సప్తపది లేని పెళ్లిళ్లు చెల్లవా ?
posted on Oct 6, 2023 @ 11:17AM
హిందూ వివాహ వ్యవస్థ ఆచార వ్యవహారాల్లో విశిష్ట స్థానం ఉంది.
ఈ ఆచార వ్యవహారాల్లో సప్త పది ఆచారం ప్రత్యేకమైనదని చెప్పొచ్చు.
వధువు, వరుడు కలిసి యజ్ఞగుండం చట్టూ తిరిగే సప్తపదితో పాటు, ఇతర ఆచారాలను పూర్తి చేయకపోతే దానిని హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. అయితే, తన భార్య రెండో వివాహం చేసుకొని వేరే వ్యక్తితో కలిసి ఉంటోందని పేర్కొంటూ జంటలోని వరుడు అదే ఏడాది మేజిస్ర్టేటు కోర్టులో కేసు పెట్టాడు. కోర్టు ఆమెకు సమన్లు పంపించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అత్తింటివారు తనను వేధిస్తున్నారని, రెండో పెళ్లి చేసుకోలేదని వాదించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సదరు మహిళ రెండో పెళ్లి జరగలేదని నివేదిక ఇచ్చారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం సప్తపది (సాత్ ఫేరీ), ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. పరిశీలించిన ధర్మాసనం అన్ని సంప్రదాయాల ప్రకారం జరిగితేనే అది వివాహంగా చెల్లుబాటు అవుతుందని, ఇలాంటివి లేకుండా ఒకవేళ జరిగినా చట్టం దృష్టిలో అది వివాహం కాదని స్పష్టం చేసింది.
ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.
పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.
కొన్ని కుటుంబాల్లో సప్తపది మాండేటరీ. పెద్దల సమక్షంలో జరిగే పెళ్లిళ్లు అయితే పర్వాలేదు కాని రిజిస్టర్ మ్యారేజ్ లు చేసుకుంటున్న అనేక ప్రేమ జంటలు సప్తపది లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. రిజిస్టర్ మ్యారేజిలు చేసుకున్న వారు సప్తపది లేకుండానే వివాహతంతును పూర్తి చేసుకుంటున్నారు. 1955 నాటి వివాహ చట్టం ప్రకారం.. సప్తపది వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. మరి రిజిస్టర్ మ్యారేజ్ లు జరిగినప్పుడు న్యాయస్థానాలు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.