లోక్ పాల్ సర్వేలో బిఆర్ఎస్ కు 45 నుంచి 51 మాత్రమే...
posted on Oct 6, 2023 @ 1:10PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. 10వ తేదీ లోపు ఎలెక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉండగా... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇతర పార్టీల నుంచి చేరికలతో కాంగ్రెస్ శిబిరం మంచి ఊపు మీద ఉంది. కాంగ్రెస్ సీనియర్లు కూడా గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 115 అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంకోవైపు బీజేపీకి రాష్ట్రంలో ఊపందుకుంటుంది. ప్రధాని సభలతో తెలంగాణలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ మొదటి వారంలో ఒకే విడతలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనేక సర్వేలు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తున్నాయి. హ్యట్రిక్ కొట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ సర్వే నివేదికలు వ్యతిరేకంగా ఉంటున్నాయి. తాజాగా లోక్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించబోతోందని సర్వేలో తేలింది. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ కు 61 నుంచి 67 సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొంది రెండో స్థానానికి పరిమితమవుతుందని వెల్లడించింది. ఎంఐఎం 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇతరులు సున్నా లేదా ఒక్క స్థానాన్ని గెలుచుకోవచ్చని తెలిపింది.
ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ సర్వేను నిర్వహించినట్టు లోక్ పోల్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే శాంపిల్ సైజ్ 60 వేలు అని పేర్కొంది.