తిరుపతి నుంచి పవన్ పోటీ.. చంద్రబాబు వ్యూహం ఇదే!
posted on Dec 23, 2023 8:13AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మూడు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. అంత కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు నిర్దిష్ట సమయం కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్వయంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ స్వయంగా చెప్పారు. ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్న జగన్ సిట్టింగుల మార్చే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై కూడా చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చేసినట్లేననిచెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ కూడా సంక్రాంతి తరువాత నుంచి ఏపీపై ప్రత్యేక దృష్టిసారించాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ పార్టీకి ఏపీలో ఉన్న బలం ఏమిటి? ఎంత? అన్న విషయాలను పక్కన పెడితే.. అధికార పార్టీ వైసీపీలోని అసంతృప్తి, అసమ్మతి తమకు బలం చేకూరుస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోలా జీరో సీట్స్ కాకుండా ఏవో కొన్ని స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలుగుతామని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఏపీ విషయంలో ఆ పార్టీ విధానమేమిటో, వ్యూహమేమిటో కనీసం కమలం హైకమాండ్ కైనా తెలుసా అంటే అనుమానమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఇక విషయానికి వస్తే.. తెలుగుదేశం, జనసేన పొత్తు ఏపీలో ఆ కూటమి అధికారానికి రావడం లాంఛనమే అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. కేవలం అధికారంలోకి రావడమే కాకుండా జగన్ పార్టీని కనీస స్థాయికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ను తిరుపతి నుంచి పోటీ చేయాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరుతున్నారని జనసేన, తెలుగుదేశం వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. చంద్రబాబు వ్యూహాత్మకంగానే జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి రంగంలోకి దిగాలన్న ప్రతిపాదన చేశారని పరిశీలకులు అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రాంతం, వర్గం అన్న తేడా లేకుండా జగన్ పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా ఎంత కాదన్నా జగన్ పార్టీకి రాయలసీమలో ఏదో మేరకు పట్టు ఇంకా ఉంది. ఆ విషయాన్ని గమనించే చంద్రబాబు జగన్ టార్గెట్ గా పవన్ కల్యాణ్ సీమ నుంచి పోటీ చేస్తే వైసీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని భావిస్తున్నారు.
పొత్తులో భాగంగా జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రాంతం నుంచి బరిలోకి దిగితే వైసీపీకి ఏదో మేర బలం ఉన్న సీమలో కూడా బలహీనం అయ్యే చాన్స్ ఉందన్నది చంద్రబాబు అంచనాగా పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగితే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని చెబుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ప్రజారాజ్యం అధినేతగా ఉన్న చిరంజీవి సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచీ పోటీలోకి దిగినా ఓటమి పాలైన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలలోని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చేయడం కంటే చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం వల్ల ఆయన విజయం సునాయాసం కావడమే కాకుండా.. మొత్తంగా ఆ ప్రభావం రాలయసీమపై కూడా పడుతుందన్నదే చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాయలసీమలోని 52 స్థానాలలో కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఆ మూడు స్థానాలలో ఒకటి కుప్పం కాగా, రెండోది హిందూపురం. ఇక మూడో స్థానం ఉరవకొండ. గత ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
గత ఎన్నికలలో రాయలసీమలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీకి ఈ సారి ఆ ప్రాంతంలో ఆ ఆధిపత్యంపై దెబ్బకొట్టాలనీ, అందుకు ఆ ప్రాంతం నుంచి జనసేనాని పోటీలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. అలాగే అదే ఉద్దేశంతో జనసేనాని కూడా తిరుపతి నంచి బరిలోకి దిగే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారనీ జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి.