వైసీపీ ఎమ్మెల్యేల నోటా జనం మాటే.. జగనే ఎందుకు?
posted on Dec 23, 2023 @ 10:59AM
నిన్న మొన్నటి వరకూ జనం మాత్రమే జగనే ఎందుకు? అని నిలదీశారు. గడప గడపకు నుంచి మా నమ్మకం నువ్వే జగన్ వరకూ అంటూ వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ జనం నుంచి ఇదే ప్రశ్న వచ్చింది.. ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఆఖరికి జగన్ సర్కార్ ప్రభుత్వాధికారులను పంపినా జనం అందరినీ ఇదే ప్రశ్న వేసి నిలదీశారు. మా నమ్మకం జగన్ కోల్పోయారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సామాజిక సాధికార యాత్ర అంటూ మంత్రులు బస్సులు వేసుకుని వస్తే.. వారి ముఖం చూడటానికి కూడా జనం ఇష్టపడలేదు. దీంతో వారు ఖాళీ కుర్చీలకే వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ప్రసంగాలు ఇచ్చేసి మమ అనిపించారు.
ఇక ఇప్పుడు ఎన్నికలు మూడు నెలలలో జరగనున్న నేపథ్యంలో ప్రజలకు వైసీపీ నేతలకు కూడా తోడయ్యారు. రాష్ట్రానికి జగనే ఎందుకు, వైసీపీయే ఎందుకు అంటూ ప్రశ్నించడం మొదలెట్టారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం, జగన్ కోసం జనం ఛీత్కారాలను సైతం ఎదుర్కొంటూ నిలబడిన తమకు జగన్ మొండి చెయ్యి చూపడానికి రెడీ అయిపోయే సరికి వారు కూడా జనంతో కలిసిపోయారు. భయాలనూ, మొహమాటాలనూ వదిలేసి.. జగన్ తీసుకునే అడ్డగోలు నిర్ణయాలకు ఓకే చెప్పడం మా వల్ల కాదని తిరగబడుతున్నారు. నియోజకవర్గాల మార్పు పేరుతో జగన్ ఇష్టారీతిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు నడుం బిగిస్తుంటే.. మొజారిటీ ఎమ్మెల్యేలు మేం మారం.. కావాలంటే పోటీ నుంచి తప్పుకుంటాం.. లేదంటే పార్టీ విడిచి స్వతంత్రులుగానో, మరో పార్టీ తరఫునో పోటీలోకి దిగి ప్రజా మద్దతు కోరతాం అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పార్టీనీ, పార్టీ అధినేతను ధిక్కరించి మరీ తమ గొంతు వినిపించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పార్టీపై జగన్ పట్టు జారిపోయిందనడానికి ఇంత కంటే నిదర్శనమేం కావాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిజమే ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చు, కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను, కళ్ళ ముందు కదులుతున్న అరాచక పాలన ప్రజలు మరిచి పోతారని, ఎవరైనా అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రజల జ్ణాపకశక్తిని తక్కువ అంచనా వేశారు. అలాగే పార్టీ నేతలు తన పట్ల ఇంత కాలం చూపిన విధేయతను చులకనగా చూశారు. దాంతో జనం, పార్టీ నేతలూ కూడా మీ అవసరం మాకు లేదని తెగేసి చెప్పే పరిస్థితి స్వయంగా తెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దిగజారిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. అభివృద్ధి అనవాలే లేని రాష్ట్రంగా మిగిలింది. వాస్తవానికి రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది అరాచకత్వం, అవినీతి మాత్రమే. ఆ కారణంగానే పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోయారు. ఇంకా వెళ్లిపోతున్నారు. కొత్త పరిశ్రమల ఊసే లేదు. ఉద్యోగాలు, ఉపాధి అన్నవి కానరావడం లేదు.
వీటికి తోడు సీఎం జగన్ కక్షసాధింపులు, వేధింపులు. తన పాలనను ప్రశ్నించినా, వ్యతిరేకించినా కుట్రపూరితంగా అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్టులు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడం. వీటన్నిటినీ గమనించిన ఏపీ జనం ఇంకెంత మాత్రం జగన్ పాలనను భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, జగన్ రెడ్డిని ఓడించి పంపించడం వినా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. సర్వేలలో, పరిశీలకుల విశ్లేషణల్లో తేలుతున్నది ఇదే.
అయితే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని తాను గొప్పగా పాలన చేస్తున్నాననీ, జనం మళ్లీ మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారనీ భ్రమలలో ఉన్న జగన్ మాత్రం వైనాట్ 175 అనే అంటున్నారు. తన వందిమాగధుల చేత అదే చెప్పిస్తున్నారు. ఇంచు మించుగా ఏడాదిన్నరగా సాగుతున్న గడప గడపకు వైస్పీ ప్రభుత్వం, నువ్వే మా నమ్మకం వంటి కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలకు వాస్తవం అర్ధమైపోయింది. భవిష్యత్ భూతద్దంలో కనిపించింది. అందుకే వారు పార్టీ కార్యక్రమాలను మమ అనిపించేసి చేతులు దులుపుకుంటున్నారు.
జగన్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేయడానికి నివేదికలను ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆ నివేదికల ఆధారంగా తమ నియోజకవర్గాలను మార్చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తమ అసమ్మతిని, వ్యతిరేకతను ముఖం మీదే చెప్పేస్తున్నారు. పరిశీలకులు కూడా ప్రజా వ్యతిరేకతే కొలమానంగా మార్పులు అన్నది వాస్తవమే అయితే ముందుగా మార్చాల్సింది జగన్ నే అని విశ్లేషిస్తున్నారు.