంగా వ్యక్తం అవుతోంది.  ఇక చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పది వేల నుంచి 40 వేల ఓట్ల వరకు కారు పార్టీకి కోత పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయనే ఓ ప్రచార సాగుతోంది.  మొత్తంగా చూస్తే.. తెలంగాణలో నిమొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో  ఓ 50 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పై  చంద్రబాబు అరెస్టు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ విషయాన్ని కేసీఆర్ ఫ్యామిలీ గ్రహించిందని.. అందుకే.. కేసీఆర్ సమీప బంధువు,మంత్రి హరీష్ రావు.. రంగంలోకి దిగి.. చంద్రబాబు అరెస్ట్‌పై  స్పందించారని కానీ అప్పటికే కేటీఆర్ వ్యాఖ్యలతో కారు పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. హరీష్ రావు ప్రకటన నష్టనివారణకు ఏమాత్రం దోహదం చేయలేదని చెబుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్..  పార్టీ నేతలతో భేటీ అయితేనో, ప్రెస్‌మీట్ పెడితేనో.. చంద్రబాబు అరెస్ట్‌పై  స్పందించాల్సి ఉంటుందని.. ఆ భయంతోనే ఆయన బయటకు రావడం లేదని అంటున్నారు.   ఏదీ ఏమైనా.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినా, పాలు చల్లినా అది ఆంధ్రా సెటిలర్లపైనేే ఉందని  అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలను గమనిస్తే.. గతంలోలా సెటిలర్లు బీఆర్ఎస్ కు సహకరించే అవకాశాలు అయితే లేవని అంటున్నారు.  అదలా  ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని అటు బీజేపీ... ఇటు కాంగ్రెస్ తమ తమ ప్రయత్నాలు ముమ్మరం  చేశాయి.. చేస్తున్నాయి. ఇక తెలంగాణలో తెలుగుదేశం సైతం  సత్తా చాటేందుకు  సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటున్నది.దానికి   ఇప్పుడు ఆంధ్రా సెటిలర్ల ఆగ్రహం తోడు కావడంతో  బీఆర్ఎస్ హ్యాట్రిక్ కల నెరవేరడం సులభ సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ డిల్లీ పర్యటన.. మరిన్ని అరెస్టులకు సంకేతమేనా?

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది. స్వయంగా వైసీపీ వర్గాలే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఆశీస్సులు జగన్ కు ఉన్నాయనీ, ఈ అరెస్టుల పర్వం చంద్రబాబుతోనే ఆగదనీ బాహాటంగానే చెబుతున్నారు. కేసుల పేర్లు, సెక్షన్లు ఉటంకిస్తూ తరువాత అరెస్టు ఎవరిదో వారు చెప్పేస్తున్నారు కూడా. సరిగ్గా ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఖరారయ్యయని చెబుతున్నారు.   అన్నీ కుదిరితే  శుక్రవారం (అక్టోబర్6) జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నిజానికి గత వారమే జగన్ ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నించారు. విదేశీ పర్యటనలు ముగించుకుని రాష్ట్రానికి రాగానే జగన్ ఢిల్లీ పర్యటనకు వెడతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే ఢిల్లీ పెద్దల నుండి అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఇక ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దల అనుమతి, అపాయిట్ మెంట్లు దొరకడంతో జగన్ రెడ్డి హస్తిన ప్రయాణం ఖరారైంది.   ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని అంటున్నారు. కాగా, జగన్ హస్తిన పర్యటనపై రాజకీయ వర్గాలలో పలు విధాల చర్చలు జరుగుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అక్రమ   అరెస్ట్ , ఈ నెలలోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన  ఆసక్తికరంగా మారింది.  బీజేపీ మద్దతుతోనే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశారన్న భావన అన్ని వర్గాలలోనూ వ్యక్తమౌతున్నది.  ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జగన్ ఈ పని చేశారంటే ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంతెందుకు కేంద్ర పెద్దల మద్దతుతోనే చంద్రబాబును అరెస్టు చేశామని వైసీపీ నేతలే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ అదే పెద్దలను కలవనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది.  వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు అరెస్టుపై విచారణ జరగనున్నది,  అదే సమయానికి జగన్ కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఢిల్లీ నుండి ఏపీకి ఎలాంటి సంకేతాలు అండనున్నాయన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.  మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, మార్గదర్శి ఎండీ శైలజ వంటి వారిని కూడా జైలుకు పంపాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారని వైసీపీ నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి అరెస్టుకు కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో మరోసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు  ముందస్తు ఎన్నికలకు క్లియరెన్స్ కోసం కూడా జగన్ హస్తిన పర్యటనకు వెళుతున్నారని అంటున్నారు. అందుకోసమే  ప్రత్యర్థుల్లోని బలమైన నేతలను జైలుకు పంపి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం తోనే హస్తిన పెద్దల ఆశీస్సులు, అనుమతి కోరేందుకే జగన్ హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు అక్రమ ఆస్తుల కేసులు, వివేకా హత్యకేసు వంటి సొంత కేసులు, అదానీ ప్రాజెక్టులు తదితర అంశాల సీఎం జగన్  ఢిల్లీ పర్యటన వెనక కారణాలు కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు, నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏ నెలకి ఆ నెల జీతాలు, పెన్షన్లు వంటి అతి సామాన్య ఖర్చులకు కూడా తెగ కసరత్తులు చేయాల్సి వస్తుంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా సరిపోనంత నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల కోట్లు బిల్లులు చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటికి నిధుల కోసం కేంద్రం దగ్గర జగన్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే చేయాల్సిన  స్థాయిని మించి అప్పులు చేయగా ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి కష్టాలు ప్రభుత్వానికి తీరని నష్టం కాగా మరికొన్ని రోజులు ప్రభుత్వం నడిచేలా పెద్దల ఆశీస్సుల కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్ లో మరోసారి ఢిల్లీ వెళ్లనున్న జగన్ ఏ మేరకు వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.

బీజేపీకి పవన్ కళ్యాణ్ రాంరాం?

బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే  మిత్రిపక్షంగా ఉన్న బీజేపీతో కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా.. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంతో కలిసి వేడతానని ప్రకటించేశారు.  చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ మూడ్ పూర్తిగా మారిపోయింది. జగన్ రెడ్డి సర్కార్ పై అన్ని వర్గాలలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు కూడా  రాష్ట్రంలో వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు తరువాత ఆ ఆగ్రహం అవదులనేవే లేకుండా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపుగా  సమాజంలోని అన్ని వర్గాలలోనూ జగన్ రెడ్డి పాలన అరాచకమని, వదిలిచుకు తీరాలన్న పట్టుదల కనిపించింది. ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది.  , ఏపీలో పొత్తులు ఉంటాయా? ఉంటే ఏఏ పార్టీలు కలిసి వెళ్తాయి? ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది పక్కన పెడితే.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన పొత్తు అయితే ఖరారైపోయింది. ఒక్క సారి జనసేనాని పొత్త ప్రకటన చేసిన తరువాత క్షత్ర స్థాయిలో కూడా జనసేన, తెలుగుదేశం శ్రేణులు కలిసే పని చేస్తున్నాయి.  తాజాగా పవన్ కళ్యాణ్ వారాహీ నాల్గవ విడత పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమాలలో జన సైనికులు అంతే యాక్టివ్ ఉంటున్నారు. అయితే, ఎటొచ్చి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. తెలుగుదేశం, జనసేనలు బీజేపీని కూడా కలుపుకొని వెళ్తారా? లేక బీజేపీని సైడ్ చేస్తారా అన్న మీమాంస కొనసాగుతుంది. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా.. ఇప్పుడు టీడీపీతో పొత్తును ప్రకటించింది. టీడీపీతో పొత్తు ప్రకటన వేళ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని, ఆ పార్టీ కూడా  కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తులు ఉండవని పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలలో రాజకీయ వర్గాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా తెలంగాణలో పొత్తులకు సమయం వచ్చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి స్టేక్ ఉంది. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడం ఇక్కడ బీజేపీకి అవసరం కూడా. ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నామని చెప్తున్న పవన్ మాత్రం అనూహ్యంగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేశారు.  దీంతో తెలంగాణలో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి అనే చర్చ పెరిగిపోతోంది. పవన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు వలన టీడీపీ,జనసేన కూటమికి  ప్రయోజనం లేకపోగా..నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్న క్రమంలో  టీడీపీ, జనసేన బీజేపీకి దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు తప్ప బీజేపీఊసే ఎత్తడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణమే అధికారంలోకి వస్తుందని పదేపదే చెబుతున్నారు తప్ప బీజేపీ గురించి మాటమాత్రంగానైనా చెప్పడం లేదు. ఈ క్రమంలోనే  పవన్ కల్యాణ్   బీజేపీకి రాంరాం చెప్పేశారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీలో బీజేపీని కాదని తెలంగాణలో పొత్తుకు వెళ్తే ప్రజలలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించే పవన్ బీజేపీ నుండి దూరం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.   అన్నిటికీ మించి  చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందని పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధంలేదని మీడియాతో చెప్పినా అంతర్గతంగా బీజేపీ, కేంద్రం హస్తం ఉందనే  ఆయన భావిస్తున్నట్లు జనసేన వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రజలలో బీజేపీపై వ్యతిరేకత ఉందని కూడా పవన్ కళ్యాణ్  సొంతంగా నిర్వహించుకున్న సర్వేలలో తేటతెల్లమైందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ వంటి విషయాలలో కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేయడంపై పవన్ చాలా కాలంగా బీజేపీని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పుడు సమయం రావడంతో  ఆయన కమలం పార్టీకీ, కమలనాథులకు దూరం జరిగారని అంటున్నారు.  మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో   బీజేపీ పెద్దల తీరు అర్ధం కావడం వల్లనే పవన్ ఢిల్లీ కూడా వెళ్లడం లేదన్ననీ, వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి.   

అగ్రరాజ్యంలో అంబేద్కర్ కు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం లభించనుంది. అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత్ అవతల ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఇదే కానుంది.మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో  ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు. ఈ స్మారక చిహ్నం అంబేద్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని డిజైన్‌ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బెయిలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి  ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.  మంత్రి రోజాపై, ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై  పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిపై కేసు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, ఆయన సోదరుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టుకు 41ఏ నోటీసులు అందించామని తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. వందల సంఖ్యలో పోలీసులతో ఆయన ఇంటిని దిగ్బంధనం చేసి మరీ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.  తనకు బెయిల్ మంజూరు చేయాలన్న బండారు అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. బండారుకు భారీ ఊరట లభించిన విషయాన్ని పక్కన పెడితే ఆయనను అరెస్టు చేసిన విధానం మాత్రం తీవ్ర విమర్శల పాలౌతోంది. బండారుకు నోటీసులు ఇచ్చామంటూ కోర్టులో చెప్పడాన్ని  ఎత్తి చూపితే.. నిజంగానే నోటీసులు ఇచ్చి ఉంటే బండారును అరెస్టు చేసే అవకాశమే ఉండదనీ, కేవలం విచారణకు రావాల్సిందిగా మాత్రమే కోరాలని అంటున్నారు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

తెలుగుదేశం జనసేన కూటమి క్లీన్ స్వీప్ పక్కా.. బీజేపీని కలుపుకుంటే మాత్రం బొక్కబోర్లా!

ఏపీలో వచ్చే ఎన్నికలలో  తెలుగుదేశం, జనసేన కూటమి విజయం పక్కా అని ఆత్మసాక్షి సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. చంద్రబాబు అరెస్టు తరువాత ఈ సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో  తెలుగుదేశం, జనసేన పొత్తు వచ్చే ఎన్నికలలో ప్రభంజనం లాంటి విజయాన్ని అందిస్తుందనీ, అదే ఈ కూటమి బీజేపీని కూడా కలుపుకుంటే మాత్రం బొక్క బోర్లా పడుతుందనీ తేల్చింది. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం విజయం ఖాయమని, అయితే బీజేపీతో జతకడితే మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదని పేర్కొంది.  తెలుగుదేశం,జనసేన పొత్తుగా ఎన్నికలు వెడితే ప్రస్తుతం  జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రులలో 17 మంది పరాజయం పాలు కావడం తథ్యమని పేర్కొంది.  ఇప్పటి వరకూ శ్రీ ఆత్మసాక్షి సర్వే మూడు విడతలు గా సర్వే నిర్వహించింది. విడత విడతకూ తెలుగుదేశం పుంజుకుంటున్నదని సర్వే  ఫలితం తేల్చింది. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జనం తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరయ్యారని సర్వే పేర్కొంది.  వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి  151 స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, అప్పట్లో తెలుగుదేశం 23 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.  అప్పటి ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలలలోనూ ప్రజలలో అసంతృప్తికి బీజం పడింది. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలనపై ప్రజాగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది.   రెండేళ్ల కిందట ఇదే ఆత్మసాక్షి సర్వే తెలుగుదేశం కు వైసీపీ కంటే నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తాయని పేర్కొనగా తాజా సర్వేలో  తెలుగుదుశం, జనసేన కూటమికి 54% ఓట్లు ఖాయమనీ, వైసీపీ 43 శాతానికి పరిమితం అవుతుందనీ పేర్కొంది. అంటే వైసీపీ కంటే తెలుగుదేశం,జనసేన కూటమి 11% అధిక ఓట్లతో అధికారం చేపట్టడ తథ్యమని పేర్కొంది. ఇందులో తెలుగుదేశం ఓట్ల షేర్ 44 శాతం ఓట్లు, జనసేన షేర్10 శాతం ఓట్లు అని పేర్కొంది.  రానున్న రోజులలో తెలుగుదేశం, జనసేనకు ఓటింగ్ శాతం గణనీయంగా  పెరిగే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.  చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరిగిందని.. చంద్రబాబు అరెస్ట్, జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత ప్రజల ఆదరణ పెరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అయి జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ టీడీపీతో జతకట్టడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయని శ్రీఆత్మసాక్షి సర్వే వివరించింది.  కాగా, బీజేపీని కూడా తమతో చేర్చుకుంటే మాత్రం టీడీపీ, జనసేన కూటమి భారీగా నష్టపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. బీజేపీతో  కాకుండా లెప్ట్ పార్టీలతో జతకడితే తెలుగుదేశం,జనసేన కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది.  తెలుగుదేశం, జనసేన, లెప్ట్ పార్టీలు కలిసి ఎన్నికలకు వెడితే 120కి పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే గణాంక సహితంగా వెల్లడించింది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి మూడు శాంపిల్స్ రూపంలో సర్వే నిర్వహించినట్లు వివరించింది.  ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు పేర్కొంది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వేలో తేల్చారు. మొత్తంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం పక్కా అని సర్వే ఫలితం తేల్చింది.     

బాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టులో మంగళవారం (అక్టోబర్ 3) విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ ను జస్జిట్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ  వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు.  ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.   కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు. అలాగే సిద్ధార్థ లూధ్రా ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

మోడీ మళ్లీ ఎన్నికల వాగ్దానాలేనా?

తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలు దూకుడు పెంచాయి. అందరికంటే ముందే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపి పెద్దలు అమిత్ షా, నడ్డాలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ నెల ఒకటో తేదీన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ తెలంగాణలో రెండు కీలక ప్రకటనలు చేశారు. ఒకటి ములుగు జిల్లాలో 900 కోట్ల రూపాయలతో ఎస్టి యూనివర్శిటీ, రెండు తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటన చేయడం బిజెపిలో జోష్ పెంచింది. 2014 ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ పార్లమెంటు  టీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎంపీ అయినప్పటికీ పసుపు బోర్డు మాత్రం తీసుకురాలేకపోయాయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రస్తుత బిజెపి పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ వోటర్లకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎన్నికల వేళ సాక్షాత్తు  ప్రధాని పాలమూరు సభకు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇంతకు ముందు ఓ లెక్క. ఇప్పటి నుంచి ఓ లెక్క అంటూ బిజెపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో  నిజామా బాద్ బిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్  కేంద్ర పెద్దలతో పసుపు బోర్డుపై పై కీలక ప్రకటన చేయించడం  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కొనసాగిన కవిత పసుపు బోర్డు తీసుకురాలేకపోయారు. దీనికి కౌంటర్ గా ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ప్రకటన చేయించడం వచ్చే ఎన్నికల్లో బిజెపికి సానుకూల అంశమైతే బిఆర్ఎస్ కు పెద్ద షాక్ అయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా విభజన హామీలను బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదన్న ఆరోపణలు కొత్తగా తెరమీదికొస్తున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 8 తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్ జిల్లాలో ఖాజీపేట రైల్వే ఓవర్ హాలింగ్ సెంటర్ సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ఏప్రిల్‌లో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సహా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. అప్పట్లో  ప్రధాని వరుస పర్యటనలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటోంది.  వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు గతంలో ప్రకటించారు. చెప్పినట్లుగానే ఎవరూ హాజరుకాలేదు. దీనిపై ప్రధాని సభలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు బహిష్కరించాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఇచ్చిన హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఏమిటి? వాటిల్లో ఏ మేరకు నెరవేరాయి? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్కువగా చర్చలోకి వచ్చిన అంశం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి.దీన్ని ఖాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ చెప్పింది.దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో నిధులు కేటాయించలేదు.ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మోదీ శంకుస్థాపన చేశారు. దీనికితోడు వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.అయితే.. ప్రతిపాదిత కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది.అది వ్యాగన్ల మరమ్మతుల కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. వ్యాగన్ల తయారీ కేంద్రం అడిగితే వ్యాగన్లకు మరమ్మతులు చేసే వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం 2009 నుంచే  పెండింగులో ఉంది. తొలిసారిగా ఆ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఖాజీపేట రైల్వే కోచ్ తయారీ ‌ప్యాక్టరీ అంశం ప్రతిపాదించారు . అలా అప్పట్నుంచి పెండింగులో ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును చట్టంలో ప్రతిపాదించింది.తర్వాత బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదని బీ‌‍ఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు తెలంగా‌‍‌‍‌‍ణకు కేంద్ర ప్ర‌‍‌భుత్వం ఇచ్చిన ‌‍‌హామీలపై తేల్చాలి అని బిజెపి యేతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పుడు రిపేర్ల ‌షాపు పెడుతున్నారని విమర్శించాయి. తెలంగా‌‍ణకు కేటాయించిన కోచ్ ‌ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని విమర్శిస్తున్నాయి.ప్రధాని అంటే గుజరాత్ కు కాదు, యావత్ దేశానికి కదా..? అని ప్రశ్నిస్తున్నారు. 

జగన్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అంగళ్లు కేసులో తెలుగుదేశం నేతలకు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కూడా ఏపీ సర్కార్ కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఏపీ హైకోర్టు ఈ కేసులో తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆరు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. తెలుగుదేశం సీనియర్ నాయకులు చల్లాబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలను మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలని ఆ పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.   జగన్ సర్కార్ పిటిషన్లపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన  ధర్మాసనం సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది. అంతే కాకుండా భద్రత కల్పించాల్సిన పోలీసులే సాక్షులుగా ఎలా ఉంటారని ప్రశ్నించింది. హైకోర్టు బెయిలు మంజూరు చేసినందున ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరుపిటిషన్లను కొట్టివేసింది. ఇదే ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించనున్న సంగతి విదితమే.